Sakshi Guest Column On NDTV And Gautam Adani Shares - Sakshi
Sakshi News home page

ఎలా ఉంటే స్వతంత్రత?

Published Mon, Dec 19 2022 12:22 AM

Sakshi Guest Column On NDTV And Gautam Adani Shares

జర్నలిజంలో సాహసం అంటే, ఆ పదం ప్రభుత్వానికి విరోధిగా ఉండాలన్న ఒత్తిడి చేస్తుంది. అది నిజం కాదు. జర్నలిస్టులు వాస్తవికంగా ఉండాలి. ప్రతి కథనాన్ని దాని యోగ్యతను బట్టి మాత్రమే మదింపు చేయాలి. ప్రభుత్వాన్ని పొగడటం చాలా సులభం. కానీ విమర్శించడమే కష్టం. ఇక్కడ తెగువ, సాహసం ముందుకొస్తాయి. ఎన్డీటీవీ ఛానల్‌లో గౌతమ్‌ అదానీ మెజారిటీ వాటాదారుగా మారిన నేపథ్యంలో ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. ఛానల్‌ను స్వాధీనపర్చుకోవడాన్ని ఒక వ్యాపార అవకాశంలా కాక ఒక ‘బాధ్యత’గా చూస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రాథమికంగా చూస్తే ఇది చక్కటి హామీని ధ్వనింపజేస్తోంది. అయితే మీడియా స్వాతంత్య్రం పట్ల ఆయన అభిప్రాయాలను బట్టి దీన్ని చూడాల్సి ఉంటుంది.

భారతదేశంలోని 400 వార్తా ఛానల్స్‌లో నేను ఎక్కువగా చూసేది ఎన్డీటీవీ. అయితే తరచుగా దానిలో వచ్చే అంశాల పట్ల, ఆ ఛానల్‌ యాంకరింగ్‌ పట్ల నేను విమర్శనాత్మకంగా ఉంటున్నప్పటికీ, అదే సమయంలో ఆ రెండింటినీ ఆరాధిస్తుంటాను. కాబట్టే ఛానల్‌ని గణనీయంగా మార్చేసే అధికారంతో అతి త్వరలో గౌతమ్‌ అదానీ ఎన్డీటీవీ మెజారిటీ వాటాదారుగా మారుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఇది మనకు తెలిసిన రూపంలోని ఎన్డీటీవీకి ముగింపు పలకనుందా?

‘ద ఫైనాన్షియల్‌ టైమ్స్‌’కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అదానీ తన భవిష్యత్‌ పథకాల గురించి మాట్లాడారు. నాకు తెలిసి నంతవరకూ, ఆయన ఈ ఒక్కసారి మాత్రమే ఈ విషయం మీద ఇలా మాట్లాడారు. ఎన్డీటీవీని స్వాధీనపర్చుకోవడాన్ని ఒక వ్యాపార అవకాశంలా కాక ఒక ‘బాధ్యత’గా చూస్తున్నట్లు చెప్పారు. ప్రాథమి కంగా చూస్తే ఇది చక్కటి హామీని ధ్వనింపజేస్తోంది. కానీ అది నిజమేనా?

మిగిలిన ఇంటర్వ్యూ విశ్వసనీయ సందేహాల కోసం మంచి కారణాలనే ప్రతిపాదిస్తుంది. మీడియా స్వతంత్రతపై అదానీ భావన నుంచి అవి పుట్టుకొస్తున్నాయి. ‘‘స్వాతంత్య్రం అంటే, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే అది తప్పు అని నువ్వు చెప్పడం అన్నమాట. ఎవరూ దానిపై తగవులాడరు. కానీ అదే సమయంలో, ప్రభుత్వం ప్రతిరోజూ సరైన పని చేస్తున్నప్పుడు దాని గురించి చెప్పే సాహసం నీకు ఉండాలి’’ అని అదానీ జోడించారు. ప్రతిరోజూ మంచి పని చేస్తున్న ప్రభుత్వం ఏది? అలాంటి ప్రభుత్వం ఏదీ నాకు తెలీదు. అలాంటి పనిని గుర్తించడానికి మీకు సాహసం ఎందుకు కావాలి? ఆ పదం జర్నలిజపు విస్తృత సముదాయాన్ని బట్టి మిమ్మల్ని కేవలం విరోధిగా మాత్రమే ఉండాలని ఒత్తిడి చేస్తుంది. కానీ అది నిజం కాదు.

జర్నలిస్టులు వాస్తవికంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి కథనాన్ని దాని యోగ్యతను బట్టి మాత్రమే వారు మదింపు చేయవలసి ఉంటుంది. ఒక పక్షం వహించకూడదు లేదా తటస్థంగా కూడా ఉండకూడదు. ప్రభుత్వాన్ని పొగడటం నిజానికి చాలా సులభం. వారు దాన్ని ఇష్టపడతారు కూడా. కానీ ప్రభుత్వాన్ని విమర్శించడమే చాలా కష్టం. ఇక్కడ తెగువ, సాహసం ముందు కొస్తాయి. మీడియా స్వాతంత్య్రానికి సంబంధించిన అదానీ భావన దీన్ని స్వీకరిస్తుందని నేను చెప్పలేను. ఆయన పదజాలం అలా స్వీకరించదనే సూచిస్తుంది.

