ముందుకు సాగని రబీ సాగు | - | Sakshi
Sakshi News home page

ముందుకు సాగని రబీ సాగు

Dec 20 2025 7:14 AM | Updated on Dec 20 2025 7:14 AM

ముందుకు సాగని రబీ సాగు

ముందుకు సాగని రబీ సాగు

కొరిటెపాడు(గుంటూరు వెస్ట్‌): ఈ ఏడాది రబీ సాగు అంత ఆశాజనకంగా లేదు. సాగులో పురోగతి కనిపించడం లేదు. రబీ సీజన్‌ అక్టోబర్‌ రెండవ వారం నుంచి మొదలైంది. రెండు నెలలు పూర్తయినా సాగు అంతంత మాత్రంగానే ఉంది. వరుస తుపాన్లు, భారీ వర్షాల కారణంగా రబీ సాగు అనుకున్నంత ముందుకు సాగలేదు. రబీ సాగు ఆరంభమై రెండు నెలలు దాటినా అతికష్టం పైన సాధారణ సాగు 65,295 హెక్టార్లు ఉండగా, ఇప్పటి వరకు 21,356 హెక్టార్ల (32.71 శాతం)కే పరిమితం అయ్యింది. ● వర్షాధారం కింద ఇక సాగుకు అవకాశం లేదు. గతేడాది ఈ సమయానికి సాధారణ సాగు 65,728 హెక్టార్లకు గాను జిల్లాలో 64,720 హెక్టార్లలో వివిధ పంటలు సాగు కాగా, ఈ ఏడాది అదే సమయానికి 21,356 హెక్టార్లు మాత్రమే సాగయింది. ● ఇక ఆరుతడి పంటల సాగు కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతం మొక్కజొన్న, జొన్న, మినుము, మంచి శనగ పంటలు వేసుకునేందుకు అవకాశం ఉన్నా ఖరీఫ్‌లో సాగు చేసిన వరి కోతలు ఇంకా పూర్తి కాకపోవడంతో పంటల సాగు ముందుకు సాగడం లేదు. దీంతో రైతుల్లో నిరాసక్తి నెలకొంది. ముందుగా సాగు చేసిన పంటలు మాత్రం కళకళలాడుతున్నాయి. ● జిల్లాలో మంచి శనగ సాగు సీజన్‌ ముగిసింది. ఈ ఏడాది మంచి శనగ సాగు కూడా ఆశించిన మేర సాగు కాలేదు. జిల్లాలో మంచి శనగ సాధారణ సాగు విస్తీర్ణం 8,121 హెక్టార్లకు గాను 7,709 హెక్టార్లలో మాత్రమే సాగయింది. సాధారణంగా ఈ ఏడాది వంద శాతానికి మించి మంచి శనగ సాగు అవుతుందనుకున్న అధికారుల అంచనాలు నిజం కాలేదు. ● గుంటూరు జిల్లాలో పెదనందిపాడు, ఫిరంగిపురం, తాడికొండ, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదకాకాని, కాకుమాను, మేడికొండూరు తదితర మండలాల్లో అత్యధికంగా శనగ సాగు అవుతుంది. అలాంటిది ఈ ఏడాది ఆయా మండలాల్లో అనుకున్న మేర సాగు కాలేదని రైతులు తెలిపారు. ● ప్రస్తుతం జిల్లాలో జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర పంటలకు మాత్రమే అదును ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ● మొక్కజొన్న సాధారణ సాగు 20,334 హెక్టార్లకు గాను ప్రస్తుతం 8,172 హెక్టార్లలో సాగయింది. జొన్న సాధారణ సాగు 16,893 హెక్టార్లకు గాను 2,608 హెక్టార్లలో, మినుము సాధారణ సాగు 6,529 హెక్టార్లకు గాను 2,353 హెక్టార్లలో, పెసర సాధారణ సాగు 10,759 హెక్టార్లకు గాను 89 హెక్టార్లలో సాగయింది. ● ఈ నాలుగు పంటల సాగుకు అదును ఉంది. దాంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ఏడాది రబీ సీజన్‌ పంటల సాగు ఆశించిన మేర ముందు సాగలేదనే చెప్పాలి.

ముగిసిన మంచి శనగ సాగు సీజన్‌...

జొన్న, మొక్కజొన్న, మినుము

సాగుకు అదును..

జిల్లా వ్యాప్తంగా

32.71 శాతం మేర పంటల సాగు

వరుస తుపాన్లు, అధిక

వర్షాలే ఇందుకు కారణం

65,295 హెక్టార్లకు గాను

21,356 హెక్టార్లలోనే సాగు

మినుము, జొన్న, మొక్క జొన్న

సాగు అంతంతే..

జిల్లాలో పంటల సాగు (హెక్టార్లలో..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement