ఈ బరువును ఏం చేద్దాం?

School bag weight and the occurrence of back pain among school children - Sakshi

స్కూల్లో టీచర్‌గానీ హెడ్‌మాస్టర్‌ గానీ ఎవరైనా పిల్లవాడి స్కూల్‌బ్యాగ్‌ వీపున తగిలించుకుని ఒక పదిహేను నిమిషాలు నిలబడగలరా? అన్నీ టెక్స్‌›్టలు అన్ని నోట్సులూ రోజూ తేవాలంటే పిల్లల వీపున పెరుగుతున్న బరువు ఎంత? టెక్ట్స్‌బుక్కుల పేజీలు పెరిగితే చదువు భారం. వీపున ఈ బరువు భారం. తల్లిదండ్రులు, న్యాయస్థానాలు పదే పదే చెప్పినా స్కూలు యాజమాన్యాలు మాత్రం ఈ బరువును పట్టించుకోవడం లేదు. పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఈ బరువును ఏం చేద్దాం?

నైట్‌ డ్యూటీ చేసి వచ్చే ఆ తండ్రి ఉదయాన్నే లేవక తప్పదు. ఇద్దరు కూతుళ్లను స్కూల్‌ బస్‌ ఎక్కించాలి. ఒకరు ఆరు, ఒకరు ఎనిమిది. వాళ్లు వెళ్లి ఎక్కగలరు. కాని వాళ్ల స్కూల్‌ బ్యాగులను మోస్తూ మాత్రం వెళ్లి ఎక్కలేరు. వాళ్ల ఇంటి నుంచి ఒక ఫర్లాంగు దూరంలో ఉన్న రోడ్డు మీద బస్సు ఆగుతుంది. సెకండ్‌ ఫ్లోర్‌లో ఉన్న పోర్షన్‌ నుంచి వాళ్లు బ్యాగులను మోసుకుంటూ బస్‌ దగ్గరకు వెళ్లి ఎక్కేసరికి వాళ్ల పని అయిపోతుంది.

నాలుగు రోజులు ఇలా చేస్తే ఐదో రోజు ఒళ్లు నొప్పులు అని స్కూల్‌ ఎగ్గొడతారు. అందుకే తండ్రి లేచి ఆ స్కూల్‌ బ్యాగులను స్కూటర్‌ మీద పెట్టుకుని బస్‌ వరకు వెళ్లి ఎక్కిస్తాడు. మళ్లీ స్కూల్లో బస్‌ ఆగిన చోటు నుంచి క్లాస్‌ రూమ్‌ వరకూ వారు ఆ బ్యాగ్‌ మోయాల్సిందే. ఏం అంత బరువా? అనంటే ఆరో క్లాసు అమ్మాయి బ్యాగు బరువు 8 కిలోలు ఉంటుంది. ఎనిమిదో క్లాసు అమ్మాయి బ్యాగు బరువు పది కిలోలు ఉంటుంది. నిజం!

వెన్ను వంచే బరువు
స్కూలుకు పిల్లలు చదువుకోవడానికే వెళతారు. కాని చదువు పేరుతో బరువు లెత్తే కూలీలుగా వారు వెళ్లకూడదు. జాతి తన వెన్నుముక మీద నిలబడాలని కోరుకునే మనం చిన్న వయసు నుంచి పిల్లల వెన్ను వంచేస్తున్నాం. శాస్త్రీయ సూచన ప్రకారం ఒక విద్యార్థి స్కూల్‌ బ్యాగ్‌ బరువు అతని శరీర బరువులో పది శాతం ఉండాలి. అంటే 20 కిలోల అమ్మాయి/ అబ్బాయి కేవలం రెండు కిలోల స్కూల్‌ బ్యాగ్‌ను మోయాలి. 30 కిలోల బరువుంటే మూడు కిలోలే మోయాలి.

ఒక అంచనా ప్రకారం ఇవాళ ప్రైమరీ లెవల్‌లో అంటే 5 వ తరగతి వరకూ పిల్లలు 6 నుంచి 12 కిలోల బరువున్న స్కూల్‌ బ్యాగులు మోస్తున్నారు. హైస్కూలు పిల్లలు 12 నుంచి 17 కిలోల బరువు స్కూల్‌ బ్యాగులు మోస్తున్నారు. ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి. తాజా స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ ప్రకారం 5 వ తరగతి లోపు పిల్లలకు రెండున్న కేజీలకు మించి బరువు ఉండరాదు. 6 నుంచి 10 చదివే పిల్లలకు నాలుగున్నర కేజీలకు మించి బరువు ఉండరాదు. ఈ పాలసీను స్కూళ్లు గౌరవిస్తున్నాయా?

ఆరోగ్య సమస్యలు
స్కూల్‌ బ్యాగును మోయడం కూడా తప్పేనా అని కొందరు వితండంగా మాట్లాడవచ్చు గాని అవసరానికి మించిన బరువు వీపు మీద పిల్లలు రోజూ మోయడం వల్ల వారికి వెన్ను సమస్యలు వస్తాయి. పాదంపై పట్టు మారుతుంది. నడక తీరు మారుతుంది. భుజం నొప్పి వంటివి బాధిస్తాయి. రోజూ ఆ బరువు మోసుకెళ్లే విషయం వారికి ఆందోళన గురి చేస్తుంది. కొంతమంది పిల్లలు ఈ మోత మోయలేక ఏదో ఒక వంక పెట్టి స్కూల్‌ ఎగ్గొడుతున్నారన్న సంగతి నిపుణులు గమనించారు కూడా.

ఇంత బరువు ఎందుకు?
ప్రభుత్వం కాని/ ప్రయివేటు కాని/ ఛారిటీ స్కూళ్లుగాని పిల్లలు బాగా చదవాలని ఆరు నుంచి ఎనిమిది పిరియడ్లు చెబుతున్నారు. ప్రతి సబ్జెక్ట్‌ ప్రతిరోజూ ఉండేలా చూస్తున్నారు. ఆ సబ్జెక్ట్‌కు టెక్స్‌›్టబుక్, నోట్‌ బుక్, వర్క్‌బుక్‌... ఇవిగాక స్పెషల్‌ నోట్‌బుక్కులు... ఇన్ని ఉంటున్నాయి. నీటి వసతి లేకపోయినా తల్లిదండ్రుల జాగ్రత్త వల్ల వాటర్‌ బాటిల్‌ ఒక బరువు. లంచ్‌ లేని చోట లంచ్‌ బ్యాగ్‌. ఒక్కోసారి స్పోర్ట్స్‌ అని బ్యాట్‌లు కూడా మోసుకెళతారు. ఇన్ని బరువులు 15 ఏళ్ల లోపు పిల్లలు మోయడం గురించి ఎన్నోసార్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, కోర్టులు మందలించినా పరిస్థితిలో మార్పులేదు.

ఏం చేయాలి?
స్కూళ్లల్లో ప్రతి పిల్లవాడూ టెక్స్‌›్టబుక్‌ తేవాల్సిన అవసరం లేని విధానం ఉండాలి. కొన్ని టెక్ట్స్‌›బుక్కులను క్లాసుల్లో ఉంచాలి.  అలాగే ప్రతి క్లాస్‌లో తాళాలు ఉన్న బుక్‌షెల్ఫ్‌లను ఏర్పాటు చేసి విద్యార్థులు తమకు ఆ రోజుకు అవసరం లేని పుస్తకాలను అందులో పెట్టుకుని వెళ్లేలా చూడాలి. పిరియడ్‌లను తగ్గించాలి. రోజూ అన్ని సబ్జెక్ట్‌లు చెప్పాల్సిన అవసరం లేని రీతిలో టైంటేబుల్‌ వేయాలి. టైంటేబుల్‌లో లేని సబ్జెక్ట్‌ పుస్తకాలు తేవాల్సిన పని లేదని పిల్లలకు చెప్పాలి.

అలాగే ప్రభుత్వాల వైపు నుంచి ఒక క్లాసు విద్యార్థికి అన్ని క్లాసుల టెక్స్‌›్టబుక్కులు ఎంత బరువు అవుతున్నాయో, ఏ సబ్జెక్ట్‌కు ఎన్ని పేజీల పాఠ్యపుస్తకాలు ఉన్నాయో అంచనా వేయించాలి. ఒక సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా మరొక సబ్జెక్ట్‌ వారు పాఠ్యపుస్తకాలను తయారు చేసేలా కాకుండా అన్ని సబ్జెక్ట్‌ల వారూ ఆ ఫలానా క్లాసుకు మొత్తం ఎన్ని పేజీల పాఠ్యపుస్తకాలు తయారు చేస్తున్నారో చూసుకోవాలి. అసలు ‘ఎక్కువ సిలబస్సే మంచి చదువు’ భావన పై చర్చ జరగాలి.

ఇక తల్లిదండ్రులైతే ఎప్పటికప్పుడు పిల్లల బ్యాగులు చెక్‌ చేస్తూ వాటిలో అనవసరమైన వస్తువుల బరువు లేకుండా చూసుకోవాలి. టైమ్‌టేబుల్‌ చెక్‌ చేసి ఆ పుస్తకాలే ఉంచాలి. బస్‌ ఎక్కేప్పుడు దిగేప్పుడు ఆ బరువును అందుకునే వీలుంటే తప్పక అందుకోవాలి. పిల్లల భుజాలకు అనువైన సరైన బ్యాగ్‌లు కొనివ్వాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top