
లండన్‌లో నూరేళ్లుగా ఉన్న భారతీయ రెస్టారెంట్ ‘వీరాస్వామి’
కామెంట్
బ్రిటన్‌లో ఇప్పటికీ నడుస్తున్న అతి పురాతనమైన భారతీయ రెస్టారెంటు ‘వీరాస్వామి’. ఇంత సుదీర్ఘకాలం నుంచీ భోజనప్రియలను అలరిస్తున్న ఇండియన్ రెస్టారెంటు ప్రపంచంలోనే మరొకటి లేదని యాజమాన్యం సగర్వంగా చెబుతుంది. దీన్ని స్థాపించి వచ్చే ఏడాదికి వందేళ్లు. ఆ సంబరాలే మరపురానివిగా మిగిలిపోయే... ‘వీరాస్వామి’ అంతిమ ఘడియలు కూడా కావచ్చు.
లండన్ రీజెంట్ స్ట్రీట్‌లో ప్రసిద్ధి గాంచిన చిరునామాల్లో ‘వీరాస్వామి’ ఒకటి. దీనికి ఎడమవైపు ఆస్టిన్ రీడ్, ఎదురుగా ఆక్వాస్కూటమ్ ఉండేవి. ఈ రెండు లెజెండరీ క్లాత్ షాపులూ చరిత్రగర్భంలోకి జారిపోయి ఎంతో కాలం కాలేదు. అదే ‘వీరాస్వామి’ విషయంలోనూ నిజం కాబోతుందేమో!
ఈ రెస్టారెంటు మూతపడటం... సాంస్కృతిక విలువలను బేఖాతరు చేస్తూ డబ్బుకు ప్రాముఖ్యం ఇవ్వడానికి నిదర్శనంగా రంజిత్ మత్రానీ, నమిత పంజాబీ అంటున్నారు. వీరు ‘వీరాస్వామి’ ప్రస్తుత యజమానులు. వారి మాటలతో ఏకీభవించని వారుండరు.
1926లో ‘వీరాస్వామి’ ప్రారంభమైంది. జనరల్ విలియం పామర్, మొఘల్ ప్రిన్సెస్ ఫయిసన్ నిస్సా బేగంల ముని మనవడు ఎడ్వర్డ్ పామర్ దీన్ని స్థాపించాడు. వీరాస్వామిలోని ‘వీరా’ ఆయన గ్రాండ్ మదర్ పేరు. తందూర్ ఓవెన్‌ను తీరాలు దాటించిన ఘనత కూడా ఎడ్వర్డ్‌కే దక్కింది. 1937లో ఈ రెస్టారెంటు తందూర్ ఓవెన్ ప్రారంభించింది. 1940లలో లండన్ మీద జర్మనీ బాంబులు కురిపిస్తున్నా, వీరాస్వామి యథాప్రకారం తెరచి ఉందని చెబుతారు.
లండన్ పుర ప్రముఖులకు ‘వీరాస్వామి’ అంటే ఎప్పుడూ మొఖం మొత్తలేదు. వేల్స్ యువరాజు (తర్వాతి కాలంలో 8వ కింగ్ ఎడ్వర్డ్ ) తరచూ అక్కడ విందు ఆరగించేవాడు. 1930ల ప్రథమార్ధంలో డెన్మార్క్ క్రౌన్ ప్రిన్స్‌కు ఈ రెస్టారెంటు ఎంతో ఇష్టమైన ప్లేస్. దీన్నిబట్టి దాని ప్రాభవం ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
ఆయన తరచూ ఇక్కడకు వస్తూ ఉండేవాడు. గోవా స్టయిల్ డక్ విన్డాలూ వంటకం ఆయన ఫేవరెట్ డిష్. ఈ ప్రిన్స్ ప్రతి ఏటా క్రిస్మస్ నాడు ‘వీరాస్వామి’కి కృతజ్ఞతా పూర్వకంగా కార్ల్స్‌బర్గ్ బీరు పీపా పంపేవాడు. బీరు, ఇండియన్ వంటకాల మేళవింపుపై బ్రిటిష్ వారి క్రేజ్‌కు ఇక్కడే బీజం పడింది. ఇప్పుడు ఇవి జన జీవన స్రవంతిలో భాగం అయ్యాయి.
