6 నెలల వ్యవధిలో 13 హత్యలు.. ఇప్పటికీ అతని పేరు కూడా మిస్టరీనే !

Stone Man: విచక్షణ కోల్పోయిన మనుషులకు ఇతరుల జీవితాలు ఎప్పటికీ ఓ ఆటే. అవసరం ఉన్నా లేకపోయినా అవకాశం ఉన్న ప్రతిసారీ.. ఉన్మాదపు కోరలతో బుసకొట్టడం, తాము చేసిన వికృతానికి జడిసిపోయే సమాజాన్ని అజ్ఞాతంగా గమనిస్తూ గర్వపడటం సైకోలకు అలవాటే. చరిత్ర మోసిన ఈ తరహా రక్తపు మరకల్లో మనదేశానికి చెందిన స్టోన్‌మేన్ కథ ఒకటి. ముంబై, కోల్‌కతా వంటి మహా నగరాలను గజగజలాడించిన ఈ రాక్షసుడి జీవితం నేటికీ ఓ మిస్టరీనే.
1985లో మొదలైన అతని హత్యాకాండ.. 2009 వరకూ కొనసాగింది. అతని టార్గెట్.. నిరాశ్రయులు, అనాథలే. కటిక దారిద్య్రంతో అల్లాడిపోతూ.. బంధాలు, బంధువులు లేక.. ఒంటరిగా ఆరుబయట, ఒళ్లు మరచి పడుకునే అభాగ్యులను నిర్దాక్షిణ్యంగా బండరాయితో మోది చంపేసేవాడు. గుర్తుపట్టలేని విధంగా ముఖాలను ఛిద్రం చేసి.. పోలీసులకే సవాలుగా మారాడు. 1989లో కోల్‌కతా పోలీసులకు.. అక్కడి మొదటి కేసుతోనే.. వెన్నులో వణుకు పుట్టించిన ఈ సీరియల్ కిల్లర్.. 6 నెలల వ్యవధిలో ఒకే విధంగా 13 హత్యలు చేశాడు. హత్యకు గురైనది ఎవరో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి.
చీకటిపడితే చాలు బయట అంతా భయం.. భయం
చీకటిపడితే ఇళ్ల నుంచి బయటికి రావద్దని.. ఒంటరిగా తిరగొద్దని నగరవాసులకు హెచ్చరికలు జారీ చేసే వారు పోలీసులు. రాత్రయితే చాలు అన్ని ఇళ్లకు తాళాలు పడేవి. ఆ జనసముద్రం కాస్త అలజడి లేని నిర్మానుష్య ఎడారి అయిపోయేది. అలా అతగాడ్ని పట్టుకోవడానికి పెద్దఎత్తునే ప్రయత్నాలు చేశారు. కానీ ఆచూకీ దొరకలేదు. రాయితో చంపుతున్నాడు కాబట్టి మీడియా అతడికి స్టోన్‌మేన్ అని పేరుపెట్టింది. హత్యకు సుమారు 30 కిలోల బండరాయిని ఉపయోగించేవాడని తేలింది.
చంపిన తీరును బట్టి.. అతడు బలిష్టమైన కండలు కలిగిన వాడని, పొడగరని అంచనా వేశారు. ఎందరో అనుమానితుల్ని విచారించారు.పైగా హత్యకు గురైన బాధితులంతా అనాథలు, నిరాశ్రయులే కావడంతో వారిని ఎవరూ గుర్తించలేకపోయారు. మృతదేహానికి దరిదాపుల్లో ఎలాంటి బండరాయి కానీ, బలమైన రాడ్డు కానీ ఎప్పుడూ దొరకలేదు.కోల్‌కతా కంటే ముందే 1985–88 మధ్యకాలంలో ముంబైని వణికించాడు ఈ స్టోన్‌మేన్. అక్కడా ఇదే తరహాలో నిరాశ్రయులైన 26 మంది అనాథలను హత్య చేసి కోల్‌కతాకు చేరాడు.
సినిమా కూడా తెరకెక్కింది
2009లో అస్సాంలోని గువాహటిలో కూడా ఇలాంటి హత్యలే జరగడంతో వాటిని కూడా స్టోన్‌మేన్ ఖాతాలోనే వేశారు పోలీసులు. ఈ వాస్తవ ఘటనల ఆధారంగా 2009లో ‘ది స్టోన్‌మేన్ మర్డర్స్’ అనే సినిమా తెరకెక్కింది హిందీలో. ఎన్ని విచారణలు జరిపినా.. ఎన్ని రాష్ట్రాలు మారినా.. నేటికీ స్టోన్‌మేన్ జాడ కాదుకదా కనీసం అతని అసలు పేరు కూడా ఈ ప్రపంచానికి తెలియలేదు.