రాహుకేతు పూజలు : తమిళుల కాళహస్తి తిరుప్పాంపురం | Tamil Nadu: Rahu Kethu temple Thirupampuram Pambunathar full deets inside | Sakshi
Sakshi News home page

Thiruppampuram తమిళుల కాళహస్తి తిరుప్పాంపురం

Jul 17 2025 10:04 AM | Updated on Jul 17 2025 10:59 AM

Tamil Nadu: Rahu Kethu temple Thirupampuram Pambunathar full deets inside

జాతకంలో కాలసర్ప దోషం, కళత్ర దోషాలు ఉంటే ఆ దోషాలను తొలగించుకునేందుకు శ్రీకాళహస్తి వెళ్లి రాహుకేతు దోష పూజలు చేయించుకోవడం తెలుగువారి  మరి తమిళ తంబీలకు..? వాళ్లకు కూడా ఇలాంటి క్షేత్రం ఒకటి ఉంది.అదే తిరుప్పాంపురం. రాహుకేతువులు ఏకశరీరంగా ఉన్న మహా మహిమాన్వితమైన సర్పక్షేత్రమిది. ఉత్తర శ్రీకాళహస్తిగా పేరు పొందిన ఈ క్షేత్రం తమిళులకు అత్యంత పవిత్రమైనది. 

తమిళులే కాదు.. ఇరుగు  పొరుగు రాష్ట్రాల వారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని సర్పదోషనివారణ పూజలు చేయించుకుని ఉపశమనం  పొందుతుంటారు. తిరుక్కాళాత్తి, కుడండై, తిరునాగేశ్వరం, నాగూర్, కీయ్‌ పెరుపల్లం తదితర అయిదు పుణ్యక్షేత్రాల గొప్పతనాన్ని ఒక్కటిగా కలిగి ఉన్న పవిత్ర స్థలమే తిరుప్పాంపురం. సాక్షాత్తూ సర్పాలే తమకు కలిగిన దోషాన్ని ఇక్కడకు వచ్చి తొలగించుకున్న గాథలు ఉన్నాయి. తిరుప్పాంపురం ఆలయంలో ఉన్న దైవం పేరు శేషపురీశ్వరుడు. అమ్మవారు వండుచేర కుయిలి. ఇక్కడ ఉన్న పుణ్య తీర్థం ఆదిశేష తీర్థం. ఈ ఆలయ విశిష్టతను తమిళ వాల్మీకిగా కొనియాడబడిన తిరునావుక్కరుసు వంటివారు కొనియాడారు. 

స్థలపురాణం: ఒకసారి కైలాసంలో శివుడిని వినాయకుడు పూజిస్తున్నాడు. అప్పుడు శివుడి మెడలోని పాములు తమనూ కలుపుకుని పూజిస్తున్నట్లు గర్వపడ్డాయి. అది గ్రహించిన శివుడు ఆగ్రహించి, ఇక మీదట నాగుపాములన్నీ తమ దివ్యశక్తులను కోల్పోయి సామాన్య సర్పాలవలె మానవుల చేత చిక్కి నానాహింసల పాలూ అయి మరణిస్తాయని శపించాడు. దీంతో శివుడి మెడలోని వాసుకితోపాటు రాహుకేతువులు తదితర సర్పాలు తమ శక్తిని కోల్పోయి తల్లడిల్లాయి. అవి తమ తప్పును తెలుసుకుని తమకు శాపవిమోచనం కల్పించవలసిందిగా పరమేశ్వరుని  ప్రాధేయపడ్డాయి. దాంతో బోళాశంకరుడి మనసు కరిగిపోయింది. మహాశివరాత్రి రోజున తిరు΄్పాంపురం వెళ్లి అక్కడ కొలువై ఉన్న తనను ఆరాధిస్తే శాపవిమోచనం కలుగుతుందని చెప్పాడు. 

అప్పుడు వాసుకి, ఆదిశేషుడు తదితర అన్ని నాగులూ కలసి ఆ ఏడాది మహాశివరాత్రిరోజు తెల్లవారు ఝామునే తిరునాగేశ్వరంలోని నాగనాథ స్వామిని, తిరుప్పాంపురంలోని పాంబునాథుడిని, నాగూరులోని నగనాథుని ఆరాధించాయి. తిరుప్పాంపురం క్షేత్రంలో ఆరాధించిన వెంటనే నాగుల శాపం తొలగిపోయింది. ఇక్కడ ఈశ్వరుడిని ఆరాధించేందుకు వచ్చిన సర్పాలు ఒక పుణ్యతీర్థాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తీర్థానికే ఆదిశేష తీర్థమని పేరు. బ్రహ్మ, ఇంద్రుడు, అగస్త్యుడు, గంగాదేవి వంటి వారు ఇక్కడి ఆలయాన్ని సందర్శించి ధన్యులైనట్లు పురాణ గాథలున్నాయి. 

ఇదీ చదవండి: అవరోధాలు, అపజయాలు కుంగదీస్తున్నాయా? ఇదిగో పరిష్కారం!

ఇక్కడ ఉన్న మూడవ కుళోత్తుంగ చోళుడి శిలాఫలకాన్ని బట్టి చూస్తే ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నాటిదని చెప్పవచ్చు. తంజావూరును పాలించిన శరభోజి చక్రవర్తిపాలనలో ఈ ఆలయానికి వసంతమండ΄ాన్ని, తూర్పుదిక్కుగా రాజగోపురాన్ని నిర్మించారు. ఈ గోపురానికి ఎదురుగానే ఆదిశేష తీర్థం ఉంది. ఇక్కడ ఉన్న వినాయక విగ్రహానికి కూడా పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి స్వామికి శేషపురీశ్వరుడు, పాంబుపుర నాథుడు, పాంబుపురీశ్వరుడు తదితర నామాలున్నాయి. గర్భగుడిలో శివుని పూజించే రీతిలో ఉన్న ఆదిశేషుని విగ్రహం కనువిందు చేస్తుంది. వెలుపలి ప్రాకారానికి ప్రదక్షిణ మార్గంలో భైరవుడు, సూర్యుడు, దుర్గ, శనీశ్వరుడు, రాహువు, కేతువు తదితర సన్నిధులున్నాయి. ఇక్కడ ఉన్న రావిచెట్టుకింద అసంఖ్యాకంగా సర్పశిలలున్నాయి. ఆలయంలో ఈశాన్య దిక్కుమూలలో రాహుకేతువులు ఒకే సన్నిధిలో కనిపిస్తారు. ఇక్కడ రాహుకాల పూజలు విశేషంగా జరుగుతాయి. అలాగే సర్పదోష పరిహార పూజలకు ఈ ఆలయం పెట్టింది పేరు. రాహుకాలంలో ఆలయం తెరిచిన వెంటనే నేతిదీపాలు కొని వెలిగిస్తారు. రాహు, కేతు దోషాల పరిహారపూజలకు తగిన సంభారాలు ఇక్కడే లభిస్తాయి. సర్పదోష నివృత్తి కోసం వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు చేయించుకుంటూ కనిపిస్తారు. జాతకంలో సర్పదోషం ఉన్నవారు, రాహుకేతువులకు మొక్కుకుని, తిరుప్పాంపురంలో పూజలు చేయించుకునే వారు అధిక సంఖ్యాకంగా కనిపిస్తుంటారు. 

చదవండి: అమెరికా స్టోర్‌లో రూ. లక్ష కొట్టేసిన భారత మహిళ, అరెస్ట్‌ : నెట్టింట చర్చ

ఎలా వెళ్లాలంటే..?
తమిళనాడులోని కుంభకోణం నుంచి కారైక్కాల్‌ వెళ్లే దారిలో ప్రధాన రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. చెన్నై సెంట్రల్‌ నుంచి కుంభకోణానికి రైళ్లు, బస్సులు ఉన్నాయి. కుంభకోణం వరకు వెళ్తే అక్కడ నుంచి తిరుప్పాంపురం వరకు వెళ్లడానికి మినీ బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాలు, ఆర్టీసు బస్సులు ఉన్నాయి.  చూడదగ్గ ఇతర ప్రదేశాలు: సాధారణంగా తమిళనాడులోని నవగ్రహాలయానికి వెళ్లే వారు ఇక్కడికి వస్తుంటారు లేదంటే ఇక్కడికి వచ్చినవారు నవ గ్రహాలయానికి వెళ్తారు. అలాగే కుంభకోణంలోని ఐరావతీశ్వరన్‌ ఆలయం, ఉప్పిలియప్పన్‌ ఆలయం, ఆదికుంభేశ్వరన్‌ ఆలయం, సారంగపాణి ఆలయం, ఆరుల్‌మిగు స్వామినాథన్‌ ఆలయం, సూర్యనాయర్‌ కోయిల్, పట్టీశ్వరం ఆలయం  తదితరాలున్నాయి.

– డి.వి.ఆర్‌. భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement