పంజాబ్‌లో ఆప్‌... ఉత్తరాఖండ్‌లో బీజేపీ?

Praveen Roy Political Revision On Punjab And Uttar Pradesh Elections - Sakshi

ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పంజాబ్‌(ఫిబ్రవరి 20), ఉత్తరాఖండ్‌(నేడు)లలో ఒకే విడతలో జరగనున్న ఓటింగ్‌లో పార్టీల అంతర్గత కుమ్ములాటలు, నేతృత్వ సమస్యలు ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి. మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం సాగిన రైతుల ఉద్యమం ఎటూ కీలకపాత్ర పోషించనుంది. పంజాబ్‌లో ఈసారి కాంగ్రెస్, బీజేపీలను ఆమ్‌ ఆద్మీ పార్టీ వెనక్కినెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ సొంతంగా మెజారిటీ వస్తుందని చెప్పలేం. ఇక ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలిచే అవకాశం కనబడుతున్నా, ఆమ్‌ ఆద్మీ ఇక్కడా కింగ్‌ మేకర్‌ పాత్ర పోషించే వీలుంది. ఢిల్లీకి ప్రతిష్ఠాత్మక సీఎస్‌డీఎస్, ఎన్నికల విశ్లేషణ ‘సాక్షి’కి ప్రత్యేకం.

భారతదేశ రాజకీయాల్లో పంజాబ్, ఉత్తరా ఖండ్‌ కొంత ప్రత్యేకం. సామాజిక వర్గాల ఆధిపత్యం పార్టీల తీరుతెన్నులపైనా ప్రభావం చూపే ప్రాంతాల్లో ఈ రెండు రాష్ట్రాలు ఉంటాయి. చరిత్రను తరచిచూస్తే పంజాబ్‌ జనాభాలో 58 శాతం ఉన్న సిక్కులు రాజకీయంగానూ బలవంతు లన్న విషయం స్పష్టం. ఉత్తరాఖండ్‌ విషయానికి వస్తే... అరవై శాత మున్న అగ్రవర్ణాలదే ఆధిపత్యం. ఈ రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కూడా ఈ వర్గాల వారే. ఉత్తరాఖండ్‌లో నేడు, పంజాబ్‌లో ఫిబ్రవరి 20న జరిగే ఎన్నికల్లోనూ ఇదే పంథా కొనసాగే అవకాశాలు మెండు. 

భారత రాజకీయాల్లో కుల, మతాధిపత్యాల ఆధారంగా వివక్ష చాలాకాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సమీప భవి ష్యత్తులో అంతమవుతుందని కూడా అశించలేము. పంజాబ్, ఉత్తరా ఖండ్‌ రెండింటిలోనూ పార్టీలు అంతర్గత కుమ్ములాటలు, నేతృత్వ సమస్యలతో కొట్టుమిట్టాడాయి. ఈ పరిణామాలతో ముఖ్యమంత్రు లనూ మార్చాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ పంజాబ్‌లో ఒకసారి ముఖ్య మంత్రిని మారిస్తే, ఉత్తరాఖండ్‌లో బీజేపీ రెండుసార్లు ఈ పని చేయాల్సి వచ్చింది. ఢిల్లీలో ఏడాదికిపైగా సాగిన రైతు ఉద్యమం (పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ రైతులు ఎక్కువగా పాల్గొ న్నారు) కారణంగా నూతన వ్యవసాయ చట్టాల రద్దు జరిగింది. ఇప్పుడు ఈ అంశం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల అంశంగానూ మారింది. ఈ ఉద్యమం సందర్భంగా రాజధానిలో జరిగిన ఘటనలు కొన్ని పంజాబ్‌లో దళితులందరూ (32 శాతం జనాభా) ఒకవైపునకు కేంద్రీకృతమయ్యేందుకు దోహదపడింది. 

ముఖాముఖి నుంచి బహుముఖానికి...
పంజాబ్‌లో చాలావరకూ ముఖాముఖి పోటీలే జరిగేవి. శిరో మణి అకాలీదళ్‌–బీజేపీల కూటమి ఒకవైపు, కాంగ్రెస్‌ ఇంకోవైపు నిలబడగా సాగిన పోటీలకు 2017లో ఆమ్‌ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశంతో తెరపడినట్లు అయ్యింది. పోటీ త్రిముఖమైంది. రావి, బియాస్‌ నదుల మధ్యలో ఉండే మాఝా ప్రాంతంలో గురు ద్వారాలు, డేరాలు రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూంటాయి. దోబా విషయానికి వస్తే ఇది ఎన్‌ఆర్‌ఐలు ఎక్కువగా ఉండే ప్రాంతం. బియాస్, సట్లెజ్‌ నదుల మధ్యలో ఉంటుంది. ఈ ప్రాంత జనాభాలో దళితులు (37 శాతం), చిన్న, సన్నకారు రైతులు ఎక్కువ.

