అవమానాలు దిగమింగి.. గిరిజన లిపిని ఆవిష్కరించా

Recipient of Narishakti Award Prasanna Shri about Tribal script - Sakshi

నారీశక్తి పురస్కార గ్రహీత ప్రసన్న శ్రీ

కృష్ణా జిల్లా సీతానగరం స్వగ్రామమైనప్పటికీ తండ్రి రైల్వేలో ఉద్యోగ రీత్యా పశ్చిమ బెంగాల్, బిహార్‌లలో పెరిగా. చదువు కొనే వయసు వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడ్డాం. తాత స్కూలు హెడ్‌మాస్టర్‌ కావడంతో నాకు కూడా విద్యాబోధన పట్ల ఆసక్తి పెరిగింది. గిరిజనులు ఉన్నత విద్య అభ్యసించాలంటే ఎన్నో వ్యయప్రయాసలు, అవమానాలు పడాల్సి వచ్చేది. వాటిని అధిగమిస్తూ ఉన్నత విద్య పూర్తిచేశా.

సత్తుపాటి ప్రసన్న శ్రీ ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ప్రొఫెసర్‌ – చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. మైనారిటీ గిరిజన భాషలను సంరక్షణ, గిరిజన భాషలకు నూతన రచనా విధానాలు అభివృద్ధి చేస్తుంటారు. భగత, గదభ, కొలామి, కొండ దొర మొదలైన 19 గిరిజన భాషలకు లిపి (అక్షరాలను) రూపొందించిన ప్రపంచంలోనే తొలి మహిళ. ఆమె సాహిత్య రచనలలో ’ఈస్ట్‌ అండ్‌ వెస్ట్‌ పోస్ట్‌ మాడర్న్‌ లిటరేచర్‌లో మహిళల సైకోడైనమిక్స్‌’ వంటి రచనలు ఉన్నాయి. ’షేడ్స్‌ ఆఫ్‌ సైలెన్స్‌’,  ’ఉమెన్‌ ఇన్‌ శశి దేశ్‌పాండే నవల – ఒక అధ్యయనం,’ రచించారు. వరల్డ్‌ అట్లాస్‌ ఆఫ్‌ ఎన్‌డేంజర్డ్‌ ఆల్ఫాబెట్స్, యూఎస్‌ఏ (2019)లో ప్రదర్శించబడిన తొలి భారతీయ, ఆసియా మహిళ. మైనారిటీ గిరిజన భాషలను పరిరక్షణ నిమిత్తం చేసిన విశేష కృషికి నారీ శక్తి పురస్కారం లభించింది.  

‘గిరిజనురాలివి అందులోనూ మహిళవి.. ఏం సాధిద్దామని, ఎవరిని ఉద్ధరిద్దామని బయల్దేరావు.. నీకు ఇంక వేరే పనిలేదా.. వంటి అనేక అవహేళనలు, అవమానాలు దిగమింగి గిరిజనుల కోసం లిపిని రూపొందించా’ అంటున్నారు నారీశక్తి–2021 పురస్కార గ్రహీత సత్తుపాటి ప్రసన్నశ్రీ. ఇలాంటి అవమానాలు ఎన్ని ఎదురవుతున్నా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తానని ధీమాగా చెబుతున్నారు. మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాద్‌ కోవింద్‌ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకొన్న సందర్భంగా ఆమె సాక్షితో ముచ్చటించారు. గిరిజనుల సంక్షేమం, విద్య కోసం చేసిన ప్రస్థానం ఆమె మాటల్లోనే...

‘‘గిరిజనుల కోసం చేస్తున్న కృషికి బూస్టప్‌ డోస్‌లా నారీశక్తి పురస్కారం దక్కింది. సుమారు మూడున్నర దశాబ్దాలుగా గిరిజనుల కోసం చేసిన ఒంటరి పోరాటంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. ఎన్ని అవమానాలు ఎదురైనా విద్య ఒక్కటే శాశ్వతమని నమ్మి నాలాగా ఇతర గిరిజనులు ఇబ్బందులు పడరాదనే ఉద్దేశ్యంతో పట్టుదలతో ముందుకెళ్లా. నాన్న నా చదువుకోసం ఎన్నో త్యాగాలు చేస్తే, భర్త నా ఆశయ సాధన కోసం ఎంతో ఆసరా ఇచ్చారు. ఆయన ప్రోత్సాహంతో కొండ ప్రాంతాల్లోని గిరిజనులను కలిసి వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించా.

ఈ క్రమంలో సెలవు రోజుల్లో ఉదయానికే విశాఖపట్నం చేరుకొని రైల్వేస్టేషన్‌లోనే కొండప్రాంతాల వారి మాదిరి దుస్తులు ధరించి అరకు గిరిజన ప్రాంతాలకు వెళ్లేదాన్ని. ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అయిన తర్వాత గిరిజన ప్రాంతాలకు వెళ్లడానికి మరింత సులభమైంది. తెలిసిన వారు ‘ఇదంతా ఎందుకమ్మా పనిపాటా లేదా’ అని హేళన చేసేవారు. ‘నిన్ను ప్రోత్సహిస్తే మాకు ఎన్ని ఓట్లు పడతాయి?’ అని అడిగిన రాజకీయ నేతలు కూడా ఉన్నారు. అవమానాలకు, అవహేళనలకు తట్టుకోలేక వెనక్కి తగ్గి ఉంటే 30కిపైగా దేశాల్లో విజిటింగ్‌ ప్రొఫెసర్‌ అయ్యేదాన్ని కాదు. 106 రిసెర్చి ఆర్టికల్స్, 18 ఎంఫిల్స్, 32 పీహెచ్‌డీలు 32 పుస్తకాలు రచించాను. అంతర్జాతీయంగా అనేక పరిశోధనలు చేశా. అల్జీరియా, అమెరికా ఫ్రాన్స్, ఇథియోపియా తదితర దేశాల్లో నా పొయిట్రీని పాఠ్యాంశంగా పెట్టుకున్నారు. సమానత్వం కోసం మాట్లాడేవారు గిరిజనుల సమానత్వం కోసం కూడా అదేస్థాయిలో పోరాడాలి. 

నేను రూపొందించిన లిపిని పాఠ్యపుస్తకాలుగా మార్చితే గిరిజనులు మాతృభాషలో విద్యాభ్యాసం చేయొచ్చు. గిరిజన విద్యార్థుల డ్రాపవుట్‌ సంఖ్య తగ్గించొచ్చు. నూతన విద్యా విధానంలో మాతృభాషలోనే బోధన అని చేర్చారు. భవిష్యత్తులో గిరిజనులకు మాతృభాషలో విద్యాబోధన జరుగుతుందని ఆశిస్తున్నా. ఒకానొక సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి నా ప్రయత్నం గురించి చెప్పా. ఎనిమిది భాషల లిపి రూపొందిస్తున్నా అని చెబితే.. అవన్నీ పూర్తిచేసి వస్తే సముచిత గౌరవం దక్కేలా చేస్తానన్నారు. తొలిసారి గిరిజన మహిళకు వైస్‌ చాన్సలర్‌ హోదా దక్కేలా చూస్తానంటూ నన్ను ప్రోత్సహించారు.   

 గిరిజనుల్లో కొండ, మైదాన ప్రాంతాల వారి విధానాలు వేర్వేరుగా ఉంటాయి. కొండప్రాంతాలవారు మనల్ని నమ్మితే∙కానీ ఏమీ చేయలేం. వారిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. వారికి నాగరక సమాజంతో తక్కువ సంబంధం ఉండటం వల్ల వారిలో విద్య పట్ల ఆసక్తి పెంచడానికి కొంత శ్రమించాల్సి వచ్చింది. ప్రస్తుతం సెలవుల సమయంలో ఉత్తరాది నుంచే కాదు క్యూబా, కొరియా, జర్మనీ తదితర  విదేశాల నుంచి కూడా యువత వచ్చి గిరిజనులకు చదువు చెబుతున్నారు. గిరిజన లిపిని పాఠ్యాంశాలుగా మార్చితే వారెంతో రుణపడి ఉంటారు. ప్రధాని నరేంద్రమోదీతో సమావేశ సమయంలో ఇదే అంశాన్ని ప్రస్తావించా. సమావేశం అనంతరం ప్రధాని మోదీ స్వయంగా నా దగ్గరకు వచ్చి ఇందాకా ఏదో చెబుతున్నారంటూ ఆసక్తిగా అన్ని విషయాలు విన్నారు. ప్రధాని సిబ్బంది నా ఫోన్‌ నంబరు కూడా తీసుకున్నారు. ఇదే స్థాయిలో ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటున్నా’’ అంటూ సాక్షితో తన భాషా సేవ గురించి వివరించారు ప్రసన్నశ్రీ. 
– సూర్యప్రకాశ్‌ కూచిభట్ల, సాక్షి, న్యూఢిల్లీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top