‘‘లే నాయనా! మరేమీ భయం లేదు’’ అన్నారు శాస్త్రిగారు. రామచంద్ర వినయంగా లేచి నిలబడ్డాడు. జేబులోంచి ఓ కాగితం తీసి ఆయన చేతిలో పెట్టాడు. మడతవిప్పి చదువుతుండగానే, ఆ ఉత్తరంలో తన తండ్రి శాస్త్రిగారికి వ్రాసిన సందేశాన్ని క్లుప్తంగా వినిపించాడు.‘‘రుణాలు దారుణంగా ఉన్నాయి స్వామీ! తొందరలో తీర్చకపోతే ఇల్లు అప్పులవాళ్ల పరమైపోతుంది. నాకేమో శిల్పాలు చెక్కడం తప్ప మరే పనీ చేతకాదు. ఈ మధ్యన చేతినిండా పని దొరకడం లేదు. డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది. డబ్బుకోసం, పని కోసం పట్టకూడని వాళ్ల కాళ్లు కూడా పట్టాను.
ఈ కష్టాలకు అంతూదరీ చిక్కడం లేదు. దీనికి పరిష్కారం మీరే చూపించగలరని మా నాన్న చెప్పాడు. అన్యథా శరణం నాస్తి’’ అంటూ మళ్లీ శాస్త్రిగారి కాళ్లమీద పడ్డాడు రామచంద్ర.‘‘ఇలా మాటిమాటికీ ఇబ్బంది పెట్టకు నాయనా! ఏదీ జాతకం కాగితాలు తెచ్చావా?’’ అని అడిగారు శాస్త్రిగారు అంతకుముందు అతడిచ్చిన కాగితాన్ని పక్కన పెడుతూ... మరో కాగితాల దొంతర తీసి ఆయనకు అందించాడు రామచంద్ర. శాస్త్రిగారు పరీక్ష చేస్తున్నారు. ద్వితీయాధిపతి దశ నడుస్తోంది. అష్టమ వ్యయాధిపతులు అంతర ప్రత్యంతర దశల్లో ఉన్నారు. గోచార రీత్యా క్రూరగ్రహమైన వ్యయాధిపతి ధన స్థానంలోకి చేరబోతున్నాడు. అన్నీ అపశకునాలే కనిపిస్తుండగా శాస్త్రిగారి మనస్సు కలవరపడింది. రామచంద్ర దీనంగా ముఖంపెట్టుకుని శాస్త్రిగారినే చూస్తున్నాడు.
ఆయన ఒక్కక్షణం కళ్లుమూసుకుని తన ఉపాస్యదేవతను స్మరించారు. ఆయన భృకుటియందు ఒక దృశ్యం ఆవిష్కృతమైంది.మహాకాలసర్పం ఒకటి సూర్యుణ్ణి మింగబోతుండగా, ఒకానొక త్రిశూలం దాన్ని ఎత్తి గిరవాటేసింది. శివుని జటాజూటంలో జారిపడ్డ ఆ పాము గంగలో ఈదులాడుతోంది... ఈ దృశ్యాన్ని చూసిన తరువాత నెమ్మదిగా కళ్లు తెరిచారు శాస్త్రిగారు.ప్రసన్న వదనంతో చిరునవ్వు నవ్వుతూ, ‘‘నాయనా! నీకు తళుకేశ్వరం తెలుసా?’’ అని అడిగారు. ‘‘తెలియదండి.’’‘‘ఇప్పుడు దాన్నే తడికలపూడి అంటున్నారు. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లే దారిలో ఉంది. అక్కడ గాంగేశ్వరస్వామి ఆలయం ఉంది. గంగాపుత్రుడైన భీష్మపితామహుడు ప్రతిష్ఠించిన శివలింగం...’’శాస్త్రిగారు చెబుతున్నారు. రామచంద్ర వింటున్నాడు.