భారతీయులకు కూడా ‘వీరాస్వామి’ ప్రీతిపాత్రంగా ఉంటూ వచ్చింది. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, కృష్ణమీనన్ ఈ రెస్టారెంటుకు తరచూ వెళ్లేవారు. అలాగే చర్చిల్, స్వీడన్, జోర్డాన్‌ల రాజులు, మార్లన్ బ్రాండో, లారన్స్ ్స ఆలివర్, పీయర్స్ బ్రాజ్నన్, ప్రిన్సెస్ ఏనీ, డేవిడ్ క్యామరన్‌లు కూడా. 1948లో భారత ఒలింపిక్ టీముకు తన సేవలు అందించింది. 2017లో ఇంగ్లాండులో పర్యటించిన భారత రాష్ట్రపతికి ఎలిజబెత్ రాణి ఇచ్చిన విందుకు వీరాస్వామే కేటరర్.
వీరాస్వామిని మూసివేత అంచుల్లోకి నెట్టిన సమస్య ఏమిటో చూద్దాం. ఈ రెస్టారెంటు రీజెంట్ స్ట్రీట్‌లోని క్రౌన్ ఎస్టేట్‌కు చెందిన బిల్డింగులో ఉంది. ఇదే అసలు సమస్య. క్రౌన్ ఎస్టేట్ సంస్థ చార్లెస్ రాజు ఆస్తులను నిర్వహిస్తుంది. ఈ సంస్థ వీరాస్వామి లీజు పొడిగించరాదని నిర్ణయించింది. లీజు వచ్చే ఏడాది ఏప్రిల్‌తో ముగుస్తుంది.
రెస్టారెంటు గ్రౌండ్ ఫ్లోర్ ముఖద్వారం ఆక్రమించి ఉండే 11 చదరపు మీటర్ల స్పేస్‌ను తీసేసుకుని పైఅంతస్తుల్లోని ఆఫీసుల కోసం రిసెప్షన్‌ను విస్తరించుకోవాలని తలపెట్టింది. అక్కడ రెస్టారెంటు ఉండటం చీకాకుగా ఉంటోందని వారు భావిస్తూ ఉండొచ్చనీ, భవనం అంతా కార్యాలయాలు మాత్రమే ఉండాలనుకున్నారని తాము భావిస్తున్నామనీ మత్రానీ ఇటీవలే ‘ది టైమ్స్’ వార్తా పత్రికకు చెప్పారు.
అయితే ‘వీరాస్వామి’ దీనిపై కోర్టుకు వెళ్లింది. కేసు ఇంకా విచారణకు రాలేదు. అలాగే, సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టారు. లీజు రద్దుకు వ్యతిరేకంగా పదుల వేలల్లో ప్రజలు పిటిషన్ మీద సంతకాలు చేశారు. దీన్ని రాజుకు సమర్పిస్తారు. ఈ ప్రయత్నాలేవీ ఫలించనట్లయితే, ‘మేం దీన్ని మూసేస్తాం.
తర్వాత అనువైన కొత్త సైటును ఎంపిక చేసి అందులో తిరిగి తెరుస్తాం. ఈ ప్రక్రియకు ఎంతకాలం పడుతుందో చెప్పలేం. అందాకా వ్యాపారం నష్టపోతుంది. వృథా వ్యయాలు ఉత్పన్నమవుతాయి’ అని మత్రాని వివరించారు. దీనివల్ల ‘ప్రధానమైన ఒక లండన్ సంస్థ నాశనమవుతుంద’ని ఆయన ఆవేదన చెందారు.
అది నిజంగానే ఓ విషాదం. ఇక్కడ విషయం, ‘వీరాస్వామి’కి చరిత్రలో ఉన్న స్థానాన్ని కాపాడటం, సంరక్షించడం మాత్రమే కాదు. ఒక మంచి రెస్టారెంటు కనుమరుగు అవుతుందన్నది కూడా ముఖ్యమైన అంశమే. 2016లో దీనికి గుర్తింపుగా మిషెలన్ స్టార్ రేటింగ్ లభించింది. ఇవ్వాళ్టికీ ఈ రేటింగ్ కొనసాగుతోంది.
చార్లెస్ రాజు జోక్యం చేసుకుని ‘వీరాస్వామి’ మూతపడకుండా అడ్డుకుంటారా? ఈ ఒక్క ఆశే మిగిలి ఉంది. ఒకవేళ ఆయన ఆ పని చేయనట్లయితే, ఈ సారి లండన్ వెళ్లినప్పుడు నేను తప్పనిసరిగా ‘వీరాస్వామి’లో డైనింగ్ చేసి వీడ్కోలు చెప్పివస్తాను. మీరు కూడా ఇలా ఎందుకు చెయ్యకూడదు? ఆలోచించండి.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్