
గత వారం ఘటనలూ, పరిణామాలూ చూస్తే ‘అదిగో పులి... ఇదిగో తోక’ సామెత గుర్తుకొస్తోంది. విహారయాత్రలకు వెళ్లిన వారిని ఊచకోత కోసిన దుర్మార్గం ఎవరైనా ఖండించవలసినది, కన్నీరు కార్చవలసినది. నేరస్థులను పట్టుకుని, విచారించి, కఠినంగా శిక్షించమని కోరవలసినది. ఆ దుర్మార్గానికి కారకులైన వారిని పొరుగుదేశం ప్రోత్సహిస్తున్నదని, బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వం ఆ దేశంలోని ‘టెర్రరిస్టుల స్థావరాలు’ అని అనుమానం ఉన్నచోట్ల దాడి చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం డ్రోన్లతో ఎదురుదాడులు చేసింది. స్వయంగా భారత ప్రభుత్వ అధికారులే అది యుద్ధం కాదని ఎన్నోసార్లు అన్నారు. కాని లేని పులికి తోకలు వెతికి, తాము చూశామని ప్రచారం చేసి అమాయకులను నమ్మించేందుకు అనేకమంది వీరంగం వేశారు. అందులో బాధ్యతాయుతంగా ఉండవలసిన నాలుగో స్తంభమూ ఉంది. వ్యక్తులుగానూ, బృందాలుగానూ... భావజాల ప్రోత్సాహపు ఐటీ సెల్స్ ఉన్నాయి.
సున్నిత సందర్భంలో టీవీ ఛానళ్లూ, యూట్యూబ్, వాట్సప్, ఫేస్ బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలూ గత వారంలో కోట్లాది అబద్ధాలను వండి వార్చాయి. టీవీ ఛానళ్లు వార్తా, విశ్లేషణా ప్రసార వేదికలు గనుక అక్కడ చెప్పే చిన్నపాటి అబద్ధమైనా, అర్ధసత్యమైనా బహుగుణీకృతమై ప్రచారంలోకి వస్తుంది. దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ అవకాశాన్ని తప్పని సరిగా బాధ్యతాయుతంగా వాడాలి. కాని భారత ప్రధాన స్రవంతి ఛానళ్లన్నీ బాధ్యతా రాహిత్యంలో అవధులు దాటాయి. ‘ఆజ్ తక్’ లాహోర్‌ను స్వాధీనం చేసుకుంది, ‘జీన్యూస్’ కరాచీని పట్టుకుంది. రిపబ్లిక్ టీవీ న్యూయార్క్‌ను స్వాధీనం చేసుకుంది. ఉదయానికల్లా వాళ్లు అన్నీ వెనక్కి ఇచ్చేశారు, మళ్లీ రాత్రి స్వాధీనం చేసు కోవడానికి!’ అని మే 9 రాత్రి సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి మార్కండేయ ఖట్జూ చేసిన వ్యంగ్య ట్వీట్ పరిస్థితి ఎంత చేజారిందో చూపుతుంది. ఆ ట్వీట్‌లో ఆయన మూడు ఛానళ్ల పేర్లే ప్రస్తావించారు గాని, ఎటువంటి మినహాయింపు లేకుండా దాదాపు అన్ని ఛానళ్ల రిపోర్టర్లూ,యాంకర్లూ పోటీ పడి తామే స్వయంగా యుద్ధ క్షేత్రంలో ఉన్నట్టు, తమ ముందరే బాంబు దాడులు, వైమానిక దాడులు, డ్రోన్ దాడులు జరుగుతున్నట్టు అభినయించారు. తమ పని నిష్పక్షపాతంగా, వస్తుగతంగా, తటస్థంగా ప్రజలకు వార్తలు చెప్పడం మాత్రమే అనేది మరిచిపోయి, తామే ఒక పక్షం తీసుకుని, వార్తలు వండి వార్చారు. కేకలూ పెడబొబ్బలూ పెట్టారు. ప్రాంతీయ భాషా ఛానళ్లు, పత్రికలు కూడా ఆ టీవీ ఛానళ్లనూ సామాజిక మాధ్య మాలలో ఉద్దేశపూర్వకంగా వెలువడిన అబద్ధాలనూ అనుసరించాయి. మొత్తం మీద సత్యం కనబడకుండా పోయింది.
యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సత్యం మీద పొగమంచు కమ్మే మాట నిజమే. కాని వార్తామాధ్యమాల పని ఆ పొగమంచును చెదరగొట్టడం! దాన్ని పెంచడం కాదు! కాని సత్యం మీద పొగమంచు కమ్మే పని, నేరుగా అబద్ధాలు ప్రచారం చేసే పని సరిహద్దుకు అవతలా, ఇవతలా... ప్రచార మాధ్యమాలూ, సామాజిక మాధ్య మాలూ శాయశక్తులా చేశాయి. ఆశ్చర్యమేమంటే, ఈ అబద్ధాల కాలపరిమితి కొన్ని గంటలు మాత్రమే. ఎందుకంటే, ఇక్కడ ఎన్ని అబద్ధాలు చెప్పినా కొన్ని గంటల్లోనే నిజమేమిటో ప్రభుత్వం అధికా రికంగా ప్రకటిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం చెప్పేది కూడా పూర్తి నిజం కాదనుకుంటే అంతర్జాతీయ ప్రచార మాధ్య మాలు చూసే సాంకేతికత అందుబాటులో ఉంది. ఇవాళ్టి సమాచార విస్ఫోటనంలో దేశదేశాల రక్షణ వ్యవహారాల నిపుణులు ఆ యా ఘటనల మీద నిమిషాల్లోనే తమ విశ్లేషణ వినిపిస్తున్నారు. అంటే జర్నలిస్టులమని చెప్పుకునే ఆర్ణబ్ గోస్వామి వంటివారు ఎన్ని అరుపులు అరిచినా కొన్ని గంటల్లో అబద్ధాలని రుజువైపోయే అవకా శాలున్నాయి. నిజాలు చెప్పే, అంతర్జాతీయ తటస్థ వార్తలు పునర్ము ద్రించే వెబ్‌సైట్ల మీద ఆంక్షలు విధించిన ప్రభుత్వం, ఈ అబద్ధాల దుమారాన్ని మాత్రం యథావిధిగా సాగనిచ్చింది. ఈ అబద్ధాలు, అర్ధసత్యాలు ఒక ఎత్తయితే... కనీస మర్యాద, సభ్యత లేకుండా సంబంధం లేని వారిని లాగడం, తిట్లూ, దుర్భాషలూ కురిపించడం విపరీతంగా జరిగాయి. యుద్ధం వద్దన్నవారి మీద, శాంతి వాక్యాలు చెప్పినవారి మీద ద్వేషం వెదజల్లడం జరిగింది.
ఈ పరిణామం ఎంత దూరం పోయిందంటే... రిపబ్లిక్ ఛానల్‌కు సలహాదారుగా ఉన్న మేజర్ (రిటైర్డ్) గౌరవ్ ఆర్య... తన సొంత యూట్యూబ్ ఛానల్‌లో చేసిన వ్యాఖ్యలతో భారత ప్రభుత్వం దౌత్యస్థాయిలో క్షమాప ణలు చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చిని సువ్వర్ (పంది) అనీ, సువ్వర్ కె ఔలాద్ (పంది సంతానం) అనీ అసభ్య కరమైన మాటలెన్నో అన్నాడు. అక్కడ ఆయన చూపిన కారణం – ఇరాన్ మంత్రి భారత పర్యటనకు ముందు పాకిస్తాన్ పర్యటన చేశారని! ఆ వీడియో ఇరాన్‌లో కూడా వైరల్ అయి, న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యా లయం ‘అతిథులను గౌరవించడం ఇరానియన్ సంస్కృతిలో చిరకాల సంప్రదాయం. ఇరానియన్లం అతిథులను దైవానికి ప్రియమైనవారిగా భావిస్తాం. మరి మీరో?’ అని ట్వీట్ చేయగా, భారత ప్రభుత్వం అది ‘ఒక ప్రైవేటు భారత పౌరుడి’ అభిప్రాయం అనీ, తమకు దానితోసంబంధం లేదనీ వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. మర్నాడే ఆ ఇరాన్ మంత్రి భారత్‌కు కూడా వచ్చి ఎన్నో ద్వైపాక్షిక, వాణిజ్య ఒప్పందాల మీద సంతకాలు చేశారు!
అలాగే, ఇరుదేశాల సైనికాధిపతులు కాల్పుల విరమ ణకు అంగీకరించారనే వార్త ప్రకటించినందుకు భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద బూతులు కురిపించారు. అటువంటి దాడులకు గురైనవారు మరెందరో ఉన్నారు. యుద్ధంలో మొట్టమొదట మరణించేది సత్యం అంటారు. ప్రస్తుత సత్యానంతర యుగంలో మరణించడాని కైనా, సజీవంగా ఉండడానికైనా సత్యానికి స్థానమే లేదు. భావోద్వేగాలదీ, మనోభావాలదీ మాత్రమే రాజ్యం! ఎంత రెచ్చగొడితే అంత వ్యాపారం, అంత జనాకర్షణ!!
-ఎన్ వేణుగోపాల్
వ్యాసకర్త ‘వీక్షణం’ ఎడిటర్