‘‘వచ్చే అమావాస్య... సోమవారం. సోమావతీ అమావాస్య అంటారు. పవిత్రమైన రోజు. ఆ రోజు ఉదయం ఆ స్వామికి శక్తివంచన లేకుండా అభిషేకం చేయించుకో.’’‘‘స్వామీ! నా ఆర్థిక పరిస్థితి చెప్పాను కదా’’ ఆదుర్దాగా మాటకడ్డం వచ్చాడు రామచంద్ర.‘‘మరేం పరవాలేదు. శక్తివంచన లేకుండా అంటే భక్తిలోపం లేకుండా మనసు తీరా చేయమని కానీ, డబ్బు ఖర్చుపెట్టమని కాదు.’’ వివరించారు శాస్త్రిగారు. ‘‘అలాగే స్వామీ!’’‘‘ఆనాటి ఉదయం అక్కడ అభిషేకం చెయ్యి. అక్కడి నుంచి తూర్పుకు ఐదుమైళ్ల దూరంలో కుడివైపున తోటల మధ్యలో అష్టభైరవ నిర్మితమైన శివాలయం ఉంటుంది. ఆ రాత్రికి నీవు ఆ ఆలయంలో జాగారం చేయాలి. జాగ్రత్త సుమా! అసలే నిర్జన ప్రదేశం. తగిన ఏర్పాట్లతో వెళ్లు. మెలకువతో రాత్రంతా ఉండి, తెల్లవారిన తరువాత నా వద్దకు నేరుగా రా’’ అంటూ కొంత డబ్బుతీసి రామచంద్ర ముందు పెట్టారు శాస్త్రిగారు.
‘‘అయ్యో! నేనివ్వాల్సింది పోయి మీరే ఎదురిస్తున్నారా?’’ మొహమాట పడ్డాడు రామచంద్ర.‘‘ఇన్నేళ్లుగా నా మొగమైనా తెలీని నిన్ను, మీ నాన్న ఇప్పుడే నా దగ్గరకు పంపాడంటే దానికేదో కారణం ఉంటుందని గ్రహించు. ఈ డబ్బు మీ నాన్న ఇచ్చిందే అనుకో’’ లాలనగా చెప్పారు శాస్త్రిగారు.రామచంద్ర సెలవు తీసుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు. అది 1966వ సంవత్సరం, ఫాల్గుణమాసం. అమాసోమవారం తెల్లవారింది. ఆ వేళ ఉదయం ఎనిమిది కావస్తుండగా రామచంద్ర తడికలపూడికి చేరుకున్నాడు. ప్రధాన రహదారి నుంచి ఎడమ పక్క సందులోకి ప్రవేశించాడు. అల్లంత దూరాన వేంగీ చాళుక్యుల కాలంనాటి ఆలయ శిఖరం నీరెండ ఛాయలో మెరుస్తూ కనిపిస్తోంది. నడుచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. జనావాసాల మధ్యలోనే ఉన్న మల్లెతోటల నుంచి సువాసనలు దారంతా విరజిమ్ముతున్నాయి. జనాలంతా నీళ్లకావిళ్లతో ఎదురొస్తున్నారు.
చెరువు దూరంగా ఉన్నట్లుంది. రామచంద్ర ఆలయాన్ని సమీపించాడు. ఆలయ ప్రాకారాన్ని చుట్టిరావడానికి వీలులేదు. రెండుపక్కల ఇళ్లు. అయిమూలగా దక్షిణదిక్కున ఒక రోడ్డుంది. గుడిలోకి ప్రవేశించాడు రామచంద్ర. తువ్వాలు చుట్టుకున్న ఆలయ పూజారి బలిపీఠం దగ్గర శుభ్రం చేసుకుంటున్నాడు. కుడివైపు బావి వుంది. ‘‘అయ్యా! ఆ బావిలో నీళ్లు స్నానానికి పనికొస్తాయా?’’ అడిగాడు రామచంద్ర.ఒక్కక్షణం అతణ్ణి పరకాయించి చూసి, ‘‘ఆ బావిలో నీళ్లు తోడటం నీవల్ల కాదు. స్నానానికైతే చెరువుంది’’ చెప్పాడు పూజారి.నిజమే. బావి చాలా లోతుగా ఉంది. నీళ్లు అట్టడుగున ఉన్నాయి.‘‘పేరుకి గాంగేశ్వర స్వామి వెలసిన క్షేత్రం. ఊళ్లో నీటిచుక్క ఉండదు. వేసవికాలం వస్తే ఉన్న ఒక్క చెరువూ ఎండిపోతుంది. జీవుడికి తాగునీటికి కరవు. గుళ్లో అయ్యవారి స్నానానికి కరవు’’ పూజారి తనలో తానే గొణుక్కుంటున్నాడు.
రామచంద్ర ఎడమభుజం మీద సంచీని ఎగదోసుకుని ముందుకి కదిలాడు. ‘‘బాబూ! వచ్చేటప్పుడు ఆ కావిడితో నీళ్లు తెచ్చిపెట్టగలవా?’’ అడిగాడు పూజారి. ‘‘మహద్భాగ్యం’’ అంటూ కావిడిని కుడిభుజం మీదకు ఎత్తుకున్నాడు రామచంద్ర. చెరువులో స్నానం చేసి, నీళ్లు తీసుకుని వచ్చాడు. అప్పటికే అభిషేకం మొదలైనట్లుంది. పూజారితో గొంతు కలుపుతూ గాంగేశ్వరస్వామిని నమక చమకాలతో అర్చించాడు రామచంద్ర. అనంతరం కొంత దక్షిణ ఆయనకు సమర్పించాడు. ‘‘లేచిన వేళ బాగుంది’’ అనుకుంటూ దానిని అందుకున్నాడు పూజారి. ‘‘బాబూ! చాలాదూరం నుంచి వచ్చినట్లున్నావు’’ రామచంద్రని అడిగాడు ఆప్యాయంగా.
‘‘అవునండీ. ఒక పని మీద వచ్చాను. ఈవేళ ఇక్కడే ఉంటాను’’ చెప్పాడు రామచంద్ర.‘‘అయితే ఈ పూటకి మా ఇంటిలో చేయి కడుక్కోవచ్చు’’ ఆదరంగా చెప్పాడు పూజారి.కృతజ్ఞతగా నమస్కరించాడు రామచంద్ర. భోజనం తరువాత, కాసేపు ఆలయ శిల్పాలను గమనిస్తూ గడిపాడు. కొద్దిసేపటికి దూరంగా ఆకాశంలో ఉరుముల సవ్వడులు వినిపించసాగాయి. ఎండ పూర్తిగా తగ్గలేదు కానీ వాతావరణం చల్లబడింది. శాస్త్రిగారు చెప్పిన గుర్తుల ప్రకారం ఆలయానికి తూర్పుముఖంగా సాగిపోయాడు రామచంద్ర. ఒక గంటన్నర వ్యవధిలో జీడిమామిడి తోటల మధ్యలో ఉన్న ఒక శిథిలాలయాన్ని కనుగొన్నాడు. మహా అయితే నాలుగడుగుల ఎత్తుంటుంది. అయిదడుగుల పొడవు, మూడడుగుల వెడల్పు ఉంటుంది. ఆ కాస్తచోటులోనే ఎనిమిదివైపులా భైరవశిల్పాలున్నాయి.
ఆ శిల్పసౌందర్యం అమోఘంగా ఉంది. రామచంద్ర గుడిచుట్టూ పరికిస్తుండగా, తోట రైతు కాబోలు వచ్చాడు. ‘‘ఎవురు బాబూ! ఈయేళప్పుడు వచ్చారు? బేగ ఎల్లిపోండి. వాన పడేనాగుంది’’ అని సలహా ఇచ్చాడు. రామచంద్ర చిరునవ్వు నవ్వి, ‘‘లేదు. ఈరాత్రికి ఇక్కడే ఉండాలని వచ్చాను’’ అన్నాడు.రైతు అతడిని అయోమయంగా చూశాడు. ‘‘సూడు బాబూ! ఈడ రాత్రైతే మావే ఉండలేం. కట్టం. ఏడనుంచొస్తాయో... ఎందుకొస్తాయో తెలవదు గానీ, చీకటి పడగానే ఈడకి కుక్కలొస్తాయి. మనుషుల్ని చెండాడేస్తాయి. ఆటితో నువ్వు పడలేవు బాబూ! నా మాటిని ఎల్లిపో’’ బుజ్జగింపుగా చెప్పాడు.‘‘ఈ గుడిలో నిద్ర చేస్తానని మొక్కుకున్నాను. అంచేత ఈ రాత్రికి ఉండాల్సిందే’’ చెప్పాడు రామచంద్ర.‘‘ఈ గుడికి ఇట్టాంటి మొక్కులతో కూడా జనాలొత్తన్నారా? ఇడ్డూరంగా ఉందే. సరే బాబూ! జాగ్రత్త’’ అంటూ రైతు అక్కడినుంచి వెళ్లిపోయాడు.ఇంకా సంధ్యాసమయం కాలేదు.
కానీ ఆకాశం మేఘావృతం కావడం వల్ల చీకట్లు కమ్ముకుంటున్నాయి. కనుచీకటి ఉండగానే రామచంద్ర గుళ్లో ప్రవేశించాడు. అడుగున్నర ఎత్తున్న ద్వారానికి తలుపులేమీ లేవు. వంగి పాక్కుంటూ లోపలికి వెళ్లి చూస్తే గుడికి మధ్యలో పానపట్ట రహితంగా నేలలో పాతేసినట్లుగా శివలింగం ఉంది.ఇంకు సీసా మూతకి కన్నంపెట్టి ఒత్తిని దూర్చి, లోపల కిరసనాయిల్ పోసి మూతపెడితే ఇల్లాయిబుడ్డి తయారవుతుంది. ఆ బుడ్డిలో కిరసనాయిల్ బదులుగా ఆవునెయ్యి పోసి తెచ్చాడు రామచంద్ర. దేవుడిముందు వెలిగించాడు. ఆ వెలుగులో రాత్రంతా అక్కడ కాలక్షేపం చెయ్యాలి. అందుకోసం కూడా తగిన ఏర్పాట్లు ముందే చేసుకున్నాడు. ఏవైనా బొమ్మలు గీసుకోవచ్చని కొన్ని కాయితాలు తెచ్చుకున్నాడు. ఆ గుడిని చూసేవరకు ఏం గీయాలో అనుకోలేదు. కానీ అక్కడికి వచ్చిన తరువాత, ఇదే గుడి అర ఎకరం నేలలో విశాలమైన గుడిగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించి, బొమ్మ గీయాలనిపించింది. ఆ పనే మొదలుపెట్టాడు.
బయట ఉరుముల శబ్దం అంతకంతకూ ఎక్కువవుతోంది. సన్నగా చినుకు కూడా ప్రారంభమైనట్లుంది. ఇంతలో ఉన్నట్లుండి అక్కడికో కుక్క వచ్చింది. ఆ గూడులో రెండు జీవులు తలదాచుకోవడానికి అవకాశం లేదు. కానీ ఆ కుక్క ముందరికాళ్లను బాగా ముందుకు జాపి, విశ్రాంతిగా ద్వారానికి అడ్డంగా కూచుంది.రామచంద్ర కొద్దిసేపు ఆ కుక్కని గమనించి, తన పనిలో మునిగిపోయాడు. ఆలయం బయటి దృశ్యాన్ని మొదటిబొమ్మగా గీయడం పూర్తయ్యేసరికి సుమారుగా మూడుగంటల సమయం పట్టింది. లోపలి ఆలయాన్ని గీయాలని రెండో బొమ్మ మొదలుపెట్టాడు.ఇంతలో వర్షం పూర్తిగా పెద్దదయింది. గాలి తాకిడి కూడా ఉద్ధృతంగా ఉంది. తానున్నది చిన్న గూడు కనుక గాలి లోపలికి పెద్దగా రావడం లేదు. అందువల్లనే దీపం నిలబడింది కానీ లేకపోతే కష్టమయ్యేది. మరో గంట గడిచింది.
