
తొలకరి జల్లులతో విత్తన సేకరణ ప్రారంభం
సోషల్ మీడియా వేదికగా పలు గ్రూపులు
నగరంలో టెర్రస్ గార్డెనర్స్ కోకొల్లలు
విత్తనాలు మార్చుకోవడానికి కార్యక్రమాలు
నగరంలో టెర్రస్ గార్డెనింగ్(మిద్దె పంట) ఒక ట్రెండ్‌గా, సరికొత్త జీవనశైలిగా మారిన విషయం విధితమే. ఇందులో భాగంగానే నగరంలోని భవనాలు పచ్చదనం అల్లుకుంటున్నాయి. అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్ అనే తేడా లేకుండా అవకాశం ఉన్న ప్రతీ ఇంటిపై చిన్న తోట ఉండాలనే ఆకాంక్ష ఒక్కొక్కరి హృదయంలోనూ నాటు వేస్తోంది. ప్రస్తుతం నగరంలోని మిద్దె తోటల ప్రేమికులువర్షాకాలాన్ని స్వాగతించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది వర్షాలు కాస్త ముందుగానే కురవడం, ఈ తొలకరి జల్లులు వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ సందర్భంగా మొక్కలు నాటడానికి అనువైన ఈ సమయాన్ని వినియోగించుకోవడానికి విత్తన సేకరణ మొదలుపెట్టారు. -సాక్షి, సిటీబ్యూరో
వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో నగరవ్యాప్తంగా విత్తనాల సేకరణ మొదలైంది. పాత కాలపు ‘నువ్వు ఇస్తే.. నేను ఇస్తా‘ పద్ధతిలో విత్తనాల మారి్పడి జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఈ విత్తన మారి్పడికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ యాప్స్‌లో వందలు, వేల మందితో ఉన్న మిద్దెపంట గ్రూపులు ఈ విత్తన సేకరణపై దృష్టి సారించాయి. ప్రముఖ సోషల్ మీడియా గ్రూపులు వాట్సప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వంటి వాటిల్లో ఎంతో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఈ విత్తనాల మారి్పడి సంస్కృతి మొక్కల కోసం మానవ సంబంధాలు పెరిగే సూచికగా మారాయి. ఈ గ్రూపుల సభ్యులు తమ వద్ద ఉన్న హెయిర్‌లూమ్ సీడ్స్, దేశీ విత్తనాలను ఇతరులకు పంచిపెడుతున్నారు. అయితే హైబ్రిడ్ విత్తనాలకు బదులుగా జెనెటిక్ డైవర్సిటీని నిలబెట్టే పద్ధతుల వైపు మొగ్గుచూపుతుండటం విశేషం.
సిటీలో పచ్చదనపు స్పర్శ
టెర్రస్ గార్డెనింగ్ నగరానికి కొత్త కాకపోయినా, కోవిడ్ తర్వాత ఈ సంస్కృతి విస్తృతమైంది. ఇంటింటా పిల్లలకు మొక్కల తాలూకు పరిచయం కలిగిస్తూ, విత్తనాలు నాటే పద్ధతులపై అవగాహన పెరుగుతోంది. కొన్ని గ్రూపులు ప్రత్యేకంగా కిడ్స్ సీడ్ స్వాప్ సెగ్మెంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇది పాత తరం జీవితానికి దగ్గరగా చేరే ఒక మార్గం కావడంలో సందేహం లేదు.‘‘ఇది మాకు ఆహారం కోసం మాత్రమే కాదు, మనశ్శాంతి కోసం కూడా’’ అని అంటున్నారు హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన మిద్దె పంట ప్రేమికురాలు సూర్యప్రభ. శ్రమకోర్చి నాటిన విత్తనాలు తర్వాత మొలక వేసిన మొక్కను చూడటం, తన చేతులతో పండించిన కూరగాయలను ఇంట్లో వండుకోవడం వల్ల కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిదని ఆమె పేర్కొన్నారు.
మీట్స్‌తో పాటు అవగాహన
ఈ నెలాఖరులో నగరంలోని బేగంపేటలో ఒక సీడ్ స్వాప్ మీట్‌ను నిర్వహించనుంది. ఇక్కడ ఎటువంటి డబ్బు లావాదేవీలు ఉండవు. ఇది పూర్తిగా మార్పిడి పద్ధతిపై ఆధారపడిన సదస్సు. దీనితో పాటు జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్, ఎస్‌ఆర్ నగర్, ఈసీఐఎల్ వంటి ప్రాంతాల్లో విత్తన మార్పిడి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు గ్రూపుల్లో ప్రణాళికలు రూపొందించారు. ఈ మీట్‌లో విత్తనాల మార్పిడితో పాటు విత్తన భద్రతా పద్ధతులు, కంపోస్టింగ్ టెక్నిక్స్, ఇండోర్ ప్లాంట్స్ గురించి అవగాహన, జీరో వేస్ట్ గార్డెనింగ్ వంటి అంశాలపై చిన్న చిన్న సెషన్లు కూడా నిర్వహిస్తారు. విత్తనాల మార్పిడి ద్వారా కేవలం మొక్కలు మాత్రమే కాదు, ఆత్మీయ సంబంధాలు కూడా నాటుతున్నారు.

ఇంటికి అనువైన మొక్కలు
ఈ వర్షాకాలంలో మిద్దె తోటల ప్రేమికులు ప్రధానంగా కూరగాయలు, పూల మొక్కలు, హెర్బ్స్‌ను నాటేందుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా గోంగూర, బీరకాయ, దోసకాయ, ముల్లంగి, మిరపకాయ, టమోటా వంటి కూరగాయలు పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జూహీ, చామంతి, గులాబీ, హిబిస్కస్ వంటి పూల మొక్కలతో పాటు తులసి, కరివేపాకు, వెల్లుల్లి కాడ, ధనియాల మొక్క, అలవేరా వంటి హెర్బ్స్ పెంచడానికి ఇష్టపడుతున్నారు. తక్కువ స్థలంలో, కంటైనర్లలో సులభంగా పెరగడం ఈ మొక్కల ప్రత్యేకత. అలాగే ఈ మొక్కల వాసన, ఆకృతి, వండినప్పుడు వచ్చే రుచి, ఆరోగ్య ప్రయోజనాలు మిద్దె తోటల ప్రాధాన్యతను మరింత పెంచుతున్నాయి.