సట్లెజ్‌కు ఆవల ఉండే మాల్వా ప్రాంతం జమీందార్లు,  పెద్ద రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతం. 2017లో కాంగ్రెస్‌ మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో 77 గెలుచుకుని విజయం సాధించగా... వచ్చిన ఓట్లు దాదాపు  39 శాతం. మాల్వా ప్రాంతంలోని 69 స్థానాల్లో కాంగ్రెస్‌ 40 చేజిక్కించుకుంది. అలాగే మాజాలోని 25 స్థానాల్లో 22, దోబా ప్రాంతంలోని 23 స్థానాల్లో 15 గెలుచుకుని అధికారం చేపట్టింది. ఆ ఎన్నికల్లో 20 స్థానాలతో ఆమ్‌ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆసక్తి కరంగా ఈ పార్టీ మాల్వా ప్రాంతంలో 18, దోబాలో 2 స్థానాలు గెలు చుకోవడమే కాకుండా... మొత్తమ్మీద 23 శాతం ఓట్లు సాధించ గలిగింది. అప్పట్లో అధికార పక్షం శిరోమణి–బీజేపీ కూటమికి 31 శాతం ఓట్లు దక్కినా... సాధించిన సీట్లు మాత్రం 18 మాత్రమే. 

ఇప్పుడు పోటీ త్రిముఖ స్థాయి నుంచి బహుముఖానికి మార డంతో రాష్ట్రంలో ఓ పెద్ద రాజకీయ మార్పునకు రంగం సిద్ధమవు తోంది. ఈ ఎన్నికల్లో చర్చకు వస్తున్న అంశాలు కొత్త సీసాలో పాత సారా చందంగానే ఉన్నాయి. మాదకద్రవ్యాలు, ఇసుక, మద్యం, కేబుల్‌ మాఫియా సమస్య, నిరుద్యోగం, రైతు సంక్షోభం, అవినీతి, పెరిగిపోతున్న ప్రభుత్వ రుణాల వంటివి ప్రధానాంశాలుగా మారాయి. ఇటీవలి కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న మరో అంశం గురుద్వారాలో మతగ్రం«థాలకు జరిగిన అవమానం. నాయ కత్వ స్థాయిలో కుమ్ములాటల వంటి సమస్యలతో కాంగ్రెస్‌ పార్టీ నిన్నమొన్నటివరకూ చెల్లాచెదురుగా ఉన్నా... పంజాబ్‌ తొలి దళిత ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ప్రకటనతో ఈ కుమ్ములాటకు కొంతవరకూ తెరపడింది. కానీ పాలనపరమైన వైఫల్యాలు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, చన్నీ, సిద్దూలతో కులాలు, మతాల ఆధారంగా రాజకీయ సమీకరణలు చేయడం వంటి అంశాలు ఆ పార్టీ అవకాశాలకు గండికొట్టే ప్రమాదముంది. రాష్ట్రంలో దళితులు 32 శాతం వరకూ ఉండగా... జాట్‌లు 20 శాతం వరకూ ఉన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. దళితుడిని ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా రాజకీయంగా ఒక మెట్టు పైనున్నా ఇది జాట్ల వ్యతిరేకతకు దారితీసే ప్రమాదం కాంగ్రెస్‌ వెన్నంటే ఉంది. 

మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీ తమ సీఎం అభ్యర్థి భగవంత్‌ సింగ్‌ మాన్‌  ద్వారా కాంగ్రెస్‌ను నేరుగా ఢీకొంటోంది. మాన్‌, కేజ్రీవాల్‌లు ప్రకటించిన పది అంశాల అభివృద్ధి ప్రణాళిక మాల్వా ప్రాంతంలో తన బలాన్ని పెంచుకునేందుకు, ఇతర ప్రాంతాల్లో లాభాలు తెచ్చి పెట్టేందుకు ఉపయోగపడుతుందని అంచనా. బీజేపీ మాజీ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌  అమరీందర్‌ సింగ్‌ ఏర్పాటు చేసిన కొత్త పార్టీ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ (పీఎల్‌సీ)తో కలసి ఈసారి బరిలోకి దిగు తోంది. శిరోమణి నుంచి వేరుపడ్డ వర్గపు పార్టీ శిరోమణి (సంయుక్త) కూడా కాషాయ పార్టీ కూటమిలో భాగంగా ఉంది. బీజేపీ ఈ సారి 65 స్థానాల్లో పోటీ చేస్తూండగా పీఎల్‌సీ 38 స్థానాల్లో, శిరోమణి (సంయుక్త) 14 స్థానాల్లో పోటీ పడుతున్నాయి.

హిందూ, సిక్కు ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు ఈ కూటమి ప్రయత్ని స్తోంది. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, బోర్డర్‌ సెక్యూరిటీ అంశాల ఆధారంగా మాజా ప్రాంతంలో పట్టు సాధించే దిశగా అడుగు లేస్తోంది. సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ నేతృత్వంలోని శిరోమణి ఎన్డీయే నుంచి వేరుపడ్డ తరువాత ఈసారి ఎన్నికల కోసం బీఎస్పీతో జట్టు కట్టింది. రైతు ఉద్యమంలో భాగమైన 22 యూనియన్లతో ఏర్పాటైన సంయుక్త సమాజ్‌ మోర్చా బి.ఎస్‌.రాజేవాలా నేతృత్వంలో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగింది. ఎన్నికలకు ముందు నిర్వహించిన ఒపీనియన్‌  పోల్స్‌ ప్రకారం పంజాబ్‌లో ఈ సారి ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలిచే అవకా శాలు ఉన్నాయి. అయితే ఈ పార్టీకి సొంతంగా మెజార్టీ వచ్చే అవకా శాలు తక్కువ. కాకపోతే బహుముఖ పోటీ నేపథ్యంలో ఓట్లు ఎలా చీలతాయో చెప్పడం కొంత కష్టమే. 1972 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఎల్లప్పుడూ ఒక పార్టీ లేదా కూటమి వైపే మొగ్గారు. ఈ సారి కూడా అదే పరిస్థితి కొనసాగుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి. 

దేవభూమిలో రసవత్తర రాజకీయం...
ఉత్తరప్రదేశ్‌ నుంచి వేరు చేయగా ఏర్పడ్డ పర్వతప్రాంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో ఈసారి రాజకీయం రసవత్తరంగా ఉండనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. నేడు ఓటింగ్‌ జరగనున్న ఈ రాష్ట్రంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 2017లో మోదీ హవా కారణంగా బీజేపీ 47 శాతం ఓట్లతో మొత్తం 57 స్థానాలు దక్కించుకోగా, కాంగ్రెస్‌ 11 స్థానాలకు పరిమితమైంది. అయితే రాష్ట్ర నాయకత్వం విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఆ పార్టీ విశ్వసనీయతను కొంతవరకూ దెబ్బతీశాయి. ఐదు నెలల కాలంలోనే మూడుసార్లు ముఖ్యమంత్రులను మార్చడం, కుంభమేళా సందర్భంగా కోవిడ్‌ నిర్వ హణలో వైఫల్యాలు కాషాయ పార్టీని వెంటాడుతున్నాయి. నిరు ద్యోగం, ద్రవ్యోల్బణం, పర్వతప్రాంతాల నుంచి ప్రజల వలసలు కూడా బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అయితే యువ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ యువ ఓటర్లను ఆకర్శించగలడనీ, మోదీ–యోగీ వంటి అంశాలు ఓటర్లను ఆకర్షించవచ్చుననీ బీజేపీ ఆశలు పెట్టుకుని ఉంది. 

గత ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన కాంగ్రెస్‌ పార్టీ హరీశ్‌ రావత్‌ నేతృత్వంలో కొంతవరకూ కోలుకుందనే చెప్పాలి. ప్రభుత్వ వ్యతిరేకత, ఉత్తరాఖండ్‌ ఎన్నికల చరిత్ర తమకు అవకాశం కల్పిస్తాయన్న ఆశతో కాంగ్రెస్‌ ఉంది. ఒక పార్టీకి వరుసగా రెండుసార్లు అధికారం కట్టబెట్టే చరిత్ర ఇక్కడ లేకపోవడం గమనార్హం. అయితే కాంగ్రెస్‌ ఈ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందా అన్నది ఒక ప్రశ్న. పార్టీలో వర్గాలు, అంతర్గత కుమ్ములాటలు ఇందుకు కారణం. ఓట్‌షేర్‌ విషయంలో బీజేపీతో ఉన్న 13 శాతం అంతరాన్ని అధిగమిం చడం కాంగ్రెస్‌కు ఈసారి కొంత కష్టమే కావచ్చు. గాంధీ కుటుంబ సభ్యుల ప్రచారం, రైతు ఉద్యమం కారణంగా రైతుల్లో నెలకొన్న అసం తృప్తి వంటి అంశాలు రాష్ట్రంలోని టెరాయి ప్రాంతంలోని తొమ్మిది స్థానాల్లో  తమకు ఓట్లు, సీట్లు తెచ్చిపెడతాయని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. ఇక్కడ రైతులు, సిక్కులు అధిక సంఖ్యలో ఉంటారు. 

రెండు జాతీయ పార్టీల హోరాహోరీ పోరు మధ్యలో ఆమ్‌ ఆద్మీ పార్టీ పోటీ చేస్తూండటం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ తరహాలోనే 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, యువతకు నెలకు ఐదు వేల రూపాయల నిరుద్యోగ భృతి, పద్ధెనిమిదేళ్ళు పైబడ్డ మహిళలకు నెలకు రూ.1000 పంపిణీ వంటి హామీలు ఆమ్‌ ఆద్మీ పార్టీకి కలిసి వస్తాయా అన్నది వేచి చూడాల్సిన అంశం. సీఎం అభ్యర్థిగా ఆర్మీ నుంచి పదవీ విరమణ చేసిన అజయ్‌ కొతియాల్‌ను ఎంపిక చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ మెరుగైన ప్రత్యామ్నాయంగా మారింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాకముందు నిర్వహించిన సర్వేల ప్రకారం... ఈసారి ఉత్తరాఖండ్‌లో పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాత్రమే. కాకపోతే ప్రధాన పార్టీలు రెండూ తగినంత మెజార్టీ సాధిం చలేని పక్షంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ కింగ్‌ మేకర్‌గా మారే అవకాశం ఉంది.

వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్, ఢిల్లీ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top