అన్నదాత అరిగోస | MLC Kavitha Column On Telangana Farmers | Sakshi
Sakshi News home page

అన్నదాత అరిగోస

Jul 10 2025 8:05 PM | Updated on Jul 10 2025 8:16 PM

MLC Kavitha Column On Telangana Farmers

పొలాల్లో వానాకాలం పంట పనుల్లో తలమునకలై ఉండాల్సిన రైతన్న ఆగమా గమవుతున్నాడు. బస్తా యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన దుఃస్థితి మళ్లీ వచ్చింది. రైతు ఆధార్‌ కార్డు ఇస్తేగానీ యూరియా బస్తా ఇవ్వడం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం రైతన్నలు ఎన్ని అగచాట్లు పడ్డారో మళ్లీ అవే పరిస్థితులు వచ్చాయి. ఇందిరమ్మ రాజ్యం తెస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రైతులను నడి బజార్లో నిలబెట్టింది. 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్వయంగా వరంగల్‌ వేదికగా ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ ఎప్పటికి అమలవుతుందో తెలియని పరిస్థితి. ఒక్కో రైతుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని నమ్మబలికి, సగం మంది రైతులకు మాత్రమే మాఫీ వర్తింపజేశారు. మిగిలిన రైతులందరూ బ్యాంకులు, సొసైటీల్లో ఉన్న అప్పులను తిరిగి చెల్లించేందుకు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు రుణాలు చెల్లించకపోతే సొసైటీ అధికారులు, బ్యాంకర్లు రైతన్నల ఇంటి తలుపులు, బిందెలు, ఇతర సామగ్రి జప్తు తీసుకు పోయిన దృశ్యాలు ఇందిరమ్మ రాజ్యంలో మళ్లీ అగుపిస్తున్నాయి.

కొందరు రైతులు రుణాలు తిరిగి చెల్లించలేదని పేర్కొంటూ వారి ఆస్తులు జప్తు చేసేందుకు సైతం అధికారులు నోటీసులు ఇవ్వడం ఈ ప్రభుత్వంలోనే ఆవిష్కృతమయ్యింది.

చేతులు దులుపుకొన్నారు!
తెలంగాణలో పంటల బీమా పథకం అమలు కావడం లేదనీ, కాంగ్రెస్‌ను గెలిపిస్తే బీమాతో ఆపన్న హస్తం అందిస్తామనీ ఇచ్చిన హామీ అతీగతీ లేదు. పంటల బీమాకు రూ.1,400 కోట్ల బీమా ప్రీమియం కూడా చెల్లించలేదు. కనీసం బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. ప్రకృతి విపత్తులతో రైతులు పంట నష్టపోతే వారికి పరిహారం వచ్చే అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం చేసింది. కేసీఆర్‌ పాలనలో అకాల వర్షాలు, వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వ పరంగా పరిహారం చెల్లించేవారు. 

కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ విధానాన్ని కూడా అటకెక్కిచ్చింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కురిసిన అకాల వర్షాలు, వడగండ్లతో 55 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఒక్కో ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించింది. కొందరు రైతులకు మాత్రమే పరిహారం ఇచ్చి చేతులు దులుపు కొన్నది. అత్యధిక మంది రైతులకు పరిహారం ఇవ్వకుండా ముఖం చాటేసింది.

రైతుకు పెట్టుబడి సాయం అందజేసి వెన్నుదన్నుగా నిలిచేందుకు కేసీఆర్‌ ‘రైతుబంధు’ పథకం ప్రవేశపెట్టారు. ప్రతి రైతుకు రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.10 వేల చొప్పున నగదు బదిలీ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ పథకంపై అనేక ఆరోపణలు చేశారు. అనర్హులకు సాయం అందు తోందని ప్రజలను తప్పుదోవ పట్టించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని నమ్మబలికారు. తీరా గద్దెనెక్కాక రెండు పంట సీజన్లు రైతుబంధును ఎగ్గొట్టారు. స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రయోజనం కోసం ఈ ఒక్క సీజన్‌లో మాత్రమే రైతులకు భరోసా కింద నిధులు జమ చేశారు. 

ఒక చేత్తో ఇచ్చిఇంకో చేత్తో లాక్కున్నట్టుగా రైతు భరోసా డబ్బును పంట రుణాలు, ఇతర అప్పుల కింద జమ చేసుకొని ఆ సాయం కూడా అందకుండా అడ్డుకున్నారు. అన్ని పంటలకు బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చి చివరికి సన్న వడ్లు పండించే రైతులకు మాత్రమే బోనస్‌నుపరిమితం చేశారు. బోనస్‌ కింద రైతులకు ప్రభుత్వం రూ. 1,200 కోట్లు బాకీ పడింది. వాటి కోసం అగ్రికల్చర్‌ ఆఫీసుల చుట్టూ రైతులు తిరిగినా ఎప్పుడు నిధులు జమ చేస్తారో తెలియని పరిస్థితి.

ఎరువుల కోసం తిప్పలు
పంట సీజన్‌ ప్రారంభానికి ముందే ప్రభుత్వం సాగుకు సన్నద్ధ మవ్వాల్సి ఉంటుంది. రైతులు తమ పొలాలను దున్నుకొని పంటలు వేసేందుకు ఎలా సిద్ధంగా ఉంటారో... విత్తనాలు, ఎరువులు సకాలంలో పంపిణీ చేయడానికి ప్రభుత్వం అంతకన్నా ఎక్కువే శ్రద్ధ కనబరచాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువులు, విత్తనాలే కాదు, పచ్చిరొట్ట విత్తనాల పంపిణీలో కూడా రైతులకు అగచాట్లు తప్పడం లేదు. 

ముందస్తు ప్రణాళిక లేకపోవడం, సాగు విస్తీర్ణానికి అనుగుణంగా కేంద్రంనుంచి ఎరువులను తెప్పించకపోవడంతో యూరియా, డీఏపీ, పొటాష్‌ కోసం ఇప్పుడు రైతులంతా రోడ్లపైకి రావాల్సిన దుఃస్థితి ఏర్పడింది. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ఇంకెవరిపైనో నెపం వేసే ప్రయత్నం చేస్తోంది. 

ఎరువులు ముఖ్యంగా యూరియా కోసం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో రైతులు నిత్యం తిప్పలు పడుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్, కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో రైతులు ఎరువుల కోసం నడిరోడ్డులో బైఠాయించారు. సిర్పూర్‌లో రైతులు, మహిళలు యూరియా కోసం గంటల తరబడి వేచిచూశారు. ముగ్గురు మంత్రులు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగానూ ఎరువుల కోసం రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయి.

ఏది భరోసా?
బీఆర్‌ఎస్‌ పాలనలో 24 గంటలు నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ సరఫరా అయ్యేది. ప్రతి రైతుకు ప్రతి సీజన్‌లో క్రమం తప్పకుండా రైతుబంధు నేరుగా ఖాతాలో జమయ్యేది. రైతు దుర దృష్టవశాత్తు మరణిస్తే రైతు బీమా పథకం కింద ఆ కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందేది. భూమిశిస్తు రద్దు, నీటి తీరువా రద్దు, ప్రాజెక్టుల పంట కాల్వలపై ఏర్పాటు చేసిన విద్యుత్‌ మోటార్ల క్రమబద్ధీకరణ లాంటి రైతు అనుకూల నిర్ణయాలతో ప్రభుత్వం అన్నదాతకు భరోసానిచ్చింది. 

కానీ తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకొంటూనే కాంగ్రెస్‌ అన్నదాతలను వంచిస్తోంది. రైతులకు ఇచ్చిన ప్రతి హామీ మోసంగా మారుతుండటంతో వ్యవసాయం పట్ల, రైతుల పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పట్టింపు లేదని మళ్లీ మళ్లీ నిరూపితమవుతోంది. ఇకనైనా నిర్లక్ష్యం వీడి రైతు సంక్షేమం తక్షణ కర్తవ్యంగా భావించిపంటల బీమా పథకం అమలుకు చర్యలు చేపట్టాలి. వెంటనే బీమా అమలుకు టెండర్లు పిలిచి ఇన్సూరె¯Œ ్స ఏజెన్సీని ఖరారు చేయాలి. యూరియా సహా ఇతర ఎరువులను పూర్తి స్థాయిలోందుబాటులోకి తేవాలి. ఎరువులను బ్లాక్‌ మార్కెట్‌ చేసి అమ్ము తున్న వారిపై ఉక్కుపాదం మోపాలి. రైతులకు బాకీ పడ్డ ‘రైతు భరోసా’ సాయం విడుదల చేయాలి.

రాష్ట్రంలో అన్ని కోణాలలో రైతులను వంచించి, వ్యవసాయాన్ని అస్తవ్యస్తం చేసి... పండుగ చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు సంబరాలు చేసుకుంటున్నరు. వారి మాటలకు, సంబరాలకు సంబంధం లేదని తెలుసుకోవాలంటే తమ మేనిఫెస్టోను ఒకసారి చదువుకోవాలి. ‘మాట ఇచ్చినవాడు మారిపోవచ్చు, 

కానీ మాట మరిచిపోవద్దు’ అని తెలంగాణరైతులు  సామెతలాగా చెప్తుంటారు. రైతుల ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిజం చేయకపోతే, రైతుల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్క సీజ¯Œ కు, అదీ ఎన్నికల్లో ప్రయోజనం కోసం రైతుభరోసా ఇచ్చి దానిని గొప్పగా చెప్పు కోవాలని చూస్తే... అదే రైతుల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందన్న వాస్తవాన్ని గ్రహించాలి.


-కల్వకుంట్ల కవిత, వ్యాసకర్త శాసన మండలి సభ్యురాలు,‘తెలంగాణ జాగృతి’ అధ్యక్షురాలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement