డబుల్‌ కా మీఠా టూర్‌.. చార్‌ ధామ్‌ యాత్ర | Travel Chardham Yatra 2025 - Check full deets inside | Sakshi
Sakshi News home page

Chardham Yatra : డబుల్‌ కా మీఠా టూర్‌.. చార్‌ ధామ్‌ యాత్ర

Aug 11 2025 12:27 PM | Updated on Aug 11 2025 12:40 PM

Travel Chardham Yatra 2025 - Check full deets inside

ప్రకృతి యాత్ర

గంగోత్రి... గంగానది పుట్టిన ప్రదేశం.కేదార్‌నాథ్‌ మంచుకొండల్లోని జ్యోతిర్లింగం.బదరీనాథ్‌ హిమాలయాల్లో విష్ణు మందిరం.ఇది.. ప్రాశస్త్యం కలిగిన చార్‌ధామ్‌ యాత్ర.వీటితోపాటు...రాముడు తపస్సు చేసిన దేవప్రయాగ.శివుడు ప్రేమను వ్యక్తం చేసిన గుప్తకాశీ. పాండురాజు నివసించిన పాండుకేశ్వర్‌.శివ గౌరి పెళ్లి వేదిక త్రియుగినారాయణ్‌. అందుకే ఇది డబుల్‌ కా మీఠా టూర్‌.

చెన్నై నుంచి ఘజియాబాద్‌కు ప్రయాణం. ఘజియాబాద్‌లో విమానం దిగిన తరవాత రోడ్డు మార్గాన హరిద్వార్‌కు ప్రయాణం. హరిద్వార్‌లో హోటల్‌ గదిలో చెక్‌ ఇన్‌ కావడం, విశ్రాంతి. రాత్రి బస.  ప్యాకేజ్‌ ప్లాన్‌లో గంగా హారతి పన్నెండవ రోజు ఉంది. కానీ ఆసక్తి ఉన్న వాళ్లు స్వయంగా ఈ రోజు కూడా వెళ్లవచ్చు.

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత గది చెక్‌ అవుట్‌ చేసి హరిద్వార్‌ నుంచి బార్కోట్‌కు ప్రయాణం. బార్‌కోట్‌లో గదిలో చెక్‌ ఇన్‌. రాత్రి బస అక్కడే.

ఆకుపచ్చ హిమాలయాల వీక్షణం
హరిద్వార్‌ నుంచి బార్కోట్‌కు రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది. మన మైదాన  ప్రాంతంలో సాగినట్లు ప్రయాణం వేగంగా సాగదు. ఆరు గంటలు పడుతుంది. హరిద్వార్‌ నుంచి యమునోత్రికి వెళ్లే దారిలో యమునానది తీరాన ఉన్న చిన్న పట్టణం బార్కోట్‌. నాలుగువేల అడుగుల ఎత్తులో ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లో, హిమాలయాల పర్వత శ్రేణుల్లో విస్తరించిన గ్రామాల్లో అక్షరాస్యత తక్కువ. కానీ బార్‌కోట్‌లో 75శాతం అక్షరాస్యులే. జాతీయ సరాసరి అక్షరాస్యతకంటే దాదాపు పదిశాతం ఎక్కువ. ఇక్కడ పర్యాటకం మంచి జీవనోపాధి కావడంతో చదువుకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇక్కడ హిమాలయాల మీద మంచు కనిపించదు. పశ్చిమ కనుమల్లాగా చిక్కటి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇక్కడ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ రాత్రి బస చేయడం మరిచిపోలేని అనుభూతి.

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత బార్‌కోట్‌ నుంచి హనుమాన్‌ చట్టికి, ఆ తర్వాత యమునోత్రికి ప్రయాణం. దర్శనం తర్వాత తిరిగి బార్‌కోట్‌కి తిరుగు ప్రయాణం. రాత్రి బస బార్‌కోట్‌లోనే.

యమున పుట్టిల్లు!
బార్కోట్‌ నుంచి యమునోత్రికి వెళ్లే దారిలో హనుమాన్‌ చట్టి దాటిన తరవాత 13 కిలోమీటర్ల దూరంలో కాళింది పర్వతం మీద ఉంది యమునోత్రి. ఇది హిమనీనదం. మంచు కరుగుతూ ప్రవాహరూపం సంతరించుకుంటున్న పరిస్థితి. పర్వతాల మధ్య నిశ్శబ్దం తప్ప మరేమీ లేనంత ప్రశాంతత నెలకొని ఉంటుంది. పర్యాటకుల రణగొణ ధ్వనులు తప్ప సాధారణ శబ్దాలేవీ వినిపించవు. యమునా నది పుట్టిన ప్రదేశంలో ఓ ఆలయం. ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించే పూజారి కుటుంబంతో΄ాటు మరికొన్ని కుటుంబాలు తప్ప ఇది పెద్ద జనావాసం కాదు. ఈ ప్రదేశానికి చేరాలంటే కాలి నడక లేదా గుర్రాల మీద మాత్రమే. స్థానికులు జమ్‌నోత్రి అంటారు. వారితో మాట్లాడేటప్పుడు జమునోత్రి అనడమే సులువుగా ఉంటుంది. యమునోత్రి ఆలయాన్ని గర్వాల్‌ రాజు మహారాజా ప్రతాప్‌ షా నిర్మించాడు. కొంతకాలానికి భూకంపం వచ్చినప్పుడు అది కూలి ΄ోవడంతో ఇప్పుడు మనకు కనిపించే ఆలయాన్ని జైపూర్‌ మహారాణి 19వ శతాబ్దంలో నిర్మించారు. యమునోత్రికి ఏడు కిలోమీటర్ల దూరాన జానకి చట్టిలో సూర్యకుండ్‌ హాట్‌ వాటర్‌ స్ప్రింగ్‌ ఉంది. ఈ ఉష్ణనీటి గుండంలో స్నానం చేయవచ్చు.

బార్‌కోట్‌ నుంచి ఉత్తరకాశీకి ప్రయాణం. హోటల్‌ గదిలో చెక్‌ ఇన్‌. సాయంత్రం విశ్రాంతి. రాత్రి బస కూడా అక్కడే.

ఇది ఉత్తరాఖండ్‌ కాశీ
ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ట్రెకింగ్‌కి ఉత్తరకాశీ చక్కటి ప్రదేశం. పర్వతాల మీద వాలే మంచు దూదిపింజల్లా తేలుతూ ఉంటే పర్వతాల నడుమ కనుమల్లో పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ సాగే నడక, క్యాంపింగ్‌ ఒక జీవితకాలపు మధురానుభూతినిస్తాయి. ఈ టూర్‌  ప్లాన్‌లో ట్రెకింగ్‌ లేదు. కానీ ఈ టూర్‌లో యువత ఉంటే నాలుగవ రోజు విశ్రాంతి సమయం లేదా ఐదవరోజు ఖాళీ సమయాల్లో సొంతంగా క్యాంపింగ్‌ ΄్లాన్‌ చేసుకోవచ్చు. ఇక్కడ విశ్వనాథుడి పేరుతో ఉన్న శివాలయం ప్రసిద్ధి. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, వారణాసి (కాశీ) లోని విశ్వనాథుడి దర్శనానికి వెళ్లలేని వాళ్ల కోసం శివుడు ఇక్కడ అదే పేరుతో వెలిశాడని చెబుతారు. కాశీలో ఉన్నట్లే ఇక్కడ కూడా హనుమంతుడు, దుర్గ, పరశురామ, దత్తాత్రేయ, భైరవ్, అన్నపూర్ణ ఆలయాలున్నాయి.

బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి ప్రయాణం. దర్శనం తర్వాత తిరిగి ఉత్తరకాశీకి ప్రయాణం. రాత్రి బస ఉత్తరకాశీలో.

గంగ పుట్టిల్లు!
ఉత్తరకాశీ పట్టణానికి వంద కిలోమీటర్ల దూరాన ఉంది గంగోత్రి. పదివేల అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ మనం చూసే ప్రదేశం గంగోత్రి గ్లేసియర్‌ (హిమానీనదం). మంచు రూపంలో ఉన్న నది. మంచు కరుగుతూ క్రమంగా ప్రవాహ రూపం సంతరించుకుంటుంది. ఇక్కడ గంగోత్రి నుంచి జాలువారిన ప్రవాహాన్ని భాగీరథి నదిగా పిలుస్తారు. ఈ నది దేవ ప్రయాగలో అలకనంద నదిలో సంగమించిన తర్వాత ఆ సంగమ ప్రవాహాన్ని గంగ అని పిలుస్తారు. భగీరథుడి ప్రయత్నం వల్ల శివుడి తల మీద నుంచి గంగ నేలకు వచ్చిన ప్రదేశంగా భావిస్తూ భాగీరథి పేరుతో పిలుస్తారు. నీటిని దైవంగా భావించే సంస్కృతిలో భాగంగా గంగోత్రిలో ఆలయం ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన ఓ సంగతి ఉంది. ఇక్కడ నివసించే ప్రజల్లో అక్షరాస్యత శాతం 99. ఆశ్చర్యపోయే ముందు ఇక్కడ జనాభా సంఖ్యను తెలుసుకుందాం. ఇక్కడ నివసించే కుటుంబాల సఖ్య యాభై లోపే. జనాభా నూట పది మంది మాత్రమే.

తెల్లవారు జామున గుప్త కాశీకి ప్రయాణం. హోటల్‌ గదిలో చెక్‌ ఇన్‌. రాత్రి బస

శివుడు ప్రేమ క్షేత్రం
గుప్తకాశీ కూడా ఉత్తరకాశీలాగానే హిమాలయ పర్వతాల్లో ఉన్న శైవక్షేత్రం. ఉత్తరప్రదేశ్‌లో గంగా నది తీరాన ఉన్న  కాశి (వారణాసి)కి మరొక ప్రతిరూపం గుప్తకాశి. ఇక్కడ విశ్వనాథ ఆలయంతోపాటు అర్ధనారీశ్వర ఆలయం కూడా ఉంది. ఈ ప్రదేశాన్ని కేదార్‌ ఖండ్‌ అంటారు. ఇక్కడ మణికర్ణిక కుండ్‌ అనే సరస్సు ఉంది. దీనిని గంగ, యమున నదులకు ప్రతీకగా చెబుతారు. ఇందులో మునిగితే ఈ రెండు నదుల్లో స్నానమాచరించిన ఫలితం ఉంటుందని భక్తుల అభిప్రాయం. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమకు యుద్ధం కారణంగా వచ్చిన పాపాల నుంచి విముక్తి ప్రసాదించమని కోరుతూ కాశీకి వెళ్లారని, పాండవులను కలవడానికి ఇష్టపడని శివుడు అక్కడి నుంచి మాయమై గుప్తకాశీకి వచ్చాడని చెబుతారు. అలాగే శివుడు తన ప్రేమను  పార్వతికి తెలియచేసిన ప్రదేశం కూడా ఇదేనని చెబుతారు.

గుప్తకాశీ నుంచి జీపులో సోన్‌ప్రయాగ మీదుగా గౌరీకుండ్‌కు ప్రయాణం. కేదార్‌నాథ్‌కు నడక. దర్శనం తర్వాత తిరిగి గౌరీకుండ్‌ మీదుగా సోన్‌ ప్రయాగ్‌ నుంచి గుప్తకాశీకి ప్రయాణం. రాత్రి బస గుప్తకాశీలో.

పార్వతి తపస్సు చేసిందిక్కడే
గౌరీకుండ్‌ నుంచి కేదార్‌నాథ్‌కు 14 కి.మీల దూరం. ఇది కేదార్‌నాథ్‌ పర్యాటకులకు ఒక మజిలీ. ఇక్కడి నుంచి కాలి నడకన లేదా హెలికాప్టర్‌లో వెళ్లవచ్చు. శివుని కోసం పార్వతి తపస్సు చేసిన ప్రదేశం గౌరీకుండ్‌ అని చెబుతారు. దీనికి సమీపంలో ఉన్న త్రియుగినారాయణ్‌ అనే ప్రదేశంలో శివపార్వతులు వివాహం చేసుకున్నట్లు చెబుతారు. గౌరీకుండ్‌ దగ్గర నిలబడి ఎటు చూసినా చక్కటి పచ్చదనమే. ఏ మాత్రం కలుషితం కాని ఆహ్లాదకరమైన వాతావరణం. ట్రికింగ్‌ చేయగలిగితే అద్భుతమైన అనుభూతి.

కేదార్‌నాథ దర్శనం
హిమాలయ పర్వతాల్లో ఓ చిన్న పట్టణం కేదార్‌నాథ్‌. దాదాపుగా పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉంది. కేదారనాథుడి పేరుతో పూజలందుకుంటున్న దేవుడు శివుడు. ఇక్కడ కేదార్‌నాథుడి ఆలయంతో΄ాటు చూడాల్సిన ప్రదేశం చోరాబారి హిమానీనదం. ఇక్కడి మంచు కరిగి మందాకిని నది పేరుతో ప్రవహిస్తోంది. కేదార్‌నాథ్‌ ఆలయాన్ని మంచుకురిసే సమయాల్లో ఆరు నెలల  పాటు (నవంబర్‌ నుంచి ఏప్రిల్‌) మూసివేస్తారు. ఆలయాన్ని మూసివేసే ముందు ఉత్సవమూర్తిని పల్లకిలో గుప్తకాశీకి దగ్గరలో ఉన్న ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్‌ టెంపుల్‌కి తీసుకువస్తారు. ఆరు నెలలపాటు అక్కడే పూజలు నిర్వహిస్తారు. ఆలయం తెరిచేటప్పుడు తిరిగి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారు.

రోజంతా గుప్తకాశీలో విశ్రాంతి. పర్వతాల మీదకు ట్రెకింగ్, స్థానిక ఆలయాల దర్శనాలకు వెళ్లవచ్చు. ఇది ఎవరికి వారు ప్యాన్‌ చేసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత గది చెక్‌ అవుట్‌ చేసి పాండుకేశ్వర్‌కు ప్రయాణం. అక్కడ గదిలో చెక్‌ ఇన్‌ అయి రాత్రికి బస.

పాండురాజు వనవాసమిక్కడే!
గుప్తకాశీ నుంచి  పాండుకేశ్వర్‌కు రోడ్డు మార్గాన దాదాపు రెండు వందల కిలోమీటర్ల ప్రయాణం. ఆ రోజంతా ప్రయాణంలోనే గడిచిపోతుంది. ఇది బదరీనాథ్‌కు వెళ్లడానికి మధ్యలో ఒక మజిలీ. జోషిమఠ్‌కు బదరీనాథ్‌కు మధ్యలో ఉంటుంది.  పాండవుల తండ్రి పాండురాజు రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికి వదిలేసి వనవాసానికి వెళ్లినట్లు కథనం. ఆ వనవాసంలో పాండురాజు ఇక్కడ నివసించాడని అందుకే ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ యోగధ్యాన బదరీ ఆలయం, వాసుదేవ ఆలయం ఉన్నాయి. వీటిని పాండురాజు నిర్మించినట్లు తామ్ర శాసనాలు దొరికాయి. అప్పటి పాంచాలదేశమే నేటి ఉత్తరాఖండ్‌ అని చెబుతారు. కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన తర్వాత   పాండవులు తమ రాజ్యాన్ని పరీక్షిత్తుకు అప్పగించి మోక్షమార్గాన్ని అన్వేషిస్తూ ఇక్కడ కొంతకాలం నివసించారని స్థానిక కథనం. మంచుకురిసే సమయాల్లో బదరీనాద్‌ ఆలయాన్ని మూసివేసేటప్పుడు ఉత్సవమూర్తిని  పల్లకీలో ఊరేగింపుగా ఇక్కడి యోగధ్యాన బదరీ ఆలయానికి తీసుకువస్తారు.

బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత పాండుకేశ్వర్‌ నుంచి బదరీనాథ్‌కు ప్రయాణం. బదరీనాథ్‌లో పూజ, మధ్యాహ్న భోజనం తర్వాత మాయాపూర్‌కు ప్రయాణం. మాయాపూర్‌లో హోటల్‌లో చెక్‌ ఇన్‌. రాత్రి బస.

రంగవల్లుల మందిరం
బదరీనాథ్‌ ఆలయ నిర్మాణమే ఒక అద్భుతం. యాభై అడుగుల ఎత్తు ఉంటుంది. సునిశితమైన నిర్మాణ నైపుణ్యానికి ప్రతీక ఈ ఆలయం. దూరానికి కూడా కళ్లకు కొట్టొచ్చే రంగులతో ఆకట్టుకుంటుంది. ఆలయ స్తంభాల నుంచి పై కప్పు, మండపం ప్రతిదీ శిల్ప నైపుణ్యంతో ఆకట్టుకుంటుంది. ఉత్తరాది ఆలయాల్లో గ్రానైట్‌ రాయిలో ఇంత గొప్ప శిల్పనైపుణ్యం నిండిన ఆలయాలను తక్కువగా చూస్తుంటాం. రంగవల్లులతో అలంక రించినట్లు ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తికి ఎదురుగా వాహనం గరుడపక్షి విగ్రహం మోకాళ్ల మీద కూర్చన్న భంగిమ ప్రత్యేక ఆకర్షణ. గర్భాలయంలో బంగారు పూత ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి పద్మాసన స్థితిలో కూర్చుని ధ్యానముద్రలో ఉంటాడు. బదరీనారాయణ సాలిగ్రామ రూపాన్ని శంకరాచార్యుడు తప్తకుండ్‌ దగ్గర ఉన్న గుహలో గుర్తించాడని చెబుతారు. ఆ విగ్రహాన్ని 16వ శతాబ్దంలో గర్వాల్‌ రాజు గర్భాలయంలో ప్రతిష్ఠించా డని చెబుతారు. ఈ ఆలయంలో గణేశ్, కుబేరుడు, నారదుడు, నరనారాయణ ద్వయం వంటి పదిహేను విగ్రహాలున్నాయి.

ఉదయం త్వరగా బ్రేక్‌ఫాస్ట్‌ ముగించుకుని దేవప్రయాగకు ప్రయాణం. అక్కడ రఘునాథ్‌ ఆలయ దర్శనం. అలకనంద– భాగీరథి నదుల సంగమం స్థలి వీక్షణం. రిషికేశ్‌కు ప్రయాణం. అక్కడ రామ్‌ఝాలా, లక్ష్మణ్‌ ఝాలా, స్వర్గాశ్రమ సందర్శనం తర్వాత హరిద్వార్‌కు ప్రయాణం. హరిద్వార్‌లో హోటల్‌ చెక్‌ ఇన్‌. రాత్రి బస.

రాముడు తపస్సు చేసిన నేల
దేవప్రయాగకు ఉన్న పౌరాణికప్రాశస్త్యం చాలా గొప్పది. ఇది పంచప్రయాగల్లో ఒకటి. ఇక్కడ ఉన్న రఘునాథ్‌ జీ ఆలయం వెయ్యేళ్లు పైబడిన నిర్మాణం. అలకనంద–భాగీరధి సంగమ స్థలికి ఎగువ భాగాన ఉంది. రావణసంహారం తర్వాత శ్రీరాముడు విజయంతో అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత ఈ ప్రదేశంలో కొంతకాలం తపస్సు చేశాడని చెబుతారు. ఇక్కడ ప్రకృతి చాతుర్యం అలకనంద– భాగీరథి నదుల సంగమం. అలకనంద నీరు మట్టితో కలిసి గోధుమరంగులోనూ, భాగీరథి నీరు ఆకు పచ్చరంగులోనూ ఉంటాయి. ఈ రెండింటి కలయిక తర్వాత ఈ ప్రవాహాన్ని గంగానదిగా పిలుస్తారు.

ఉత్తుంగ తరంగం
రిషికేశ్‌కి ఉన్న  పౌరాణికప్రాస్త్యంతో పాటు భౌగోళిక వైశిష్ట్యం కూడా పెద్దదే. దేవప్రయాగ నుంచి గంగానది రిషికేశ్‌కి వచ్చేటప్పటికి ప్రవాహం ఉదృతంగా ఉరకలెత్తుతూ ఉంటుంది. ఆశ్చర్యంగా నీరు ఇక్కడ అత్యంత స్వచ్ఛంగా ఉంటాయి. అలకనంద– భాగీరథి నదుల నీటిలో కనిపించే పచ్చరంగు, బురద రంగు ఛాయలు కూడా కనిపించవు. రిషికేశ్‌ రివర్‌ రాఫ్టింగ్‌కి అద్భుతమైన ప్రదేశం. రాఫ్టింగ్‌ ప్రాక్టీస్‌ చేయించే ఆపరేటర్‌లు ఉంటారు. రాఫ్టింగ్‌ మెళకువలు నేర్పించి రోడ్డు మార్గాన రిషికేశ్‌ ఎగువప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ నదిలో వదులుతారు. ప్రవాహంతో పాటుగా కేరింతలు కొడుతూ ఒక్కో రాఫ్టింగ్‌ బోట్‌ పరుగులు తీస్తుంటుంది. రిషికేశ్‌లో గంగానది ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకు చేరడానికి ఒక వంతెన ఉంటుంది. దానిని లక్ష్మణ్‌ ఝాలా అంటారు. సీతాదేవి నదిని దాటడం కోసం లక్ష్మణుడు చెట్ల తీగలు, వేళ్లతో వంతెన ఏర్పాటు చేశాడని చెబుతారు. ఇప్పుడు మనకు కనిపించే ఇనుప వంతెనను బ్రిటిష్‌ పాలకులు నిర్మించారు. ఇరవయ్యవ శతాబ్దపు తొలినాళ్లలో వేళ్లు, చెట్ల తీగల వంతెన పర్యాటకుల తాకిడికి కుంగిపోవడంతో ఇనుప వంతెన నిర్మించారు. రిషికేశ్‌ కి ఒక కిలోమీటరు దూరాన రాముడు కట్టిన వంతెన ఉంటుంది. దాని పేరు రామ్‌ఝాలా.

బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత హరిద్వార్‌లో సైట్‌ సీయింగ్‌. మానసదేవి ఆలయ దర్శనం. సాయంత్రం గంగాహారతి, షాపింగ్, రాత్రి బస.

నిర్మల గంగ
హరిద్వార్‌లో గంగానది నిర్మలంగా ప్రవహిస్తుంటుంది. నగరంలో మోటారు వాహనాలను అనుమతించరు. గంగానది ఒక ఘాట్‌ నుంచి మరొక ఘాట్‌కు వెళ్లడానికి ఎలక్ట్రిక్‌ ఆటోలుంటాయి. చండీదేవి ఆలయానికి వెళ్లడానికి రోప్‌వే ఉంటుంది. రోప్‌వే మీద ప్రయాణిస్తూ గంగానది ఏరియల్‌ వ్యూ చూడడం మర్చి΄ోవద్దు. మానసాదేవి ఆలయం నుంచి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవ్చు. సాయంత్రం గంగాహారతి వీక్షణం కనువిందు చేస్తుంది. నాలుగు గంటలకే ఘాట్‌కు చేరితే హారతి మొదలయ్యే లోపు వెలుతురు ఉండగానే కలియతిరగవచ్చు. షాపింగ్‌ కూడా అప్పుడే పూర్తి చేసుకోవాలి. హారతి తర్వాత చీకటి పడుతుంది. కాబట్టి నేరుగా గదికి రావడమే ఉంటుంది.


బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత ఘజియాబాద్‌కు ప్రయాణం. ఎయిర్‌పోర్టులో డ్రాప్‌ చేయడంతో నిర్వహకుల బాధ్యత పూర్తవుతుంది. పర్యాటకులు విమానం ఎక్కి చెన్నైకి రావడంతో చార్‌ధామ్‌ యాత్ర పూర్తవుతుంది. ఐఆర్‌సీటీసీ నిర్వహించే చార్‌ధామ్‌ యాత్ర ఈ నెల 22వ తేదీ న మొదలవుతుంది. సెప్టెంబర్‌ మూడవ తేదీ తో పూర్తవుతుంది. ఈ పర్యటనలో యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బదరీనాథ్‌ ప్రదేశాలను దర్శించుకోవచ్చు.

ఆర్‌వీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ నిర్వహిస్తున్న చార్‌ధామ్‌ యాత్ర హైదరాబాద్‌ నుంచి మొదలవుతుంది. ఈ పన్నెండు రోజుల టూర్‌ సెప్టెంబర్‌ ఐదవ తేదీ నుంచి మొదలవుతుంది. ఇందులో ఒక్కొక్కరికి దాదాపుగా అరవై వేల రూపాయలవుతుంది. 

ప్యాకేజ్‌ ఇలాగ: సింగిల్‌ ఆక్యుపెన్సీలో దాదాపు 70 వేల రూపాయలు. డబుల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి అరవై వేలు, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 58 వేలకు పైగా అవుతుంది. 

ఇది ఫ్లయిట్‌ జర్నీ: విమానం 22వ తేదీ ఉదయం 5.50 నిమిషాలకు చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరుతుంది. ఎనిమిదిన్నరకు ఘజియాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఘజియాబాద్‌ నుంచి సెప్టెంబర్‌ మూడవ తేదీ సాయంత్రం నాలుగన్నరకు బయలుదేరి ఆరు గంటల పది నిమిషాలకు చెన్నై చేరుతుంది.యమునోత్రి యమునానది పుట్టిన ప్రదేశం. 

ఇదీ చదవండి: ‘స్వీట్’‌ కపుల్‌ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు
 

– వాకా మంజులారెడ్డి,
సాక్షి, ఫీచర్స్‌ ప్రతినిధి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement