‘‘నువ్వెప్పుడైనా నిలువుటద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకుంటావా?’’ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని పార్కుకి తీసుకువచ్చి, అవీ ఇవీ చెపుతూ వున్నట్టుండి ఇలా వ్యక్తిగతమైన ప్రశ్న వేసిన తులసి కేసి ఆశ్చర్యంగా చూసింది ప్రగతి.‘‘అద్దంలో చూసుకోవడం రోజూ అందరూ చేసే పనే కదా? నా గురించి ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నావ్?’’‘‘నువ్వు ప్రత్యేకం కాబట్టి. నిన్ను చూసుకుని నువ్వే మోహించేటంత, ముట్టుకొంటే డాగు పడేటంత అపురూపమైన అందాన్ని నీకు భగవంతుడిచ్చాడు. సినిమాతారలకు మించిన సహజ సౌందర్యం నీది.
కానీ ఏం లాభం? దాన్ని అడవికాసిన వెన్నెల చేస్తున్నావ్. ఈ వయసులో ఓ బాయ్‌ఫ్రెండు, బాడీగార్డు, ప్రేమ – దోమ ఎఫైరూ –ఎంజాయ్‌మెంటూ, థ్రిల్లూ – గిల్లూ... ఇలాంటివేం లేకుండా జీవితాన్ని చప్పగా గడిపేస్తున్న నిన్ను చూస్తుంటే ఆశ్చర్యమే కాదు – జాలేస్తోంది కూడా...’’‘‘తులసీ, ఇలా క్లాస్ పీకడానికా నన్నిక్కడికి తీసుకొచ్చింది?’’ ప్రగతి అసహనంగా చూసింది.‘‘సారీ, నీ మంచి కోరి చెబుతున్న నన్నర్థం చేసుకో. ‘ఓ ప్రేమ లేఖ – ప్రపోజలూ, అచ్చటా – ముచ్చటా దేనికీ నోచుకోని దరిద్రగొట్టు బతుకుల్ని మాకెందుకిచ్చావు దేవుడా!’ అని ఏడ్చే నాలాంటి అమ్మాయిలు ఎందరున్నారో నీకు తెలియదు.
ఎందుకంటే కొమ్ములు తిరిగిన కుర్ర హీరోలు వెర్రివాళ్ళలా వెంటపడుతున్న అదృష్ట జాతకురాలివి నువ్వు. కానీ దేవుడు నీకు యిచ్చిన వరానికి ఏమాత్రం గర్వపడక ఇంత రిజర్వ్‌డ్‌గా మడిగట్టుకుని ఉండడానికి కారణం తెలుసుకుందామని, ఇలా వసంతంలాంటి వయసును వ్యర్థం చేసుకుంటే, ఆ తర్వాత పోగొట్టుకున్న దానికోసం ఎంత పరితపించినా ప్రయోజనం ఉండదని చెప్పడానికే...’’‘‘చెప్పింది చాలు. నా బుర్ర తినకు.
నేనే పొరపాటూ చేయడం లేదు. నా తీరు, నా దారి చాలా తృప్తికరంగానూ. ప్రశాంతంగానూ వున్నాయి.’’ ‘‘కాదు. నువ్వు ఆత్మవంచన చేసుకుంటూ అబద్ధాలు చెబుతున్నావ్. నీ మనస్సాక్షిగా నిజం చెప్పు. నీకు ఎప్పుడూ శృంగారపరమైన ఊహలూ, కవ్వించే కలలూ రావడం లేదూ? ఒంటరిగా ఉన్నప్పుడు వయస్సు పోరుతో మానసికంగా పులకింతలూ, గిలిగింతలూ కలగడం లేదూ? అబ్బాయిలు నీకేసి అదే పనిగా ఆరాధనాపూర్వకంగా చూస్తూంటే నీకే ‘ఫీలింగ్స్’ కలగడం లేదంటే నేను చస్తే నమ్మను...’’‘‘నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా కొచ్చిన నష్టం లేదు.
అనవసరమైన విషయాలు ప్రస్తావించి నన్ను విసిగించకు’’‘‘పిచ్చి పిల్లా, నేను చెప్పేవన్నీ వయోధర్మాలు, మర్మాలూ! కాని, సర్వసామాన్యమైన పచ్చినిజాల్ని ఒప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావ్. ఈ కాలంలో హైస్కూల్ దశలోనే ఆడపిల్లలు ప్రేమపిచ్చితో రెచ్చిపోతూ మొబైల్స్‌ని వదలడం లేదంటే – ఇంజనీరింగ్ ఫైనల్‌కొచ్చి నువ్వింత బుద్ధిగా వుండడం సాధ్యమా? నువ్వు మరోలా అనుకోకపోతే నిన్నో ప్రశ్న సూటిగా అడుగుతున్నాను – ఇంతవరకు ఏ మగధీరుణ్ని చూసినా నీ మనస్సు చలించలేదా? నా మీద ఒట్టేసి చెప్పు’’లేదన్నట్టు ప్రగతి అడ్డంగా తల ఆడించింది.
‘‘యూ ఆర్ రియల్లీ గ్రేట్. అయితే నువ్వెంతగా పట్టించుకోకపోయినా నీ లాంటి అందాలరాశికి నిన్ను వెంటాడే మృగాళ్ల వల్ల ముప్పు రావచ్చు. మనం తరచుగా వార్తల్లో చూస్తున్నాం కదా! ప్రేమను అంగీకరించని నేరానికి ఎంతమంది అమాయక యువతులు యాసిడ్ దాడులకు, కత్తిపోట్లకు, అఘాయిత్యాలకు బలి అవుతున్నారో! అందుచేత నీలాంటి బుద్ధిమంతురాలికి భద్రత అవసరం. ప్రేమరొంపిలో దిగమనను కాని, నువ్వంటే పడిచచ్చే బకరాల్లో ఒకణ్ణి ఎంచుకొని ఊరిస్తుంటే చాలు నీ రక్షణ సంగతి వాడు చూసుకుంటాడు...’’‘‘తులసీ, నాకిలాంటి చెత్త సలహాలివ్వకు ఏకపక్షంగా నా జోలికి ఎవరొచ్చినా. ఆ పోకిరీగాళ్లకు బుద్ధి చెప్పగలననే ధైర్యం నాకుంది...’’ ప్రగతి మాటల్లో ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతోంది.
‘‘సెభాష్. నువ్వు నాకు నచ్చావ్. అలాగే మా అన్నకూ తెగ నచ్చేశావ్..’’‘‘మీ అన్నెవడు? అతగాడికి నాకూ ఏం సంబంధం?’’ ప్రగతి ప్రశ్నల్లో కరకుదనానికి తులసి తుళ్లిపడింది.‘‘కోప్పడకుండా పూర్తిగా విను. మా అన్నంటే నా కజిన్. పేరు భూపతి. నా కోసం కాలేజీకి వచ్చినప్పుడెప్పుడైనా చూసుంటావ్. అచ్చం సినిమా హీరోలా వుంటాడు. ఆపైన కోటీశ్వరుడు. ఈ నెక్లెస్ మొన్న రాఖీ కట్టిన సందర్భంగా వాడిచ్చిందే...’’‘‘అయితే ఏమిటి? సూటిగా చెప్పు’’ ప్రగతి మొహం ఎర్రబడ్డం తులసి గమనించింది.‘‘కూల్ డౌన్ ప్రగతీ. ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడైన మా అన్న మీద పడుతున్న వాళ్లందరినీ కాదని నువ్వంటే ఇష్టపడుతున్నాడు.
వాడెంత మర్యాదస్తుడంటే – నీ ఎదుటపడి ‘ఐ లవ్ యు’ అని చెప్పలేక నిన్ను పరిచయం చేస్తే చాలని నన్ను చంపుకొని తింటున్నాడు...’’‘‘అర్థమైంది. ఇదన్నమాట అసలు సంగతి. ఈ విషయం చెప్పడానికా ఇంత ‘బిల్డప్’ ఇచ్చావ్? మీ అన్నకు నిర్మొహమాటంగా చెప్పు. నా మీద ఎలాంటి పిచ్చి భ్రమలూ పెట్టుకోవద్దని!, అతను అపర కుబేరుడైనా, నలకూబరుడైనా నా మనసు చలించదనీ, ప్రేమ నాకు ఆమడ దూరమనీ! పాపం మీ అన్నకు దూతికగా నువ్వు చాలా శ్రమపడ్డావు చాలు. ఇక పద క్లాసుకు టైమవుతోంది...’’ అంటూ విసుగ్గా విసురుగా పైకి లేచింది ప్రగతి. ఆమె నిగ్రహానికి, మనోబలానికి విస్తుపోయిన తులసి ఇంకేం చెప్పినా వినదని మౌనంగా ప్రగతి వెంట కాలేజ్ వైపు నడిచింది...
