
మట్టిని తీసి..ప్రాణం పోసి..!
మట్టి విగ్రహాల్లో దిట్ట అమలాభట్ట
వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న 100 కుటుంబాలు
వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలు లభ్యం
మనం చేసుకునే పండగలు వెనుక ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకం అవ్వడం. కానీ ఆధునిక పోకడలు పర్యావరణ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాల్లో ఉపయోగిస్తున్న ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్‌తో తయారు చేస్తున్న విగ్రహాలు పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. దీనివలన జీవకోటికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. అందువలన ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే వినియోగించాలనే సంకల్పంతో అమలాభట్ట గ్రామస్తులు మట్టితో విగ్రహాలను తీర్చిదిద్దుతున్నారు. వీటిని ఉపయోగించడం వలన పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇలా మట్టి మేలు తలపెడుతున్న వారిని ఒకసారి పలకరిస్తే... – రాయగడ
ఒడిశా రాయగడ జిల్లా కేంద్రానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో అమలాభట్ట గ్రామం ఉంది. ఈ గ్రామంలోని సుమారు 100 కుటుంబాలు మట్టినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాయి. వీరు ప్రకృతిహితంగా విగ్రహాలను తయారు చేస్తుంటారు. కేవలం మట్టినే ఉపయోగించి అందమైన విగ్రహాలను తయారు చేయడంలో అమలాభట్ట గ్రామానికి ప్రత్యేకత ఉంది. ప్రతీ ఏడాది వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలు వంటి ప్రత్యేక దినాల్లో విగ్రహాల తయారీలో ఇంటిళ్లపాది నిమగ్నమవుతుంటారు. ఈ ఏడాది కూడా వినాయక ఉత్సవాలకు సంబంధించి విగ్రహాల తయారీ ఊపందుకున్నాయి. మూడు నెలల ముందుగానే విగ్రహాలను రూపొందించడంలో నిమగ్నమైన యువతీ, యువకులు రేయింబవళ్లు కష్టించి విగ్రహాలను తయారీ చేస్తున్నారు. మూడు నెలల పాటు కష్టపడి పనిచేస్తే సుమారు రూ.50 వేల వరకు ఆదాయం ఒకొక్కరికీ లభిస్తుందని చెబుతున్నారు. అయితే గత మూడేళ్లుగా తమ వ్యాపారాలు చాలా మందకొడిగా కొనసాగు తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వినాయక విగ్రహాలకు సంబంధించి సహజ రంగులు ధరలు ఆకాశానంటుతుండడంతో పాటు ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్‌తో రూపొందించిన విగ్రహాల విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో మట్టి విగ్రహాలకు గిరాకీ తగ్గుతోందని చెబుతున్నారు.
బాల వినాయకులకు గిరాకీ
ఈ ఏడాది ఆర్డర్లు ఇచ్చేవారు బాల వినాయకుల ప్రతిమలకు అత్యంత ప్రాధాన్యమివ్వడంతో పాటు ఆర్డర్లకు అనుకూలంగా విగ్రహాలను తయారు చేస్తుండడం విశేషం. మువ్వగోపాలుడు, బాల వినాయకుడు వంటి వేషధారణల్లో ఈ ఏడాది వినాయకుల విగ్రహాలు దర్శనం ఇవ్వనున్నాయి. రాయగడ జిల్లాలోని గుణుపూర్, గుడారి, మునిగుడ, పద్మపూర్ వంటి ప్రాంతాలతో పాటు గజపతి జిల్లా నుంచి అదేవిధంగా పొరుగు రాష్ట్రమైన మన్యం జిల్లా పార్వతీపురానికి చెందినవారు కూడా ఈసారి వినాయక విగ్రహాలకు ఆర్డర్లు ఇచ్చారు.
డైలీ మార్కెట్‌లో విగ్రహాలు
చిన్న చిన్న విగ్రహాలను ఈ గ్రామానికి చెందిన యువతులు రూపొందిస్తున్నారు. వాటిని స్వయంగా తయారు చేసి రంగులు అద్ది, పూర్తయిన తర్వాత చవితికి మూడు రోజుల ముందుగానే రాయగడ పట్టణంలోని మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. ప్రతీ ఏడాది మహిళలు వినాయక చవితి సందర్భంగా కష్టపడి విగ్రహాల తయారీతో పాటు వాటిని విక్రయించి కొంతమొత్తం ఆదాయం సంపాదించుకుని కుటుంబ పోషణకు అండగా నిలుస్తుంటారు.
వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతీ ఏడాది చిన్న చిన్న విగ్రహాలను మహిళలమే రూపొందిస్తుంటాం. తయారీ పూర్తయితే రంగులు అద్ది వాటిని మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తుంటాం. రూ.10ల నుంచి రూ.100ల వరకు విగ్రహాలను రూపొందిస్తుంటాం. అయితే కొనుగోలుదారులు మా కష్టానికి తగ్గ ఆలోచించకుండా బేరసారాలు అడుతుంటారు. విక్రయాలు మందకొడిగా ఉంటే ఒకొక్కసారి గిట్టుబాటు ధర లేకపోయినప్పటికీ విక్రయించాల్సి వస్తుంది. ఒకవేళ అలా విక్రయించకపోతే పెట్టుబడి కూడా నష్టపోతాం. – పొందూరు లక్ష్మి, అమలాభట్ట
షెడ్డు నిర్మిస్తే ప్రయోజనం
గ్రామంలో సుమారు వంద కుటుంబాలు మట్టినే నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నాయి. వర్షం వస్తే నానా అవస్థలు పడాల్సి వస్తోంది. చేసిన విగ్రహాలు వర్షాలకు తడిచి పాడవుతున్నాయి. పాలిథిన్ ఖరీదు చేసి వర్షం కురిసే సమయంలో విగ్రహాలను కప్పుకోవాల్సి వస్తోంది. అదే గ్రామంలో అందరి కోసం షెడ్డు ఉంటే అంతా అక్కడే విగ్రహాలు తయారీ చేసుకునే అవకాశం ఉండేది. షెడ్డు లేకపోవడంతో ఎవరి ఇంట్లో వారే విగ్రహాలను తయారు చేసుకోవాల్సిన పరిస్థితి. భారీ వినాయకుల తయారీ కోసం బయట వేరొకరిపై ఆధారపడాల్సి వస్తోంది. – వంజరాపు రాజేష్, అమలాభట్ట
ఇదీ చదవండి: జోరు జోరుగా జోగ్.. క్యూ కడుతున్న టూరిస్టులు
అధికారులు దృష్టి సారించాలి
గత రెండేళ్లుగా వచ్చిన ఆర్డర్ల ప్రకారమే విగ్రహాలను రూపొందిస్తున్నాం. ఆర్డర్లు లేకుండా తయారు చేస్తే అవి విక్రయాలు జరగక నష్టపోవాల్సి వస్తోంది. ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నా, వాటి ఆదరణే అధికమవ్వడంతో మా వ్యాపారాలు §ð దెబ్బతింటున్నాయి. మట్టినే నమ్ముకున్న మా కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయి. జిల్లా యంత్రాంగం వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.- పి.వెంకటరావు, అమలాభట్ట
చదవండి: క్షణం ఆలస్యమైతే అంతే సంగతులు : వైరల్ వీడియో