
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చరిత్రాత్మక నిర్ణయమని పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి స్పష్టం చేశారు. దేశ చరిత్రలో 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. సామాజిక విప్లవానికి నాంది పలికిన ఈ సందర్భంలో తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండటం జీవితంలో తాను చేసుకున్న అదృష్టమని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్ల పట్ల తమకు కితాబు ఇవ్వకపోయినా పరవాలేదు కానీ కనీసం హర్షించే స్థితిలో లేకపోవడం దౌర్బగ్యమని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ తీసుకొచ్చిన అన్ని బిల్లులకు బీఆర్‌ఎస్ వారి హయాంలో మద్దతు ప్రకటించిందన్నారు. బీసీల పట్ల బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్. ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించానని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకే కట్టుబడి ఉందని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
కవిత ఏ పార్టీ అన్నది అర్ధం కావడం లేదు
ప్రస్తుతం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏ పార్టీలో ఉందనే విషయం అర్థం కావడం లేదని సెటైర్లు వేశారు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్‌ఎస్‌లో దెయ్యాలు ఉన్నాయా? లేదా?, దెయ్యాల పీడ వదిలిందా?, కవిత ఎందుకు స్పందించడం లేదు? అని టీపీసీసీ ప్రెసిడెంట్ ప్రశ్నించారు. కవిత బీఆర్‌ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయడం లేదని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లపై కవిత సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.