రామచంద్ర కూర్చుని ఉన్నచోట నేల చెమ్మతేరడం మొదలయ్యింది. వెంటనే పక్కన పెట్టిన సంచీని తీసి ఒళ్లో పెట్టుకున్నాడు. వర్షం ఇంకా పెద్దదయితే, నీళ్లు లోపలికి వచ్చేస్తాయి కాబోలు... అప్పుడెలా అని మథన పడసాగాడు.అతను ఊహించిందే నిజమైంది. రెండో బొమ్మ ఇంకా పూర్తి కాకుండానే గుళ్లోకి నీళ్లు రాసాగాయి. అప్పటికే రామచంద్ర కట్టుకున్న పంచె పూర్తిగా తడిసిపోయింది. గొంతుకు కూర్చుంటే చీలమండల వరకు నీళ్లు వచ్చేశాయి. ఇక అక్కడ ఉంటే క్షేమం కాదనిపించింది. లోపలినుంచి బయటికి వెళ్దామంటే కుక్క అడ్డంగా ఉంది. దానికి బయటికి పోవడం ఇష్టం లేదు కాబోలు, చేత్తో ముందుకు తోసినా కదలలేదు. కొద్దిసేపటికి రామచంద్రకు బయటకు వెళ్లడానికి తోవ ఇచ్చింది. అతడితోపాటు తాను కూడా బయటకు నడిచింది.
యట అంతా గాఢాంధకారంగా ఉంది. నేలమీద పిక్కలవరకు నీళ్లున్నాయి. ‘ఇంతలోనే ఎంత వర్షం పడింది?’ అని ఆశ్చర్యపోతూనే, ఒక్క ఉదుటన ఆలయంపైకి ఎక్కి కూచున్నాడు. ఎలా ఎక్కిందో తెలియదు కానీ ఆ కుక్క కూడా ఆలయంపైకి చేరింది. అక్కడ కూచునేందుకు బాగుంది. ఎటొచ్చీ పైనుంచి కుండపోత వాన. చప్పగా తడిసిపోయాడు. కొద్దిగా ఒణుకు కూడా వస్తోంది. ఆకాశం చిల్లుపడినట్లుగా ఆ రాత్రంతా వాన పడుతూనే ఉంది. గాలి విసిరి కొడుతూనే ఉంది. మెరుపు వెలుగు పడినప్పుడల్లా నీటిమట్టం పెరుగుతున్నట్లుగా తెలుస్తూనే ఉంది. కొద్దిసేపటి తరువాత ఉన్నట్లుండి కుక్క మొరగడం ప్రారంభించింది. అది ఎందుకు మొరుగుతోందో ముందు అర్థం కాలేదు. అప్పుడే ఆకాశంలో మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగులో... గుడిపైకి ఒక నల్లత్రాచు వచ్చి పడగ విప్పి వుండడం రామచంద్ర కంటపడింది. గుండె గుభేలుమంది. ఆ త్రాచు కాటువేసేందుకు సన్నద్ధంగా ఉంది. రామచంద్రకి కిందికి దూకి తప్పించుకుపోయే అవకాశం లేదు.
కుక్క కూడా అక్కడే ఉండి నిస్సహాయంగా చూస్తోంది. పామును నేర్పుగా పట్టుకుని విసిరేయగలిగితే బాగానే ఉంటుంది కానీ, ధైర్యం చాలలేదు. కొద్దిగా వెనక్కి జరిగాడు. వీపుకి భైరవశిల్పం తగిలింది. దాని చేతికి త్రిశూలం ఉందనే సంగతి స్ఫురణకు వచ్చింది. చేతులు రెండూ వెనక్కి పెట్టి ఆ త్రిశూలాన్ని ఊడబెరికాడు. త్రాచుపామును త్రిశూలంతో ఎత్తిపట్టి, దూరంగా విసిరేశాడు. అదికాస్తా నీళ్లలో పడి, ఎటో కొట్టుకుపోయింది. ఆ తరువాత కొద్దిసేపటికే తెల్లవారింది. కానీ గుడిమీద నుంచి కిందికి దిగే అవకాశం మాత్రం లేదు. నేలమట్టానికి నాలుగడుగుల ఎత్తులో ఉన్న ఆ ఆలయానికి దాదాపు సమానంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్లలో కిందికి దిగితే తాను బయటపడగలనో లేదో తెలియని పరిస్థితి. ఎందుకైనా మంచిదని మరో భైరవశిల్పం చేతిలోని శూలాన్ని ఊడబెరికి పట్టుకున్నాడు.
రాత్రి నుంచి తనతోపాటు ఉన్న కుక్క తప్ప మరో తోడు లేదు.
ఇప్పట్లో ఎవరైనా వచ్చే అవకాశమూ కనిపించడం లేదు. ఆ కుక్కకి పాపం ఆకలి వేస్తున్నట్టుంది. కానీ చేసేదిలేక దిక్కులు చూస్తూ కూచుండిపోయింది. ఆ పూట సూర్యుడు ఉదయించలేదు. మధ్యాహ్నం కావస్తుండగా వర్షం తగ్గుముఖం పట్టింది. రామచంద్రకు తాను కూచున్న ప్రదేశం నుంచి కిందికి దిగడానికి ధైర్యం చాలలేదు. అంతలోతు నీళ్లలో దిగి నడవడం కానీ, ఈదుకుంటూ వెళ్లడం కానీ మహాప్రమాదంగా తోచింది.ఇంతలో, ‘‘ఒహోయ్ పెద్దమడిసీ! మెల్లిగా దిగిరా’’ అని అల్లంత దూరంలో ఎత్తయిన గట్టుమీద నుంచి ఎవరిదో తోట రైతు అరుస్తున్నాడు.‘నువ్వే దగ్గరకు రా!’ అన్నట్లు సైగ చేశాడు రామచంద్ర. రైతు నవ్వుకుంటూ, ‘‘బయపడమాకు. అవకాడ సెరువుకి గండి కొడతన్నాం. ఓ గంటలో నీళ్లన్నీ తీసేస్తాయి. ఆనక వద్దువు గానిలే’’ అని చెప్పి వెళ్లిపోయాడు.రైతు చెప్పింది నిజమయ్యేందుకు సుమారుగా రెండుగంటల సమయం పట్టింది. సాయంత్రం నాలుగు కావస్తుండగా తోటలో నీళ్లు తగ్గి, బురదనేల బయటపడింది. రామచంద్రతో పాటు పక్కనే ఉన్న కుక్క కూడా నేలకు దిగింది.
గబగబా అడుగులు వేస్తూ గట్టుమీదికి వెళ్లిపోయింది. రామచంద్ర భయంభయంగా అడుగులు వేస్తున్నాడు. చీలమండల వరకు బురద నిలిచి ఉంది కానీ, మరేమీ ప్రమాదం లేదు. ఒక్కోచోట కాలు దిగబడి పిక్కల వరకు బురద వస్తోంది. నిన్నరాత్రి నుంచి తన చేతిలోని శూలాన్ని అలాగే ఉంచుకున్నాడు. ఆ శూలాన్ని నేలలో గుచ్చుతూ, ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తరువాతే అడుగు వేస్తున్నాడు. పాతిక అడుగులు వేసేసరికి ఒకచోట శూలం బొరియలో దిగబడినట్లుగా లోపలికి పోయింది. కొద్దిగా పక్కకు జరిగి అదే చోట మళ్లీ నేలలో బలంగా గుచ్చాడు రామచంద్ర. సందేహం లేదు... అక్కడ రాళ్లున్నాయి. అందుకే శూలం కంగున మోగుతోంది.‘‘జాగర్తయ్యోవ్’’ అన్నాడు గట్టుమీదనుంచి రైతు. రామచంద్ర అదేమీ పట్టించుకునే స్థితిలో లేడు. శూలంతో చుట్టూ గీస్తూ ఏదో పరీక్షిస్తున్నాడు. చివరకు అతడు తాను గతరాత్రి ఊహించినది నిజమే అయినందుకు సంబరపడ్డాడు.
ఈ ఆలయం కిందనే పూర్వం అతిపెద్ద ఆలయమేదో ఉండేది. అది శిథిలం కాగా, ఎవరో దానిపై చిన్న ఆలయాన్ని నిర్మింప చేశారు అనే నిర్ధారణకు వచ్చాడు. ఆ లోపలి ఆలయం ఇప్పుడు ఉండి ఉంటే ఎలా ఉండేదన్న ఊహతో రాత్రి తాను గీసిన నమూనా కాయితాలన్నీ వానలో నానిపోయి, ఎందుకూ పనికిరాకుండా పోవడంతో రామచంద్రకు మనసులో కష్టం వేసింది. కానీ ఇప్పుడు స్థిమిత పడ్డాడు. గట్టుకు వస్తూనే, ‘‘చూడు బాబూ! ఈ ప్రాంతంలో ఇదివరకు ఏదైనా పెద్దగుడి ఉండేదా?’’ అడిగాడు రైతుని రామచంద్ర.‘‘అదేమో తెలవదు. నాకు ఊహ తెలిసినప్పటినుంచి అదే గుడి’’ చెప్పాడు రైతు.‘‘కాదు. నాకు అర్థమైనంత వరకు ఇక్కడ ఓ పెద్ద గుడి ఉండేది. ఉండేది ఏమిటి ఉంది. నేను చూశాను. నువ్వొప్పుకుంటే నేను దాన్ని వెలికి తీస్తాను’’ ఉత్సాహంగా చెప్పాడు రామచంద్ర.
‘‘సూడయ్యా! మమ్మల్నిలా బతకనియ్యి. ఈ తోటంతా మాదే అయినా ఆ గుడి వున్నంతమేరా సెట్టు పెట్టకుండా వదిలేసి మా పొట్ట మేం పోషించుకుంటున్నాం. ఇప్పుడు గుడీ అదీ అంటూ అల్లరి మొదలెట్టావంటే... గవర్నమెంటోళ్లతో, బత్తులతో నానా తలనొప్పులూ పడాల్సొస్తుంది. ఆనక మా తోట ఏటవుద్దో నువ్వు గేరంటీ సెప్పగలవా?! అంచేత సూసిందంతా మర్సిపో. దీనికింద పెద్దగుడి వుందని నాకూ తెలుసు. కానీ చెప్పాను కదా, ఇక్కడ పలుగు పడితే భైరవసామి ఊరుకోడు. కుక్కలొచ్చి కండలు పీకేస్తాయి. ఇగ తొవ్వడం మొదలెడితే ఇంకేం వత్తాయో సెప్పలేం. వచ్చిన పని పూర్తయింది కాబట్టి, జాయిగా ఇల్లు జేరుకో’’ అని చెప్పేసి వెళ్లిపోయాడు రైతు.
రామచంద్ర అక్కడినుంచి మళ్లీ తడికలపూడి గాంగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాడు. స్వామికి నమస్కరించి బయలుదేరాడు. ఆ రాత్రికి రాత్రి నడుచుకుంటూ వెళ్లి తెల్లవారేసరికి శాస్త్రిగారి ఇంటిముందు నిలబడ్డాడు.
‘‘నిన్నంతా ఏమైపోయావు? తుపానులో చిక్కుకుపోయావేమో అని కంగారు పడ్డాను’’ అడిగారు శాస్త్రిగారు అతడిని చూస్తూనే.‘‘నిజమేనండీ. మీ ఆశీస్సులు ఉండబట్టి బతికిపోయాను. లేకపోతే ఈపాటికి చనిపోయే వాడిని’’ అంటూ ముందురోజు రాత్రి తనకు ఎదురైన అనుభవాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు రామచంద్ర.‘‘హమ్మయ్య. గండం గడిచింది. ఇంక నీకేమీ భయం లేదు. నీ వృత్తిలో కూడా పైకొస్తావు. ఇదిగో ఈ ఉత్తరం తీసుకో. హైదరాబాదులో ఉన్న మా స్నేహితుడికి నీ గురించి రాశాను. అక్కడేదో గుడి కడుతున్నారట. నీకేదైనా పని దొరకచ్చు. కానీ రాతి శిల్పాలే చెక్కుతా... సిమెంటు తాపీ పట్టుకోను అంటూ పిచ్చి సిద్ధాంతాలు వల్లెవేయకు. దొరికిన పనిలో దూరిపో. రోజులు బాగుపడితే మనసుకు నచ్చిన పని దొరకచ్చు’’ అని బోధించారు శాస్త్రిగారు.
ఆయనకు మరోసారి నమస్కరించి వచ్చేశాడు రామచంద్ర. ...ఇదంతా నా కథ. ఇందులోని రామచంద్రను నేనే. ఆనాడు శాస్త్రిగారి వద్దనుంచి వచ్చిన తరువాత ఎంతో జీవితాన్ని చవిచూశాను. ఎన్నెన్నో అనుభవాలను పొందాను. నాకొచ్చిన కళను నా పిల్లలకు నేర్పించాను. కానీ వారికి రాతిశిల్పాలతో పనిచేసే అవకాశం రాలేదు. ఇప్పుడు నా మనుమళ్లు రాతిశిల్పాలను కంప్యూటర్ల సాయంతో చెక్కుతున్నారని తెలిసి ఆనందంగా ఉంది. స్థాపత్య కళలో వారు సాధిస్తున్న విజయాలు చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. ముఖ్యంగా మళ్లీ మన ఆలయాలకు పూర్వవైభవం వస్తోంది కదా అని చాలా సంతోషంగా ఉంది.
ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు ప్రాణదానం చేసిన ఆ అష్టభైరవ నిర్మిత ఆలయాన్ని మరిచిపోలేదు నేను. ఇప్పటివరకు ఆ ఆలయాన్ని మూడుసార్లు సందర్శించాను. అక్కడికి వెళ్లిన ప్రతిసారీ ఏవేవో కొత్త అనుభూతులు కలిగేవి. ప్రతిసారీ ఆ రైతును కలిసేవాడిని. పెద్దగుడిని బయటికి తీయడానికి కానీ, తోటను అమ్మడానికి కానీ అతడెప్పుడూ ఒప్పుకోలేదు. ఇప్పుడు నాకు వయసు మీరింది. బహుశా ఈపాటికి ఆ తోట రైతు మనవళ్ల పరమై ఉంటుంది. వాళ్లయినా అక్కడ తవ్వకాలకు ఒప్పుకుంటారని నేను అనుకోవడం లేదు. ఇటీవలే గాంగేశ్వర స్వామి ఆలయానికి పునరుద్ధరణ జరిగిందని తెలిసి సంతోషించాను. ఇక ఆ గుడి కూడా జీర్ణోద్ధరణ పొందితే... అది కూడా నా వంశం వారివల్ల జరిగితే నాకు కావాల్సింది అంతకంటే ఏమీ లేదు.
ఇట్లురామచంద్ర అని రాసివున్న డైరీని మూడోసారి చదివి, మూసి పక్కన పెట్టాడు కిషోర్. తన తాతయ్య ప్రాణం కాపాడిన ఆ మందిరాన్ని ఒక్కసారి చూసి రావాలనిపించింది అతనికి.నేల నాలుగుచెరగులా ఎక్కడ తడిమి చూసినా శిథిలాల కింద చరిత్ర మూలుగుతూ ఉంటుంది. కొన్నింటికి మహర్దశ పడుతుంది. బయటికి వస్తాయి. రాజ్యమేలతాయి. మరికొన్నింటి భవిష్యత్తు కాలాలమీద కానీ తేలదు. ఏ స్వార్థమూ లేకుండా ఒకనాటి జ్ఞాపకాలను తవ్వితీసి మళ్లీ అందరిముందు ఠీవిగా నిలబెట్టాలని తపించేవారు నూటికో కోటికో ఒక్కరుంటారు. కొన్నిసార్లు వాళ్లు తమ ప్రయత్నంలో విజయం సాధిస్తారు కూడా.


