
పల్లకీలో పెళ్లికూతురు
‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ నవ్య పథం
సొంత మేనమామళ్లా కార్యక్రమం
బృందంలోని అమ్మాయిల పెళ్లిలో తమ వంతు శోభ
కుటుంబ సభ్యుల్లా మెలుగుతూ సంతోషాల జల్లు
చర్చనీయాంశంగా మారిన సంప్రదాయం
పల్లకీలోని అమ్మాయి పేరు హిమబిందు. తండ్రి ఆవులశెట్టి చంద్రశేఖరప్ప వస్త్ర దుకాణం నిర్వహిస్తుండగా, తల్లి లక్ష్మీదేవి గృహిణి. బీసీఏ పూర్తి చేసిన ఈమె ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ బృందంలో సభ్యురాలు. మూడేళ్లుగా తన వంతు సేవగా ఆలయాలను శుభ్రం చేస్తున్నారు. ఈ అమ్మాయి ఎదురొచ్చి టెంకాయ కొడితే కానీ ఆ బృందం బయలుదేరుతున్న బస్సు కదలదు. అంతటి సెంటిమెంట్. పల్లకీ మోస్తున్నారంటే వాళ్లు సొంత మేనమామలు అనుకుంటే పొరపాటు. గుడి సేవ బృందంలోని సభ్యులు ఎంచుకున్న తోవ ఇది. తమతో పాటు సేవలో పాల్గొనే అమ్మాయిల పెళ్లి సందర్భంగా ఈ ‘పల్లకీ సేవ’ ఇంటి మనుషులుగా సొంత ఖర్చుతో నిర్వహిస్తుండటం విశేషం.
కర్నూలు కల్చరల్: అమ్మాయిని ఓ అయ్య చేతిలో పెట్టాలంటే తల్లిదండ్రులకు కంటి మీద కునుకు ఉండదు. పెళ్లి చూపులు మొదలు.. అప్పగింతల వరకు ఒకటే హడావుడి. కాంక్రీట్ వనాల్లో ఎవరికి వారుగా బతుకున్న రోజుల్లో బంధాలు, బంధుత్వాలు గుర్తుకు తెచ్చుకున్నా కళ్ల ముందు మెదలని పరిస్థితి. సొంతూళ్లకు దూరంగా, సప్త సముద్రాలకు అవతల ఉద్యోగాలు చేస్తున్న వారికి వరుసలు తెలియవు, ఉన్న ఊళ్లో ఎవరిని ఏమని పిలవాలో దిక్కుతోచదు. అలాంటిది పెళ్లి అనగానే.. తల్లిదండ్రుల గుండెలు బరువెక్కుతాయి. అమ్మో.. ఇంత తక్కువ సమయమా? అనే మాట వినపడటం సర్వ సాధారణం.
అయితే ముక్కూమొహం తెలియని వాళ్లు, మేమున్నామని భరోసా కల్పిస్తే.. సొంత మేనమామళ్లా హడావుడి చేస్తే.. కుటుంబ సభ్యుల్లో ఒకరిలా మెలుగుతుంటే.. జీవితంలో అంతకంటే సంతోషం ఏముంటుంది. ఈ కోవకు చెందినదే ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’. కార్యక్రమం చేశామా, వెళ్లిపోయామా అన్నట్లు కాకుండా.. ఈ బృందం ఓ కుటుంబంలా మెలుగుతోంది. కష్టాలో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ.. సంతోషాలను కలిసి పంచుకుంటున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకం.
వాట్సాప్ గ్రూపులో 1,500 పైనే సభ్యులు
మొదట అరకొరగా మొదలైన మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత వాట్సాప్ గ్రూపు దినదిన ప్రవర్దమానంగా వెలుగొందుతోంది. ప్రస్తుతం ఈ గ్రూపులో 1,500 మందికి పైగానే సభ్యులు. ఎంపిక చేసుకున్న గుడి వివరాలను గ్రూపులో తెలియజేసి కార్యక్రమం నిర్వహణలో పాల్పంచుకునేందుకు ఆసక్తి కలిగిన సభ్యుల వివరాలతో జాబితా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత అవసరమైన మేరకు సభ్యులకు అవకాశం కలి్పస్తున్నారు. మరో కార్యక్రమంలో మిగిలిన వారికి ఆ భాగ్యం లభిస్తోంది.
ఇప్పటి 123 దేవాలయాల్లో కార్యక్రమం
నంద్యాలలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో మొదలైన కార్యక్రమం ఇప్పటి వరకు 123 దేవాలయాల్లో తమ సేవను విస్తరించడం విశేషం. కాశీలోని విశాలక్ష్మి గుడిలో ఏకంగా 9 రోజుల పాటు ఈ బృందం తమ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పల్లకీలో పెళ్లి కూతురు
‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ బృందంలో సభ్యురాలైన హిమబిందు స్వస్థలం నంద్యాల కాగా.. వివాహం ఆదివారం కర్నూలు నగరంలో నిర్వహించారు. వరుడు వీర నవీన్. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వివాహం సందర్భంగా బృందం సభ్యులు సు మారు 150 మంది హాజరయ్యారు. వీరు పల్లకీని తీసుకొచ్చి పెళ్లి మంటపానికి తీసుకొస్తున్న తీరుకు వివాహానికి హాజరైన అతిథులు ఆశ్చర్యచకితులయ్యారు. ఎవరికి ఎవరో అన్నట్లుగా బతుకుతున్న రోజుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని చర్చించుకోవడం విశేషం.