అడుగడుగుకో గొయ్యి!
అధ్వానంగా కాజ–నంబూరు మార్గం కాజ గ్రామంలో రహదారిపై దారిపొడవునా భారీ గుంతలే దుమ్ము ధూళితో నిండుతున్న నివాసాలు
తాడేపల్లి రూరల్ : మంగళగిరి నియోజకవర్గంలోని కాజ, పొన్నూరు నియోజకవర్గంలోని నంబూరుల మధ్య రహదారి అధ్వానంగా మారింది. దాదాపు 3.5 కి.మీ. పొడవున ఈ రహదారి ఉంది. నిత్యం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. ద్విచక్ర వాహనదారులు, కార్లలో, ఆటోల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే రహదారిలో గుంటూరు చానల్‌పై బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందోనని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టోల్‌గేట్ రుసుం తప్పించుకోవాలని..
ఈ మార్గంలో నిత్యం నంబూరుతోపాటు గోళ్లమూరు, ఉప్పలపాడు గ్రామాలకు చెందిన వారు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. కాజా వద్ద టోల్‌గేటు రుసుం చెల్లించాల్సి వస్తుందని భారీ వాహనాలు ఈ రోడ్డులో వందల సంఖ్యలో రాత్రీపగలు తేడా లేకుండా తిరుగుతున్నాయి. రోడ్డు పొడవునా రెండువైపులా పంట కాలువ డ్రైనేజీలు ఉండడంతో మార్జిన్‌లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఎదురుగా వాహనం వస్తే మార్జిన్ దిగాలంటే భయమేస్తోందని వాహనదారులు తెలిపారు. కాజ గ్రామంలో జాతీయ రహదారి నుంచి గుంటూరు చానల్ వరకు రోడ్డు గజానికొక గొయ్యి ఉంది. భారీగా దుమ్ము లేవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో నుంచి ఈ రహదారి వెళుతుండడంతో రోడ్డు పక్కనే ఉన్న నివాసాల్లో దుమ్ము చేరుతోంది. అనారోగ్యం పాలవుతున్నామని కాజ గ్రామస్తులు వాపోతున్నారు.
భారీ లారీలతో ...
గుంటూరు చానల్‌పై బ్రిడ్జి సైడు ఐరన్ గడ్డర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కింద పిల్లర్లు సైతం ధ్వంసం అయ్యాయి. రోజూ ఈ రోడ్డులో ట్రాన్స్‌పోర్ట్ లారీలతో పాటు 50 టన్నుల లోడ్‌తో కంకర, మట్టి టిప్పర్లు తిరుగుతున్నాయి. ఈ వాహనాల వల్ల బ్రిడ్జి మరింత బలహీనపడే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. వెంటనే ఇరిగేషన్ అధికారులు ఆ బ్రిడ్జిని నిర్మించి, రహదారికి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
అడుగడుగుకో గొయ్యి!


