వరిపొట్టుతో ఇన్ని ఉపయోగాలా..! | sagubadi: Surprising Uses of Rice Husks that Turn Trash into | Sakshi
Sakshi News home page

Rice Husk: వరిపొట్టుతో ఇన్ని ఉపయోగాలా..!

May 22 2026 12:01 PM | Updated on May 22 2026 7:39 PM

sagubadi: Surprising Uses of Rice Husks that Turn Trash into

వరిపొట్టు (ఊక)ను ఇంటిపంటలు, పెరటి తోటలు, మిద్దె తోటల్లో మొక్కల పెంపకంలో ఉపయోగించవచ్చు. ఊక మొక్కల పెరుగుదలకు, నేల స్వభావాన్ని మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది. వరి పొట్టును ప్రధానంగా మట్టి నిర్మాణాన్ని మెరుగుపరచడానికి వాడవచ్చు. కుండీల్లో లేదా తోట మట్టిలో వరిపొట్టును కలపడం వల్ల మట్టి గట్టిపడకుండా గుల్లగా ఉంటుంది. 

ఇది వేర్లు సులభంగా వ్యాపించడానికి సహాయపడుతుంది. మట్టిలో తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచడమే కాకుండా, అదనపు నీరు కుండీలు, మడుల్లో నుంచి బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది. ఎండకాలంలో మొక్కల మొదళ్లలో వరి పొట్టును మల్చింగ్‌ చెయ్యటం లేదా పరచడం ద్వారా మట్టిలోని తేమ ఆవిరి కాకుండా కాపాడవచ్చు.

కాల్చిన వరి పొట్టు లేదా వరిపొట్టు బయోచార్‌ను కూడా వాడొచ్చు. దీని వల్ల మట్టికి పొటాషియం అందుతుంది. హానికరమైన శిలీంధ్రాల నుండి రక్షణ లభిస్తుంది. కుండీలకు మట్టిని సిద్ధం చేసేటప్పుడు సుమారు 10–20% వరకు వరి పొట్టును కలిపితే మంచి ఫలితం ఉంటుంది. పచ్చి వరి పొట్టు నేరుగా వాడటం కంటే, కొద్దిగా ఎండినది లేదా కాల్చినది వాడటం వల్ల తెగుళ్ల భయం ఉండదు. 

వరి పొట్టులో  సిలికాన్‌ ఉంటుంది. దీన్ని మట్టిలో కలపటం లేదా పొట్టు కాల్చిన బూడిదను వాడటం వల్ల మొక్కలకు సహజంగా సిలికాన్‌ అందుతుంది. సిలికాన్‌ వల్ల మొక్క కాండం గట్టిగా మారుతుంది. దీనివల్ల గాలికి లేదా వర్షానికి మొక్కలు నేలవాలకుండా  నిటారుగా పెరుగుతాయి. మట్టిలో మాంగనీస్, అల్యూమినియం వంటి లోహాల విషపూరిత ప్రభావాన్ని తగ్గించి, ఇతర పోషకాలు మొక్కకు సరిగ్గా అందేలా వరిపొట్టు చేస్తుంది.

- కొల్లి కృష్ణ కుమారి,
అడ్మిన్, గుంటూరు జిల్లా 
మిద్దె తోటల బృందం
మొబైల్‌: 94906 02366 

చదవండి: మిద్దెతోటల్లో కోకో పీట్‌తో ఇన్ని ఉపయోగాలా..?!

Advertisement
 
Advertisement
Advertisement