డి.కె. శివకుమార్‌ (డిప్యూటీ సీఎం) రాయని డైరీ | DK Shivakumar Rayani Diary | Sakshi
Sakshi News home page

డి.కె. శివకుమార్‌ (డిప్యూటీ సీఎం) రాయని డైరీ

May 31 2026 1:32 AM | Updated on May 31 2026 1:32 AM

DK Shivakumar Rayani Diary

మాధవ్‌ శింగరాజు

ప్రయత్నాలు విఫలం కావచ్చు, ప్రార్థనలు నిష్ఫలం కావు. ఇన్నాళ్లకు దేవుళ్లు, దేవతలు కలిసి నేను కోరుకున్న స్థానంలో నన్ను ఉంచబోతున్నారు! ఓర్పు వహించినందుకు; పీఠాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించినందుకు దక్కిన వరం! ఆకాశం వైపు చూశాను. దివిలోని ఆ మెరుపుల దారుల నుంచే కదా నా కోసం దైవాశీస్సులు ఉరుముల రథాలు వేసుకుని, ప్రమాణ స్వీకారానికి వర్షించే మేఘాలై భువికి  రాబోతాయి! రామనగర కాబలమ్మ అమ్మవారు, కెంచిరమ్మ అమ్మవారు; మైసూరు చాముండే శ్వరి మాత, చామరాజనగర్‌ శ్రీమలే మహదేశ్వరుడు, కల్లహళ్లి భూవరాహనాథుడు, శ్రీరంగనాథస్వామి వారు, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి, చిక్కమగళూరు శారదాంబ, ఉడిపి శ్రీమూకాంబిక, గోకర్ణ మహాబలేశ్వరుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, తిరుమల శ్రీవేంకటేశ్వరుడు, కారైకాల్‌ శనీశ్వరుడు, గువహటి కామాఖ్య మాత... పైనుంచి నా వైపు చూస్తూ – ‘‘సంతోషమేనా దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్‌’... అని నన్ను అడుగుతున్నట్లుగా ఉంది. 

ఇలలో నాకు దైవ సమానులైన నిర్మలానందనాథ స్వామిజీ, శ్రీ నంజవదుత స్వామిజీ, నొనవినకెరె అజ్జయ్య స్వామీజీ, శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ, ప్రణవానంద స్వామిజీ... నన్నెలాగూ ప్రమాణ స్వీకార ఘడియల్లో వేదిక మీదకు అదృశ్యంగా చెయ్యి పట్టి నడిపిస్తారు. భక్తి మార్గంలో ఉన్నప్పుడు, ఎదురొచ్చే ప్రతి మనిషిలోనూ మనకు దైవమే కనిపిస్తాడేమో! అదొక సాక్షాత్కారం! ముఖ్యమంత్రి అధికారిక నివాసం ‘కావేరి’లో అల్పాహార సమావేశానికి వెళ్లినప్పుడు సిద్ధరామయ్య నాకు ఎదురొచ్చారు. ఆయనకు నమస్కరించాను. ఆత్మీయంగా కౌగిలించుకున్నాను. ఆ క్షణంలో... జీవాత్మ వెళ్లి పరమాత్మలో లయం అయినట్లుగా నేను పూర్తిగా లుప్తమైపోయాను!! దేవుడు నేరుగా దీవెనలుగానీ, శాపాలుగానీ ఇవ్వడు. కానీ అవకాశాలను కల్పిస్తాడు! ఆ అవకాశాలను వదులుకోకూడదు. ఆలస్యం చేయకుండా సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించాను. 

వెంటనే, ‘ఇదొక నాటక ప్రదర్శన’ అని బీజేపీ మొదలు పెట్టేసింది! ఒక మనిషి మీద గౌరవం నాటకం ఎలా అవుతుంది? 
‘‘ఇక్కడీయన పాద నమస్కారాలు చేస్తున్నారు. అక్కడ ఈయన ఇంటి ముందు స్వీట్లు పంచుతూ అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు...’’ అని అవహేళన! స్వీట్లు ఒకరు వెళ్లిపోతున్నందుకే పంచు కుంటారా? ఒకరు వస్తున్నందుకు పంచు కోరా? భక్తి భావనలను వీళ్లంతా ఎందుకు వ్యక్తిగతం చేస్తారు! ప్రత్యర్థిని ఎప్పుడూ ప్రత్యర్థిగానే చూడాలా? అలాగైతే, ‘రెండున్నరేళ్ల పదవీకాల ఒప్పందం’ ప్రకారం, నవంబరులోనే నేను సిద్ధరామయ్యతో తగవుకు దిగి సీఎంగా నా రెండున్నరేళ్ల పదవీకాలాన్ని ఆయన్నుంచి లాక్కోవలసింది కాదా? ఆయనే తప్పుకుని వెళ్లేవరకు ఇప్పటిదాకా నేను ఆగటం ఎందుకు? 

ముఖ్యమంత్రిగా రేపు నా ప్రమాణ స్వీకారం. జూన్‌ 1కి బదులు జూన్‌ 3 పెట్టుకుంటే మంచిదని నోనవినకెరె స్వామిజీ సందేశం పంపారు. ప్రమాణ స్వీకారం లోక్‌ భవన్‌ గ్లాస్‌ హౌస్‌లో కాకుండా, విధానసౌధ మెట్ల మీద ఏర్పాటు చేసుకొమ్మని రాజగురు బెల్లూరు ద్వారకానాథ్‌ వర్తమానం పంపారు. మెట్ల మీద స్వీకారం స్వర్గీయ రామకృష్ణ హెగ్డే, ఎస్‌.ఎం. కృష్ణ నెలకొల్పిన సంప్రదాయం. ముహూర్తం ఏదైనా, ప్రమాణం ఎక్కడైనా అంతా ప్రజల కోసమే. రాజ్యాంగం నా మతం. ప్రజలు నా దేవుళ్లు. మార్గం చూపించటం దైవ నిర్ణయం. గమ్యం చేరుకోవటం మానవ ధర్మం.  

Advertisement
 
Advertisement
Advertisement