కస్టడీ మరణాలపై జాతి మేలుకోవాలి

Narayan Rajeev Article On Lockup Deaths - Sakshi

కొన్ని వారాల క్రితం, 22 ఏళ్ల కుర్రాడు అల్తాఫ్‌ పెళ్లాడతానని చెప్పి ఒక మైనర్‌ బాలికను అపహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ ఉద్దేశంతోనే అతడు ఆ బాలికను తన స్నేహితుడితో కలిసి ఆగ్రా చేరుకోమని సూచించాడు. వారు అక్కడికి వచ్చాక త్వరలోనే తాను అక్కడికి వస్తానని చెప్పాడు. కానీ అతడా పని చేయలేదు. కారణం అలా చెప్పిన మరుసటి రోజే ఆ అమ్మాయి కుటుంబం చేసిన ఆరోపణలతో పోలీసులు అల్తాఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఒక రోజు తర్వాత అతడు చనిపోయాడు. పోలీసు స్టేషన్‌ వాష్‌ రూమ్‌లో నేలకు కొన్ని అడుగుల ఎత్తున ప్లాస్టిక్‌ టాప్‌కు వేలాడుతూ కనిపించాడు. ఇంటరాగేషన్‌ చేస్తున్న చోటే అతడు తాను ధరించి ఉన్న జాకెట్‌ దారం సహాయంతో ఉరివేసుకున్నాడని పోలీసుల ప్రకటన. 

ఇది విడి ఘటన కాదు. అలాగని విశేష ఘటన అంత కంటే కాదు. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం గత 20 ఏళ్లలో దేశంలో 1,888 మంది అటు పోలీసు కస్టడీలో లేక జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంటూ చనిపోయారని తెలియడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. పైగా ఇవి అధికారికంగా ప్రకటించిన కస్టడీ మరణాల సంఖ్య మాత్రమే. నిజానికి ఎన్ని మరణాలు చోటు చేసుకుని ఉంటాయన్నది ఎవరికి వారు ఊహించుకోవలసిందే.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ఈ రకమైన నెత్తుటి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. గుజరాత్‌ కూడా ఈ జాబితాలో చేరుతోందని ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది. 2020 లోనే గుజరాత్‌లో 15 కస్టడీ మరణాలు నమోదయ్యాయి. గతేడాది దేశవ్యాప్తంగా 76 మంది ఇలా చనిపోయారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల ప్రజ లకు వ్యతిరేకంగా రాజ్యమే రెచ్చగొడుతున్న ఆగ్రహావేశాల నేపథ్యంలో ఇలాంటి ఘాతుకమైన మరణాల వైపు భారత దేశం శరవేగంగా దూసుకెళుతోంది. పోలీసు కస్టడీలో లేదా విచారణ సమయంలో జరుగుతున్నట్లు అధికారులు చెబు తున్న కారణాలు రోతపుట్టిస్తాయనడంలో సందేహం లేదు.

అనారోగ్యం, గుండెపోటు, వ్యాధి కారణంగా ఆసుపత్రిలో చేర్పించినప్పుడు సహజ మరణం లేదా వయసు కార ణంగా సహజమరణం వంటివి కస్టడీ మరణాలకు కారణా లని చెబుతున్నారు. ఇంత హృదయం లేని వివరణల కారణంగానే కస్టడీ మరణాలపై సుప్రీంకోర్టు ధ్వజమె త్తింది. చట్టబద్దంగా పాలన సాగుతున్న పౌర సమాజంలో కస్టడీ మరణాలకంటే మించిన ఘోరనేరాలు మరొకటి ఉండవని కోర్టు కడిగిపారేసింది. 

జాతి సిగ్గుపడే విధంగా, అమానుషమైన రీతిలో కస్టడీలో జరుగుతున్న మరణాలపై సుప్రీకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలేసినా శాంతిభద్రతల వ్యవస్థలో ఏ ఒక్కరూ లెక్క చేయలేదు. దేశవ్యాప్తంగా ప్రతిపోలీసు స్టేషన్, నిఘా సంస్థ, సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ, ఈడీతో సహా ప్రతి కార్యాలయంలోనూ సీసీటీవీలు నెలకొల్పాలని, నైట్‌ విజన్, ఆడియో రికార్డింగు సౌకర్యం వీటికి తప్పక కల్పిం చాలని గతేడాది నవంబరులో సుప్రీం కోర్టు ఆదేశించింది. పోలీసు స్టేషన్లలో జరిగే ప్రతి విచారణను తప్పకుండా రికార్డు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.

