
మనుషులు కలవడానికి మహాసముద్రాలు దాటాలా?మనసులు కలవడానికి మంచుపర్వతం కరగాలా?అనుకోకుండా వచ్చే వానగానో, చెమటతో తడిపే ఎండగానో, కదిలే తేరుగానో, ఎదిగే పైరుగానో, పారే ఏరుగానో, మరిగే నీరుగానో... ఏమో... ఎప్పుడో ... ఎలాగో... ఎందుకో... కలుస్తూనే ఉంటారు!‘‘ఏ నావదే తీరమో, ఏ నేస్తమే జన్మ వరమో..’’ ఎక్కడి నుంచో గాలిలో గంధకంలా తేలుతూ రింగ్‌టోన్ నా చెవుల్ని తాకింది.
భారంగా కదిలాను. నాతో పాటే చేతికున్న సెలైన్ బాటిల్ కూడా గాలిలో దీపంగా కదలాడింది. తెరలు తెరలుగా వచ్చిన కడుపునొప్పి ఉపశమనం కోసం పెట్టిన సెలైన్ బాటిల్ నా వంక దిగులుగా చూస్తోంది. కారిడార్లో ఎవరో తిరుగుతున్న అలికిడి, నా పైన అదేపనిగా తిరుగుతున్న ఫ్యాను చప్పుడు! గాలికి డోర్ కర్టెన్ పైకి లేచింది. కళ్ళు తెరిచి పాట వినిపించిన వైపు చూశాను.ఎదురుగా ఉన్న గదిలో ఎవరో అమ్మాయి చేతికి సెలైన్ బాటిల్‌తో కనిపించింది.ఓదారుస్తూ పక్కనే ఆమె స్నేహితురాలు! కొసరి కొసరి అన్నం పెడుతుంటే విలువ తెలియకుండా పెరిగినందుకు మంచి శిక్షే పడింది.వరమో శాపమో హాస్టలు రూపంలో ‘పొమ్మనలేక పొగబెట్టి’నట్లుగా ఎదురయింది.
కూర బాగుంటే అన్నంమెతుకులు లావుగా ఉంటాయి. అన్నం సన్నగా ఉంటే కూర ఉప్పూకారంతో ఉడికించినట్లుగా ఉంటుంది. బిందెలు బిందెలు నీళ్ళు కలిపి తాలింపు వేసిన చారు, ఉండీ లేనట్లుగా కనిపించే కందిపప్పుతో పసుపుగా సాంబారు! ఎప్పుడైనా ‘ఔటింగ్’ దొరికితే బజారులో దొరికే అడ్డమైన గడ్డినీ ఆబగా తిన్న కర్మానికి తెరలుతెరలుగా కడుపునొప్పి! దాని ఫలితం... ఆసుపత్రి బెడ్!‘‘ఇప్పుడెలా ఉంది?’’ అడిగింది సిస్టర్.‘పర్లేదు’ అని చెప్పి నీరసంగా ఆమె వంక చూశాను.సెలైన్ బాటిల్లో సూది గుచ్చి అందులోకి ఏదో పసుపురంగు మందు పంపించింది.నాడి పట్టుకుని చూసి ‘‘సాయంత్రానికి పంపుతారు. రెస్ట్ తీసుకో. బజారులో ఏది దొరికితే అది తినకూడదు. నోటికి రుచిగా ఉన్నవన్నీ ఆరోగ్యానికి మంచిది కాదు’’ చెప్పి వెళ్ళిపోయింది.
‘కొన్ని రోజులు హాస్టల్ తిండి తింటే తెలుస్తుంది...’ నోటి చివరిదాకా వచ్చిన మాట నీరసం వల్ల గొంతులోనే ఆగిపోయింది. పైకి అనలేకపోయాను. ఆమె వెళ్ళిన విసురుకు డోర్ కర్టెన్ పక్కకి జరిగింది. నాకు ఎదురుగా దిండు మంచానికి ఎత్తుగా జరిపి టిఫిన్ తింటున్న అమ్మాయి కనబడీ కనబడనట్లుగా కనిపించింది. అసలు తినకుండా ఉంటే ఉండగలం గానీ, సగం తిని ఉండాలంటేనే తాతముత్తాతలు దిగొస్తారు!రూముకు నాలుగు బెడ్లతో, మొత్తం ముప్పై పడకలతో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ హాస్పిటల్ అది. మరీ హడావిడిగా ఉంటే అమ్మాయిలకు, అబ్బాయిలకు వేరువేరుగా రూములుంటాయి.
నాలాగా ఎప్పుడైనాఫుడ్ పాయిజన్ అయినవాళ్ళు వస్తే ఏదో ఒక ఖాళీ రూములో ఉంచి సెలైన్ పెడ్తారు. బహుశా ఆ అమ్మాయికి కూడా నాలాగే అయిందేమో! రమేష్‌గాడు ఉంటే బాగుండేది. విషయం చెప్తే ఈపాటికి ఆ అమ్మాయి గురించి అన్నీ ‘ఎంక్వైరీ’ చేసి, ‘రిపోర్ట్’ ముందు పెట్టేవాడు. సరైన టైంకి వెళ్ళిపోయాడు.‘‘ఔట్...’’ పెద్దగా అరుపులు, ఆ తర్వాత చప్పట్లు వినిపించాయి. ఆడా, మగా తేడా లేదు. ఒకరి ఓటమికిఆనందిస్తూ ఇంకొకరికి గెలుపును ఆస్వాదించే రోజులు మొదలయ్యాయి. చిన్నప్పటి ఆటలన్నీ అటకెక్కిపోయాయి. చిన్నాపెద్దా అందరికీ పాతిన మూడు కర్రల మధ్య పరుగులే బలమైన వ్యాపకంగా మారిపోయాయి.ఆఖరి చుక్క దగ్గర ఆగిపోయింది సెలైన్. కడుపులోనూ, మనసులోనూ కురుస్తున్న వాన ఆగిన సంతోషం!
∙∙
చేతులు కట్టుకుని, స్లిప్పులు పట్టుకుని, బోనులో ముద్దాయిల్లా కౌంటర్ ముందు నిలబడ్డారు పిల్లలంతా.ఏడు బ్రాంచ్‌లతో, రెండేళ్లు ఇంటర్మీడియట్ నాలుగేళ్లు ఇంజనీరింగ్ కలిపి ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుతో ఉన్న యూనివర్సిటీలో ఎత్తైన కొండను తొలిచి వలయాకారంగా ఏర్పాటుచేసిన ఫుడ్ కోర్ట్ అది.కొమ్మల మీద పక్షులు వాలినట్లుగా సాయంత్రం క్లాసులు అయిపోగానే స్టూడెంట్స్ అందరూ అక్కడ చేరతారు. ఫుడ్ కోర్ట్ చుట్టూ ఉన్న గోడ మీద కొందరు, మెట్లమీద కొందరు, చెట్లకింద కొందరూ ఉదయం నుంచీ వేడెక్కిన బుర్రల్లోకి కాస్తంత ఉల్లాసాన్ని నింపుకుంటూ ఉంటారు.ఒక కన్ను బయటి నుంచి లోపలికి వస్తున్న వాళ్లమీదా, ఇంకో కన్ను టిఫిన్ ప్లేట్లు పట్టుకుని చెట్లకింద చేరుతున్న వాళ్లవంకా నిలిపి లైనులో నుంచున్నాను నేను.
గొడుగులా పరుచుకున్న బాదంచెట్టు నీడకింద ఎదురెదురుగా కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్న జంటలతో కాలం ఐస్‌క్రీములాగా కరిగిపోతోంది. గంటల్ని మంటల్లో వేసి తగలబెట్టినట్లుగా విరామం లేని కబుర్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో నాకిప్పటికీ అర్థం కాదు. ఒక చెట్టు పెంచితేనే ఎంతోమందికి నీడనిస్తోంది. ఒక మనిషి సక్రమంగా పెరిగితే ఎంతమందికి ఆశ్రయమిస్తాడో! కాలం కత్తుల మీద కాకుండా కనికరం మీద నడిస్తే తప్ప ఇలాంటివి చూడలేమేమో? చుట్టూ చూశాను. గింజల కోసం ఎక్కడెక్కడి నుంచో ఎగిరొచ్చిన పావురాళ్ల గుంపులా కనిపించారు. ‘‘ఏ నావదే తీరమో, ఏ నేస్తమే జన్మ వరమో..’’ తుళ్ళిపడి ఆలోచనల్లోనుంచి బయటికి వచ్చి రింగ్‌టోన్ వినిపించిన వైపు చూశాను. ముదురురంగు నీలం జీన్స్ మీద తెల్లటి టాప్ వేసుకున్న అమ్మాయి లైనులో కనిపించింది... ఆసుపత్రిలో తనకి తోడుగా ఉన్న అమ్మాయితో!
నీరసం ఎగిరిపోయింది. నిన్నటి కొద్దిపాటి అనారోగ్యానికి నీరసంతో తేలిపోయినట్లుగా ఉన్న కాళ్లు ఆ అమ్మాయిని చూశాక ఆనందంతో గాలిలో మరింత తేలిపోసాగాయి. నా టిఫిన్ ప్లేట్ తీసుకుని బాదం చెట్టు కిందకి చేరి తింటూ ఆ అమ్మాయినే గమనించసాగాను.
టిఫిన్ తీసుకుని ఇద్దరూ ఎదురుగా ఉన్న మరో బాదం చెట్టు నీడలో కూర్చున్నారు. తింటున్న వాడిని పైకి లేచి వాళ్లకు దగ్గరగా వెళ్లి, ‘‘హాయ్... నా పేరు ఏడుకొండలు. నీ పేరు..’’ అన్నాను.‘‘అలివేలు మంగతాయారు’’ చెప్పి పకపకా నవ్వింది ఆ అమ్మాయి.‘‘అయితే కలిసి నడవడానికి ఎక్కువ సమయం లేదు’’అన్నాను నేను కూడా నవ్వుతూ.
‘‘అవునవును... చనువిస్తే చంకనెక్కడం, చావగొడితే మంచమెక్కడం బాగా అలవాటు మీకు’’ అంది అక్కడి నుంచి పైకి లేస్తూ. పక్కనున్న అమ్మాయి కూడా ఆమెను అనుసరించింది.‘‘నీ ఆరోగ్యం బాగుందా ఇప్పుడు?’’ అడిగాను.‘నీకెలా తెలుసు?’ అన్నట్లుగా నుదురు చిట్లించింది. నడకలో వేగం తగ్గి మాటలో ఆశ్చర్యం తొంగిచూసింది.‘‘నీ ఫోన్ రింగైనప్పుడు వచ్చే పాటంటే నాకు చాలా ఇష్టం. నిన్న ఆస్పత్రిలో నీ ఎదురుగా ఉన్న బెడ్ మీద నేను కూడా ఉన్నాను. అప్పుడు విన్నాను. అనుకోకుండా ఇప్పుడిలా వినిపించిన పాట ద్వారా నువ్వేనని గుర్తుపట్టాను.’’ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్న ఆమెను చూస్తూ, ‘‘తాయారూ.. మళ్ళీ ఎప్పుడు?’’ అన్నాను.
పకపకా నవ్వుతూ అక్కడి నుంచి కదిలింది. చెమటను తుడుచుకుంటూ చెట్టు కిందకి చేరాను. ఎండలో నడుస్తున్న వాడికి గొడుగు పడుతున్నట్లుగా ఉన్న చెట్టు వంక కృతజ్ఞతగా చూశాను. ‘‘ఏరా కొండలూ! ఏమంటుందేంటి కల్పన’’ అన్నాడు పక్కన కూర్చుంటూ రమేష్. ‘‘కల్పనా? తనెవరు?’’ అన్నాను.‘‘ఇప్పటిదాకా మాట్లాడావుగా. ఆ అమ్మాయే’’‘‘కాదు కాదు... తను అలివేలు మంగతాయారు’’‘‘భలేవాడివే! తన పేరు కల్పన. ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్. దీని గురించే ఆ చందూగాడికి, పవన్‌గాడికీ గొడవలు మొదలయ్యాయి. కొట్టుకునేదాకా వెళ్లింది యవ్వారం. ఇంతకుముందు కూడా ఈ విషయం గురించి రూములో కూడా డిస్కషన్ జరిగింది. గుర్తులేదా?’’ అన్నాడు.
‘‘విషయం తెలుసుగానీ ఈ అమ్మాయని తెలియదు’’ అన్నాను. ‘‘ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి దక్కాలి గాని, ఇంకొకడితో మాట్లాడ్డం చూస్తే మాత్రం వాళ్లిద్దరూ ఒక్కటై వాడ్ని తన్నడానికి వెళ్ళిపోతున్నారు?’’ఆశ్చర్యం నుంచి తేరుకుని ‘‘ఇంతకీ ఆ అమ్మాయి ఇష్టమేంటో’’ అన్నాను నీళ్ళు తాగుతూ. నా వంక అదోలా చూశాడు. ‘‘అమ్మాయి ఇష్టంతో పనేముంది? ముందు చూడాలి, నచ్చాలి, మాటలు కలపాలి. ఆ తర్వాత ప్రపోజ్ చేయాలి. ఇన్‌స్టంట్ కాఫీలా అప్పటికప్పుడే ఫలితం తెలిసిపోవాలి. లేటయిందంటే నారదీసి ఆరేయడమే’’ అన్నాడు పెద్దగా నవ్వుతూ. నేనేమీ మాట్లాడలేదు. బట్టలిప్పుకుని విచ్చలవిడిగా తిరుగుతున్న లోకాన్ని మూకుడుతో మూయలేను. ప్రభావంలో పడి కొట్టుకుపోతూనో రాజీపడుతూనో కళ్ళు మూసుకుని బతకలేను. ‘‘ఇష్టాలైనా కష్టాలైనా మనిషిని బట్టి మారుతుంటాయిగా. నువ్వంటే నాకిష్టం కాబట్టి నువ్వు కూడా నన్నే ఇష్టపడాలని బలవంతం చేయడం అన్యాయం కదా’’ అన్నాను వాyì వైపు చూస్తూ.
‘‘లాజిక్కులు చెప్పుకోడానికి తప్ప అప్లై చేయడానికి పనికిరావురా. ఇద్దరికీ ఒకే వస్తువు నచ్చడం, దానికోసం కొట్టుకోవడం చూస్తుంటే చిన్నతనం గుర్తొస్తుంది. ‘వాడికున్నదీ నాక్కూడా కావా’లనే ఆరాటం తప్ప అసలు ఆ వస్తువుతో నీకెంత అవసరం ఉందో ఆలోచన లేదు. అరవయ్యో డెబ్భయ్యో నిండితే ఒకప్పుడు మనుషులు చచ్చేవాళ్లు. ఇప్పుడు ‘అరచేతి’లో చావును పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నారు. మూడు ముళ్ళూ, ఏడడుగులు ఎప్పుడో గంగలో కలిసిపోయాయి. ఇప్పుడు.. ప్రేమలు లేని కాలం నడుస్తోంది. చంపడం చచ్చిపోవడం మాత్రమే తెలిసిన కాలం! వాళ్లిద్దరూ సాయంత్రం నీ రూముక్కూడా రావొచ్చు. ఇన్నేళ్లూ చక్కగా చదువుకున్నావు. వెళ్లేముందు ప్రశాంతతను పాడుచేసుకోకు’’ అన్నాడు పైకి లేస్తూ.
వెళ్ళిన వాడివైపు చూస్తుంటే మనసంతా ఒకటే ఆలోచనలు. ‘పుస్తకం చదవకపోతే పాడైపోతావు’ అని చూపించే సినిమా ఒక్కటి లేదు. ‘అమ్మాయిని ప్రేమించకపోతే బతుకు వృథా’ అని చెప్పే సినిమాలు ఎక్కువయ్యాయి. హీరో ఒకమ్మాయిని ప్రేమిస్తే ఆ ప్రేమ గెలిచేదాకా వాళ్లిద్దర్నీ అందరూ సపోర్ట్ చేస్తారు. ఎన్నెన్నో త్యాగాలు, మరెన్నో పోరాటాలు, రక్తపాతాలు... చివరికి ‘శుభం’ ముందు అందరూ నవ్వీ చూసినవాళ్లందర్నీ వెర్రివాళ్లని చేస్తారు! మనుషులంతా ఆ భ్రమల్లోనే బతికే పరిస్థితుల్ని క్రియేట్ చేస్తారు.అక్కడి నుంచి రూమువైపు బయల్దేరాను. ప్రేమ పుట్టడానికి నిమిషమో అరనిమిషమో సరిపోతుంది. కానీ దాన్ని గెలుచుకోవడానికి ఎన్నో బలులు జరగాలి. ఎన్నో జీవితాలు మట్టిలో కలిసిపోవాలి!
∙∙
‘‘నీతో మాట్లాడాలి’’ అన్నానొకసారి.‘‘ఏంటి విషయం? చెప్పు’’ అంది.‘‘ఇక్కడ కాదు. అక్కడ...’’ కొండపై కనిపిస్తున్న ఫుడ్ కోర్ట్ వైపు చేయి చూపించాను.ఎకడమిక్ బ్లాక్స్, లైబ్రరీ దాటి ఫుడ్ కోర్ట్ దగ్గరకి చేరుకుని బాదంచెట్టు కింద కూర్చున్నాక ‘‘చెప్పు’’ అంది. ‘‘ఇంకో నెలలో ఇంజినీరింగ్ పూర్తవుతుంది. ఎక్కడో ఒకచోట ఏదో ఒక జాబ్ వస్తుంది. నువ్వొప్పుకుంటే పెద్దలతో మాట్లాడతాను’’ అన్నాను సూటిగా విషయంలోకి వస్తూ. ‘‘ఒప్పుకోకపోతే...’’నాకంటే సూటిగా వచ్చిందా మాట.వెంటనే సమాధానం చెప్పలేక తడబడ్డానో క్షణం.
‘‘చెప్పు.. కలలు కందామా? కలిసుందామా?’’ మళ్ళీ తనే అడిగింది రెట్టిస్తూ. నా నుంచి సమాధానం లేదు.‘‘చూడు... ఇంటర్ నుంచి చందూ, ఇంజనీరింగ్ రెండో సంవత్సరం నుంచి పవన్ వెంటపడుతున్నారు. ఇప్పుడు నువ్వు! నా ఇష్టంతో పనిలేదు. మీకిష్టం అయింది కాబట్టి దాన్నే నా ఇష్టంగా మార్చుకోవాలి. పోనీ నువ్వే చెప్పు... మీ ముగ్గురిలో ఎవర్ని ఇష్టపడాలో’’ అంది.
మళ్ళీ నాలో అలజడుల జలపాతాలు మొదలయ్యాయి.‘‘ఈ వయసులో మన కష్టాన్నే ఇష్టంగా మార్చుకోవాలి. మంచి భవిష్యత్తు గురించి కలలు కనాలి. అనుభవాలను ఆలోచనలను ఎదుగుదలకు సోపానాలుగా మలచుకోవాలి. అంతేగానీ అమ్మాయి బాగుందనో, పరిచయమైందనో ప్రేమిస్తున్నానని చెప్తే అది ఇద్దరి భవిష్యత్తుకూ మంచిది కాదు.
చదువుకునే వయసులో ప్రేమలు, పెళ్ళిళ్ళు మంచివి కాదు. ప్రేమించుకుని అందరికంటే ముందు కొన్ని అనుభవాలను పొందాలని తహతహలాడతాం. కానీ అవే భవిష్యత్తులో పీడకలలుగా మారి జీవితాంతం వెంటాడతాయి. రోజూ పేపర్లో ఎన్నో దారుణాలు చదువుతున్నాం. ప్రేమించకపోతే చంపేస్తారు, చెప్పినట్టు వినకపోతే చంపేస్తారు, మాట్లాడితే చంపేస్తారు, మాట్లాడకపోతే చంపేస్తారు. కొన్నాళ్ళు కలిసుండడం ఆ తర్వాత చంపేయడం! కలిసుండడానికి ఇష్టపడ్డప్పుడు, విడిపోవడానికి కూడా ఇష్టపడొచ్చు కదా! చంపడమెందుకు? ‘మీరిద్దరూ నాకు స్నేహితులు.
ప్రేమించే ఉద్దేశం లేద’ని వాళ్ళతో చెప్పేయొచ్చు. దాని పర్యవసానాలు వేరుగా ఉండేవి. అందుకే.. నా చుట్టూ నేనొక గోడ కట్టుకున్నాను. నా జాగ్రత్తలో నేనుంటున్నాను. నా కారణంగా వాళ్లిద్దరూ గొడవపడుతున్నారని విన్నప్పుడల్లా ఎంతో బాధ కలుగుతుంది. వయసుతో పాటు జ్ఞానమో సంస్కారమో పెరగాలి. ఇవి రెండూ పెరగని వాళ్లని ఏమనాలో నువ్వే ఆలోచించుకో’’ చెప్పి అక్కడి నుంచి లేచింది.కొద్దిదూరం నడిచాక ఆమె ఫోన్ మోగింది.‘‘ఏ నావదే తీరమో, ఏ నేస్త మే జన్మ వరమో..’’ పాట కూడా ఆమెతో పాటే వెళ్ళిపోయింది.
మనుషులు విడిపోడానికి సునామీలు చెలరేగాలా?మనసులు దూరమవడానికి అగ్నిపర్వతాలు బద్దలవ్వాలా?గుండె సముద్రమై ఎగసినప్పుడో, పూలు వాడి నేలరాలినప్పుడో, కళ్లల్లో నదులు పొంగినప్పుడో, కలవరంతో గుండె మండినప్పుడో! ఏమో... ఎప్పుడో... ఎలాగో... విడిపోతూనే ఉంటారు! తీరం చేరే నావలు కొన్నే.. కొన్ని అలల ధాటికి చెల్లాచెదురౌతాయి! మరికొన్ని మధ్యలోనే మునిగిపోతాయి! మరికొన్ని నావలు... తీరం ఎటున్నదో తెలియక సాగుతూ...నే ఉంటాయి!