
ఫైల్ ఫొటో
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ వేదికగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ భేటీ కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీతో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్ శాంతి చర్చల అంశంపై ఈ ఇద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
కీవ్‌పై మాస్కో దాడుల ఉధృతమైన నేపథ్యంలో.. తాజా పరిస్థితులు, మానవతా అంశాలు, శాంతి స్థాపన ప్రయత్నాలపై ఇరు దేశాల నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశ వివరాలను జెలెన్‌స్కీ మోదీకి వివరించారు. అలాగే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని తెలిపారు.
‘‘ఉక్రెయిన్ అధ్యక్షుడితో జరిగిన చర్చలో యుద్ధ పరిస్థితి, మానవతా అంశాలు, శాంతి స్థాపన ప్రయత్నాలపై అభిప్రాయాలు పంచుకున్నాం. భారత్ శాంతి కోసం జరిగే అన్ని ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది’’ అని భారత ప్రధాని, జెలెన్‌స్కీతో ఫోన్‌కాల్ సారాంశాన్ని వెల్లడించారు. మరోవైపు.. జెలెన్‌స్కీ కూడా సంభాషణను ఉపయోగకరమైన, ముఖ్యమైన చర్చగా అభివర్ణించారు.
అలస్కాలో ట్రంప్-పుతిన్ సమావేశం జరిగినప్పటి నుంచి.. రష్యా నుంచి శాంతి సంకేతాలు రాలేదని, రష్యా ఇటీవల తమ పౌరులపై దాడులు ఉధృతం చేస్తోందని, అసలు పుతిన్ శాంతి చర్చలకు సిద్ధంగా లేడని జెలెన్‌స్కీ అంటున్నారు. ఈ యుద్ధం ముగియాలంటే వెంటనే కాల్పుల విరమణ అమలు కావాలని అని జెలెన్‌స్కీ మోదీతో చెప్పినట్లు తెలుస్తోంది.