దేశంలో ఆకలి కేకలు ఆగాలంటే...

Global Hunger Index 2022: Why India so Low - Sakshi

దేశానికి ‘స్వాతంత్య్రం’ వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా ప్రజల మౌలిక అవసరాలను పరిష్కరించటంలో పాలక ప్రభుత్వాలన్నీ విఫలమైనాయి. కూడు, గూడు, గుడ్డ లేక పేదలు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. కోట్లాది మంది పేదలు ఆహారం కోసం హాహా కారాలు చేస్తున్నారు. 

ప్రపంచ ఆకలి సూచిలో (గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌) భారత స్థానం దిగజారుతూ వస్తున్నది. 2021లో 101 స్థానంలో ఉండగా 2022లో 107వ స్థానానికి దిగజారింది. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ నివేదికలో 121 దేశాలు ఉన్నాయి. వీటిల్లో చైనా, టర్కీ, కువైట్‌ సహా 17 దేశాలు ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఐర్లాండ్‌కి చెందిన ‘కన్సర్న్‌ వరల్డ్‌ వైడ్‌’, జర్మనీకి చెందిన ‘వెల్త్‌ హంగర్‌ హైఫ్‌’ సంస్థలు ఈ నివేదికను రూపొందించాయి. ఈ 121 దేశాల్లో ఆసియా ఖండంలో భారతదేశం కంటే అఫ్గానిస్తాన్‌ మాత్రమే వెనకబడి ఉంది. పాకిస్తాన్‌ 99, బంగ్లాదేశ్‌ 84, నేపాల్‌ 81, శ్రీలంక 64 స్థానాల్లో మనకంటే మెరుగ్గా ఉన్నాయి. 2020లో గ్లోబల్‌ ఇండెక్స్‌ స్కోర్‌ 38.8గా ఉండి నేడు 29.1గా నమోదు అయ్యింది. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ (జీహెచ్‌ఐ) ప్రపంచ స్థాయిలో, రీజనల్‌ స్థాయిలో ఆకలిస్థాయిని వెల్లడిస్తుంది. 29.17 స్కోర్‌తో భారతదేశం ‘అత్యంత సీరియస్‌’ అన్న లేబుల్‌ పొందింది. ఆసియా రీజియన్‌లోనూ, మొత్తం ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆకలి స్థాయిలో భారత్‌ ఉందని నివేదిక వెల్లడించింది.

జీహెచ్‌ఐ నివేదికను పోషకాహార లోపం, పిల్లల పెరుగుదల, పిల్లల మరణాలు వంటి అంశాలను ఆధారంగా చేసుకుని 100 పాయింట్‌ స్కేల్లో లెక్కిస్తారు. సున్నా వస్తే ఉత్తమ (ఆకలి లేదు) స్కోర్, 100 వస్తే చెత్త స్కోర్, అంటే ఆకలి బాగా ఎక్కువగా ఉండటంగా పరిగణిస్తారు.  

దేశంలో పోషకాహార లోపం 2018–20లో 140 శాతం ఉంటే 2019–21 నాటికి 163 శాతానికి పెరిగింది. ప్రపంచంలో పోషకాహార లోపం ఉన్న జనాభా 828 మిలియన్లు ఉంటే, ఇండియాలోనే 224.3 మిలియన్ల మంది ఉన్నారు. 117 దేశాల నుంచి సేకరించిన సమాచారంతో రూపొందించిన నివేదికలో భారతదేశంలో 22.4 కోట్ల మంది పోషకాహారం లభించక బాధపడుతున్నారు. ఇందులో 15 నుంచి 49 ఏళ్ల లోపు వయస్సుగల మహిళలు 51 శాతం అని నివేదిక పేర్కొన్నది. 2019లో చిన్నారుల స్థితిపై యునిసెఫ్‌ నివేదిక ప్రకారం 5 ఏళ్ల లోపు 69 శాతం పిల్లలు సరైన పౌష్టికాహారం లేక ప్రాణాలు కోల్పోతున్నారు. 4.66 కోట్ల మంది వయస్సుకు తగ్గ ఎత్తు పెరగటం లేదు. 2.56 కోట్ల మంది చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు ఉండటం లేదు. 5 నుంచి 23 సంవత్సరాల లోపు పిల్లల్లో కేవలం 10 శాతం మందికే పోషక విలువలు గల ఆహారం లభిస్తున్నదని కేంద్ర ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా డేటా తెలుపుతున్నది. 

భారతదేశంలో 20 కోట్లకు పైగా వలస కార్మికులు ఉన్నారు. వీరు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. మరో 20 కోట్ల మంది దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. కనీస ఆదాయం లేక 23 కోట్ల మంది రోజు వారీ కూలీలు, చిరు వ్యాపారులు... పస్తులు, అర్ధాకలితో జీవిస్తున్నారు. భారత ఆహార సంస్థ గోదాముల్లో ఆహార ధాన్యాలు ముక్కిపోతున్నా పేదలకు, అన్నార్తులకు అందించకపోవటం ఏమిటని సుప్రీమ్‌ కోర్టు అనేక సార్లు ప్రశ్నించింది. గోదాముల్లో 7.10 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి. గత ఆరేళ్ల కాలంలో 40 వేల టన్నుల ఆహార ధాన్యాలు పాడై పోయాయి. దీన్ని గమనిస్తే ఆహార ధాన్యాలు పాడైనా ఫరవాలేదు, పేదలకు మాత్రం పంపిణీ చేయం అన్నదే పాలకుల విధానంగా ఉంది. 

దేశం అభివృద్ది బాటలో పయనిస్తున్నదనీ, ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధిని సాధించటమే కాకుండా ఎగుమతి చేసే స్థాయిలో ఉందనీ మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. కేంద్రం చెబుతున్న దానికీ, గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలకూ పొంతన లేకుండా ఉంది. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా రైతాంగం అధిక సంఖ్యలో నిరసనలు చేస్తున్నారు. కోటి 40 లక్షల మంది రైతులు వ్యవసాయం నుంచి ఎందుకు వైదొలిగారు? ఆహార ధాన్యాల ఎగు మతిదారుగా భారత్‌ ఉంటే రైతాంగం ఎందుకు వ్యవసాయం నుంచి వైదొలుగుతున్నారు? నేటికీ దేశంలో 27 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితుల ఎందుకు ఉన్నాయి? దేశంలో పండిన పంటలను దేశ అవసరాలకు ఉపయోగించినప్పుడే ఏ దేశమైనా స్వావలంబన సాధించినట్టు చెప్పవచ్చు. ప్రజలకు ఆహారం అందుబాటులో లేక ఆకలి కేకలు పెడుతుంటే, వారి ఆకలి తీర్చకుండా ఎగుమతులు చేయటం స్వావలంబన సాధించటం కాదు.

దేశ ప్రజల పేదరికానికీ, వారి ఆకలి ఆర్తనాదాలకూ దేశ పాలకులు అమలు జరిపిన విధానాలే కారణం. సామ్రాజ్యవాదం, బడా బూర్జువా, భూస్వామ్య వర్గంతో లాలూచి పడిన పాలక ప్రభుత్వాలన్నీ దేశ సహజ వనరులన్నిటినీ వారికి కట్టబెడుతూనే ఉన్నారు. ఫలితంగా దేశాభివృద్ధి కుంటుపడటమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుతూ వచ్చాయి. ఈ పరిస్థితి మారాలంటే... సహజ వనరులన్నీ దేశాభివృద్ధికి ఉపయోగపడేలా చేయాలి. సామ్రాజ్యవాద దోపిడీని అరికట్టాలి. పారిశ్రామిక అభివృద్ధిలో పాత్రధారులైన కార్మికులకూ పరిశ్రమల్లో హక్కు కల్పించాలి. అలాగే గ్రామీణ పేదలకు భూమి పంపిణీ జరగాలి. అప్పుడే దేశంలో ఆకలి కేకలు ఆగిపోతాయి. (క్లిక్‌: సెల్‌ ఫోన్లు, మోటర్‌ సైకిళ్ళు వాడేవారు పేదలు కారని వాదిస్తారు.. కానీ)


- బొల్లిముంత సాంబశివరావు  
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రైతు కూలీ సంఘం (ఏపీ) 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top