ఓ డాక్టరమ్మా… ఈ ఎముకల గూడు చెప్పిన పాఠం వింటావా? | Sejal Pawar Video: What Nirona bones in Germany are trying to say | Sakshi
Sakshi News home page

ఓ డాక్టరమ్మా… ఈ ఎముకల గూడు చెప్పిన పాఠం వింటావా?

Jun 12 2026 2:00 PM | Updated on Jun 12 2026 2:52 PM

Sejal Pawar Video: What Nirona bones in Germany are trying to say

పోయినోళ్లందరూ మంచోళ్లే... ఉన్నోళ్లూ పోయినోళ్ల తీపి గురుతులు అన్నారో సినీకవి. బతికి ఉన్నప్పుడు దక్కని గౌరవం.. మనిషికి చనిపోయాకైనా దక్కుతుందని చెబుతుంటారు. కానీ, ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో ఆ నమ్మకాన్నే ప్రశ్నార్థకం చేసింది. ప్రాణాలను కాపాడాల్సిన వైద్య వృత్తిలో ఉండి.. మృతదేహాలపై చేసిన ఓ డాక్టర్‌ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. చివరకు తన మాటల తీవ్రత గ్రహించిన ఆమె క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో.. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో జరిగిన ఘటన మరణానంతరం కూడా మనిషికి దక్కాల్సిన గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.

ఒక కామెడీ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యురాలు సీజల్‌ పవార్‌.. మెడికల్‌ కాలేజీ రోజుల్లో శవాలపై నిర్వహించే శిక్షణ (అటాప్సీ/కాడేవర్ స్టడీ) గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ మృతదేహాల ప్రైవేట్‌ పార్ట్‌ల గురించి తాను, తన తోటి డాక్టర్లు జోకులు వేసుకునేవాళ్లమని ఆమె మాట్లాడారు. ఆ సమయంలో కమెడియన్‌ ప్రణీత్ మోర్‌తో‌ సహా అక్కడున్నవాళ్లంతా పగలబడి నవ్వారు. మాట్లాడింది అమ్మాయి కావడంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. అయితే..

మృతదేహాల శరీర భాగాలపై వల్గర్‌ కామెంట్లు సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. వైద్య విద్య కోసం తమ శరీరాలను దానం చేసే వారి పట్ల ఇది అవమానకరమని పలువురు అభిప్రాయపడ్డారు. సరిగ్గా.. ఇదే సమయంలో జర్మనీలో జరిగిన ఓ ఘటనను కొందరు ప్రస్తావించారు..

ష్లైడ్‌ అనే చిన్న పట్టణంలో ఉన్న జోహానెస్‌-స్టుర్మియస్‌ జిమ్నాసియం స్కూల్‌ విద్యార్థులు.. కొన్ని దశాబ్దాలుగా తమకు అనాటమీ పాఠాలు అర్థం కావడంలో సహకరించిన అస్థిపంజరానికి అత్యంత గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. అది భారత్‌కు చెందిన ఓ మహిళ అస్థిపంజరం కావడం.

అప్పటిదాకా అదొక ప్రతీకాత్మక నమునా(ప్లాస్టిక్‌)గా భావించిన విద్యార్థులు.. అసలు విషయం అర్థమయ్యాక తెగ బాధపడిపోయారు. దశాబ్దాలుగా ప్రయోగశాలలో వేలాడుతున్న ఆ అస్థిపంజరం బ్రిటిష్‌ పాలనా కాలంలో యూరప్‌కు తరలించిన వేలాది భారతీయ మృతదేహాల్లో ఒకటిగా గుర్తించారు. ఆ మహిళ అస్థిపంజరానికి "నిరాన్‌" అని పేరు పెట్టారు. అక్కడితో వాళ్లు ఆగలేదు..

ఆ మృతదేహం కేవలం బోధనా సామాగ్రి కాదని.. ఒకప్పుడు ప్రాణం ఉన్న మనిషే కదా అనుకున్నారు. స్కూల్‌ నిర్వాహకుల్ని ఒప్పించి గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సిబ్బంది సహకారంతో ఓ శవపేటికలో ఆ అస్తికలు ఉంచి గౌరవప్రదంగా సమాధి ఏర్పాటు చేశారు. 2022లో జరిగిందీ ఘటన.

అయితే ఒకే సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ రెండు ఘటనలు.. "మరణించిన వారికి మనం ఎంత గౌరవం ఇస్తున్నాం?" అనే ప్రశ్నను మరోసారి ముందుకు తెచ్చాయి.

అదొక చీకటి వ్యాపారం
జర్మనీలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మరో చారిత్రక వాస్తవాన్ని గుర్తు చేసింది. బ్రిటిష్‌ పాలనలో భారతదేశం నుంచి వేలాది అస్థిపంజరాలు, మృతదేహాలు యూరప్‌, అమెరికా దేశాలకు ఎగుమతి అయ్యాయి. పేదలు, అనాథలు, గుర్తింపు లేని వ్యక్తుల మృతదేహాలు ఎక్కువగా ఈ వ్యాపారంలో భాగమైనట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వైద్య విద్య, పరిశోధనల పేరుతో సాగిన ఈ వ్యాపారం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కొనసాగి, 1985లోనే పూర్తిగా నిషేధించబడింది.

ఆ గౌరవం ఎక్కడ?..
ఈ చర్చ మధ్య మరో విషాద ఘటనను కూడా చాలామంది గుర్తుచేస్తున్నారు. ఒడిశాలో తన సోదరి మరణాన్ని నిరూపించడానికి బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడంతో.. ఓ వ్యక్తి సమాధి తవ్వి అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకెళ్లిన ఘటన దేశాన్ని కలచివేసింది. అలాగే.. ఆస్పత్రి మార్చురీల్లో నెలల తరబడి గుర్తింపు లేకుండా ఉండిపోయే మృతదేహాలు, అంబులెన్స్‌ లేక భుజాలపై మృతదేహాలను మోసుకెళ్లే పేద కుటుంబాలు, శరీరదానంపై ప్రజల్లో ఉన్న అనుమానాలు.. ఈ ఘటనలు అన్నీ ఒకే ప్రశ్నను మిగులుస్తున్నాయి. మనం నిజంగా మరణించిన వారిని గౌరవిస్తున్నామా? లేక వారి గుర్తింపును, మానవత్వాన్ని కేవలం అవసరాలకు మాత్రమే పరిమితం చేస్తున్నామా?.. జీవించి ఉన్న సమాజం, మరణించినవారికి ఇచ్చే గౌరవంలోనే తన నాగరికతను ప్రతిబింబిస్తుంది. ఆ గౌరవం ఎక్కడ తగ్గిపోతుందో అక్కడ మానవత్వం కూడా మెల్లగా మాయమవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement