
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, చాలాచోట్ల ఇంకా రాచరికాలు లాంఛనప్రాయంగా మిగిలి ఉన్నాయి. పలుచోట్ల రాజ సంస్థానాల వారసులకు పట్టాభిషేకాల వంటి లాంఛనాలు కొనసాగుతుండటం మనకు తెలిసిన సంగతే! నాగరిక రాజ్యాలు, సంస్థానాల వ్యవహారాలు సరే, దక్షిణాదిన ఏకైక ఆదివాసీ రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు కూడా ఉన్నాడు.
అదే కేరళలోని మన్నన్ రాజ్యం. పుష్కరం కిందట ఆ రాజ్యానికి కొత్త రాజు వచ్చాడు. ఆయన పట్టభద్రుడు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ప్రభుత్వ ఆహ్వానంపై హాజరైన ఈ చదువుకున్న మారాజు కథా కమామిషూ..
కేరళలోని ఇడుక్కి జిల్లా కట్టప్పన గ్రామానికి చేరువలో ఉంటుంది మన్నన్ రాజ్యం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దక్షిణాదిన మిగిలి ఉన్న ఏకైక ఆదివాసీ రాజ్యం ఇది. ఈ రాజ్యానికి 2012లో కొత్త రాజు వచ్చాడు. ‘రామన్ రాజమన్నన్(Raman Rajamannan)’గా పట్టాభిషిక్తు డయ్యాడు. అతడి అసలు పేరు బిను. అతడికి ముందున్న రాజు ‘అరియన్ రాజమన్నన్’. అతడు 29 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. అరియన్ రాజమన్నన్‌కు ముందున్న రాజు ‘దేవన్ రాజమన్నన్’ తన 54వ ఏట చనిపోయాడు. ఇప్పటి రాజు రామన్ రాజమన్నన్ అలియాస్ బిను మన్నన్ రాజ్యానికి పదిహేడో రాజు. అతడికి ముందున్న రాజులందరూ నిరక్షరాస్యులే! రామన్ రాజమన్నన్ ఎర్నాకుళం మహారాజా కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తిచేశాడు.
మన్నన్ రాజ్యానికి ఎవరు రాజైనా, వారికి ‘రాజమన్నన్’ గౌరవ బిరుదనామం వస్తుంది. మన్నన్ తెగ ప్రజలది మాతృస్వామ్య సమాజం. దేశ పాలనా యంత్రాంగానికి లోబడే ఈ రాజ్యం నడుస్తోంది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయి. ఇడుక్కి జిల్లావ్యాప్తంగా 62 చోట్ల విస్తరించి ఉన్న మూడువందలకు పైగా మన్నన్ తెగ కుటుంబాల మంచిచెడ్డలను ప్రస్తుత రాజు రామన్ రాజమన్నన్ చూసుకుంటారు. ఈ రాజుకు ఒక ఆస్థానం, ఆ ఆస్థానంలో తొమ్మిదిమంది మంత్రులు ఉంటారు.
ప్రజల పెళ్లిళ్లు, విడాకులు సహా తెగకు సంబంధించిన అంతర్గత సమస్యలు, బయటి నుంచి తెగ ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం రాజు బాధ్యతే! రాజుకు హఠాత్తుగా అనారోగ్యం వాటిల్లినా, రాజు మరణించినా, కొత్తరాజు వచ్చేంత వరకు రాజ్యభారాన్ని మంత్రులు చూసుకుంటారు. మన్నన్ ప్రజలు రాజును తమ పాలకుడిగానే కాకుండా, ఆధ్యాత్మిక మార్గదర్శిగా కూడా గౌరవిస్తారు. ఒక రాజు, అతడికి ఒక ఆస్థానం అంటే భారీగా ఊహించుకుంటారేమో! ఈ రాజుకు, ఆయన ఆస్థానానికి భారీ భవంతులు, రాజప్రాసాదాలూ ఉండవు. మామూలు పక్కా ఇల్లే ఆయన నివాసం, ఆస్థానం.
రామన్ రాజమన్నన్ భార్య బినుమాల్ మన్నన్ తెగప్రజలకు రాణి. వీరి కూతురు అర్చన యువరాణి. మన్నన్ ప్రజల్లో ఎక్కువమంది వ్యవసాయ పనులు చేసుకుంటారు. వీరిలో కొందరు అటవీశాఖలో చిన్న చిన్న ఉద్యోగాల్లో కుదురుకున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు రామన్ రాజమన్నన్ సకుటుంబంగా హాజరయ్యారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును స్వయంగా కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేడుకలకు ఆహ్వానం అందుకున్న తొలి మన్నన్ రాజుగా ఆయన దేశ ప్రజలకు కనిపించారు. రిపబ్లిక్ డే వేడుకలు ముగిశాక రాజదంపతులు ఢిల్లీలోని ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి జనవరి 31 వరకు అక్కడే ఉన్నారు. వారు ఫిబ్రవరి 2న తిరిగి తమ రాజ్యానికి చేరుకున్నారు. వీరి ప్రయాణ ఖర్చులను గిరిజనాభివృద్ధి శాఖ పెట్టుకుంది.
మన్నన్‌ల చరిత్ర!
ఏడు వందల ఏళ్ల క్రితం పాండ్య, చోళ రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది. యుద్ధంలో పాండ్యరాజు చిరై వర్మన్ ఓడిపోయాడు. కొద్దిమందిని వెంటబెట్టుకుని తన రాజ్యం నుంచి పారిపోయి, ఇప్పటి ఇడుక్కి జిల్లాలోని అటవీ ప్రాంతానికి వచ్చి, కొత్త రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. అదే ఈ మన్నన్ రాజ్యమని స్థానిక మన్నన్ తెగ ప్రజలు చెబుతారు.
విద్యను అందించడమే లక్ష్యం
రాజుగా నా ప్రజలందరికీ విద్యను అందించడమే నా ప్రధాన లక్ష్యం. విద్యతోనే ఆదివాసీల జీవితాలు మెరుగుపడతాయి. నేటితరానికి ఈ అవగాహనను కల్పించడం ద్వారానే పేదరికాన్ని నిర్మూలించగలం – రామన్ రాజమన్నన్
పిల్లల్ని చదివించటం అంటే వారికి రాయల్ లైఫ్‌ను ఇవ్వటమే. – రాజమన్నన్