బీజేపీకి అగ్ని పరీక్ష.. ఆ రెండు దశల్లో ఎస్పీ కూటమికే స్వల్ప ఆధిక్యం | Sakshi
Sakshi News home page

బీజేపీకి అగ్ని పరీక్ష.. ఆ రెండు దశల్లో ఎస్పీ కూటమికే స్వల్ప ఆధిక్యం

Published Thu, Feb 24 2022 7:40 AM

Sakshi TV Ground Report On Uttar Pradesh Assembly Polls 2022

లక్నో (యూపీ) నుంచి సాక్షి ప్రతినిధులు కంచర్ల యాదగిరి రెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి అగ్నిపరీక్షగా మారాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, తెలంగాణలో అధికారంలోకి రావడానికి కావాల్సిన పాజిటివ్‌ మూడ్‌ను యూపీ విజయం సెట్‌ చేస్తుందని బీజేపీ భావిస్తోంది. ‘వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, 2024 రోడ్‌మ్యాప్‌’ పేరిట బీజేపీ కేంద్ర కమిటీకి రెండు నెలల క్రితం ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్పించిన విధాన పత్రం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఉత్తర భారతంలో తిరుగులేని శక్తిగా స్థిరపడ్డ బీజేపీ దక్షిణాదిన, ముఖ్యంగా తెలంగాణలో పాగా వేయడానికి కావాల్సిన ఊపును యూపీ ఫలితాలు అందిస్తాయని ఆ పత్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో యూపీలో అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రధాని మోదీ సహా 24 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. సమాజ్‌ వాదీ పార్టీ తరపున అఖిలేశే చెమటోడుస్తున్నారు. 

నాలుగు విడతలపై జోరుగా అంచనాలు 
403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో నాలుగు మూడు విడతల్లో ఇప్పటిదాకా 231 చోట్ల పోలింగ్‌ పూర్తయింది. వీటిలో ఎవరిది పై చేయి అన్నదానిపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సమాజ్‌వాదీ–ఆర్‌ఎల్డీ కూటమికి, బీజేపీకి మధ్య హోరాహోరీ నడుస్తోందని పలు సర్వే సంస్థల ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల్లో వెల్లడైనట్టు విశ్వసనీయ సమాచారం. మూడు విడతలపై సర్వే సంస్థల అంచనాల సగటును పరిశీలించినా బీజేపీ, ఎస్పీ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డట్టు తేలుతోంది. పోలింగ్‌ జరిగిన 172 స్థానాలను అవి సగానికి కాస్త అటు ఇటుగా పంచుకునే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. మిగతా పార్టీల ప్రభావం నామమాత్రమేనని అంటున్నారు.

మొత్తమ్మీద మూడు దశల అనంతరం ఎస్పీ కూటమి స్వల్ప ఆధిక్యంలో కనిపిస్తోందని, రాబోయే దశల్లో బీజేపీ సత్తా చాటుతుందని అంచనా వేస్తున్నారు. బీఎస్పీ ఓటు బ్యాంకు కూడా బీజేపీ, ఎస్పీలకు చెరో సగం చొప్పున బదిలీ అవుతోందన్నది సర్వే సంస్థల అంచనా. అభ్యర్థి, కుల సమీకరణలను బట్టి ఇది కాస్త అటూ ఇటుగా ఉండొచ్చని అమర్‌ ఉజాలా దినపత్రిక లక్నో అసోసియేట్‌ ఎడిటర్‌ సుమంత్‌ పాండే అన్నారు. ‘‘బీజేపీ, ఎస్పీ–ఆర్‌ఎల్డీ మధ్య హోరాహోరీ సాగుతోంది. మా అంచనా ప్రకారం బీజేపీకి 2017లో వచ్చిన సీట్లతో పోలిస్తే 30 శాతం దాకా తగ్గే అవకాశముంది’’ అని పాండే వివరించారు. మూడో పార్టీ గానీ, ఇతరులు గానీ సాధించే 10, 15 సీట్లు మెజారిటీకి కీలకమైనా ఆశ్చర్యం లేదన్నారాయన! 

చదవండి: (ఎన్నికల వేళ విమాన ప్రయాణం పై ప్రత్యర్థుల మాటల యుద్ధం!)

పశ్చిమ యూపీలో ఎస్పీ ఆధిక్యం అంతంతే! 
మొదటి రెండు దశల పోలింగ్‌పై ఎస్పీ కూటమి పెట్టుకున్న అంచనాలు ఫలించనట్టు కన్పిస్తోంది. ఆర్‌ఎల్‌డీ ప్రభావం కనిపించే పశ్చిమ యూపీలోని జాట్‌ సామాజిక వర్గం ఎస్పీ–ఆర్‌ఎల్డీ కూటమి వైపు మొగ్గుచూపుతుందని, ఈ రెండు దశల్లోనే 40 నుంచి 50 సీట్ల ఆధిక్యత వస్తుందని అంచనాలు వేసుకున్నారు. అది 20–25 స్థానాలకు దాటకుండా చూడటంలో బీజేపీ సఫలమైందని విశ్లేషకుల అభిప్రాయం. మూడో విడత పోలింగ్‌ హోరాహోరీగా సాగినా బీజేపీకే స్వల్ప ఆధిక్యం కన్పించిందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. నాలుగో దశలోనూ అదే ట్రెండ్‌ నడిచిందంటున్నాయి. ఈ నేపథ్యంలో తొలి రెండు దశల్లో ఎస్పీ కూటమి సాధించే ఆధిక్యం అధికారానికి బాటలు పరిచేంతగా ఉండదని అంచనా.

కాయ్‌ రాజా కాయ్‌!
యూపీ ఎన్నికలు దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధికారం ఎవరిదన్న అంశంపై భారీగా బెట్టింగులు సాగుతున్నాయి. హైదరాబాద్, ముంబయి, నోయిడా, అహ్మదాబాద్‌ కేంద్రాలుగా రూ.3 వేల కోట్ల మేరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ బెట్టింగులు సాగినట్లు యూపీ పోలీసు సీనియర్‌ అధికారి ఒకరు సాక్షి ప్రతినిధులతో అభిప్రాయపడ్డారు. ఈ రాకెట్‌ను ఛేదించేందుకు సహకరించాలంటూ మహారాష్ట్ర పోలీసుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు చెప్పారు. ప్రతి దశలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఓట్లు వస్తాయన్నదానిపై బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. పశ్చిమ యూపీలో ఎస్పీ–ఆర్‌ఎల్డీ కూటమికి 50 శాతంలోపు సీట్లు వస్తాయని బెట్టింగులు పెడితే రూపాయికి రెండు రూపాయలు, అంతకు మించి వస్తాయన్న వారికి రూపాయికి రూపాయిన్నర లెక్కన బెట్టింగులు సాగుతున్నాయి. బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని కాస్తున్న వారికి రూపాయికి రూపాయి, ఎస్పీ గెలుస్తుందన్న వారికి రూపాయిన్నర బెట్టింగు సంస్థలు ఆఫర్‌ చేస్తున్నాయి.

Advertisement
Advertisement