అయినప్పటికీ అదానీకి ఎన్డీటీవీ కోసం పెద్ద పథకాలే ఉన్నాయి. ఆ ఛానల్‌కి అంతర్జాతీయ పాదముద్రను ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ లేదా ‘అల్‌ జజీరా’తో సరిపోల్చే స్థాయిలో భారతదేశానికి ఒక్క మీడియా సంస్థ కూడా లేదని కూడా ఆయన అన్నారు. ఇది రెండు విషయాలను సూచి స్తోంది. అదానీ ఎన్డీటీవీలో చాలా పెట్టుబడి పెట్టబోతున్నారు. బహుశా ఆయన ఆ ఛానల్‌ విశ్వసనీయతను కాపాడవచ్చు. ఎందు కంటే అలా కాపాడకపోతే, ఫైనాన్షియల్‌ టైమ్స్, అల్‌ జజీరా స్థాయిని అది సాధించలేదు మరి!. ఇక్కడ సమస్య ఏమిటంటే, మీడియా స్వాతంత్య్రంపై ఆయన భావనతో ఈ ప్రశంసించదగిన ఆకాంక్ష ఘర్షణ పడుతోంది. పైగా, ఇది ఆయనను ఒక భయంకరమైన సందిగ్ధంలో ఉంచుతోంది. లేదా రెండు సందిగ్ధాలు అని కూడా చెప్పవచ్చు.

ఎన్డీటీవీ ప్రతిరోజూ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఉన్నట్లయితే దాన్ని ప్రభుత్వ ప్రచార అంగంగా మాత్రమే చూస్తారు. అప్పుడు అది ఫైనా న్షియల్‌ టైమ్స్, అల్‌ జజీరా స్థాయికి ఎన్నటికీ పెరగలేదు. అదానీకి అర్థం కానిది ఏమిటంటే, విమర్శనాత్మకంగా ఉండే దాని వస్తు గతతత్వం, సాహసమే ఫైనాన్షియల్‌ టైమ్స్‌ని గొప్ప పత్రికగా మలిచిందన్నదే! అల్‌ జజీరా విషయంలో కూడా ఇది నిజమే. కాక పోతే ఖతార్‌లో తన సొంత ప్రభుత్వ వార్తలను కవర్‌ చేసే విషయంలో మాత్రం ఇది నిజం కాకపోవడం విషాదం.

మరొకటి జరగవచ్చు. ఎన్‌డీటీవీని గ్లోబల్‌గా మార్చడానికి తగి నంత డబ్బు అదానీ వద్ద ఉంది. దాన్ని ప్రపంచంలోని ప్రతి మూలకూ చేరుకోగలిగే ఉపగ్రహాలపై అదానీ వెచ్చించగలరు. అయితే ఆ టీవీ ఛానల్‌ విశ్వసనీయతనే నిర్లక్ష్యం చేసినప్పుడు ఎవరైనా దాన్ని చూడగలరా? బహుశా తాము వదిలిపెట్టి వెళ్లిన గడ్డ గురించి ఇప్పటికీ బాధపడుతున్న, పూర్తిగా స్వదేశంలో లేని కొద్దిమంది ప్రవాస భారతీయులు మాత్రమే ఆ ఛానల్‌ని చూడవచ్చు తప్ప మరెవరూ చూడబోరు. 

అదానీ చెప్పని మరో విషయం ఉంది. కానీ తన కొత్త ఛానల్‌ కోసం తన మనస్సులో ఉన్న ఏ విషయానికైనా నిజానికి అది కీలకమైంది. ఎన్డీటీవీకి విశిష్టమైన స్వభావం, విశ్వసనీయమైన వీక్షకులు, అత్యంత అధిక ప్రతిష్ఠ ఉన్నాయి. ఈ ఛానల్‌ని కొనడానికి వందలాది కోట్లు వెచ్చించిన తర్వాత (దాన్ని గ్లోబల్‌ స్థాయికి తీసుకెళ్లడానికి వేల కోట్లు కూడా వెచ్చించవచ్చు) దాని ప్రతిష్ఠను దిగజార్చి నష్టం కలిగించేలా మార్పులు చేపట్టగలరా? అందుచేత ఆ ఛానల్‌ ఉత్తమ యాంకర్లు, కరెస్పాండెంట్లను ఆయన అట్టిపెట్టు కోవచ్చు. వీరే లేకుంటే ఎన్డీటీవీ ఉత్త హార్డ్‌వేర్‌ లాగా మాత్రమే ఉంటుంది. కానీ వారి వస్తుగత పనితత్వాన్ని, వారి వాక్‌ స్వాతంత్య్రాన్ని దెబ్బతీసినట్లయితే వారు సంస్థలో కొనసాగుతారా?

బహుశా, ఇదే ఆయన ఆలోచనలను కాస్త పదును పెట్టవచ్చు. సంస్థ నుంచి వెళ్లిపోయేవారి స్థానంలో కొత్త జర్నలిస్టులను నియమించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ మంచి జర్న లిస్టులను వెతకడమే చాలా కష్టమైన పని. అలాంటివారు ఇప్పటికే చక్కటి వేతనాలతో సురక్షిత స్థానాల్లో ఉండవచ్చు. తమకు సుపరిచితం కాని వ్యవహారంలోకి అడుగుపెట్టి వారు తమను తాము ఎందుకు బలిపెట్టుకుంటారు?.

- కరణ్‌ థాపర్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement
Advertisement