కొత్త సంవత్సరం బాగుంటుందా? | World Economic Situation and Prospects in 2022 | Sakshi
Sakshi News home page

కొత్త సంవత్సరం బాగుంటుందా?

Dec 23 2022 12:46 AM | Updated on Dec 23 2022 12:48 AM

World Economic Situation and Prospects in 2022 - Sakshi

కోవిడ్‌ మహమ్మారి, రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన 2022 సంవత్సరం మరి కొద్ది రోజుల్లో గతించిపోనుంది. ఆ వెంటనే రానున్న 2023 ప్రపంచానికి శుభ సంకేతాలు ఏమైనా వెలువరిస్తుందా అనేది ప్రశ్న. ఎన్నో ఆశలతో మొదలైన 2022లో ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 3 శాతం కంటే దిగువకు పడిపోయింది.

నూతన ఏడాదిలో కూడా ఇది 2.1 శాతంగా మాత్రమే ఉంటుందన్న ఐఎంఎఫ్‌ అంచనా  ఎంతమాత్రమూ ఆశ్చర్యం కలిగించదు. భారత్‌ వృద్ధిరేటు కూడా 5–6 శాతం మధ్య ఉండొచ్చు. అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థగా మన ప్రస్తుత స్థితిని మనం మరికొంత కాలం పట్టుకుని వేలాడవచ్చు. కానీ ఏ రకంగానూ మన ప్రస్తుత ఉపాధి రికార్డు మెరుగుపడే అవకాశం లేదు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకూ, ప్రపంచ రాజ కీయ నాయకులకూ 2022 చెడు సంవత్స రంగా ఉంటూ వచ్చింది. 2020లో మహమ్మారి సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకుని 2021లో అనేక భారీ ఆర్థిక వ్యవస్థల్లో బలంగా ఆర్థిక పునరుద్ధరణలు నమోదయ్యాయనీ, ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 5.8 శాతంగా ఉంటుందనే అంచనాతో, కోవిడ్‌ మహమ్మారి కథ ముగిసిం దనే వాగ్దానంతో 2022 ప్రారంభమైంది.

ఫిబ్రవరి చివరలో ఉక్రె యిన్‌పై రష్యా యుద్ధం ద్వారా ద్రవ్య నియంత్రణతో కూడుకున్న ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో ఇంధనం, ఆహారం, ఎరువుల ధరలు చుక్కలంటాయి. పైగా సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమెరికా నేతృత్వంలో ఐక్య పాశ్చాత్య కూటమి రష్యాపై విధించిన కనీవినీ ఎరగని ఆర్థిక ఆంక్షలు దీనికి తోడయ్యాయి. 

అలాగే, చైనాలో ఒమిక్రాన్‌ వైరస్‌ రకం దాడితో సరఫరా చెయిన్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో అనేక ప్రముఖ నగరాల్లో తీవ్ర స్థాయిలో లాక్‌డౌన్లు మళ్లీ నెలకొన్నాయి. అధిక వడ్డీరేట్లు, యుద్ధ అనిశ్చితిల వల్ల, ‘భద్రత ఉన్నచోటికి ఎగిరిపోవడం’ అనే సూత్రం ప్రాతిపదికన అమెరికాకుపెట్టుబడులు తరలిపోవడానికి దారితీసింది. దీంతో డాలర్‌ బాగా బలపడింది. ఇది అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విదేశీ ద్రవ్య సమస్యలకు, రుణ బాధలకు దారితీసింది.

ఈ బహముఖమైన ప్రకంపనల ఫలితంగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) విభాగపు వరల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ అంచనా వేసినట్లుగా 2022లో ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 3 శాతం కంటే దిగు వకు పడిపోయింది. ఆర్థికాన్ని అలా పక్కన ఉంచితే, 1945 తర్వాత యూరప్‌ చరిత్రలో తొలిసారిగా మొదలైన అత్యంత తీవ్రమైన భూతల యుద్ధం కారణంగా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు ఘోరంగా దెబ్బతిన్నాయి.

