‘శ్రీవాత్సవ బిజినెస్ ఎంపైర్ టవర్స్..‘ప్రముఖ వ్యాపారవేత్త శ్రీవాత్సవ అనుమానాస్పదంగా మరణించాడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన వందమందిలో ఒకరైన అతని మరణం సంచలనమైంది. పరిశోధన మొదలైంది.ఢిల్లీ నుంచి వచ్చిన వైద్యబృందం తీవ్రమైన ఒత్తిడి వల్ల మరణించి ఉండవచ్చని అభిప్రాయపడింది. ఎన్‌ఐఏ– స్పెషల్ ఏజెంట్ అభిమన్యుని రంగంలోకి దించింది. హైదరాబాద్ చేరుకున్నాడు అభిమన్యు. టైమ్ అర్ధరాత్రి రెండు గంటలు.
ఆ చాంబర్‌లో కమిషనర్ ప్రద్యుమ్న, శ్రీవాత్సవ భార్య, అభిమన్యు ఉన్నారు.‘‘సారీ మిసెస్ శ్రీవాత్సవ గారు! ఈ టైమ్‌లో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు. శ్రీవాత్సవగారు ఏ విషయంలోనైనా టెన్షన్ ఫీలవ్వడం గమనించారా?’’ అడిగాడు అభిమన్యు.‘‘లేదు, తను స్ట్రెస్ ఫీలవ్వడం ఎప్పుడూ చూడలేదు. కోవిడ్ టైమ్‌లో అయిదు వందల కోట్ల నష్టం ఎదురైనప్పుడే తేలిగ్గా తీసుకున్నారు’’ చెప్పింది మిసెస్ శ్రీవాత్సవ. తనకు బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా? ‘‘బెదిరింపులకు భయపడడు.
చాలా మొండి మనిషి.’’ మిసెస్ శ్రీవాత్సవ చెప్పింది.అభిమన్యు ఆలోచనలో పడ్డాడు. ‘శ్రీవాత్సవను ఒత్తిడికి గురిచేసిన విషయం ఏమై ఉంటుంది?’శ్రీవాత్సవ ఫోన్‌ను అన్‌లాక్ చేసి; ఫోన్ డేటాను పరిశీలించాడు. అనుమానించదగినది ఏదీ కనిపించలేదు. చాంబర్‌లో అనుమానం కలిగించేవేవీ కనిపించలేదు. స్టాఫ్‌ను విచారించాడు. అభిమన్యు దృష్టి ‘కీ చైన్’ మీద పడింది. శ్రీవాత్సవ పిడికిట్లో వుంది. సిక్స్ నైన్ అనే అంకెలు ఉన్న కీ చైన్. ఎలాంటి కీ లేదు.ఆ కీ చైన్ మిసెస్ శ్రీవాత్సవకి చూపించి, ‘‘దీని గురించి చెప్పగలరా?’’ అని అడిగాడు.‘‘లాస్ట్ వీక్ స్విట్జర్లండ్ వెళ్లినప్పుడు తెచ్చుకున్నాడు.
అంతకు మించి విశేషమేమీ లేదు’’ చెప్పింది మిసెస్ శ్రీవాత్సవ.‘‘కేసు క్లోజ్ చేయాల్సిందేనా?’’ కమిషనర్ అడిగాడు.‘‘కేసు ఇప్పుడే మొదలైంది’’ అంటూ అభిమన్యు కీ ఎక్కడ కొన్నదో చెక్ చేశాడు. ఆ చైన్ శ్రీవాత్సవ క్యాష్ పే చేసి కొన్నట్టు తేలింది. అవి ప్రత్యేకంగా ఆర్డర్ చేసి, తమ లక్కీ నంబర్లు కలిసొచ్చేలా ఆర్డర్ చేస్తారు. ఈ అంకెల్లో ఏదో ఉంది!అభిమన్యు ఆలోచిస్తూనే నేమ్ ప్లేట్ వైపు చూసి వెంటనే మిసెస్ శ్రీవాత్సవకు ఫోన్‌చేసి, ‘‘క్షమించండి. ఈ టైమ్‌లో డిస్టర్బ్ చేసినందుకు. మీ వారికి న్యూమరాలజీ మీద నమ్మకం ఉందా?’’ అడిగాడు.
‘‘ఉంది. తన పేరును శ్రీవాత్సవ్ గా మార్చుకోవడానికి కారణం అదే...’ అని ఇంకేదో చెప్పబోతుండగా, ‘‘థాంక్యూ’’ అని ఫోన్ పెట్టేసి, కమిషనర్ వైపు తిరిగి ‘‘అర్జెంట్ గా స్విట్జర్లాండ్ వెళ్ళాలి... ఈ సిక్స్ నైన్ కీ చైన్‌కు, స్విట్జర్లండ్‌కు సంబంధం ఉంది.. నైన్ అంకె శ్రీవాత్సవ పేరు.. సిక్స్ అంకె...’’ అని ఆగి, వెంటనే ‘‘గాటిట్...’’ అని కమిషనర్ వైపు తిరిగాడు.‘‘శ్రీవాత్సవ ఒక్కడే స్విట్జర్లండ్ వెళ్లాడు. బిజినెస్ పనిమీద కాదు. స్విస్ బ్యాంకులు శ్రీవాత్సవలాంటి బిలియనీర్లకి కామధేనువులు. శ్రీవాత్సవ తెలివైన వ్యాపారవేత్త. సిక్స్ అంకె ‘లాకర్’ను సూచిస్తుంది. ఏదో క్లూ కీ చైన్‌లో ఉంది.’’ అన్నాడు.
స్విట్జర్లండ్...మిసెస్ శ్రీవాస్తవ తరఫున లీగల్ డాక్యమెంట్లు సమర్పించడంతో స్విస్ బ్యాంకు లాకర్‌ను ఓపెన్ చేశారు.లాకర్‌లో విదేశాల్లో కొన్న ఖరీదైన ఫోన్. అందులో ఒకే కాంటాక్ట్– సెక్రటరీ మాయ నంబర్. శ్రీవాత్సవ రికార్డ్ చేసిన వాయిస్.‘‘మీరు నా వాయిస్ వినేసరికి నేను ఈ లోకంలో ఉండకపోవచ్చు. నేను నా అంతరాత్మకు తప్ప ఎవరికీ భయపడను. ఒక బలహీన క్షణంలో సెక్రటరీతో నా సంబంధం నన్ను ట్రాప్ చేసింది. ప్రముఖ వ్యాపారవేత్తగా నాకున్న పరిచయాలు వాడుకోవాలని చూసింది.
మేము సన్నిహితంగా ఉన్న వీడియోలు పంపి బ్లాక్ మెయిల్ చేసింది. హోంమంత్రిని, రక్షణ శాఖ అధికారులను పరిచయం చేయమంది. లేకపోతే వీడియోలు బహిర్గతం చేస్తానని బెదిరించింది. వీడియోలు బయటకు వస్తే నా కంపెనీ షేర్లు పడిపోతాయి. నా సంస్థల మీద ఆధారపడ్డ వేలాది కుటుంబాలు వీధిన పడతాయి. అలా అని దేశ రక్షణను పణంగా పెట్టను. నా మరణాన్ని పరిశోధించడానికి మీరొస్తారని తెలుసు...’’ ఒకవిధంగా శ్రీవాత్సవ మరణవాంగ్మూలం.
శ్రీవాత్సవ స్విట్జర్లండ్‌కు రావడానికి కారణం తెలిసిపోయింది. అప్పటికే పారిపోయే ప్రయత్నంలో ఉన్న మాయను అరెస్ట్ చేశారు. అభిమన్యు సూచన మేరకు శ్రీవాత్సవ సెక్రటరీ మాయ– అతడు మరణించిన విషయం తెలుసుకుని, అతని కోటు జేబులో ఉన్న డబ్బు దొంగిలించి పారిపోతూ సీసీ కెమెరాలకు చిక్కింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు’’ అన్న వార్త మీడియాలో ఫ్లాష్ అయ్యింది.
ఎన్‌ఐఏ కార్యాలయం..మాయ ఎదురుగా అభిమన్యు.‘‘చాలా సిల్లీ పెట్టీ కేసు కదూ! నువ్వు బయట కనబడితే జనం, పోలీసులు వదలరు. నీ మీద ఎఫ్‌ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. రికార్డుల్లో లేని ఖైదీవి. నీ కోసం మీ వాళ్ళు కూడా గాలిస్తారు. లైఫ్‌లో హనీ ట్రాప్ చేయకుండా, శ్రీవాత్సవ ఆత్మ శాంతించేలా నీకు ఈ శిక్ష ...’’అభిమన్యు ఇంటరాగేషన్ సెల్ నుంచి బయటకు నడిచాడు.



