
ఆ ఉదయం ఇంకా తెల్లవారలేదు. ఫోన్‌లో చిన్ని పిచ్చుక పిల్ల పలకరింపు.ఆ చప్పుడుకి నిద్ర కళ్ళతో పక్కన టీపాయ్‌పై తడిమి, ఫోన్ అందుకుని మెసేజ్ తెరిచి చూశాడు.పచ్చటి ఆకుల మధ్య నుండి తొంగి చూస్తున్న విచ్చుకున్న మల్లెపూవు ఫోటో, ఆ కింద ‘‘మా ఇంట్లో మల్లె తీగకి పూసిన మొదటి పూవు. ఇది నీ కోసం. ఈ ఉదయం తోటలోకి రాగానే, ఆ పువ్వును చూడగానే, ఎంత ఆనందం వేసిందో. నువ్వు గుర్తొచ్చావు. నిద్రలేవగానే చూస్తావని’’ ఆమె. ఇలాంటి పిల్లపై నిద్రపాడుచేసింది అని ఎట్లా కోపం తెచ్చుకోగలడు. అతని పెదవులపై చిన్న నవ్వు.‘‘ ఒకే పూవు. మరి అక్కడ నేను లేనుగా’’
‘‘సరిగ్గా చూడు. ఆ పక్కన ఓ చిన్న మల్లె మొగ్గ వుంది. ఈ పూచిన పూవు రాలిపోతుంది కదా. అప్పుడు దానికి వికసించడానికి చోటు దొరుకుతుంది’’
అతనికి కొంచం దిగులనిపించింది. రెండు పూలూ ఒకేసారి పూసి, ఒకేసారి రాలిపోవచ్చు కదా అనుకున్నాడు మనసులో.‘‘ఈ మల్లె ఏ జాతిదో, ఎక్కడ నుండి వచ్చిందో తెలీదు. ఎంత పరిమళం వెదజల్లుతూ వుందో! రెండు సీతాకోక చిలుకలు వాలాయి ఆ కొమ్మపై. ఆ అదురుకో, వీచిన గాలికో, పూవు రాలిపోయింది’’ ఒక కన్నీటి చుక్క ఎమోజీ. కాసేపటికి
‘‘ఆ రాలిన పూవు చూడు, కొంచెంసేపు బుద్ధుడి ఒడిలో, ఈ మొక్కల మధ్య... దానిది కాని చోటైనా, ఎంతో అందంగా లేదూ!’’
చిన్ని చిన్ని పక్షులతో అలంకరించిన వేలాడే పింగాణీ కుండీలో ఆకుల మధ్య ఆ మల్లెపూవు.అతనికి అప్పుడా పిల్ల దగ్గరికి పరుగెత్తుకెళ్ళి గుండెలకు హత్తుకోవాలని అనిపించింది.
‘‘ఇవ్వాల్టి ఉదయపు చిన్ని, చిన్న ఆనందాలు ఇవి. ఇప్పటికి ఇక బై’’‘‘అప్పుడేనా’’ అన్నాడు అతను.అటుపక్క నవ్వు.‘‘నీకు ఇక ఎప్పటికీ తెల్లవారదు. నాకోసం కలలు కనడంలోనే సమయం గడిచిపోయిందని అంటావు కదూ’’మరో నవ్వు ఎమోజీతో సంభాషణ ఆగిపోయింది.అతను లేచాడు. తలుపు తెరిచి ఆకాశం కేసి చూశాడు.అది ఎప్పటిలానే వుందా? అతనికి అది గాఢనీలంలోకి మారినట్లు అనిపించింది నిన్నటి కన్నా. అక్కడ రెండు తెల్లటి మేఘాలు ఒకదాన్ని ఒకటి అందుకునేందుకు చేతులు చాస్తునట్లు. ఆ రెండు చాచిన చేతులు ఒకటి ఆమె, రెండు నేను అనిపించి సంతోషంగా కలిగింది.అతనికి తెలుసు, కాసేపు అయితే ఆ దృశ్యం మారుతుందని.అందుకని అతను ఆఖరున చూసిన ఆ మేఘాలను తన లోపల అలానే నిలుపుకుని లోనికి వెళ్ళాడు.కాఫీ తాగి, స్నానించి, టిఫిన్ తిని ప్రతిరోజు వలే అతను తనదైన పనిభారపు భేతాళుడిని భుజానికి వేసుకొని వేటకు బయలుదేరాడు.
ఆమె పిల్లలకు పాఠం చెబుతూ వుంటే వైబ్రేషన్ మోడ్‌లో వున్నా, ఫోన్ ఒక్కసారి కదలి ఆగిపోయింది. ఆమెకి తెలుసు క్షణకాలం, రెండు రింగ్స్‌కే ఆగిపోయిన ఆ కాల్ ఎవరిదో. ఆ రింగ్‌టోన్ మిగిలినవాటి కన్నా భిన్నంగా వుంటుంది. ఆమె ఏమీ తొందర పడలేదు. అతను మళ్ళీ తాను పలకరించే దాకా మౌనంగానే ఉండగలడని ఆమెకి తెలుసు.స్టాఫ్ రూమ్‌లోకి వచ్చి, ఫోన్ తీసి చూసింది.నీలాకాశంలో చేతులు చాచిన చేతుల్లా అగపడే రెండు తెల్లటి మేఘాలు. ‘‘ పొగ మేఘాలు కదూ, అవి తేలి విడిపోయి, ఎటో వెళ్లిపోయేలోగా ఇలా నీకు మేఘ సందేశం’’ఆమె ఒక హృదయపు గుర్తును అతనికి పంపింది.
‘‘నువ్వు ఎందుకు గుర్తుకొస్తావో ఇలా నాకు? ఇప్పుడీ సిస్టం ముందు కూర్చుని నాకు ఎన్నడూ ఏ మాత్రం ఆసక్తి లేని పనులు చేస్తూ... ఇదంతా బతకడం కోసం కదూ?’’‘‘తప్పదు బతకాలి కాదా’’ అందామె క్లుప్తంగా.‘‘అవుననుకో, నీకూ తెలుసు కదా! ఇదంతా ఎంత నరకంగా వుంటుందో?నాకు పారిపోవాలని అనిపిస్తుంది’’‘‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా! ఏడు సముద్రాలూ ఈది, ఏడు పర్వతాలూ దాటి? నిన్ను నువ్వు కట్టేసుకున్న రాటను ఊడ బెరుక్కొని... ఎటుపోతావ్? ఎచటికి పోతావ్ ఈ రాత్రి’’ అందామె చిన్ని నవ్వుతో.‘‘అవును. వెళ్ళాలి అని వున్నా వెళ్ళలేను’’‘‘సరే, పని చేసుకోవాలి నువ్వూ నేనూ. కూలి ముట్టాలి అంటే పని చేయలి కదా!’’‘‘సరే’’ఆమె దిద్దాల్సిన పిల్లల పరీక్ష పేపర్లు ముందేసుకు కూర్చుంది. ఏమి తెలుసు అతని గురించి ఆమెకి?ఆమె గురించి అతనికి ఏమి తెలుసు?
అట్లా తెలుసుకోవాలని ఇద్దరికీ ఎందుకనిపించలేదో తెలీదు?తాము ఒకరికొకరు ఏనాటి నుండో, తెలిసినట్లు ఎందుకు అనిపించిందో కూడా వాళ్ళకి తెలీదు. లేదా తమ గత కాలాలు ఏవో, అన్నీ రద్దయిపోయి, జీవితం ఆ క్షణం నుండే మొదలైనట్లుగా వుంది. అతను ఒక సంగీత కచేరీలో పరిచయం అయ్యాడు.సంగీతం మన లోలోపల, మనకే తెలియని భావోద్వేగాలను తట్టిలేపుతుంది.సమూహానికి కాస్త ఎడంగా ఒక్కతీ కూర్చుని వింటోంది. ‘‘ఆజా బాలమ్ పరదేశీ’’ అంటూ పాడుతూవుంది కౌశికీ చక్రబర్తి, భైరవిలో. రాగానికి అనుగుణంగా గాలిలో కదులుతున్న ఆమె సన్నటి పొడవాటి చేతివేళ్ళ విన్యాసాన్ని చూస్తోంది ఆమె. అందంగా, సుకుమారంగా వున్న ఆమె, మరేదో లోకంలో ఉన్నట్లు, తన చుట్టూ ఏమి జరుగుతోందో, ఎవరున్నారో, లేరో తనకేం ప్రమేయం లేనట్లు ఎంత తాదాత్మ్యతతో పాడుతున్నదో. ఆమె స్వరం ఎంత మధురంగా ఉందంటే, ఆ పాట విన్న ఆ పరదేశీ ఎవడో, ఆమె చెంత అలా వశీకరణ చెందినవాడుగా కూర్చుండి పోడూ అనుకుందామె.
పాడుతున్న ఆ గాయనిని, అరమోడ్పు కళ్ళతో, తలూపుతూ వింటున్న ఆమెనీ చాలసేపటి నుండి మార్చి, మార్చి చూస్తూ వున్న అతను ‘‘మీరు కూడా పాడతారా?’’ అన్నాడు. ఆ అపరిచిత వ్యక్తి కేసి చూసి, తల అడ్డంగా ఊపి ‘‘ఇష్టం. వినడం’’ అంది.అడక్కుండానే ‘‘నాక్కూడా! కర్ణాటక సంగీతంలో కొంచెం ప్రవేశం వుంది’’ అన్నాడు.కొన్ని మాటలు కలిసి, ఇష్టాలు కలిసి కాఫీని ఆస్వాదించి, సంగీతం గురించి అతనికి తెలిసిన సంగతులు చెబుతుంటే, ఆసక్తిగా విని, అట్లా మొదలైంది వాళ్ళ పరిచయం.ఆమె పని చేసే కాలేజీకి దగ్గరలోనే అతని ఆఫీసు. ఏదో కమర్షియల్ బ్యాంకులో ఉద్యోగి. మద్రాసు నుండి డిప్యుటేషన్ మీద వచ్చాడు ఏడాది కాలానికి.ఇద్దరికీ కుదిరినప్పుడు సాయంత్రాలు కలిసి కాస్త దూరం నడిచి, ఏ కాఫీనో తాగి, ఆమెతో పాటూ ఆటో ఎక్కి, మరి కాసేపటిలో శ్రీనగర్ కాలనీలో ఆమె ఇల్లు వస్తుందనగా, కాస్త దూరంలోనే దిగి పోయేవాడు. అతనికి తెలుసు ఆమె ఎక్కడ వుంటుందో.
ఆమె అతడిని ఇంటికి రమ్మని ఎన్నడూ పిలవలేదు. వెళ్ళాలని అతనూ అనుకోలేదు.యూసఫ్‌గూడలో వున్న నిసిట్ (ఎన్‌ఐఎస్‌ఈటీ) క్యాంపస్ గెస్ట్‌హౌస్‌లో వుండేవాడు. ఎప్పుడన్నా వీలు దొరికినప్పుడు ఆమె అతని దగ్గరకు వచ్చేది.అతని గదిలోనో, ఆరుబైట చెట్ల కిందో కూర్చుని గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళ మాటల్లో అనేక విషయాలు దొర్లినా, వ్యక్తిగతమైన సంగతులు వచ్చేవి కావు. బహుశా అలాంటి సంభాషణ మొదలవుతే అది ఎక్కడికి దారి తీస్తుంది? మనుషులు ఒంటరి జీవులు కాదనీ, అనేకానేక సంబంధాల మధ్య వాళ్ళు జీవిస్తారని వాళ్ళకు తెలుసు.జీవితంలోని ఆ పొరలను విప్పినప్పుడు ఊపిరాడక, తమ ఇద్దరికీ ఎంతో శాంతిని, నిశ్చింతను ఇస్తున్న ఇప్పటి ఈ బంధం, ఏ మురికి కాలువలోకో ప్రవహించి, అసహ్యాన్నో, అవమానాన్నో మిగిల్చి చివరకు అంతం అవుతుందన్న భయం కూడా వాళ్ళను మాట్లాడనివ్వలేదు.
వాళ్ళ ఇద్దరి మధ్య కలిగిన అద్భుతము, అపురూపము అని వాళ్ళు అనుకునే ఈ పేరు లేని ప్రేమయో, బంధమో అనుకునే ఆ భావన, గాలి బుడగవలే టప్పుమని పగిలి పోతుందేమో అన్న భయం వాళ్ళకి లోలోపల వుండి వుండాలి. కొన్ని నెలల తరువాత, ఇదంతా ఎక్కడి దాకా పోతుందో అనిపించి, ఆమె అన్నది ‘‘మనం మాట్లాడుకోవాలి’’‘‘మాట్లాడి? నీ స్థితిని నువ్వూ, నా స్థితిని నేనూ మార్చగలమనే అనుకుంటున్నావా?’’ అన్నాడు అతను ఒకసారి. తాము ఇద్దరం ఎప్పటికీ ఇట్లానే వుండగలమన్న ఈ భ్రమని నమ్మినంత కాలం, ఇలా సాగినంత కాలం ఇట్లా సాగనివ్వాలనే వాళ్లకు వుంది.అతను అన్నాడు ఒకసారి ఆమె చేతి వేళ్ళతో ఆడుకుంటూ ‘‘ఆనందం అనిపించిన ప్రతిదాన్నీ మనం శాశ్వతంగా స్వంతం చేసుకోవాలి అనుకుంటాం.
అది అప్పటికి కలిగించిన సంతోషం.అట్లా అది మనకి అప్పుడు మనం వున్న స్థితి, కాలం వల్ల కలిగిన ఆనందమో, హాయో! ఈ మనిషి కావాలి శాశ్వతంగా నాకు, అని ఎంతో ఇష్టపడి, ప్రేమించి చేసుకున్న పెళ్ళిళ్ళలోనూ, వాళ్ళతోనే, ఆ బంధంలోనే వున్నా, ఆ ఇద్దరు మనుషులలో చాలా సందర్భాలలో చెప్పరానంత డిసపాయింట్‌మెంట్ వుంటుంది ఎందుకో’’‘‘అవును. అది వాళ్ళు గుర్తించినా, అప్పటికే వాళ్ళ చుట్టూ అనేక కొత్త బంధాలు బిగుసుకుపోతాయి. ముఖ్యంగా పిల్లలు. అప్పుడు అది దాటడం కష్టం’’ అందామెఅతను మౌనంగా విన్నాడు.‘‘ఇదంతా నాకు చాలా ఆశ్చర్యంగా వుంది. ఇట్లా మరొక మనిషి నా హృదయానికి ఇంత దగ్గరగా వస్తుందని నేను ఎన్నడూ ఊహించలేదు.’’‘‘ఆడమనిషి’’ అని సవరించి నవ్వింది.‘‘ఉహు, నాకు మనిషే. ఇద్దరు మనుషులు.
అంతే’’ అన్నాడు ఆమె నుదుటి మీద ముద్దుపెడుతూ.అతని వొడిలో పడుకున్న ఆమె లేచి కూర్చుని ‘‘ఏం? ఎందుకింత ఇష్టం? ఎందుకింత మోహం నీకూ, నాకూ మధ్య? మనం ఒక ఆడ, మగ మనుషులం. మన ఇద్దరికీ మనసులే కాదు, శరీరాలు కూడా వున్నాయి మరిచిపోకు’’ అంది ఆమె.‘‘అవును ఈ శరీరాలు కూడా ఒకరికి ఒకరు కావాలని కోరుకుంటాయి’’ అని, ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. ఆమె దూరంగా జరిగింది అతనికి. ‘‘ఈ దాగుడుమూతలు ఎందుకు నీకూ నాకూ మధ్య’’ అన్నాడు.‘‘భయం. నిజంగా భయం నాకు. నా మనసును, దేహాన్నంతా నీకు ఇచ్చేసి, నాకు నేను కాకుండా పోతానని భయం. నా ఉద్వేగాలను నా లోపలే దాచుకోలేనితనపు భయం.
హు, ఇంకా, లోకభయం, నా కుటుంబ భయం, ఈ దాటలేని అగడ్తల మధ్య పడి, మనుషుల తీర్పుల మధ్య పడి నలిగి నువ్వూ, నేనూ చచ్చిపోతామేమోననే భయం’’ఆ తరువాత అతన్ని ఆనుకొని, అతని చేయి గట్టిగా పట్టుకుని, ఆమె ఒక్క మాటన్న మాటలాడకుండా అతనికేసి నీళ్ళు నిండిన కళ్ళతో చూసింది.కాస్సేపటికి ‘‘నువ్వు చెప్పాలి అనుకుంటున్నదంతా చెప్పేయి ఇవ్వాళ’’ అన్నాడు అతను. ‘‘నాకే తెలీదు. ఈ ద్వైదీభావం ఏమిటో. నువ్వు కావాలి, వద్దు కూడా, నువ్వు పూర్తిగా కావాలి. అట్లా వద్దు కూడా. కొంచెం, నీ చేయి పట్టుకుని, నీ భుజం మీద తలవాల్చి, నువ్వు అట్లా నా కళ్ళ మీద ముద్దు పెట్టి ..’’అతను ఆమె తలను దగ్గరికి లాక్కొని కళ్ళ మీద ముద్దు పెట్టాడు.
ఆ నీటి తడి అతడి పెదవులకు కొంచెం ఉప్పగా తాకింది.‘‘నీకు కష్టం కలిగించే, నీకు ఇష్టంలేని పని ఏమీ జరగదు మన మధ్య’’ అన్నాడు. ‘‘నేను ఇది చెప్పడం మన మధ్య ఏర్పడిన ఈ బంధపు తప్పు, ఒప్పుల గురించి, నీతో మాట్లాడటానికి కాదు, నాకు పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు. బయట హాస్టల్‌లో వుంటారు. మా అమ్మ, నాన్న, ఒక మానసిక వైకల్యం వున్న చెల్లి ఇంట్లో’’‘‘అతను? అదే మీ ఆయన’’‘‘వున్నాడు, కానీ వుండీ లేనట్లే’’‘‘అంటే’’‘‘చాలా ఆస్తులు తగలేశాక, ఎన్నో గొడవలయ్యాక, ఆ మిగిలినవి ఏవో మా అత్తింటి వాళ్ళు పిల్లల పేర్లపై పెట్టాక, మమ్మల్ని గాలికి వదిలేసి, అతను ఎక్కడెక్కడో తిరిగి, ఆ మిగిలిన ఆస్తి కోసం నన్నూ, అతని తల్లిదండ్రులను కూడా చాలా వేధించడం మొదలు పెట్టాక, వాళ్ళు కూతురు దగ్గరికి అమెరికాకి వెళ్ళిపోయారు. నేను మా అమ్మా వాళ్ళ దగ్గరికి వచ్చేశాను.’’
‘‘మరి అతను’’‘‘నేను విడాకులు అడిగాను. ఆడపిల్లలు కదా. తండ్రి లేకపోతే కష్టం అట. పెద్దవాళ్ళు వద్దన్నారు. పిల్లలు అనే పేరుతో వస్తాడు. వుంటాడు. కొన్నాళ్ళు. చాలా కోపం, అసహ్యం నాకు. నన్ను ముట్టుకునే సాహసం చేయడు. అతను నా మేనబావే. ఆస్తులు, బంధుత్వాలు అంటూ నాకు ఇష్టం లేకుండానే చేసిన పెళ్లి ఇది’’‘‘చాలా కష్టం కలిగింది కదూ!’’ అతను ఆమె తలనిమురుతూ అన్నాడు.ఆమెకి నిజంగా చాలా దుఃఖం కలిగినా అతనికేసి చూసి, ‘‘అందుకే మరింత దుఃఖాన్ని మోయలేనని అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మ, నాన్న, మానసికంగా ఎదగని చెల్లి, ఆ, ఇంకా నా పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఇదంతా దాటి నీ కోసం వచ్చేయాలి అనుకున్నా, నిజంగా చేయగలనా? ఇక దుఃఖం వద్దు అనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఒక కొత్త దుఃఖాన్ని తెచ్చేలా ఉన్నావు’’ అని నవ్వింది.‘‘నువ్వు నమ్మవేం? అట్లా చేయను. అంటే, నీకు దుఃఖం కలిగంచే పని.
అలా అయితే వెళ్ళనా’’ అతడు ఆమె చేయి విడిపించుకుని లేచి నిలబడ్డాడు.ఆమె నవ్వి, అతని చేయి పట్టి లాగి కూర్చోబెట్టి ‘‘మరి నీ సంగతి ‘‘ అని అతని మొఖంకేసి చూసి, కళ్ళు తమాషాగా ఎగరేసింది.‘‘నీ అంత దుఃఖభాజిత కుటుంబ కథాచిత్రం కాదులే నాది. కొంచం ప్రేమించే చేసుకున్నాం. ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం.’’‘‘కొంచం ప్రేమించుకోవడం ఏమిటి?’’‘‘మరి? అప్పుడు చాలా ఎక్కువనుకున్నాంలే. తరువాత పెళ్లి చేసుకుని కలిసి జీవించడం మొదలుపెట్టాక అది కొంచెమే అని తెలిసిందిలే’’ అని నవ్వాడు.‘‘ఊ, చెప్పు?’’‘‘బహుశా, ఈ దేశంలో పిల్లలని పుట్టించడం అంత సులువైన విషయం మరోటి లేదనుకుంటా’’‘‘అర్థం అయింది. నేను చేసిందీ అదేగా’’‘‘కలిసి ఉండటానికి ప్రయత్నం చేశాం.
నా కొడుక్కి అప్పుడు ఐదేళ్ళు. తనకి ఈ ఇల్లూ, సంసారం ఇదంతా ఊపిరాడనితనంగా అనిపించడం మొదలైంది. తను ఓవర్ యాంబిషస్ అనుకున్నాను నేనప్పుడు. తను ఇంకా పైకి ఎదగాలి, ఏ ఆక్స్‌ఫర్డ్‌లోనో పైచదువులు చదవాలి, ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో వుండాలి అనుకుంది. ఇదంతా ఎందుకు వున్నదాంట్లోనే వుండచ్చు కదా అనిపించేది నాకు’’‘‘అట్లా నువ్వు అనుకోవడం ఆమెపై నీకు చాలా ప్రేమ ఉండటం వల్లా, లేక నువ్వు, నేను, నా కుటుంబం కోసమే ఆమె అనుకునే నీ స్వార్థం వల్లా’’‘‘పెళ్ళంటే బాధ్యత కదా?’’ అని ఒక్క క్షణమాగి, ‘‘స్వార్థం కూడానేమో! కొంచెం చాలా ఎక్కువ.