ఒకవైపు పశ్చిమ దేశాల కూటమి, మరోవైవు రష్యా, కొంతమేరకు చైనా కూటమిలో దేని పక్షాన చేరాలి లేదా వీలైనంత వరకు తటస్థంగా ఉండిపోవాలా అనే విషయమై ప్రపంచ దేశాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. వాతావరణ మార్పు, అణు నిరాయుధీకరణ, అంతర్జాతీయ వాణిజ్యం, ప్రపంచ పెట్రోలియం మార్కెట్, పెరుగు తున్న రుణ బాధలు, సీమాంతర డిజిటల్‌ డేటా తరలింపులు వంటి అనేక ఒత్తిడి కలిగించే అంశాల కారణంగా అంతర్జాతీయ సహకారానికి తీవ్ర సవాళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో మనం 2023లో ఏం ఆశించగలం? 

అంతర్జాతీయంగా ఇలా...
 ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యవిధానాలను విస్తృత స్థాయిలో బిగించి వేశారు. మరోవైపున ఇప్పటికే చుక్కలనంటిన చమురు, గ్యాస్, ఆహార ధరలు చాలా దేశాల్లో వినియోగదారులపై అలివి మాలిన భారాన్ని మోపడం కొనసాగనుంది. అయినప్పటికీ ద్రవ్యో ల్బణ రేట్లలో కాస్త మెరుగుదలను ఆశించే పరిస్థితులు ఏర్పడ్డాయి. 

అన్నిటికీ మించి ఉక్రెయిన్‌ యుద్ధ పథం ఎటువైపు దారితీస్తుందో అంచనా వేయడం అసాధ్యమైపోయింది. శీతాకాలం తర్వాత ఆకస్మి కంగా మిలిటరీ దాడులు తరచుగా జరుగుతూ దీర్ఘ కాలిక మంద్ర స్థాయి సైనిక ఘర్షణలు నెలకొంటాయని విశ్లేషకులు భావి స్తున్నారు. ఒక దశలో అంత సులభం కాని కాల్పుల విరమణ కూడా సాధ్య పడొచ్చు కానీ శాంతి నెలకొనకపోవచ్చనీ, ‘ఘనీభవించిన రూపంలో సైనిక ఘర్షణ’ కొనసాగవచ్చనీ చెబుతున్నారు. 

ప్రపంచంలో చాలా చోట్ల మహమ్మారి అంతరించిపోయి ఉండొచ్చు కానీ, చైనా ఇటీవలే జీరో కోవిడ్‌ పాలసీని సడలించడంతో ఆ దేశంలోని 140 కోట్లకు పైగా జనాభాలో తిరిగి కోవిడ్‌ సంక్ర మించడం, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  ఒమిక్రాన్‌ కంటే ప్రమాదకరమైన వైరస్‌ రకాలు ప్రబలే అవకాశం కూడా ఉందనీ, దీనివల్ల ప్రస్తుతం ఉనికిలో ఉన్న రోగనిరోధక రక్షణ వ్యవస్థలు పనిచేయకుండా పోతాయనీ సాంక్రమిక వ్యాధుల నిపు ణులు ఇప్పటికే హెచ్చరించారు.

ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్న అమెరికా, యూరప్, చైనాలు 100 ట్రిలియన్‌ డాలర్ల విలువైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 60 శాతం వాటాను కలిగి ఉన్నాయి. యూరప్‌ ఇప్పటికే మాంద్య పరిస్థితుల్లో ఉన్నందున 2023లో అది ఎలాంటి వృద్ధిని చూపించలేక పోవచ్చు. ప్రత్యేకించి జర్మనీ, బ్రిటన్‌  రానురాను బలహీనపడిపోతున్నాయి. 2023 ప్రథమార్థంలో అమెరికా కూడా మాంద్యంలో ప్రవేశించవచ్చని చాలామంది విశ్లేషకులు భావిస్తు న్నారు.

2022లో చైనా ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోయినందున 3 లేదా 4 శాతం కంటే ఎక్కువ వృద్ధిని చూడలేం. అయితే చైనా ఆర్థిక వ్యవస్థ కాస్త కోలుకున్నా, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుకు నెట్ట గలదు. ఈ పరిస్థితుల్లో ఐఎంఎఫ్‌ నివేదిక ప్రపంచ వృద్ధి రేటును 2.1 శాతంగా మాత్రమే పేర్కొనడం ఆశ్చర్యం కలిగించదు. నిజానికి ఐఎంఎఫ్‌ అధినేత ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు 1 శాతం కంటే ఎక్కువగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఉత్సాహ పడినప్పటికీ, 2023లో తైవాన్‌ని ఆక్రమించే ప్రమాదకరమైన చర్యకు చైనా పాల్పడకపోవచ్చు. అయితే 2020లో జరిగినట్లుగా భారత్, చైనా సరిహద్దుల పొడవునా మరో దశ సైనిక దొమ్మీ ఘటనలకు చైనా పాల్పడదని హామీ ఇచ్చే పరిస్థితులు ఇప్పుడు కూడా తక్కువగానే ఉన్నాయి. 

 ప్రపంచంలోని పది కోట్లమంది శరణార్థుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.  ఆయా దేశాల ప్రభుత్వాలు దిద్దుబాటు చర్య కోసం టైమ్‌ టేబుల్‌ రూపొందించుకోవడంలో ఇంకా వెనుకబడి ఉన్నందున వాతావరణ ప్రమాదాలు పెరిగే అవకాశముంది. ఇక ఆఫ్రికా విషయానికి వస్తే ప్రపంచం దృష్టికి రాకుండా మరుగున ఉన్న యుద్ధాలు, కరువులు ఇంకా మరెంతోమంది ప్రాణాలను హరించ డమే కాకుండా మరింత వేదనకు, ఆకలికి కారణమవుతాయి.

ఇండియా పరిణామాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్య ప్రమాదంలోకి జారుకుంటున్నం దున ఆర్థిక వృద్ధి రేటును కొనసాగించడం భారతదేశానికి సవాలుగా మారుతుంది. 2023లో భారత్‌ వృద్ధిరేటు 5–6 శాతం మధ్య ఉంటుం దని నా ఆంచనా. స్థూలంగా చూస్తే ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థగా మన ప్రస్తుత స్థితిని మనం మరికొంత కాలం పట్టుకుని వేలాడవచ్చు. సూక్ష్మ స్థాయిలో చూస్తే మనం ఈ స్థితిని ఇండోనేషియాకు, చివరకు చైనాకు కూడా వదులు కోవలసి రావచ్చు.

ఏ రకంగా చూసినా మన ప్రస్తుత ఉపాధి రికార్డు మెరుగు పడే అవకాశం లేదనిపిస్తోంది. ప్రత్యేకించి ఎగుమతుల విష యంలో ఇటీవలి పతనం కొనసాగినట్లయితే, మన విదేశీ ద్రవ్య స్థితి 2023 లోనూ ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. 
నాలుగు పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరుగు తుండటం, ఇప్పటినుంచి 16 నెలల లోపు సార్వత్రిక ఎన్నికలు జరుగ నున్న నేపథ్యంలో ఈ కాలం పొడవునా రాజకీయ ప్రచారం చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అడుగంటిపోతున్న కాంగ్రెస్‌ పార్టీపై బీజేపీ తన ఆధిక్యతను మరింతగా పెంచుకోవచ్చు.

ప్రపంచంలో అత్యధిక స్థాయిలో భౌగోళిక రాజకీయ చిక్కుముళ్లు ఉంటున్నందున, 2023 నవంబర్‌లో ముగిసే జీ–20 దేశాల కూటమి అధ్యక్ష బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం భారత ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. ప్రత్యేకించి జీ–20 కూటమిలోని అభివృద్ధి చెందుతున్న సభ్యదేశాలకు సంబంధించినంతవరకూ ప్రపంచ ఆర్థిక సమస్యల్లో కొంత స్పష్టమైన పురోగతి సాధిస్తే దానికి ఎంతో ప్రాధా న్యత ఉంటుంది. మొత్తం మీద చెప్పాలంటే, 2022 కంటే 2023 ప్రపంచానికి మరింత చెత్త సంవత్సరంగా ఉండబోతోంది.

వ్యాసకర్త భారత ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు
(‘ద బిజినెస్‌ స్టాండర్డ్‌’ సౌజన్యంతో)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement