పర్వతాల మధ్య ప్రకృతి గీతం.. | Travel Tips: Most Beautiful Natural Sites in the French Alps | Sakshi
Sakshi News home page

పర్వతాల మధ్య ప్రకృతి గీతం..

Mar 30 2026 5:11 PM | Updated on Mar 30 2026 5:40 PM

Travel Tips:  Most Beautiful Natural Sites in the French Alps

పచ్చగా పరుచుకున్న పచ్చిక, మంచుతో కప్పబడిన భారీ పర్వతాలు, వాటి మధ్యలో బొమ్మల్లా కనిపించే చిన్న చిన్న గ్రామాలు ... అన్నీ కలిసి ఒక ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి ఫ్రెంచ్‌ ఆల్ఫ్స్‌ పర్వతాలు. ఎండాకాలం రాగానే చల్లదనంతో రారమ్మని ఆహ్వానిస్తాయి. ఫ్రెంచ్‌ ఆల్ఫ్స్‌ అనే ఈ విశాలమైన పర్వత ప్రాంతం ఫ్రాన్స్‌లోని ప్రకృతి రమణీయతను అత్యంత అందంగా చూపుతుంది. 

ఫ్రెంచ్‌ ఆల్ఫ్స్‌లో ప్రతి దృశ్యం ఒక పెయింటింగ్‌లా ఉంటుంది. సూర్యోదయం వేల బాల భానుని కిరణాలు మంచుపర్వతాల మీదుగా, పచ్చని గడ్డిపై పడి ఒక వింతైన బంగారు కాంతిని మనకు చూపుతుంది. చల్లని, స్వచ్ఛమైన గాలి మదిని తాకి వెళ్తుంటే, స్వర్గంలో ఉన్నామా ... అనే అనుభూతి కలుగుతోంది.

సరస్సుల అందాలు
ఇక్కడి సరస్సులు ఆకాశాన్ని ప్రతిబింబిస్తూ సంధ్యాకాలం కొత్త రంగుల్లో మెరిసి΄ోతాయి. ఈ సమయంలో కెమెరా కన్నా మనసుతో క్లిక్‌మనిపించే దృశ్యాలు ఎన్నో కనువిందుచేస్తాయి. మేఘాలు పర్వతాల మధ్య నెమ్మదిగా తిరుగుతూ, ఒక నిధానమైన ప్రయాణ అనుభూతిని ఇస్తాయి.

సందర్శనీయ స్థలాలు
ఇక్కడి చామోనిక్స్‌లో పర్వత జీవితం సహజంగా కనిపిస్తుంది. మోంట్‌ బ్లాంక్‌ పర్వత శిఖరాలు ఎండాకాలంలో కూడా మంచుతో మెరుస్తుంటాయి. ఆన్నెస్సీలో సరస్సు పక్కన నడక ఒక ప్రశాంత అనుభవాన్ని ఇస్తుంది. లేక్‌ ఆన్నెస్సీ నీరు క్రిస్టల్‌ క్లియర్‌గా ఉండటం ప్రత్యేక ఆకర్షణ. గ్రెనోబెల్‌లో నగర జీవితం, పర్వత జీవితం రెండింటి మేళవింపు కనిపిస్తుంది.

నిశ్శబ్ధ సంగీతం..
ఫ్రెంచ్‌ ఆల్ఫ్స్‌లో జీవితం నెమ్మదిగా సాగుతుంది. చిన్న కేఫ్‌లలో కాఫీ తాగుతూ, గ్రామాల్లో నడుస్తూ సమయం గడపవచ్చు. ఇక్కడ ప్రజలు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తారు.

పర్వతాల మీదుగా ప్రయాణం
హైదరాబాద్‌ నుంచి ముందుగా ప్యారిస్‌ లేదా జెనీవా వరకు విమానంలో చేరుకోవాలి. 

జెనీవా నుంచి ట్రైన్‌ లేదా రోడ్డు మార్గంలో ఫ్రెంచ్‌ ఆల్ఫ్స్‌ కు చేరుకోవచ్చు. 

రైలు ప్రయాణంలో పర్వతాల అందమైన దృశ్యాలు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగులుతాయి.

వుడెన్‌ హౌజ్‌లో బస
చిన్న చాలెట్స్, వుడెన్‌ హౌసెస్‌ లేదా సరస్సు పక్కన ఉన్న స్టేల్లో ఉండటం ద్వారా ప్రకృతికి దగ్గరగా ఉండే అనుభూతి పొందవచ్చు. కిటికీ నుంచి పర్వతాలు, మేఘాలు కనిపించే దృశ్యం ఎంతో ఆహ్లాదకరం.

ఏం చూడాలి?
మంచు పర్వతాలు
పచ్చని పచ్చిక మైదానాల
స్వచ్ఛమైన నీటితో తొణికసలాడే సరస్సులు.
ఆహ్లాదభరితమైన గ్రామ జీవితం 
ఇవి అన్నీ కలిసి సహజ సౌందర్యాన్ని కళ్లకు కడతాయి. 

మరికొన్ని ఆసక్తికరమైనవి: 
మాంట్‌ బ్లాంక్‌ అనే పర్వత శిఖరం ఇక్కడ అత్యంత ఎత్తైనది.

ఇక్కడి చాలా సరస్సులు క్రిస్టల్‌ క్లియర్‌గా ఉంటాయి.

వేసవిలోనూ మంచు శిఖరాలు కనిపిస్తాయి. 

ఆల్పైన్‌ గ్రామాలు ఎన్నో శతాబ్దాలుగా తమ స్వరూపాన్ని అలాగే కాపాడుకున్నాయి.

వాకింగ్, సైక్లింగ్‌కు ఈ ప్రదేశం చాలా ప్రసిద్ధి


ఛీజ్‌తో తయారైన వేడి వేడి వంటకాలు
ఫ్రెంచ్‌ కంట్రీసైడ్‌లో బ్రెడ్, చీజ్‌తో తయారైన వేడి వేడి వంటకాలు ఇక్కడి ప్రత్యేకత. ఫాండ్యూ అనేది ఇక్కడి గ్రామీణుల సంప్రదాయ వంటకం. వైట్‌వైన్, వెల్లుల్లి, ఇతర పదార్థాలను కలిపి తయారుచేసిన ఛీజ్‌లో గట్టిగా కాల్చిన రొట్టెముక్కలను ముంచుకొని, తింటారు. 

బంగాళదుంప, ఉల్లిపాయలు, వైట్‌వైన్‌.. మొదలైన వాటితో తయారుచేసిన టార్టిఫ్లెట్‌ అనేది అక్కడి బలవర్ధకమైన ఒక వంటకం. ఇక్కడి వంటకాలలో సాస్‌లు ముఖ్యమైనవి. బ్లూబెర్రీ టార్టె అనేది ఇక్కడి పర్వత ప్రాతాలలోనివారికి ఇష్టమైన డిజెర్ట్‌. సంప్రదాయ మూలికలతో చేసే స్థానిక పానీయాలను తప్పక సేవించాల్సిందే.  

ఎండకాలమే సరైనది...
ఎండాకాలంలో ఫ్రెంచ్‌ ఆల్ఫ్స్‌ ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉండి, ప్రకృతి ఫ్రెష్‌ ఫీలింగ్‌ను అందిస్తుంది. ప్రతి దృశ్యం కొత్తగా అనిపిస్తుంది.

ఫ్రెంచ్‌ ఆల్ఫ్స్‌ అంటే ఒక ప్రయాణం మాత్రమే కాదు ఒక ప్రశాంతమైన జీవన విధానం. ఇక్కడ ప్రతి క్షణం మనసుకు విశ్రాంతి ఇస్తుంది. ఎండాకాలంలో కూడా ఒక చల్లని జ్ఞాపకంగా ఈ ప్రదేశం మనసులో నిలిచిపోతుంది.

– ఎం.జి.కిశోర్,
ప్రయాణికుడు.కామ్‌

(చదవండి: నేచర్‌ లవర్స్‌కు డ్రీమ్‌ డెస్టినేషన్‌)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement