ఏ దేవుడిని ఎప్పుడు ధ్యానించాలి? | Praises Of The Gods On Certain Days Weeks And Festivals | Sakshi
Sakshi News home page

ఏ దేవుడిని ఎప్పుడు ధ్యానించాలి?

May 28 2026 8:59 AM | Updated on May 28 2026 8:59 AM

Praises Of The Gods On Certain Days Weeks And Festivals

ధర్మ సందేహాలు

ఎన్నో దేవతా స్తోత్రాలున్నాయి. ప్రతిదీ నిత్యం పారాయణ చేయాలని చె΄్తారు. కానీ రోజూ అన్ని పారాయణ చేయడం సాధ్యం కావడం లేదు. మరి వాటిని నిత్యపారాయణ చేయకపోవడం పాపం కదా? పైగా ఇన్నిన్ని స్తోత్రాలు ఎందుకు? – ఆర్‌. కౌసల్య, చిలకమర్రి, నల్గొండ జిల్లా

జ: అన్ని స్తోత్రాలు పారాయణ చేయడం నిత్యమూ సాధ్యం కాదు. అలాగని అవి ఎందుకు? అని ప్రశ్నించరాదు. బజారులో బోలెడన్ని కూరగాయలుంటాయి. అన్నీ రోజూ తినలేం. అలాగని ఇన్నిన్ని ఎందుకు? అంటామా?

ఎవరి అవకాశాన్ని, అభీష్టాన్నీ బట్టి నిత్యం సాధ్యమైన వాటినే అనుష్ఠించవచ్చు. రోజూ విందుభోజనం చేయలేం కదా! ఏ పండగకో పబ్బానికో విందునారగించినట్లు తీరిక దొరికిన వేళ సావకాశంగా స్తోత్రాలు పారాయణ చేసుకోవచ్చు. ఏదేమైనా – ఆనందంగా భక్తిగా వాటిని పఠించాలే తప్ప, తప్పనిసరి కృత్యంగా మొక్కుబడి వ్యవహారంగా తలచరాదు.

నిత్యం మన అవకాశాన్ని బట్టి ఆహారం తిన్నట్లే, స్తోత్రమో, జపమో పరిమితమైన అనుష్ఠానం అవసరం. ఆయా దేవతలకి నిర్దేశించిన వారాలలో, తిథులలో, పర్వదినాలలో ఆయా స్తోత్రాలను నిదానంగా పఠించుకోవచ్చు. ఔషధశాలలో మందుల వలె వివిధ ప్రయోజనాలకోసం, వివిధ స్తోత్రాలుంటాయి. కొన్ని ఆరోగ్యం కోసం, కొన్ని దారిద్య్ర నివారణ కోసం...ఇలా! వాటిని ఆయా లక్ష్యాల సిద్ధికోసం వినియోగించుకోవచ్చు.

ఏ దేవుడిని ఎప్పుడు ధ్యానించాలి? – గుంటుక శకుంతల, హైదరాబాద్‌
ఉదయం వేళ విష్ణువునే స్మరించాలి. మన పోషకత్వాన్ని నిర్వహించేది విష్ణువు గనుక ఉదయం లేవగానే ఆయన్ని స్మరిస్తే మన నిత్యజీవితం సాఫీగా సాగిపోతుంది. సూర్యాస్తమయ సమయంలో శివుని స్మరించాలి. అలాచేస్తే మన నిత్యజీవితంలో సమతుల్యత లభిస్తుంది.

హర శబ్దానికి హరించువాడని అర్ధం ఆయన్ని సాయం సమయాల్లో ధ్యానిస్తే మన పాపాల్ని అన్నింటినీ హరింపచేస్తాడు. ‘‘ప్రదోషే హరిం న పశ్యాత్‌ నృసింహం రాఘవం వినా’’ విష్ణువు నృసింహావతారం ఎత్తింది సాయం సంధ్యా సమయంలోనే గనుక నృసింహునకు మినహాయింపు. ఇక రాముని విషయానికొస్తే ‘రమయతీతి రామః’’ – ప్రజలను రంజింప చేసే వాడు కనుక రాముని ఎల్లవేళలా స్మరించవలసిందే.

పక్షానికి ఒకసారి సంభవించే మహాప్రదోష కాలంలో శివదర్శనం, శివనామ జపం మనకు అమిత ప్రయోజనకరం. 

Advertisement
 
Advertisement
Advertisement