ఇంకొంచెం ప్రయాస లేకుండానే దొరికేసే దేహసుఖం, ఇంకా నిలకడ, నిశ్చింతతో పాటూ, ఆడ, మగ ఆ ఇద్దరు మనుషుల, కట్టడి చేసే లోకం స్వార్థం కూడా ఉంటుందేమో, మనం గుర్తించం కానీ’’‘‘నిజమే’’ అంది ఆమె ‘‘మేము అప్పుడు దిల్లీలో వుండేవాళ్ళం. మా అమ్మకి తెలిసింది మా ఘర్షణ. బహుశా తను మా అబ్బాయి ‘అనిరు«ద్ కీ మా’ అని చిన్నగా నవ్వి, ‘‘నా భార్య చెప్పినట్టు వుంది. అమ్మే అనింది పట్టి ఉంచేవి బంధాలు ఎలా అవుతాయి, బందిఖానాలు అవుతాయి కానీ అని. మేము విడిపోయాం.’’‘‘మరి బాబు?’’‘‘తనకి బాబు పట్ల ప్రేమ చాలానే వున్నా, మేం మాట్లాడుకున్నాం, ఒక నిర్ణయానికి వచ్చాక స్నేహితుల్లా వుందాం అనుకున్నాం. బాబు బాధ్యత నేను తీసుకున్నాను. తను యూకే వెళ్ళింది. తను అనుకున్నట్లుగానే చదువుకుంది. మంచి పొజిషన్‌లో వుంది. అక్కడే స్థిరపడింది. వీలైనప్పుడు తల్లీ, కొడుకు కలుసుకుంటారు.’’
‘‘మరి..’’ఆమెకి నోటిదాకా వచ్చి, అది అంత సంస్కారం కాదేమోనని ఆగిపోయింది.‘‘ఉన్నారు. ఆ తరువాత ఒకరిద్దరు స్త్రీలు నా జీవితంలో. ఏ రిలేషన్ పెళ్లి దాక వెళ్ళలేదు. దానికన్నా ముందుగానే వాళ్ళ నిందారోపణలు, పొసెసెసివ్‌నెస్‌లు, నా అపరాధ భావనల బరువులు, ఏమి చేయాలో తోచక, అంత ఎమోషనల్ బరువు మోయలేక పారిపోవడాలు... ఇంకో రిలేషనో, పెళ్ళో ఇక వద్దనుకునేలా చేశాయి నన్ను’’ అన్నాడు.ఆమెకేసి అట్లా దిగులుగా చూశాడు.‘‘ఇదిగో నువ్వు ఇట్లా వచ్చావు. ఎందుకు ఇలా వచ్చావో, వున్నావో, వుంటావో లేదో తెలియకుండా’’ అన్నాడు. ఆమె అతన్ని క్షణకాలం తదేకంగా చూసి,
‘‘ఇంతటి నిశ్చింతను, శాంతిని, నేను ఎన్నడూ ఎరుగను. ఇదంతా ఎక్కడి దాకా వెడుతుందో, ఎక్కడ ఆగిపోతుందో కూడా నాకూ తెలీదు.
ఈ లోకంలో పరమ కుతూహలమైన సంగతి ఏదైనా వుందీ అంటే, ఇద్దరు మనుషులు, ఉహూ ఇద్దరు ఆడా, మగా మధ్య వున్న సంబంధం ఏవిటో తెలుసుకోవడమే అనుకుంటాను. నువ్వు నాకు కావాలి. కానీ..’’ఆమె తన మాట పూర్తి చేయకుండానే ‘‘కానీ వద్దు కూడా’’ అన్నాడు నవ్వి.అతని రెండు చేతులను తన దగ్గరికి లాక్కుని ఆ చేతులలో తన మొఖాన్ని దాచుకుని, అరచేతుల్ని ముద్దుపెట్టుకుని, ఆమె మెల్లిగా లేచి తన చేతి సంచీ తీసుకుని, వెనక్కి తిరిగి, కంటి నుండి రాలిన కన్నీటి చుక్కను తుడుచుకోకుండానే నడిచి వెళ్లి పోయింది. ఆమె మళ్ళీ రేపు కూడా, నిన్నటి మల్లెమొగ్గ, రేపు ఉదయం విరిసి పూవు అవ్వగానే, తనకు ఆ బొమ్మ పంపుతే బావుండును. ఉహు, రెండు విరిసిన మల్లెపూలు అనుకుంటూ వుంటే, ఎందుకో తనలోంచి తానంతా ఖాళీ అయిపోయినట్లు అనిపించింది అతనికి.