కార్పొరేట్ ఒత్తిడికి బై బై.. ఆటో డ్రైవింగ్‌తో లైఫ్ హ్యాపీ! | Woman Leaves 9 Year Managerial Career to Drive Auto-Rickshaw | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ ఒత్తిడికి బై బై.. ఆటో డ్రైవింగ్‌తో లైఫ్ హ్యాపీ!

May 31 2026 11:30 AM | Updated on May 31 2026 11:41 AM

Woman Leaves 9 Year Managerial Career to Drive Auto-Rickshaw

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ రంగంలో తొమ్మిదేళ్ల పాటు ఐటీ మేనేజర్‌గా పనిచేసిన ఓ మహిళ, కార్పొరేట్ ఉద్యోగంలోని ఒత్తిడికి విసిగిపోయి, ఆ రంగాన్ని వదిలేశారు. ప్రస్తుతం ఆమె స్వయంగా ఆటో నడుపుకుంటూ, ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. దుబాయ్‌కు చెందిన ఎంటర్‌ప్రెన్యూర్ నెజ్రిన్ మిద్లాజ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఈ స్ఫూర్తిదాయకమైన కథనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

కార్పొరేట్ పరుగు నుంచి ఆటో చక్రం వైపు..
ఆటో ఎక్కిన నెజ్రిన్ మిద్లాజ్‌కు ఆ మహిళా డ్రైవర్‌లోని ఆత్మవిశ్వాసం, ఆమె ప్రశాంతత  ఎంతగానో ఆశ్చర్యపరిచింది. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే ఈ వృత్తిలోకి ఆమె ఎలా వచ్చారని ఆరా తీయగా, ఆమె తన వెనుక ఉన్న తొమ్మిదేళ్ల కార్పొరేట్ ప్రస్థానాన్ని బయటపెట్టారు. నిరంతర పని ఒత్తిడి, డెడ్‌లైన్లు, మేనేజర్ హోదాలో ఎదుర్కొన్న టెన్షన్లు ఆమెను మానసిక ప్రశాంతత కోసం ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి.

నెలకు రూ. 60 వేల ఆదాయం - అసలైన సంతోషం
ఉద్యోగం వదిలేసిన ఆమె, ఆ తర్వాత తన సొంత ఆటోను కొనుగోలు చేసి స్వేచ్ఛగా పనిచేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె ఆటో నడుపుతూ నెలకు దాదాపు రూ. 60,000 వరకు సంపాదిస్తున్నారు. ఐటీ రంగంలో ఉన్నప్పుడు దక్కని మానసిక ప్రశాంతత ఇప్పుడు లభిస్తోందని ఆమె వెల్లడించారు. హోదా కంటే సంతోషమే ముఖ్యమని ఆమె నమ్మడం అందరినీ ఆలోచింపజేస్తోంది.

సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు
ఈ  ఉదంతంపై స్పందించిన నెజ్రిన్.. సమాజం సక్సెస్‌ను కేవలం ఉద్యోగ హోదాలతోనే కొలుస్తుందని, కానీ హోదా కంటే వ్యక్తిగత సంతృప్తి ముఖ్యమని పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. చాలా మంది ఐటీ ఉద్యోగులు తమ వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి, ఆఫీసుల్లో ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి కామెంట్ల రూపంలో తమ బాధను పంచుకుంటున్నారు. హోదాను వదిలి సంతోషాన్ని ఎంచుకున్న ఆమె ప్రయాణం పలువురికి ఒక పాఠంలా మారింది.

ఇది కూడా చదవండి: నెత్తురోడుతున్న నెమలి.. ఈకలు పీక్కుపోయిన జనం

Advertisement
 
Advertisement
Advertisement