
మనసున మనసై.. బతుకున బతుకై.. తోడొకరుండిన అదే భాగ్యమని ఎప్పుడో చెప్పేశాడు ఓ సినీకవి. నిజం. ఒంటరితనం కొంతసేపు బాగుంటుందేమో కానీ.. సమయం గడుస్తున్న కొద్దీ బాధిస్తుంది. పీడిస్తుంది. మనోవేదనకు గురి చేస్తుంది. పాపం.. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం ఒరాకిల్ ఉద్యోగి ఒకరికి ఈ విషయం కొంచెం ఆలస్యంగా తెలిసింది. అయితే..
మనోడు ఒంటరితనాన్ని తట్టుకోలేక డిప్రెషన్‌లో కూరుకుపోలేదు. ఏ అఘాయిత్యానికి పాల్పడలేదు కానీ... ఎవరూ ఊహించనట్టు ర్యాపిడో డ్రైవర్ అయ్యాడు!!. హవ్వా.. అంత బతుకూ బతికి ఇంటి వెనుక చచ్చినట్టు ఒరాకిల్‌లో లక్షలు సంపాదించే ఉద్యోగం చేస్తూ ఇదేం పని అనుకోవద్దు. పాపం ఒంటరి తనం నుంచి బయటపడేందుకు తనకు తోచిన మార్గమిదే మరి! వివరాలు ఏమిటంటే...
నిజానికి ఈ స్టోరీని సాద్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నాడు. రెండు లక్షల రూపాయల విలువైన టీవీఎస్ రోనిన్ మోటర్ సైకిల్‌ను ఒక వ్యక్తి ర్యాపిడో రైడ్ల కోసం వాడుతూంటే సాద్‌కు కుతూహలం ఎక్కువైంది. ర్యాపిడోను నడుపుతున్న వ్యక్తితో మాట మాట కలిపాడు. అప్పుడు తెలిసింది. అతడు ఒరాకిల్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్ అని. సంవత్సరానికి 32 లక్షల రూపాయల జీతం వస్తోంది అని. అంత జీతమొస్తూంటే.. ఈ ర్యాపిడో ఏంటి భయ్యా అని అడిగితే... ‘‘వీకెండ్స్‌లో ఒంటరి తనాన్ని తట్టుకునేందుకు ఈ పని చేస్తున్నా’’ అన్న సమాధానం వచ్చింది. ర్యాపిడో నడిపేటప్పుడు అపరిచితులు బైక్ ఎక్కుతారు. వారితో మాట్లాడవచ్చు. కొత్త వారి పరిచయాలు పెరుగుతాయి. తద్వారా నా ఒంటరితనం బాధ తగ్గుతుందని ఆ ఇంజినీర్ చెప్పడంతో ఇలాక్కూడా జరుగుతుందా? అని అనిపించిందని సాద్ తన ఎక్స్ ఖాతాలో ఆశ్చర్యపోయారు.
ఈ ఉదంతం కాస్తా ఆధునిక జీవితంలో ఉరుకులు, పరుగుల జీవితంపై మరోసారి ఫోకస్‌ను పెట్టందని చెప్పాలి. ఒంటరితనంతో ఎన్నో రకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాట్సప్, ట్విట్టర్, ఎఫ్‌బీ వంటి బోలడన్నీ కమ్యూనికేషన్ సౌకర్యాలు ఉన్నా.. నోరు విప్పి మనసారా మాట్లాడుకునేందుకు ఒక వ్యక్తి తోడు లేకపోతే మాత్రం వేస్ట్ అనేది అందుకే మరి!.
టెక్ ప్రపంచంలో రోజుకు పది పన్నెండు గంటల ప్రయాణం.. బెంగళూరు లాంటి నగరాల్లోనైతే ఆఫీసులకు వచ్చిపోయేందుకు మూడు నాలుగు గంటల సమయం పడుతూండటాన్ని పరిగణలోకి తీసుకుంటే వ్యక్తిగత సమయం అంటూ ఏదీ లేకుండా పోతుంది. సొంతూళ్లకు, కుటుంబానికి దూరంగా ఉన్న వారి పరిస్థితి మరీ అధ్వాన్నం. ఏది ఏమైనప్పటికీ సామాజిక హోదా, సంపాదనలే విజయానికి కొలమానాలుగా మారుతున్న ఈ తరుణంలో భేషజాలు వదిలి తన సమస్యకు తాను ఒక అందమైన పరిష్కారాన్ని కనుక్కున్న ఆ అజ్ఞాత ఇంజినీర్‌కు జై అనాల్సిందే!
