చేతులెత్తేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం

Guest Column Australia Suffers COVID Cases Straining Businesses Supply Chains - Sakshi

కోవిడ్‌ నియంత్రణకు సంబంధించి ఆస్ట్రేలియా పనితీరును ప్రపంచమంతా శ్లాఘించి ఎన్నో రోజులు కాలేదు. కానీ ఇప్పుడు ఒక ప్రభుత్వం ఎలా వ్యవహరించకూడదో చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తోంది. ఇలాంటి సంక్షోభంలో విధివిధానాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు, ఇది పూర్తిగా ప్రజల బాధ్యతే అన్న చందంగా ప్రవర్తిస్తోంది. దీంతో కేసుల సంఖ్య పెరిగింది. ఆరోగ్య ఖర్చు ప్రజల మీద పడింది. ఇంకా ముఖ్యంగా, ఒమిక్రాన్‌ వేవ్‌ ముంచెత్తుతున్న కీలక సమయంలో ఆధారపడదగ్గ రాజకీయ నాయకత్వం లేకుండా పోయింది. దీంతో విశ్వసనీయమైన వైద్యనిపుణుల వైపు చూడటం తప్ప ప్రజలకు మార్గం లేకుండా పోయింది.

ఆస్ట్రేలియా... నిన్నమొన్నటి వరకూ కోవిడ్‌ నిర్వహణ, నియం త్రణలో ప్రపంచ దేశాలు ఈర‡్ష్యపడే స్థాయి ఈ దేశానిది. ప్రజారోగ్య వ్యవస్థల నిర్వహణ, అతితక్కువ కేసులు, ఎలాంటి విపత్కర పరిస్థితి నైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్న ఆసుపత్రులు, సజావుగా సాగిపోతున్న ఆర్థిక వ్యవస్థ! మరిప్పుడో? గందరగోళం. కోవిడ్‌–19ను ఎలా ఎదుర్కోరాదో చెప్పేందుకు ఈ దేశాన్ని ఉదాహరణగా చూపేంత! ఏ దేశమైనా కోవిడ్‌ వంటి వ్యాధులను సమర్థంగా ఎదుర్కో వాలంటే టెస్టింగ్, ట్రేసింగ్, ఐసొలేషన్, క్వారంటైన్‌ (టీటీఐక్యూ) అనే నాలుగు సూత్రాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌ తరువాతి కాలంలో ఈ పద్ధతులన్నీ పాటించేం దుకు ప్రభుత్వం ఓ  సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తుందని అందరూ భావించారు. ప్రజారోగ్య నిపుణుల మాటలకు ప్రభుత్వం చెవొగ్గుతుందని ఆశించాము. 

కోవిడ్‌ నియంత్రణలో టీకాలు అతి ముఖ్యమైన భాగమే. అలాగని మొత్తం భారం వాటిపైనే వేయడం సరికాదని ముందు నుంచి కూడా అందరూ చెబుతూనే వచ్చారు. డెల్టా రూపాంతరితం పోయి ఒమిక్రాన్‌ వచ్చే సమయానికి మా అనుమానాలన్నీ నిజమ య్యాయి. టీకాలేసుకున్న వారితోపాటు వేసుకోని వారిపైనా ఇది దాడులు చేయడం మొదలుపెట్టింది. రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా లేనివారికీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికీ, పిల్లలకూ సోకింది. రెండు డోసుల టీకాతో తాత్కాలిక నిరోధకత మాత్రమే లభిస్తుందనీ, బూస్టర్‌ రూపంలో తీసుకునే మూడో డోసుతోనూ కొన్ని నెలలపాటు మాత్రమే రక్షణ అనీ మాలాంటి వారికి తెలుసు. స్వల్ప లక్షణాలున్న వారికీ లాంగ్‌ కోవిడ్‌తో చిక్కులు తప్పవు. టీకా తీసుకున్నా, తీసుకోక పోయినా! న్యూ సౌత్‌ వేల్స్‌ ప్రధాన వైద్యాధికారి కెర్రీ ఛాంట్, ప్రీమియర్‌ డొమినిక్‌ పెరోటెట్‌ ఇన్‌ఛార్జ్‌లుగా కోవిడ్‌ దాని మానాన అదే పోతుందన్నట్టుగా ఓ కొత్త పాలసీని అమల్లో పెట్టారు. 

గత ఏడాది డిసెంబర్‌ 15వ తేదీ కోవిడ్‌ మహమ్మారి చరిత్రలో చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఒమిక్రాన్‌ కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే కలిగిస్తుందనీ, ఇది ఎన్నాళ్లో వేచి చూస్తున్న బహుమతి లాంటిదనీ, అంతా త్వరలోనే సర్దుకుంటుందనీ ఓ తప్పుడు కథనాన్ని ప్రజల మెదళ్లలోకి చొప్పించారు. దీనికంటే అవమానకరమైన విషయం ఇంకోటి ఏమిటంటే...‘‘ఆస్ట్రేలియాలో ప్రతి ఒక్కరికీ అది సోకుతుంది’’ అని ప్రకటించడం. ఇంకోలా చెప్పాలంటే, వ్యాప్తిని అడ్డుకుని ఏం ప్రయోజనం అని ప్రభుత్వమే చెబుతోందన్నమాట. 

గతంలోనూ ప్రీమియర్‌ డొమినిక్‌ పెరోటెట్, ప్రధానమంత్రి స్కాట్‌ మోరిసన్‌తో కలిసి చేయకూడని తప్పిదం చేశారు. ఆరోగ్య నిపుణులు మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా మాస్కులు ధరిం చడం వంటి అన్ని రకాల కోవిడ్‌ నిబంధనలను ఎత్తేశారు.  ఇదిలా ఉంటే న్యూసౌత్‌ వేల్స్‌లో మాత్రం ప్రజలు ఎవరికి వారు టెస్టులు చేయించుకోవాలి, కాంట్రాక్ట్‌ ట్రేసింగ్, క్వారంటైన్‌ వంటివన్నీ సొంతంగా చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ చర్యలన్నీ ‘వ్యక్తిగత బాధ్యత’ అని కూడా తేల్చేశారు. 

సెలవులతో పరిస్థితి తారుమారు
డిసెంబరు ఆఖరులో వచ్చిన సెలవులతో పరిస్థితి తలకిందులైంది. ముందస్తు హెచ్చరికల్లాంటివేవీ లేకుం డానే పరీక్ష కేంద్రాలు మూత పడ్డాయి. దీంతో ఉన్న వాటిల్లో కిలోమీటర్ల మేర క్యూలు కట్టారు. పరీక్షల కోసం కొంతమంది కార్లలోనే రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. అలాగే ఫలితాల కోసం ఐదారు రోజులు వేచి చూశారు. ఈ వ్యవహారం పండుగ వాతావరణాన్ని ఎలాగూ దెబ్బతీసేసింది; అదే సమయంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సరిగ్గా వారం గడవకముందే తొలగించిన కోవిడ్‌ నిబంధనలన్నీ మళ్లీ అమ ల్లోకి వచ్చేశాయి. కానీ, అప్పటికే పరిస్థితి చేయి దాటింది.

కోవిడ్‌ నిర్ధారణ కోసం రాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేయించు కోవాలని ప్రజలందరికీ చెప్పారు. కానీ యూకేలో మాదిరిగా పరీక్షల ఖర్చును భరించేందుకు మాత్రం ప్రభుత్వం అంగీకరించలేదు. పైగా ప్రధాని మోరిసన్‌ లాంటి వారు విలేకరుల ప్రశ్నలకు ‘‘యాంటీజెన్‌ పరీక్షలు కొందరు చేయించుకోగలరు. కొంతమంది చేయించుకోలేరు’’ అని బదులిచ్చారు. అక్కడితో ఈ తేలికపాటి వ్యాఖ్యల పరంపర ఆగి పోలేదు. ‘మహమ్మారి విషయంలో అన్నీ ఉచితంగా అందించే పరిస్థితిలో లేము’ అని కూడా అన్నారు. కానీ ఇందుకోసమే కదా... ఆసుపత్రులు, ప్రజారోగ్య వ్యవస్థ, ఫార్మాస్యూటికల్‌ బెనిఫిట్స్‌ పథకం వంటివి ఉన్నవి? ప్రాథమిక ఆరోగ్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచేందుకు, చౌకగా వైద్య సేవలు అందించేందుకే ఈ ఏర్పాట్లన్నీ! వ్యాధి నియంత్రణకు ఖర్చులు భరించడమనేది అడ్డంకి కాకూడని సమయం ఏదైనా ఉంటే అది ఇప్పుడే!

వ్యాపారాలు దెబ్బతిన్నాయి...
కోవిడ్‌ను ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న నిర్ణయాలు వ్యాపారాలను దెబ్బతీశాయనడంలో సందేహం లేదు. ఈ నష్టం... రెస్టారెంట్లు, లాడ్జీల వంటివి మూతపడిన దాని కంటే ఎక్కువే ఉంది. సూపర్‌మార్కెట్‌ వ్యవస్థలోని అన్ని స్థాయిల వారూ జబ్బు పడుతూండటంతో మార్కెట్లలో సరుకులు నిండు కుంటున్నాయి. గత ఏడాది ప్రజలు టాయిలెట్‌ పేపర్‌ కోసం పోటీ పడితే ఈసారి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్ల వంతు వచ్చింది. పైగా ఈ కిట్ల కోసం భారీ మొత్తాలు చెల్లించాల్సిన పరిస్థితి. చాలామంది ఈ కిట్లతోనే వ్యాధి నిర్ధారణ చేసుకున్నారు. పీసీఆర్‌ పరీక్షలు చేయించు కోలేదు. ఫలితంగా వీరందరూ అధికారిక లెక్కల్లోకి చేరలేదు. 

అరవై ఐదేళ్ల పైబడిన వయసున్న వారు, కోవిడ్‌ సోకినవాళ్లు అత్యవసర పరిస్థితుల్లో ‘000’ నంబరుకు ఫోన్‌ చేయవద్దనీ, సొంత ఏర్పాట్లేవో చేసుకోవాలనీ ప్రభుత్వం చెబుతోంది. పరిమితమైన ఆదాయం ఉన్న వారు తమ దారి తామే వెతుక్కోవాలని చెప్పిందన్న మాట. ఆస్ట్రేలియా వాసులందరికీ కనీస స్థాయి ఆరోగ్య సేవలు అందించాల్సిన బాధ్యత మెడీకేర్‌పై ఉంది. నివారణ, ప్రజారోగ్య పరిరక్షణ చర్యలు కూడా ఈ బాధ్యతల్లో ఉన్నాయి. ప్రభుత్వం పీసీఆర్‌ పరీక్షలను పరిమితం చేయాలని భావిస్తే పరీక్ష కేంద్రాల్లో పరిస్థితికి అనుగుణంగా పీసీఆర్, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ రెండింటినీ అందు బాటులో ఉంచాల్సింది. తద్వారా కేసుల సంఖ్యను పరిమితం చేసే అవకాశమూ చిక్కేది. వ్యాపారం కూడా మెరుగ్గానే ఉండేది! ప్రభు త్వమే కోవిడ్‌ సన్నాహక సామగ్రిని కొనుగోలు చేసి, పాజిటివ్‌గా తేలిన వారికి పంపిణీ చేసి ఉంటే వారి పరిస్థితిని ఇళ్ల నుంచే ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండేందుకు ఉపయోగపడేది. 

జాతీయ వ్యూహం, విధానం ఏదీ?
ముందస్తు హెచ్చరికలు ఎన్ని ఉన్నా ఆస్ట్రేలియా ప్రభుత్వం జాతీయ స్థాయిలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలకు సంబంధించి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించడంలో విఫలమైందనే చెప్పాలి. గత ఏడాది చివరలో జాతీయ కేబినెట్‌ ‘క్లోజ్‌ కాంటాక్ట్‌’ నిర్వచనాన్ని మార్చేం దుకు అయిష్టంగానే అంగీకరించాల్సి వచ్చింది. పాజిటివ్‌ వ్యక్తి కుటుంబ సభ్యులు లేదా వారితో కనీసం నాలుగు గంటల సమయం గడిపిన వారిని ఈ కోవలోకి చేర్చారు. అయితే దీనికి ఓ శాస్త్రీయ ప్రాతిపదిక అంటూ ఏదీ లేదు.

ఒక వ్యక్తికి వ్యాధి సోకేందుకు 15 నిమిషాలు చాలనేందుకు ఇప్పటికే బోలెడన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ప్రభుత్వం కేసుల సంఖ్యను కాకుండా... ఆసుపత్రులు, ఐసీయూల్లో చేరుతున్న వారిని పరిగణలోకి (తీవ్రత అంచనాకు?) తీసుకోవాలని చెబుతూండగా ఇటీవలి కాలంలో అవి కూడా పెరిగిపోతున్నాయి. మరోవైపు సాధారణ చికిత్స కల్పించాల్సిన వారినీ ఇళ్లల్లోనే సొంత వైద్యం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చెబుతోంది. ఈ రకమైన వైఖరితో మహమ్మారి కొమ్ములు వంచలేము. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థను ఉద్ధరించేందుకూ ఇది సరిపోదు. మూక నిరోధకతతో మహమ్మారి ఎండెమిక్‌ స్థితికి చేరుకుంటుందనుకుంటే పొరబాటే. 

ఇంకో కొత్త రూపాంతరితంతో మరోసారి విజృంభించవచ్చు. ప్రభుత్వాలు తగిన నాయకత్వ లక్షణాలతో వ్యవహరించనప్పుడు, అంతా మీరే చూసుకోండి అంటున్నప్పుడు... ప్రజలు విశ్వసనీయ వైద్యనిపుణులు ఏం చెబుతున్నారో చూడాలి. కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడం ఒక్కటే తరుణోపాయం!
– డాక్టర్‌ కెరిన్‌ ఫెల్ప్స్‌
ఆస్ట్రేలియా మెడికల్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షురాలు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top