మన(సు)లో మాట
డాక్టర్‌గారూ, నాకు పెళ్లై ఇరవై ఏళ్లు. మా ఇద్దరు అబ్బాయిలూ కాలేజీలో చదువుతున్నారు. మొదట్లో నా భర్త కొన్ని వ్యాపారాలు చేసి బాగా నష్టపోయారు. అయితే అప్పుడు సంపాదన లేకపోయినా, ఉన్నదానిలోనే అందరం సంతోషంగా ఉండేవాళ్లం. ఇటీవల ఆయన కొత్తవ్యాపారం ఒకటి మొదలు పెట్టి అందులో బాగా క్లిక్ అయ్యాడు. ఇప్పుడాయన పూర్తిగా ఆ వ్యాపారానికి అంకితమైపోయాడు. మేము పడుకున్నాక వస్తాడు. నిద్రలేవక ముందే వెళ్తాడు. పిల్లలు కాలేజీకి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు.
నాకు పిల్లలు, భర్తే నా ప్రపంచం. ఈ ఒంటరితనాన్ని నేను భరించలేక పోతున్నానని ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో నేను ఆత్మహత్యకు ప్రయత్నించాను. ఆయన మనసు కరగకపోగా నన్ను పుట్టింటిలో దించారు. దాదాపు ఆరునెలల వరకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. తర్వాత నేనే ఆయనను బతిమిలాడుకొని మళ్లీ మా ఇంటికి వచ్చాను. ‘‘నేను ఇలాగే ఉంటాను. నీకు నచ్చితే నాతో ఉండు, లేకపోతే విడాకులు తీసుకుని వెళ్లిపో’’ అంటాడు. నేను ఆయనను వదిలి ఉండలేను. అలాగని ఆయనతో కూడా ఉండలేను. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దయచేసి నాకు సహాయం చేయగలరు.
– తేజస్వి, హైదరాబాద్
‘కనుల ముందే లోకమున్నా... కానరాని చీకటాయే, గుండె నిండా ఆశలున్నా... పంచుకునే తోడులేదే!’ అనే పాట మీ ప్రస్తుత మానసిక వేదన కు, ఒంటరితనానికీ అద్దం పడుతుంది. ఒకవైపు భర్తపై మీకున్న అమితమైన ప్రేమ, మరోవైపు ఆయననుంచి మీకు కావాల్సిన సమయం, ఆ΄్యాయత దొరకక పోవడం వల్ల మీరు ఎదుర్కొంటున్న తీవ్రమైన భావోద్వేగ సంఘర్షణలో ఇలాంటి నిరాశ, నిస్సహాయత కలగడం సహజమే. అయితే మీ బాధను వ్యక్తపరచడానికి లేదా ఆయన దృష్టిని ఆకర్షించడానికి మీరు చేసిన ఆత్మహత్యాయత్నాలు పరిష్కారం కావు.
మీ భర్త కోణం నుంచి చూస్తే, మీకు, మీ కుటుంబానికి ఒక మంచి భవిష్యత్తును అందించడానికి ఆయన రాత్రింబవళ్లు కష్టపడుతున్నారే తప్ప మిమ్మల్ని ద్వేషించడం లేదు, కానీ ఆ శ్రమలో భాగంగా ఆయన మిమ్మల్ని మానసికంగా నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయాన్ని గ్రహించే ఓపిక, సమయం ఆయనకు లేవు. మీ వైపు నుంచి చూస్తే, భర్తతో సమయం గడపడం, మాట్లాడుకోవడం, భావోద్వేగంగా దగ్గరగా ఉండడం కూడాౖ వెవాహిక జీవితంలో సహజమైన, కనీస అవసరమే కాబట్టి ఇక్కడ ఎవరి కోరికా తప్పుకాదు, కానీ ఇద్దరి అవసరాలు, ప్రాధాన్యతలు ఒకదానితో ఒకటి ఢీకొంటున్నాయి.
మీ భర్తకు మ్యారిటల్ లేదా ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఖచ్చితంగా ఉపయోగపడవచ్చు. కౌన్సెలింగ్ లక్ష్యం ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకునేలా చేయడం; అందుకోసం ‘నువ్వు మారాలి’ అనికాకుండా ‘మన బంధం కోసం కలిసి వెళ్దాం’ అని ఆయనకు నచ్చజెప్పాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన జీవితంలో కుటుంబం ఎంతో ముఖ్యమైనదే అయినప్పటికీ, మనకంటూ కూడా కొన్ని అభిరుచులు, స్నేహాలు, ఆసక్తులు, వ్యక్తిగత లక్ష్యాలు ఉండాలి. అవి కుటుంబానికి ప్రత్యామ్నాయం కావు కానీ, మీ సంతోషం పూర్తిగా ఎదుటివారిపైనే ఆధారపడే స్థితిని మార్చి మీ భావోద్వేగ సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి. మీలో వచ్చే ఈ సానుకూల మార్పును, స్థిరత్వాన్ని అర్థం చేసుకుని, మీ భర్త కూడా తన కఠినమైన ఆలోచనా విధానాన్ని పునఃపరిశీలించి, మీతో కలిసి ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు రావడానికి ఒప్పుకునే అవకాశం ఉంది.
ఒకవేళ ఆయన ప్రస్తుతానికి రాకపోయినా, మీ అంతర్గత బలాన్ని పెంపొందించుకోవడానికి మీరు ఒక్కరైనా సరే ఒక మంచి సైకియాట్రిస్టును లేదా ఫ్యామిలీ కౌన్సెలర్‌ను కలవడం ఉత్తమం.

డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన
మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com


