భవిష్యత్తులో పిల్లలు ఇబ్బందులు పడకూడదని, అందుకు ఆస్తులు సంపాదించి పెట్టాలని చాలావరకు తల్లిదండ్రులు అనుకుంటుంటారు. ‘కానీ, పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, ధైర్యమే!’ అంటారు నీలిమ. కోర్టు సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన శ్రీదేవి అప్పల్ల నీలిమ కూతురు.సింగిల్ పేరెంట్‌గా ఇద్దరు కూతుళ్ల పెంపకంలో తను తీసుకున్న జాగ్రత్తలు, జీవితంలో ఎదురైన సవాళ్లను అధిగమించిన విధానాలను ఇలా మన ముందుంచారు..
‘‘నేను రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసేదాన్ని. చాలా పనుల్లో ఆడ మగ అనే తేడా చూపుతారు. నేను చిన్నప్పటి నుంచి అలా చూసేదాన్నికాదు. అందుకే, ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఇద్దరు అమ్మాయిలను పెంచాను. మాది కాకినాడ. మాకు కొద్దిపాటి ఆస్తి ఉంటే, దాన్ని అమ్మి, తిరిగి మరో ఆస్తి కొని, అమ్మి... అలా వచ్చిన డబ్బులతో పిల్లలిద్దరినీ సాకాను. నా పిల్లలు కూడా నాలాగా ధైర్యంగా ఉండాలనుకుంటాను. నా పెద్ద కూతురు దివ్యజ్యోతి బీఎస్సీ పూర్తయ్యాక, జాబ్ చేస్తుంది. చిన్నమ్మాయి శ్రీదేవి సినిమాలలో తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది.
సినిమా స్టార్ కావాలనుకున్నాను...
మా అక్క తమిళ, మలయాళ సినిమాలలో నటించేది. ఆ సమయంలో నేను నాకు కూతురు పుడితే, సినిమాల్లోకి తీసుకురావాలని ఆ రోజుల్లోనే అనుకునేదాన్ని. కానీ, ఆ విషయాన్ని కాలక్రమంలో మర్చిపోయాను. ఆ తర్వాత మా అక్క సినిమాలు మానేసి, కుటుంబ వాతావరణంలోకి వచ్చేసింది. నాకూ కుటుంబ పరిస్థితుల వల్ల చిన్న వయసులోనే పెళ్లయ్యింది. ఇద్దరు కూతుళ్లు పుట్టాక, ఒంటరిగా జీవితాన్ని మొదలుపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దివ్యకు బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలని ఉండేది. శ్రీదేవికి టీచర్ అవ్వాలని ఉండేది. ఇద్దరినీ చదువుకోమనే ప్రోత్సహించాను. అయితే, ఇంట్లో శ్రీదేవి టీచర్‌లా యాక్ట్ చేస్తుండేది. అది చూసి, ఈ అమ్మాయి చేత రీల్స్ చేయిస్తే బాగుంటుందనుకున్నాను. తను స్కూల్ నుంచి రాగానే ఓ గంట రెస్ట్ ఇచ్చి, గ్రీనరీ ప్లేస్‌ల్లోకి తీసుకెళ్లి రీల్స్ చేసేవాళ్లం. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో శ్రీదేవికి మంచి పేరు రావడంతో పాటు, సినిమా అవకాశాలూ వచ్చాయి.
మంచి – చెడు చూసే విధానంలోనే..!
ఒకప్పటి రోజులకు ఇప్పటి రోజులకు అన్ని చోట్లా చాలా మార్పులు వచ్చాయి. అవకాశాలూ పెరిగాయి. అమ్మాయిలు ఒంటరిగానే ప్రతి సమస్యను సాల్వ్ చేసుకుంటున్నారు. ‘ఎవరినో తప్పు పట్టడం కాదు, మనం మన జాగ్రత్తలో ఉండాలి’ అని చెబుతుంటాను. దానిని శ్రీదేవి కూడా బాగా అర్థం చేసుకుంటుంది. ఏ పని చేసినా డబ్బు సంపాదించడానికే. కానీ, చదువు మాత్రం ఉండాలి. శ్రీదేవి జూనియర్ ఇంటర్ పూర్తి చేసింది. పై చదువుల కోసం డిస్టెన్స్‌లో ప్లాన్ చేస్తున్నాం. నేను చెప్పేవి ఇద్దరూ బాగా వింటారు. వారేం అనుకున్నారో అవి కూడా స్పష్టంగా చెబుతారు. వాటిలో మంచి చెడులు చెబుతాను. సంతోషంగా ఉండటానికి ఏం చేయాలో కూడా మాట్లాడుకుంటూ ఉంటాం.
కలిసే టూర్లు..
బయటి స్నేహాలను ఎంకరేజ్ చేయడం లేదు. ఫ్రెండ్స్‌తో టూర్స్‌కి వెళ్లచ్చు కదా అంటారు. కానీ, ‘నో’ అనే చెబుతాను. నాకూ ట్రావెలింగ్ అంటే ఇష్టం కాబట్టి మేం ముగ్గురం కలిసి టూర్స్‌కి వెళుతుంటాం. దివ్యకు సినిమా డైరెక్షన్ అంటే ఇష్టం అని చెబుతుంటుంది. కానీ, చదువుకు న్యాయం చేసే జాబ్ కొన్నాళ్లు తప్పక చేయమని చెబుతాను. శ్రీదేవికి సావిత్రి, సౌందర్యలాగా పేరు తెచ్చుకోవాలని కోరిక. వారిలాగే ట్రెడిషనల్‌గా ఉండటం, అలాంటి పాత్రలతో మెప్పించడం ఇష్టం. నేను కూడా అలాంటి ఇష్టాలను ఎంకరేజ్ చేస్తుంటాను. నాటి నటీనటుల సినిమాలు కలిసి చూస్తాం.
కష్టం విలువ తెలుసుకున్నారు..
సింగిల్ పేరెంట్‌గా పిల్లల పెంపకంలో కష్టపడ్డాను అని చెప్పలేను. ఎందుకంటే, నా కష్టాన్ని పిల్లలు అర్థం చేసుకున్నారు. నా మాట విన్నారు. నా వరకు చూసుకుంటే తండ్రి ఉంటేనే పిల్లల్ని బాగా పెంచగలుగుతారు అనుకోవడం తప్పు అనిపిస్తుంది. నా భర్త సపోర్ట్ లేకపోయినా పిల్లల్ని పెంచాను. అయితే, పిల్లలిద్దరూ నా మాట విన్నారు కాబట్టి వారి పెంపకం సులువై ఉంటుంది. అందరి పిల్లలు అలా వినాలని ఏమీ లేదు. నేను ఏదైనా విషయంలో బాధపడితే పిల్లలిద్దరికీ విషయం వెంటనే అర్థమైపోతుంది. వాళ్లు అర్థం చేసుకుని, నన్ను కష్టపెట్టకూడదని సెట్ అయిపోతారు.
సాయం చేసే గుణం..
నేను ఒక్కదాన్నే పిల్లల్ని కష్టపడి పెంచుకుంటున్నప్పుడు ఎవరూ సాయం చేయలేదు. కానీ, పిల్లలకు ఇప్పుడు కొంచెం ఫేమ్ వచ్చి, డబ్బు సంపాదిస్తున్నారని.. కొందరు దగ్గరవుతుంటారు. అలాంటప్పుడు పిల్లలు వాళ్లను దూరం పెట్టమని చెప్పరు. ‘కష్టంలో ఉన్నారు కదా! హెల్ప్ చేయమ్మా!’ అని నాకే చెబుతారు. ఎదుటివారికి సాయపడే గుణం ఇద్దరికి వచ్చిందని సంతోషిస్తాను..
‘మీకు భవిష్యత్తులో పెళ్లిళ్లు అయ్యి, మీ కుటుంబాలు మీకు ఉన్నా.. నేను నాలాగే, మీకు తల్లిలా, ఓ స్నేహితురాలిగా ఉంటాను’ అని చెబుతాను. ‘నువ్వు కోల్పోయిందంతా మేం తిరిగి తీసుకొస్తాం అమ్మా!’ అని పిల్లలు అంటుంటారు. వాళ్లు జీవితంలో మంచిగా స్థిరపడితే అంతే చాలు అనుకుంటాను. నేను, నా ఇద్దరు కూతుళ్లు ఫ్రెండ్స్‌లా ఉంటాం. మా ఇద్దరి కూతుళ్లతో పాటు మైకి అని ఓ పెట్ ఉంది. అది కూడా మా కుటుంబంలో ఓ సభ్యురాలే. నలుగురం ఒకదగ్గర ఉంటే మా సందడి అంతా ఇంతా కాదు. మా ఆనందం ఇలా మాతో ఎప్పటికీ ఉండాలని కోరుకుంటాను’’ అని వివరించారు తల్లిగా నీలిమ.
∙నిర్మలారెడ్డి


