సైన్స్‌లోకి అమ్మాయా!

Physicist Rohini Godbole Got France Award Ordre National Du Merite - Sakshi

‘సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలోకి అమ్మాయిలా..’ అని రోహిణిని చూసి అప్పటివారు అనుకుంటే.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో అమ్మాయిలు లేకపోవడం ఏంటి అన్నట్లు రోహిణి ఆనాడు తన కాలేజ్‌ క్యాంపస్‌ను చూశారు.

పార్టికల్‌ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేసినప్పుడు  తొలిసారి రోహిణీ గోడ్బోలేను భారతీయ భౌతిక శాస్త్ర పండితులుసాలోచనగా తలపంకిస్తూ ఆమె వైపు చూశారు. ఒక అమ్మాయి! అదీ ఫిజిక్స్‌లో! అదీ ఉపాణుకణ స్వభావాలపై! అదీ న్యూయార్క్‌ స్టేట్‌ యూనివర్సిటీలో! ఆ పీహెచ్‌డీకి ముందు ముంబైలోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ నుంచి సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీతో బయటికి వచ్చారు రోహిణీ. అప్పుడూ అంతే. అప్పుడు అంటే.. డెబ్బైలలో. ఒక అమ్మాయి! అదీ సైన్స్‌లో! అదీ ఐఐటీ ముంబైలో!!

రోహిణీ గాడ్బోలే 1982లో ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్‌ లెక్చరర్‌గా చేరినప్పుడు కూడా సహ పురుష లెక్చరర్‌లు కళ్లు మెరిసే వింతగా ఆమెను చూశారు. రోహిణికి మాత్రం నీరసం, నిరుత్సాహం. క్లాస్‌ రూముల్లో గుప్పెడు మందైనా అమ్మాయిలు ఉంటేనా! సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలోకి అమ్మాయిలా.. అని రోహిణిని చూసి అప్పటివారు అనుకుంటే.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో అమ్మాయిలు లేకపోవడం ఏంటి అని రోహిణి చూశారు. నాటి నుంచీ నేటి వరకు ఒక భౌతిక శాస్త్ర పరిశోధకురాలిగా, ప్రొఫెసర్‌గా.. అమ్మాయిల్ని శాస్త్ర సాంకేతిక రంగాల విద్య, అధ్యయనాలవైపు ప్రోత్సహిస్తూనే ఉన్నారు రోహిణి.

ఆ కృషికి గుర్తింపే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఫ్రెంచ్‌ అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌’ అవార్డుకు ఆమె ఎంపిక అవడం. అంతర్జాతీయ పురస్కారం ఇది. గౌరవ కారణం కూడా. ‘భౌతికశాస్త్ర విద్య, అధ్యయన రంగాలలో ఇండో–ఫ్రాన్స్‌ సంబంధాలపురోగతికి, సైన్స్‌ సబ్జెక్ట్‌ చదివేందుకు అమ్మాయిలకు ఆసక్తి, ప్రేరణ కలిగించే విధంగా ఫలవంతమైన ప్రయత్నాలు చేసినందుకు..’ రోహిణికి ఈ అవార్డు ఇస్తున్నట్లు ఫ్రాన్స్‌ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 
∙ ∙  
సైన్స్‌ చదవాలని ఉత్సాహంగా కాలేజ్‌లో చేరిన అమ్మాయిలు ఆ తర్వాత పై చదువులకు వెళ్లకుండా ఎలా మెల్లిమెల్లిగా సైన్స్‌కు దూరం అవుతున్నారో రోహిణి దగ్గర స్పష్టమైన డేటా ఉంది. ‘‘కాలేజ్‌ నుంచి యూనివర్సిటీకి వెళ్లే లోపు 10 శాతం మంది అమ్మాయిలు తగ్గిపోతున్నారు. యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ కి వెళ్లేలోపు 5 శాతం తగ్గిపోతున్నారు. పీహెచ్‌డీ అయ్యాక కెరీర్‌ ఎంచుకునేలోపు 15 శాతం మంది తగ్గిపోతున్నారు’’ అని రోహిణి అధ్యయనంలో వెల్లడయింది. ఈ పరిస్థితిని మార్చడం కోసం ఆమె ప్రొఫెసర్‌గానే కాకుండా, ‘టెడెక్స్‌’ వక్తగానూ అనేక స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఇస్తూ వస్తున్నారు. ఆమె జీవిత లక్ష్యం సైన్స్‌ అధ్యయనాల్లో అమ్మాయిల సంఖ్యను, శాతాన్ని పెంచడం. స్వయంగా ఆమే అమ్మాయిలకొక ఆదర్శం. సైన్స్‌లో రోహిణి ఇప్పటివరకు 100కు పైగా అధ్యయన పత్రాలను సమర్పించారు.

జె.సి.బోస్‌ ఫెలోషిప్‌ ఉంది. రోహిణి 1995లో బెంగళూరులోని ఐ.ఐ.ఎస్సీ.లో అసోసియేట్‌ గా చేరారు. ప్రస్తుతం అక్కడే ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ‘పద్మశ్రీ’ రావడం, ‘యూరోపియన్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ న్యూక్లియర్‌ రిసెర్చ్‌’ (సి.ఇ.ఆర్‌.ఎన్‌.)లో చేసిన అధ్యయనాలు... ఆమె కెరీర్‌లోని అత్యున్నతస్థాయులు. ఇప్పుడు వాటికి ఫ్రెంచ్‌ అవార్డు జత కలిసింది. ఒక మామూలు అమ్మాయి సైన్స్‌లో ఇన్ని శిఖరాగ్రాలు చేరుకోడాన్ని అప్పటి పరిస్థితుల్ని బట్టి గొప్ప విషయంగానే భావించాలి. రోహిణి 1952లో పుణెలో పుట్టారు. తండ్రి మధుసూదన్‌ గణేశ్‌ గాడ్బోలే. తల్లి మాలతీ దండేకర్‌. స్కూల్లో ఉన్నప్పుడే ఆమెకు సైన్స్‌పై ఆసక్తి కలిగేలా ఆమె తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకున్నారు. ‘‘సైన్స్‌ విద్య, అధ్యయన, ఉద్యోగ రంగాలలోకి మహిళలు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా ప్రభుత్వ విధానాలు, సామాజిక దృష్టిలో మార్పులు రావాలి’’ అని రోహిణి గోడ్బోలే కోరుకుంటున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top