నెత్తురోడుతున్న నెమలి.. ఈకలు పీక్కుపోయిన జనం | Crowd Plucks Peacock Feathers Instead Of Helping Injured National Bird, Humanity Hits New Low | Sakshi
Sakshi News home page

నెత్తురోడుతున్న నెమలి.. ఈకలు పీక్కుపోయిన జనం

May 31 2026 9:43 AM | Updated on May 31 2026 11:44 AM

Peacock Plucking Incident Sparks Outrage: Humanity Hits New Low

న్యూఢిల్లీ:  ఒక జాతీయ పక్షి(నెమలి) గాయపడి, కుంటుకుంటూ రోడ్డు దాటుతుండగా, అటుగా వెళ్తున్న వాహనం ఢీకొనడంతో అది ప్రాణాపాయ స్థితికి చేరింది. దీనిని గమనించిన జనం ఆ మూగజీవికి సాయం చేయాల్సింది పోయి, దాని ఈకలను పీక్కోవడంలో తలమునకలయ్యారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది.

సహాయం మరిచి..
‘మాతృభూమి’అందించిన కథనం ప్రకారం..  రోడ్డు పక్కన గాయపడి పడి ఉన్న ఆ నెమలిని చూసి  జనం అక్కడ గుమిగూడారు. ఆ నెమలి నడవలేక, ఎగరలేక తీవ్ర వేదన అనుభవిస్తుంటే, వారు కనీస మానవత్వం చూపలేదు. అటవీ శాఖ అధికారులకో లేదా వెటర్నరీ వైద్యులకో సమాచారం అందించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంతలో అక్కడున్న కొందరు ఆ నెమలి శరీరం నుంచి బలవంతంగా ఈకలను పీకేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిని చూసినవారంతా షాకవుతున్నారు.

మండిపడుతున్న నెటిజన్లు
ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధలో ఉన్న జీవిని ఆదుకోవడానికి బదులుగా, ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సమాజంలో కరుణ, కనికరం అనేవి లేకుండా పోతున్నాయని, ఇలాంటి ఘటనలు మానవత్వం పతనమవుతున్నదనడానికి నిదర్శనమని సోషల్ మీడియా వేదికగా పలువురు అంటున్నారు.

చట్టం ఏం చెబుతోంది?
భారతదేశ జాతీయ పక్షి అయిన నెమలికి ‘వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972’ కింద అత్యున్నత రక్షణ ఉంది. దీనికి హాని చేయడం, దాని శరీర భాగాలతో వ్యాపారం చేయడం నేరం. గాయపడిన పక్షిని చూసినప్పుడు వెంటనే అటవీ అధికారులకు లేదా రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించడం పౌరుల కర్తవ్యం. ఈ వీడియోపై అధికారులు స్పందించి, బాధ్యులపై విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ఈ వీడియో ఏ ప్రాంతానికి చెందినదనే విషయాన్ని ‘మాతృభూమి’ తన కథనంలో పేర్కొనలేదు.

ఇది కూడా చదవండి: కేదారనాథ్‌లో భక్తజన సునామీ.. ఈ 39 రోజుల్లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement