
పూర్వం సంతప్తకుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సంసార వ్యామోహం లేనివాడై, తపోవృత్తితో జీవించేవాడు. తపోబలంతో పాపరహితుడై, అరణ్యాలలో సంచరిస్తూ ఉండేవాడు. బాహ్యచిత్తవృత్తులను నిరోధించి, ఇంద్రియాలను జయించాలనే తలపుతో అతడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. అటవీమార్గంలో ప్రయాణిస్తుండగా, సంతప్తకుడు దారితప్పిపోయాడు. కాకులు దూరని కారడవిలాంటి కీకారణ్యంలోకి చేరుకున్నాడు. అడవిలో మహావృక్ష్యాలు, నేలంతా పాకి ఉన్న లతలు, గుబురుగా వ్యాపించి ఉన్న పొదలు నిండి ఉండటంతో అతడికి దారీ తెన్నూ కానరాలేదు. అక్కడక్కడా క్రూర జంతువులు, సాధు జంతువులు, పక్షులు తప్ప ఆ కీకారణ్యంలో ఎక్కడా నరసంచారం లేదు. సంతప్తకుడికి భయం కలగలేదు గాని, దారి తోచలేదు. దైవసంకల్పం ఎలా ఉంటే అలాగే జరుగుతుందని అనుకుంటూ ముందుకు సాగాడు.
ఇంతలో చీకటి పడింది. అసలే కీకారణ్యం, ఆపై చిమ్మచీకటి. కీచురాళ్ల రొద, కర్ణకఠోరంగా గుడ్లగూబల అరుపులు, అక్కడక్కడా క్రూరమృగాల గర్జనలు వినిపించసాగాయి. అయినా సంతప్తకుడు ఆగలేదు. ముందుకు నడవసాగాడు. ఇంతలో అత్యంత జుగుప్సాకరమైన దృశ్యం కనిపించడంతో, నిశ్చేష్టుడై అక్కడే నిలిచిపోయాడు.ఒక మర్రిచెట్టు వద్ద ఐదు ప్రేతాలు ఒక శవాన్ని పీక్కు తింటున్నాయి. అవి చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాయి. మనిషి అలికిడి వినిపించడంతో ప్రేతాలు తేరిపార చూశాయి. వాటికి సంతప్తకుడు కనిపించాడు. అతడిని చూసి, ప్రేతాలు ఆనందంగా గంతులు వేశాయి. ‘వీణ్ణి నేను తింటాను’ అంటే ‘నేను తింటాను’ అంటూ అవి అతడి వైపు పరుగుతీశాయి.
అతడి కాళ్లను రెండు ప్రేతాలు, చేతులను రెండు ప్రేతాలు పట్టుకోగా, ఐదో ప్రేతం తల పట్టుకుంది. అవన్నీ అతడిని తీసుకుని ఆకాశంలోకి ఎగిరాయి. కిందనున్న శవంలో ఇంకా మాంసం ఉండటంతో, దానిని వదిలేయడం ఇష్టంలేక మళ్లీ కిందకు వచ్చి, దానిని కాళ్ల మధ్య ఇరికించుకుని, మళ్లీ పైకిలేచి ఎగరసాగాయి. ఈ పరిణామానికి సంతప్తకుడు భయభ్రాంతుడై, తనను ఆపద నుంచి గట్టెక్కించమంటూ మహావిష్ణువును ప్రార్థించడం ప్రారంభించాడు.సంతప్తకుని ప్రార్థనకు కరిగిన మహావిష్ణువు తానే స్వయంగా బయలుదేరాడు. ఆయన అక్కడకు చేరుకునే సరికి సంతప్తకుడు ప్రేతాల మూపులపై హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. మహావిష్ణువు సంతప్తకుడిని తీసుకుపోతున్న ప్రేతాలను అనుసరించసాగాడు.
తోవలో మణిభద్రుడు అనే యక్షరాజు కనిపించాడు. విష్ణువు అతడికి కనుసైగ చేయడంతో అతడు ప్రేతాలకే భయంగొలిపే భీకరరూపం దాల్చి వాటి ఎదుట నిలిచాడు. మణిభద్రుడి భీకరాకారాన్ని చూసి ఆ ప్రేతాలు కొయ్యబారిపోయాయి. అతడు రెండు ప్రేతాలను చేతుల్లోను, రెండు ప్రేతాలను కాళ్లలోను చిక్కించుకుని, మరో ప్రేతాన్ని నోట కరచుకున్నాడు. వాటి చేతుల నుంచి సంతప్తకుడిని విడిపించాడు. పంచప్రేతాలనూ పిడిగుద్దులతో ఒళ్లు హూనం చేశాడు. ప్రేతాల వద్దనున్న శవం పట్టుకుని, అతడు మాయమైపోయాడు.మణిభద్రుడి శిక్షతో, మహావిష్ణువు దయతో ఆ పంచప్రేతాల పాపాలు నశించాయి. మానవాకృతిలో సంతప్తకుడి ముందు మోకరిల్లి, ‘బ్రాహ్మణోత్తమా! మమ్మల్ని క్షమించు. విష్ణుభక్తుడవైన నిన్ను అపహరించి, ఆరగించాలనుకున్నాం. మా పొరపాటుకు మన్నించు’ అని కోరారు.
‘బాబూ! మీరెవరు? ఇదంతా మాయా? లేక నా చిత్తభ్రమా?’ అని ప్రశ్నించాడు సంతప్తకుడు.‘విపోత్తమా! మాయా కాదు, భ్రమా కాదు. మేం ప్రేతాలం. పూర్వజన్మ పాపాల ఫలితంగా ప్రేతాలుగా మారాం’ అని చెప్పారు.‘మీ పేర్లేమిటి? మీకీ దుర్దశ ఎందుకు ప్రాప్తించింది?’ అడిగాడు సంతప్తకుడు.‘మా పేర్లు పర్యుషిత, సూచీముఖ, శీఘ్రగ, రోధక, లేఖకులు’ చెప్పాయి ప్రేతాలు.పూర్వజన్మలో అమాయకుల పట్ల, సాధుజనుల పట్ల చేసిన అపచారాలను, అఘాయిత్యాలను పొల్లు పోకుండా చెప్పుకుని, పశ్చాత్తాపం వ్యక్తం చేశాయి. ప్రేత రూపాల్లో తాము పడుతున్న అగచాట్లను వివరించాయి.సంతప్తకుడు ప్రేతాల బాధలను వింటుండగా, మహావిష్ణువు అతడి ఎదుట సాక్షాత్కరించాడు.మహావిష్ణువును చూడగానే సంతప్తకుడు పులకాంకితుడయ్యాడు.
వెంటనే విష్ణువుకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆయనను రకరకాలుగా స్తుతిస్తూ స్తోత్రపఠనం మొదలుపెట్టాడు. సంతప్తకుడి సన్నిధిలో ఉండటం వల్ల ప్రేతాలు కూడా విష్ణువును ప్రత్యక్షంగా చూడగలిగాయి. మహావిష్ణువు దర్శనమాత్రంతోనే ఆ ప్రేతాల జన్మాంతర పాపాలన్నీ పూర్తిగా నశించాయి.‘ప్రాణులను ఉద్ధరించేది నీవే, పాపాలను పరిహరించేదీ నీవే! పూర్వజన్మ పాపాలకు ఏళ్లతరబడి అగచాట్లు పడుతున్న ఈ ప్రేతాలకు ఉత్తమగతులను ప్రసాదించు స్వామీ’ అని ప్రార్థించాడు సంతప్తకుడు.అతడి ప్రార్థనకు మహావిష్ణువు ప్రసన్నుడయ్యాడు.గంధర్వులు, అప్సరలతో కూడిన ఆరు దివ్యవిమానాలను అక్కడకు రప్పించాడు.సంతప్తకుడిని, అతడితో పాటు పంచప్రేతాలను ఆ విమానాల్లో వైకుంఠానికి తీసుకుపోయాడు.
∙సాంఖ్యాయన