
ఘనత
చండీగఢ్‌లోని ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్’కి చెందిన సుఖ్‌పాల్ కౌర్, అహ్మదాబాద్‌లోని ‘హాస్పిటల్ ఫర్ మెంటల్ హెల్త్’కి చెందిన విభా సలాలియా 199 దేశాలలోని లక్ష మంది అభ్యర్థుల నుంచి గ్లోబల్ నర్సింగ్ అవార్డ్ తుది జాబితాకు ఎంపికయ్యారు.
నర్సింగ్ గత సంవత్సరాలలో ఎలా మారిందో, గ్లోబల్ నర్సింగ్ స్టాండర్స్‌తో సమానంగా ఉండడానికి మన దేశంలో ఏం చేయవచ్చో... మొదలైన అంశాలపై వీరికి మంచి అవగాహన ఉంది.
చాలా మార్పులు
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో పుట్టిన సుఖ్‌పాల్ కౌర్‌కు సామాజిక సేవకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను నర్సింగ్‌లో చేరేలా చేసింది. ‘ఇతరులకు సహాయపడాలనే నా తత్వానికి నేను ఎంచుకున్న వృత్తి బాగా సరిపోయింది’ అంటారు కౌర్. ప్రస్తుతం ఆమె ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ ఎడ్యుకేషన్’కి ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడే ఆమె బీఎస్‌సీ, మాస్టర్స్, నర్సింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.
నిజానికి ఆమె ఈ ఇన్‌స్టిట్యూట్‌లో క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్‌గా చేరారు. క్రమంగా లెక్చరర్, అసోసియేట్‌ప్రొఫెసర్ అయ్యారు. ప్రిన్సిపల్ కావడానికి ముందు హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌గా ప్రమోట్ అయ్యారు. ‘నర్సింగ్ విద్యలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మేము క్రిటికల్ కేర్ నర్సింగ్, ఆంకాలజీ నర్సింగ్‌లాంటి ఏడు స్పెషలైజ్‌డ్ బ్రాంచ్‌లను నడుపుతున్నాం’ అంటున్నారు 58 సంవత్సరాల కౌర్.
తలకు గాయాలు అయిన పేషెంట్‌ల కోసం నర్స్‌ల ఆధ్వర్యంలో క్లినిక్స్‌నుప్రారంభించారు కౌర్. మన దేశంలో మొట్టమొదటి ఎంఎస్‌సీ నర్సింగ్‌ప్రోగ్రామ్ ఇన్ ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్‌ను లీడ్ చేస్తున్నారు కౌర్. ‘మేము మొదట్లో మాన్యువల్‌గా చెక్ చేసేవాళ్లం. ఇప్పుడు ముఖ్య లక్షణాలు నేరుగా చూపించే మానిటర్స్ వచ్చాయి. ఇది టైమ్‌ను సేవ్ చేస్తుంది. ఇక చదువుకు సంబంధించి చాక్, బ్లాక్‌బోర్డ్ నుండి మల్టీమీడియా క్లాస్‌రూమ్‌లు, ఇంటరాక్టివ్ బోర్డ్స్, ఫ్లిప్ క్లాస్‌రూమ్‌లకు మారాయి. ఫ్లిప్ క్లాస్‌రూమ్‌లో స్టూడెంట్స్ ముందుగానే ప్రిపేర్ అవుతారు’ అంటున్నారు కౌర్.
బాల్య జ్ఞాపకమే బాట చూపింది...
మెంటల్ హెల్త్ కేర్‌ని మార్చడానికి తన కెరీర్‌ను అంకితం చేశారు యాభై ఆరు సంవత్సరాల విభా సలాలియా. 33 సంవత్సరాల వృత్తి అనుభవాన్ని గుజరాత్‌లోని మెంటల్ హెల్త్ కేర్‌ని మెరుగుపరచడంలో ఉపయోగించారు. మానసిక అనారోగ్యం బారినపడిన వేలాదిమందికి అండగా ఉన్నారు. వారు ఆత్మగౌరవంతో బతికేలా చేశారు.
‘మెంటల్ హెల్త్ కేర్’పై విభా ఆసక్తి చూపడానికి కారణం... బాల్య జ్ఞాపకం.
‘మా ఇంటి బయట ఒక మహిళ చింపిరి జుట్టుతో, శుభ్రత లేకుండా అస్తవ్యస్తంగా కూర్చొని ఉండడం నాకు గుర్తుంది. ఊరివాళ్లు ఆమెను అవమానించి పిచ్చిది అని పిలిచేవాళ్లు. ఆమెకు సహాయం చేయలేని నిస్సహాయత స్థితిలో ఉండి బాధపడేదాన్ని’ తన బాల్య జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారు విభా సలాలియ.
ఈ జ్ఞాపకమే తనను మెంటల్ హెల్త్ నర్సింగ్‌లో స్పెషలైజ్ చేయడానికి కారణం అయింది. నిజానికి విభా రెగ్యులర్ బీఎస్సీలో చేరారు. అయితే తన బంధువు ఒకరు అడ్మిట్ అయిన హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు నర్సింగ్‌ని ప్రొఫెషనల్‌గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
‘మా బంధువును నర్స్‌లు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ దృశ్యాలు చూసిన తరవాత ఎలాగైనా నర్సింగ్ చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాను. బీఎస్సీ కోర్సు వదిలేసి అహ్మదాబాద్‌లోని సివిల్ హాస్పిటల్‌లో నర్సింగ్ లో చేరాను’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు విభా.
నర్సింగ్ విద్యలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మేము క్రిటికల్ కేర్ నర్సింగ్, ఆంకాలజీ నర్సింగ్‌లాంటి ఏడు స్పెషలైజ్‌డ్ బ్రాంచ్‌లను నడుపుతున్నాం.
– కౌర్