పూర్వం కాశీక్షేత్రాన్ని రాజధానిగా చేసుకుని, ఇక్ష్వాకు వంశానికి చెందిన కీర్తిమంతుడు పాలించేవాడు. ఒకనాడు కీర్తిమంతుడికి వేట మీద కోరిక పుట్టి, అడవిలో వసిష్ఠాశ్రమ పరిసరాలకు వెళ్లాడు. అప్పుడది వైశాఖమాసం. వసిష్ఠ మహర్షి శిష్యులందరూ వైశాఖమాస ధర్మాలను ఆచరిస్తూ సందడిగా కనిపించారు. వైశాఖమాస ధర్మకార్యాలను అప్రతిహితంగా కొనసాగించడానికి వసిష్ఠ మహర్షి అప్పటికే ఆశ్రమానికి చేరువలో బాటసారుల దప్పిక తీర్చడానికి చలివేంద్రం, వారు సేదదీరడానికి అనువుగా చలువ పందిరితో ఒక విడిది మంటపం ఏర్పాటు చేశాడు. వసిష్ఠుడి శిష్యుల్లో కొందరు చలివేంద్రం వద్ద నిలబడి బాటసారుల దప్పిక తీరుస్తున్నారు. ఇంకొందరు విడిది మంటపంలో ఉన్నవారికి రసభరితమైన పండ్లు అందిస్తున్నారు.
మరికొందరు సేదదీరుతున్న బాటసారులకు విసనకర్రలతో గాలి విసురుతూ సపర్యలు చేస్తున్నారు. ఇదంతా చూసిన కీర్తిమంతుడు ఆశ్చర్యపోయాడు. వసిష్ఠుడి శిష్యులను సమీపించి, ‘మునికుమారులారా! మీరంతా ఎవరు? ఇదంతా ఎందుకు చేస్తున్నారు?’ అని ప్రశ్నించాడు.‘రాజా! మేమంతా వసిష్ఠ మహర్షి శిష్యులం. ఆయన ఆదేశం మేరకు వైశాఖ ధర్మాలను నెరవేరుస్తున్నాం’ అని బదులిచ్చారు.‘ఏదైనా క్రతువులో భాగంగా ఈ పనులన్నీ చేస్తున్నారా? ఏ దేవత ప్రీతి కోసం ఇదంతా చేస్తున్నారు? దీనివల్ల ఫలితమేమిటి?’ అడిగాడు కీర్తిమంతుడు.
‘రాజా! గురువు ఆజ్ఞ మేరకు ఈ పనులన్నీ చేస్తున్నాం. వివరాలేవీ మాకు తెలియవు. ఆయనను కలుసుకుని, నేరుగా అడిగితే, ఆయనే చెప్పగలరు’ అని చెప్పారు శిష్యులు.కీర్తిమంతుడు వసిష్ఠాశ్రమంలోకి ప్రవేశించి, వసిష్ఠ మహర్షికి నమస్కరించాడు. ‘మహర్షీ! నేను ఇటువైపుగా వస్తుంటే, మీ శిష్యులందరూ బాటసారులకు కని విని ఎరుగని సపర్యలు చేస్తూ కనిపించారు. ఇది ఏమైనా ప్రత్యేకమైన క్రతువా? దీని వల్ల ఫలితమేమిటి? మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది’ అని అభ్యర్థించాడు.
వసిష్ఠుడు కీర్తిమంతుడి జిజ్ఞాసకు సంతోషించాడు.‘రాజా! నా శిష్యులు చేస్తున్నవన్నీ వైశాఖమాస ధర్మాలు. వైశాఖమాసంలో మానవులందరూ తప్పనిసరిగా ఆచరించాల్సినవి– స్నానం, దానం. ఎన్ని ధర్మాలను ఆచరించినా, స్నాన దానాలను ఆచరించని మానవులు శ్రీహరికి ప్రీతిపాత్రులు కాలేరు. వైశాఖధర్మాలు సులభసాధ్యాలు. దప్పిగొన్న వారికి నీరు ఇవ్వడం, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, అలసిన వారికి విశ్రాంతి పొందడానికి ఏర్పాట్లు చేయడం వంటి సామాన్య చర్యలే వైశాఖధర్మాలు. వీటిని ఆచరించిన మానవులకు శ్రీహరి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది’ అని చెప్పాడు.
కీర్తిమంతుడు సంతోషంతో వసిష్ఠుడికి కృతజ్ఞతలు తెలుపుకొని, తన రాజధానికి చేరుకున్నాడు. మరునాడే తన భటులతో రాజ్యమంతటా ఇలా చాటింపు వేయించాడు: ‘నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఎనిమిదేళ్ల పైబడిన బాలలు మొదలుకొని వృద్ధుల వరకు వైశాఖమాసంలో అనుదినం స్నానం చేయాలి. సంపన్నులు చలివేంద్రాలను, బాటసారులకు భోజనశాలలను, విడిది మందిరాలను ఏర్పాటు చేయాలి. స్నాన దానాలు చేయనివారికి కఠిన శిక్షలు తప్పవు’.
కీర్తిమంతుడి రాజ్యంలో ప్రజలందరూ రాజాజ్ఞను తు.చ. తప్పకుండా పాటించసాగారు. రాజ్యంలో ఎవరూ ధర్మం తప్పనందున కాలంతీరి ఎవరు మరణించినా, వారందరూ నేరుగా విష్ణులోకానికి పోతున్నారు. యమలోకానికి వెళ్లేవారు ఎవరూ లేకపోయారు.ఇదే పరిస్థితి కొనసాగితే తన ఉనికికే ముప్పు వస్తుందని తలచిన యముడు తన పరివారంతో బయలుదేరి, కీర్తమంతుడి రాజ్యాన్ని ముట్టడించాడు. యుద్ధానికి పిలుపుగా భీకర శంఖారావం చేశాడు.
కీర్తిమంతుడు సైన్య సమేతంగా యుద్ధానికి సన్నద్ధుడై వచ్చాడు. ఉభయ సైన్యాలకు భీకర పోరు సాగింది. కీర్తిమంతుడు తన శక్తిమంతమైన బాణాలతో యమదూతలను రణరంగం నుంచి తరిమికొట్టాడు. యముడు నేరుగా కీర్తిమంతుడితో తలపడ్డాడు. తీక్షణమైన బాణాలతో కీర్తిమంతుడిని నొప్పించి, సింహనాదం చేశాడు. కీర్తిమంతుడు మూడు బాణాలతో యముడి ధనుస్సును విరిచేశాడు.
ఆగ్రహించిన యముడు కాలదండాన్ని తీసుకుని, కీర్తిమంతుడిపైకి విసిరాడు.తన భక్తుడైన కీర్తిమంతుడి రక్షణ కోసం శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని సంధించాడు. ఆ చక్రం శరవేగంతో దూసుకొచ్చి, కాలదండాన్ని విసిరికొట్టింది. అది యముడి మీదకొచ్చింది. ఈ పరిణామానికి దేవతలంతా హాహాకారాలు చేసి, యముడిని క్షమించమని ప్రార్థించడంతో విష్ణువు తన చక్రాన్ని ఉపసంహరించుకున్నాడు. కీర్తిమంతుడి చేతిలో ఎదురైన ఓటమికి తలవంచుకుని, యముడు తిరిగి తన లోకానికి బయలుదేరాడు.
∙సాంఖ్యాయన


