మే 1న వైశాఖ పూర్ణిమ
వైశాఖ శుద్ధ పూర్ణిమ (వైశాఖ పౌర్ణమి) హిందూ, బౌద్ధ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన రోజు. దీనిని ‘బుద్ధ పూర్ణిమ’ అని, ‘మహా వైశాఖి’ అని కూడా పిలుస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును కూర్మావతారంలో పూజించడం, నదీస్నానం చేయడం, అశ్వత్థ వృక్షాన్ని అంటే రావి చెట్టును ఆరాధించడం వల్ల అక్షయ పుణ్యఫలం లభిస్తుందని, చేతనైనంత దానధర్మాలు చేయడం వల్ల నరఘోష తొలగిపోతుందని శాస్త్రోక్తి.
విశిష్టతలు:
బుద్ధ పూర్ణిమ/జయంతి: సిద్ధార్థుడు జన్మించడం, జ్ఞానోదయం పొందడం, మహా పరినిర్వాణం చెందడం అనే మూడు ముఖ్యమైన ఘట్టాలు ఇదేరోజు జరగడంతో దీనిని ‘త్రివిధ పుణ్యదినం’గా బౌద్ధులు జరుపుకుంటారు.
శ్రీ కూర్మ జయంతి:
శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించిన రోజుగా కూర్మ పురాణం చెబుతోంది.ఈ రోజు కూర్మనారాయణుని ఆరాధించడం సత్ఫలితాలనిస్తుంది.
సముద్ర/నదీ స్నానం:
ఈ రోజున సముద్రంలో లేదా గంగానదిలో స్నానం చేయడం అత్యంత పవిత్రం. కరక్కాయను సముద్రంలో వేసి స్నానం చేస్తే నరదిష్టి, నరఘోష తొలుగుతాయని నమ్మకం.
చదవండి: మంచుకొండల్లో ఓంకార నాదం
రావి చెట్టు పూజ:
వైశాఖ మాసంలో రావిచెట్టుపై విష్ణుమూర్తి కొలువై ఉంటాడని, ఈ పూర్ణిమ రోజు రావి చెట్టును పూజిస్తే శని, బృహస్పతుల అనుగ్రహం కలిగి శుభ ఫలితాలు లభిస్తాయని పెద్దల మాట.
అన్నమాచార్య జయంతి:
సంకీర్తనాచార్యుడు అన్నమాచార్యుల వారు జన్మించిన రోజు కావడంతో దీనికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. దానధర్మాలు: ఈ రోజున చేసే జలదానం, వస్త్రదానం, ఆహార దానం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయని పురాణోక్తి.
– డి.వి.ఆర్.