ఎంత నచ్చజెప్పినా, బతిమాలినా కనీసం భూపతి ఎదుటపడ్డానికి కూడా అంగీకరించని ప్రగతి దృఢవైఖరి తులసి అహాన్ని దెబ్బతీసింది. భూపతి మెప్పు కోసం అతణ్ణి ప్రగతిని నీడలా వెంటాడమని, అందుకు తాను సహకరిస్తానని తులసి అతనికి మాటిచ్చి ప్రోత్సహించింది. తులసి కోసమనే వంకతో తరచుగా కాలేజీకి వస్తూ భూపతి ప్రగతి పెడమొహం పెట్టినా పరిచయం చేసుకున్నాడు. ఎన్నోసార్లు తన కారులో ‘లిఫ్ట్’ ఇచ్చే భాగ్యాన్ని ఇమ్మని ప్రాధేయపడ్డాడు, బలవంతపెట్టాడు కూడా. పిక్నిక్‌కనీ, కార్తిక వనసమారాధనకనీ, పుట్టిన రోజనీ... ఇలా వివిధ సందర్భాలకు తులసితో కలిసి ఆహ్వానించినా, అన్నిటినీ ప్రగతి తిరస్కరించింది. ప్రగతి సినిమాకో, షాపింగ్ కో, ఏదైనా సభకో... ఎక్కడికెళ్లినా ఆ సమాచారం ముందుగా తెలుసుకొని అక్కడ ప్రత్యక్షమై అతి మర్యాదలు చెయ్యబోయే భూపతిని ఆమె కటువుగా హెచ్చరించింది.
తులసి పుట్టినరోజు వేడుకకు మాత్రం స్నేహితురాళ్ల బలవంతం మీద వాళ్లతో కలిసి వెళ్లిన ప్రగతికి అక్కడ కూడా భూపతి పీడ తప్పలేదు. ప్రగతికి అతి ప్రాధాన్యమిచ్చి, పాడడం రాదన్నా పాటలు పాడమని వేధించి, వద్దంటుంటే చనువుగా కేకు తినిపించి, ఆమెకు ప్రత్యేకంగా వీడియో ఏర్పాటు చేసి, అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్న భూపతి హింసను భరించలేక – తలనొప్పి సాకుతో మధ్యలోనే ప్రగతి అక్కణ్ణుంచి వెళ్లిపోయింది. కారులో డ్రాప్ చేస్తానని భూపతి వెంటబడితే ఆమె అందరిముందు చీదరించుకోవడంతో ఆ పురుష పుంగవుడికి తల కొట్టేసినట్టయింది. ఆ సంఘటనతో అతను తోక తొక్కిన త్రాచులా రెచ్చిపోయాడు. కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఆమెను ఫ్రెండ్స్ ముందు అసభ్య పదజాలంతో వేధించడమే గాక ఆమె శీలం మీద బురద చల్లే పుకార్లతో పెద్ద ఎత్తున ప్రచారం చేయించాడు.
భూపతి ఆవూళ్లో రెండు థియేటర్లు, జిల్లా అంతటా పెట్రోలు బంకులూ, మద్యం దుకాణాలూ వగైరావున్న సంపన్నవ్యాపారి శ్రీపతి ఏకైక పుత్రరత్నమనీ, పోలీసులను కూడా శాసించే యువ రాజకీయవేత్తనీ, అతనికి లేని వ్యసనం లేదనీ తెలిసిన ప్రగతి అతని వల్ల ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడి, అతని సంగతి తనను పెంచి పెద్దచేసిన అమ్మమ్మ అనసూయమ్మ చెవిన వేసింది. ఆవిడ కంగారుపడి ఎప్పటి నుంచో అనుకుంటున్న దగ్గర సంబంధం – సాఫ్ట్ వేర్ ఇంజినీరు, అన్ని విధాలా యోగ్యుడు అయిన వివేక్‌తో పెళ్లి నిశ్చయించి, ముహూర్తం కూడా పెట్టించింది.తులసి ద్వారా ప్రగతి పెళ్లి వార్త తెలిసిన భూపతి తనకు దక్కని ప్రగతిని ఎవరికీ దక్కనివ్వనన్నాడు.
దారికాసి ప్రగతిని అటకాయించి మంచిగా తనతో పెళ్లికి అంగీకరిస్తే కళ్లలో పెట్టుకొని చూసుకుంటానని ప్రాధేయపడ్డాడు. ఆమె ‘ఛీ’ కొట్టి తిరస్కరించడంతో ఇరవై నాలుగు గంటలలోగా ఆమె వివేక్‌తో పెళ్లి రద్దు చేసుకొని తనకు ఓకే చెప్పకపోతే ఆమె అంతు చూస్తానని బెదిరించాడు. అతని బెదిరింపులను లెక్కచెయ్యకుండా గడువులోగా ఎటువంటి సమాధానమూ చెప్పని ప్రగతి ముందు అతను ప్రత్యక్షమై కొన్ని ఫోటోలు ఆమె చేతికిచ్చి, ఆ కాపీలు వివేక్‌కి పంపిస్తానని బ్లాక్ మెయిలింగ్ ఆయుధాన్ని ప్రయోగించాడు. అవి మార్ఫింగ్ చేసిన కొన్ని ప్రగతి అర్ధనగ్న చిత్రాలు, మరికొన్ని ఆమె భూపతి కౌగిలిలో ఉన్నవీ! ఆ ఫోటోలు చూసిన ప్రగతి అగ్నిహోత్రమైంది. ఆమె మనోనేత్రాల ముందు అలాంటి బెదింపులకు బలయిన తల్లి ప్రతిమ దీనగాథ కదలాడింది...
ప్రతిమ గోదావరి జిల్లాకు చెందిన సంప్రదాయ కుటుంబం నుంచి పీజీ చెయ్యడానికి వాల్తేరు వెళ్లింది. ఆమె పేరుకు తగ్గ బంగారు బొమ్మ. ఇంట్లో వాళ్లకిచ్చిన హామీకి తలవొగ్గి ఎవరితోనూ ఎటువంటి పరిచయాలు పెంచుకోని ప్రతిమ మంచిగాయని అనే విషయం లేడీస్ హాస్టల్ అంతటికీ తెలిసింది. ఫ్రెండ్స్ బలవంతం మీద యూనివర్సిటీ సాంస్కృతిక కార్యక్రమాల్లో రెండు మూడుసార్లు పాల్గొన్న ఆమె సమ్మోహన గానం ఆమెను అభినందించడానికి వచ్చిన మోహన్‌ని పరిచయం చేసింది.
అతను ఇంజినీరింగ్ విద్యార్థి. పాటలు రాయడమే కాకుండా మధురంగా స్వరకల్పన చేయగల సంగీతజ్ఞుడుగా అప్పటికే అతనికి కేంపస్‌లో మంచిపేరుంది. క్రమంగా అతని పాటల్ని ఆమె పాడ్డం, పరస్పర ప్రశంసలు – వాళ్ల ప్రేమకు దారి తీశాయి. వలపు చిగురించి, ప్రేమలేఖలు పుష్పించి, వాళ్ల అనుబంధం మధుమాసమై పరిమళించింది. ఇటు భీమిలి బీచ్ నుంచి అటు సింహాచలం వరకు ఎందరో ప్రేమికుల్ని చూసిన సంకేత స్థలాలన్నీ వాళ్ల ప్రణయానికి విహారవేదికలయ్యాయి. ‘మరో చరిత్ర’లో బాలు–స్వప్నల్లా రాళ్ల మీద కాకపోయినా ఆ ప్రేమ జంట ఇసుకలో తమ పేర్లను ఎన్నోసార్లు రాసుకొన్నారు...
ప్రతిమ మోహన్‌ల ప్రేమాయణానికి అసూయపడిన ప్రతిమ రూమ్మేట్ రజని ఆ సంగతిని ప్రతిమ తల్లిదండ్రులకు తెలియపరచింది. అప్పటికే గాలివార్తను విన్నా, ప్రతిమ మీద నమ్మకంతో దానిని పట్టించుకోని వాళ్లు రజని ఇచ్చిన సమాచారంతో ఆ పొగ వెనక నిప్పు వుందని నిర్ధారించుకొని ఆగమేఘాల మీద వాల్తేరు వెళ్లి, ఉన్నపళంగా ప్రతిమను ఇంటికి లాక్కెళ్లారు. ఆ తర్వాత ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా కూతురు గోడు వినకుండా ఆమెను ప్రభాకర్ అనే ఇంజినీరుకిచ్చి ఆ మూడు ముళ్లూ వేయించి, ఊపిరి పీల్చుకున్నారు. క్రమంగా ప్రభాకర్ సాహచర్యంలో సంసార పర్వంలో ఏ లోటు లేని ప్రతిమ గతాన్ని, మోహన్‌ని పూర్తిగా మర్చిపోయింది. ఓ ఆడపిల్లకు తల్లయింది.
నాలుగేళ్లు ఆనందంగా గడిచిన తర్వాత అనూహ్యంగా ఆ ఇంటిలో మోహన్ ప్రత్యక్షమయ్యాడు. ప్రభాకర్ పనిచేస్తున్న ఆఫీసుకు కొత్తగా వచ్చిన అతణ్ని ఆయన లంచ్‌కి పిలిచాడట! తనెవరో ఎరగనట్టున్న ప్రతిమను చూసి మోహన్ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ప్రభాకర్ లేని సమయంలో వచ్చి గతాన్ని గుర్తుచేశాడు. ప్రతిమకేమైందో తెలియక ఆమె కోసం ఎదురు చూసి చూసి చివరకు కల్లబొల్లి కబుర్లతో తనకు చేరబడిన రజనినే పెళ్లిచేసుకున్నాననీ, కాని ఆమె నరకాన్ని చూపిస్తోందనీ ఆమెకు విడాకులిచ్చి తిరిగి ప్రతిమను చేసుకుంటాననీ ప్రపోజ్ చేశాడు.
చేజారిన పెన్నిధి అదృష్టం కొద్దీ తిరిగి ఇలా కంటపడిందనీ, తను చెయ్యని తప్పును అర్ధం చేసుకొని తమ ప్రేమకు ప్రాణం పొయ్యమనీ అర్థించాడు. అతని రాకకూ కోరికకూ అప్రతిభురాలైన ప్రతిమ అతనికి చేతులెత్తి దణ్ణంపెట్టి పచ్చని తమ సంసారంలో చిచ్చు పెట్టవద్దనీ, తనను మరచిపొమ్మనీ వేడుకొంది. కాని అతను పట్టువిడిచి పెట్టకుండా ఆమె తనతో రావడానికి అంగీకరించకపోతే తను భద్రంగా దాచివుంచిన ఆమె ప్రేమలేఖల్ని ప్రభాకర్‌కి చూపిస్తానని బెదిరించాడు. మోహన్‌తో ఎప్పుడూ హద్దు మీరకపోయినా అతని బ్లాక్ మెయిలింగ్‌కి భయపడిపోయిన ప్రతిమ పసిగుడ్డును తల్లి చేతుల్లో పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది!
తనకు యుక్తవయసు వచ్చిన తర్వాత తల్లి మరణ రహస్యాన్ని చెప్పిన అమ్మమ్మ ఆ అనుభవం నేర్పిన పాఠంతో ఎన్నడూ ప్రేమవ్యవహారంలో చిక్కుకోనని తన చేత ఒట్టేయించుకొంది. నాన్న స్పందన తెలుసుకోకుండానే ‘అమ్మ అనవసరంగా ఉద్రేకపడింది. అప్పటి కథ పునరావృతం కాకూడదు. నేను అమ్మలా చేయని తప్పుకు బేలనై బెదిరిపోక, ఈ తరం స్త్రీ అబల కాదనీ చీకటిని చీల్చుకొని వచ్చే పొడుస్తున్న పొద్దు లాంటిదనీ నిరూపిస్తాను. భూపతి ఆట కట్టిస్తాను..’ అని దృఢమైన నిర్ణయాన్ని తీసుకొని ధైర్యంగా నేరుగా కాబోయే భర్త వివేక్ దగ్గరకు వెళ్లింది.
భూపతి బ్లాక్ మెయిలింగ్ గురించి చెప్పి ఆ ఫోటోలను సిగ్గుపడకుండా అతనికి చూపించింది. నిజానిజాలను తెలసుకొని తన నిజాయితీ పట్ల నమ్మకముంటే మాత్రమే తనను పెళ్లి చేసుకోమని, నిర్ణయాన్ని అతనికే విడిచి పెడుతున్నాననీ నిర్భయంగా చెప్పింది. ప్రగతి సాహసోపేతమైన చర్యకు ఆశ్చర్యపోయిన వివేక్ ఆమెకేసి ప్రశంసాపూర్వకంగా చూస్తూ – ‘‘డార్లింగ్, నీ ధైర్యాన్నిఅభినందిస్తున్నాను. నీలాంటి సాహసి అయిన ప్రేయసి తోడుంటే జీవితంలో నాకు అసాధ్యాలుండవు. నిన్ను నిస్సందేహంగా నా దానిని చేసుకుంటాను. పద, ఈ ఫొటోలు స్టేషన్లో చూపించి ఈ దారుణానికి కారకుడైన భూపతిని నిర్భయ కేసు కింద అరెష్టు చేయిద్దాం...’’ అంటూ ఆమెకు చేయి అందించాడు. ప్రగతి ఆనందంగా అతని చేతినందుకొని ముందుకు నడిచింది...!



