పిల్లలకు చెప్పాల్సిన 'మాయాబజార్' పాఠాలు..!
పిల్లలకు చెప్పాల్సిన పాఠాలు ‘మీరు ఉద్దండ పండితులేగాని ఉండాల్సిన బుద్ధి మాత్రం లేదయ్యా’ అంటాడు శకుని. ర్యాంకులు వేరు... కామన్సెన్స్ వేరు... ఈ సంగతి పిల్లలకు ఎవరు చెప్పాలి? ‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’ అంటాడు ఇదే శకుని. ఈ చిట్కా చెప్పడానికి పెద్దలకు తీరిక ఎక్కడిది? అస్మదీయులు ఎవరో తస్మదీయులు ఎవరో తెలుసుకోకపోతే పిల్లల అడుగులు పడేదెలా? హాయ్ హాయ్ నాయకా.. హోయ్ హోయ్ నాయకా... నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉంటాయి? తెలుగువారికి మాత్రమే ఉన్న వ్యక్తిత్వ వికాస సర్వస్వం ‘మాయాబజార్’ సినిమా. ఈ సెలవుల్లో పెద్దలు పిల్లలతో ఈ సినిమా చూడాలి. వివరించాలి. ‘మాయాబజార్’1957లో విడుదలైన గొప్ప తెలుగు చిత్రం. భారతంలోని పాత్రలకు కొద్దిపాటి కల్పన జత చేసి మలచిన ఈ సినిమా ఎందుకు ఇంతకాలం ఆదరణ పొందుతూ ఉందంటే అది ఎప్పుడూ ఒకేలా ఉండే మానవ స్వభావాలను చిత్రించింది కనుక. నేడు ఎదురుపడే మనుషులు ఎలా ఉంటారో ఈ సినిమాలో పాత్రలు అలా ఉంటాయి. అందుకే వాటితో తమను తాము ఐడెంటిఫై చేసుకున్న ప్రేక్షకులు ఎన్నో సాఠాలు నేర్చుకుంటారు. అర్థం చేసుకుంటారు. పిల్లలకు ఈ సినిమా గొప్ప వినోదంగా ప్రారంభమవుతుంది. ఐదేళ్ల వయసు పిల్లల నుంచి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. చూసేకొద్దీ ఎదిగే కొద్దీ వారికి సినిమా కొత్తగా అర్థమై మరింతగా నచ్చుతుంది. ఈ సినిమాకు ఫ్యాన్స్ అయిపోతారు. అలా తరతరాలుగా ఫ్యాన్స్ అయ్యేలా చేసుకుందీ సినిమా. గతంలో ప్రతి వేసవిలో ఈ సినిమా రీరిలీజ్ అయ్యేది. ఇప్పుడు ఓటిటీల్లో... యూట్యూబ్లో కలర్లో ఉంది. పిల్లలతో ఒకటికి రెండుసార్లు చూసి వారికి చెప్పాల్సిన పాఠాలు చాలానే ఉంటాయి. 1. బాల అభిమన్యు తన విలువిద్య గురించి ఇలా అంటాడు: అత్తయ్యా... నువ్వు జడవకుండా నుంచో... నీ ముక్కుకు తగలకుండా నత్తును కొడతాను. పిల్లలకు చెప్పాలి: నత్తు అంటే ముక్కుకు పెట్టుకునే ఆభరణం. విలువిద్య నేర్చుకుని ఎవరైనా సరే పండునో కాయనో కొట్టగలరు... కాని ముక్కుకు తగలకుండా నత్తును కొడతానంటున్నాడంటే విలువిద్య చాలా గొప్పగా నేర్చుకున్నాడన్న మాట. మనం చదివినా, ఆటల్లో ప్రవేశించినా, కళల్లో ఉన్నా ఆ స్థాయి పరిణితి సాధించాలి. అభిమన్యుడిని ఆదర్శంగా తీసుకోవాలి. 2. శ్రీకృష్ణుడు ‘సత్యపీఠం’ తీసుకువస్తాడు. అలాగే ‘ప్రియదర్శిని’ కూడా చూపిస్తాడు. పిల్లలకు చెప్పాలి ‘సత్యపీఠం’ ఆనాటి లై డిటెక్టర్. మన పూర్వికులు శాస్త్రపరంగా గొప్ప ప్రయోగాలు చేశారు. ఊహలు చేశారు. శాస్త్రజ్ఞుల ఊహలో లేని కాలంలో ‘సత్యపీఠం’ ఊహ చేయడం మనవారి గొప్పతనం. అలాగే వీడియో కాల్ చేసుకునేలా ల్యాప్టాప్లాంటి ‘ప్రియదర్శిని’ని చూపించారు. సైన్స్ దృష్టికోణం నుంచి పురాణాలు చూస్తే చాలా ఇంటెరెస్టింగ్ విషయాలు తెలుస్తాయని చె΄్పాలి. 3. శకుని పాచికలు వేస్తూ అంటాడు: ఈ పాచికలతో ఎవరినైనా సర్వనాశనం చేయగలను. పిల్లలకు చె΄్పాలి: జూదం వ్యసనం. అందులో మోసం ఉంటుంది. నష్టం ఉంటుంది. ఒక్కసారి వ్యసనాల్లో దిగితే తిరిగి రావడం కష్టం. నేటి రోజుల్లో ఆన్లైన్ గేమింగ్ కూడా అలాంటి వ్యసనమే. బెట్టింగ్ యాప్లు కూడా వ్యసనమే. ఆల్కహాల్, డ్రగ్స్ కూడా వ్యసనాలే. వ్యసనాల వల్ల పాండవులు రాజ్యాలను కోల్పోయారు. అందువల్ల ఎప్పుడూ వ్యసనాల జోలికిపోకూడదు. 4. శర్మ, శాస్త్రి వచ్చి లక్ష్మణ కుమారుణ్ణి పొగుడుతూ ‘పురోగమించుట వారికి తెలుసు... తిరోగమించుట తమకు తెలుసు’ అంటారు. పిల్లలకు చెప్పాలి: గొప్పలు చెప్పుకోవడం, పొగడ్తలకు పడిపోవడం అల్పుల లక్షణం అని, లక్ష్మణ కుమారుడు అలాంటి వాడని చెప్పాలి. మనకు ఎంత ప్రతిభ ఉన్నా గొప్పలు చెప్పుకోకూడదని నేర్పాలి. లేని ప్రతిభ ఉన్నట్టుగా కల్పించి చెప్పి అభాసుపాలు కాకూడదని చెప్పాలి. మన బలహీనతను వాడుకుంటూ కొందరు చుట్టూ చేరి మోసం చేసి పబ్బం గడుపుతారనీ అలాంటి వారిని గుర్తించి దూరం ఉండాలి చెప్పాలి. 5. రాజ్యం పోయాక సుభద్ర వస్తే బలరాముని ఇంట్లో పరాభవం పిల్లలకు చెప్పాలి: కొందరు మనుషులు అభిమానాన్ని బట్టి గాక స్థితిని బట్టి గౌరవిస్తారని, మనం కష్టంలో ఉంటే వారు అసలు రూపు చూపిస్తారని అలాంటి వారిని చూసి జాలి పడాలి తప్ప బాధ పడకూడదని నేర్పాలి. డబ్బుకు అతీతమైన విద్యాబుద్ధులు, వ్యక్తిత్వం శాశ్వతమని, వాటికే లోకంలో విలువ, గౌరవం అని చె΄్పాలి. 6. ఘటోత్కచుడి ప్రవేశం పిల్లలకు చెప్పాలి: మన దేశంలో అడవుల్లో జీవించేవారు ఉంటారని వారిని గిరిజనులు, ఆదివాసీలు అంటారనీ వారి కట్టు, బొట్టు, భాష, యాస, ఆచారాలు వేరని... మనం నాగరికులం అయినంత మాత్రాన వారిని చిన్నచూపు చూడకూడదని. వారెంతో మంచివారని, అడవులు వారి ఆధారం అని వాటిని నరికి లాక్కుని వారికి హాని కలిగించడం తప్పు అని నేర్పాలి. ‘అస్మదీయులు’ అంటే ఫ్రెండ్స్ అనీ, ఆదివాసీలకు మనం అస్మదీయులుగా ఉండాలని చె΄్పాలి. 7. దుష్ట చతుష్టయం పిల్లలకు చెప్పాలి: దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు... వీరు నలుగురిని దుష్ట చతుష్టయం అంటారని చతుష్టయం అంటే నాలుగు అని చెప్పాలి. చెడు ఆలోచనలు చేసేవారితో స్నేహం చేస్తే మనం కూడా చెడ్డవాళ్లం అవుతామని చెడ్డపనులు చేయడం వల్ల ప్రమాదంలో పడతామని హెచ్చరించాలి. 8. గింబళి, గిల్పం కావాలని డిమాండ్ పిల్లలకు చెప్పాలి: స్నేహితులైనా, బంధువులైనా న్యాయమైన సాయం, కోరిక కోరితే నెరవేర్చాలని, అదే మన మంచితనం సాకుగా తీసుకుని గొంతెమ్మ కోరికలు కోరితే వారికి బుద్ధి చె΄్పాలని నేర్పాలి. ‘కంబళి’, ‘తల్పం’ కాదని ‘గింబళి’, ‘గిల్పం’ కోరిన శర్మ, శాస్త్రులకు చిన్నమయ్య బుద్ధి చెప్పే దృశ్యాలు పిల్లలకు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయి. 9. శాకంబరీదేవి ప్రసాదం– వివాహ భోజనంబు పిల్లలకు చెప్పాలి: తెలుగువారి భోజనానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని ప్రతి ప్రాంతానికీ సమూహాలకు వారివైన ఆహార అలవాట్లు ఉంటాయని, వాటిని గౌరవించాలని మన ఆహారపు అలవాట్లను పాటించాలని నేర్పించాలి. గోంగూరను శాకంబరీ దేవి ప్రసాదం అంటారని తెలుగువారికి గోంగూర ఇష్టమని చెప్పాలి. భక్ష్యాలు, చిత్రాన్నాలు, పానీయాలు, కూరగాయలు అంటే ఏమిటో వాటి తేడాలేమిటో చెప్తే సరదా పడతారు. 10. చినమాయను పెనుమాయ పిల్లలకు చెప్పాలి: ఏ పనైనా నిజాయితీగా చేస్తే ఫలితం ఉంటుందని.. మాయతో కపటంతో శశిరేఖను లక్ష్మణ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని కౌరవులు భావిస్తే శ్రీకృష్ణుడు, ఘటోత్కచుడు పెనుమాయతో ఆ పెళ్లిని పెటాకులు చేశారని... తగిన శాస్తి జరిగిందని... చెడ్డవాళ్లు ఎప్పటికీ ఓడిపోతారని, మంచితనంతో ఉంటేనే గెలుస్తామని బోధించాలి.(చదవండి: అందరికీ కావాల్సిన పోషకాలు ఇవే..! వయసుల వారీగా డైట్ ఎలా ఉండాలంటే..?)