నేడు సినీ మార్గదర్శకుడు కేవీ రెడ్డి వర్ధంతి

Sakshi Guest Column On Movie Director KV Reddy

సినిమాకు ఒక విధానం ఉందనీ, ఆ విధానానికి ఒక శాస్త్రం ఉందనీ, దాన్ని అనుసరించే సినిమాలు తీయాలని చెప్పి, చేసి చూపిన దర్శక మేధావి కేవీ రెడ్డి. సరైన స్క్రిప్టు సినిమాకు ముఖ్యమనీ, స్క్రీన్‌ప్లే సిద్ధమైతే సినిమా మూడొంతులు పూర్తయినట్టేనని నిరూపించిన దక్షిణ భారతదేశ దర్శకుల్లో అగ్రగణ్యులు. దర్శకునిగా కేవీ రెడ్డి మూడు దశా బ్దాల కాలంలో తీసిన సినిమాల సంఖ్య కేవలం 14. తమిళ, హిందీ వెర్షన్లతో కలిపితే 18. వీటిలో 5 పౌరాణికాలు, నాలుగు జానపదాలు, 3 సాంఘికాలు, రెండు చారిత్రకాలు ఉన్నాయి.

ఆయన పేరు చెప్పగానే ‘మాయాబజార్‌’, ‘పాతాళభైరవి’, ‘గుణసుందరి కథ’, ‘దొంగ రాముడు’ గుర్తొస్తాయి. కేవీ 1937లో తన మిత్రుడు మూలా నారాయణస్వామి భాగ స్వామిగా ఉన్న ‘రోహిణీ పిక్చర్స్‌’లో ప్రొడ క్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ గా చేరడంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. అప్పట్లో రోహిణీ పిక్చర్స్‌ హెచ్‌ఎం రెడ్డి దర్శకత్వంలో ‘గృహలక్ష్మి’ (1938) తీసింది. ఇక్కడే ఆయనకి బీఎన్‌ రెడ్డి, సముద్రాల, నాగిరెడ్డిలతో పరిచయమైంది. తర్వాత వీరంతా బయటికి వచ్చి వాహినీ పిక్చర్స్‌ స్థాపించారు. 

వాహినీ పతాకంపై బీఎన్‌ తీసిన ‘వందేమాతరం’ (1939), ‘సుమంగళి’ (1940), ‘దేవత’ (1941) చిత్రాలకు కేవీ సహాయ దర్శకులుగా చేశారు. దేవత తరువాత కేవీకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. అది మూలా నారాయణస్వామి పెట్టుబడితో తీసిన ‘భక్తపోతన’ (1942). అది రజతోత్సవాలు జరుపుకుంది. ‘గుణసుందరి కథ’ (1949) విజయం ఇచ్చిన ప్రేరణతో విజయావారికి మరో అద్భుత జనరంజకం ‘పాతాళభైరవి’ (1951) తీశారు. ‘మాయాబజార్‌’ (1957) ఒక చరిత్రను సృష్టించింది. కేవీ దర్శకత్వ ప్రతిభకు, పకడ్బందీ స్క్రీన్‌ ప్లేకు ఈ చిత్రం ఒక తిరుగులేని సిలబస్‌. 

తెలుగు చిత్ర రంగంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కేవీ రెడ్డి (కదిరి వెంకటరెడ్డి) 1912 జులై 1న అనంతపురం జిల్లా తాడిపత్రిలో పుట్టారు. 1972 సెప్టెంబర్‌ 15న కన్నుమూశారు. కేవీ మనమధ్య లేక పోయినా ఆయన కళకు, వ్యాపారానికి సమన్వయం చేస్తూ తీసిన చిత్రాలు చూస్తున్నంత కాలం చిరంజీవిగా నిలిచే ఉంటారు. తెలుగు సినిమా రంగంలో ఆయనకు ప్రత్యామ్నాయం లేదు.
– హెచ్‌. రమేష్‌ బాబు, చలనచిత్ర పరిశోధకులు
(నేడు కేవీ రెడ్డి వర్ధంతి) 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top