ఇంటరాగేషన్‌ గదులు, లాకప్‌ గదులు, పోలీసు స్టేషన్‌ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలన్నింటిలో భద్రతా కెమెరాలను ఏర్పర్చాలని కూడా కోర్టు ఆదేశించింది. స్టేషన్లు, ఇంటరా గేషన్‌ కార్యాలయాల్లోని కారిడార్లు, లాబీలు, రిసెప్షన్‌ ఏరియాలు, సబ్‌ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్‌ ఉండే గదులు, బయట ఉండే వాష్‌ రూముల వద్ద కూడా కెమెరాలు అమ ర్చాలని ఆదేశించింది.

అలాగే మాదకద్రవ్యాల నిరోధక బ్యూరో, రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్, తీవ్రమైన మోసాలపై దర్యాప్తు చేస్తున్న ఆఫీసులు– ఇలా అన్ని చోట్లా సీసీటీవీ రికార్డు చేసి వాటిని 18 నెలలపాటు భద్రపర్చా లని ఏ విచారణ క్రమంలోనైనా మానవ హక్కుల ఉల్లం ఘన జరిగినట్లయితే పర్యవేక్షణకు ఇవి ఉపయోగ పడతాయని కోర్టు స్పష్టం చేసింది. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 21 ప్రకారం ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ అనే ప్రాథమిక హక్కును పరిరక్షించడానికి ఇవన్నీ తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

తన ఈ ఆదేశాన్ని అమలు చేయడానికి ఆరువారాల లోపు గడువు విధించుకుని మరీ కార్యాచరణ పూర్తి చేయా లని సుప్రీం కోర్టు ఆదేశించింది. కానీ కోర్టు ఆదేశం ఎంత అపహాస్యం పాలైందంటే ఇదే సమస్యను మనం సంవ  త్సరం తర్వాత ఇప్పుడూ చర్చించుకుంటూనే ఉన్నాం. 2018లో పంజాబ్‌లో జరిగిన ఒక కస్టడీ చిత్రహింసల కేసును విచారించిన సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ఇదే విధమైన ఆదేశం జారీ చేసింది. కానీ మూడున్నర సంవ త్సరాల తర్వాత కూడా తన ఆదేశాలను అమలు చేయక పోవడంపై అత్యున్నత న్యాయస్థానం అభిశంసించింది.

అయినా సరే పోలీసు స్టేషన్లలో ఇలాంటి ఘోరాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమిళనాడులో లాక్‌డౌన్‌ నిబం  ధనలను ఉల్లంఘించారనే సాకుతో పోలీసులు... తండ్రీ కుమారులను చిత్రహింసలు పెట్టి చంపేసిన ఘాతుక చర్యపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరం నవంబర్‌ 20న సుప్రీం కోర్టు తాజాగా అవే ఆదేశాలు మళ్ళీ జారీ చేసింది.

సంవత్సర కాలంగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది రైతులు ఆందోళన చేస్తున్నారు. వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు కనీస  మద్దతు ధరకు కూడా హామీ ఇవ్వాలన్నది వీరి డిమాండ్‌. ఈ రైతుల పిల్లలే మన అంతర్జాతీయ సరిహద్దులను పరి రక్షిస్తున్నారు. రైతుల న్యాయమైన డిమాండ్ల పట్ల సాను భూతి ప్రకటించకపోవడం అటుంచి వారి ట్రాక్టర్లను దేశ రాజధానిలో ప్రజలపైకి తోలారంటూ ఆరోపిస్తున్నాం.

చివరకు రైతులపైకి వాహనాలు తోలి చంపిన లఖిం పూర్‌ ఖేరీ ఘటనపై కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే విచారణ మొదలెట్టారు. యూపీలో స్థానిక పోలీసు బలగాలు చేపట్టే ఎలాంటి విచారణపైనా తనకు నమ్మకం లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రభుత్వాధికారం గుప్పిట్లో పెట్టుకున్న శక్తుల ఉచ్చులో మనం పడి పోతు న్నాం. తాము అన్ని చట్టాలకూ అతీతమని, ఎవరి ఆదేశా లనూ, సూచనలనూ తాము పాటించబోమంటున్న అధి కార శక్తుల ప్రాబల్య కాలంలో మనం మనుగడ సాగి  స్తున్నాం.

ఈ రాజ్యాంగేతర శక్తుల ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే మన సామూహిక చైతన్యం సైతం ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. ప్రాథమికమైన, ప్రాణాధా   రమైన ఈ చైతన్యాన్ని కూడా మనం కోల్పోతే అది ఎన్నటికీ తిరిగిరాదు. నిజంగానే ఇది మనకు మేలుకొలుపు లాంటి  దేనని గ్రహించాలి. – నారాయణ్‌ రాజీవ్‌, కమ్యూనికేషన్స్‌ కన్సల్టెంట్‌ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top