
నమ్మకం, నిజాయితీ సహజీవనం చేసే చోటు ఆ చాయ్ దుకాణం. అది నిన్న మొన్నటి దుకాణం కాదు, వందేళ్ల నాటిది. దీనికి పెట్టుబడి నమ్మకం, రాబడి నిజాయితీ. ప్రపంచంలోనే అరుదైన లక్షణాలు ఉన్న ఆ చాయ్ దుకాణం పశ్చిమ బెంగాల్‌లోని శ్రీరామ్‌పూర్ పట్టణంలో ఉంది. నరేశ్‌చంద్ర షోమ్ అనే స్వాతంత్య్ర సమరయోధుడు 1920లలో ఈ దుకాణాన్ని ప్రారంభించారు. ఈ చాయ్ దుకాణాన్ని ప్రారంభించడానికి కారణం లాభాపేక్ష కాదు, ఆనాటి స్వాతంత్య్ర సమరయోధుల చర్చలు, సమావేశాలకు ఒక కుదురైన వేదికగా ఉపయోగపడటానికి నరేశ్‌చంద్ర షోమ్ దీనిని ప్రారంభించారు. ఆయన ఏ ముహూర్తాన ఈ దుకాణాన్ని ప్రారంభించారో గాని, నేటి వరకు ఈ చాయ్ దుకాణం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. నేటికీ స్థానిక తేనీటిప్రియులకు అభిమాన ఆలవాలంగా నిలిచి ఉంది.
స్వాతంత్య్ర పోరాట కాలంలో మిగిలిన సమరయోధుల మాదిరిగానే నరేశ్‌చంద్ర కూడా తరచు అరెస్టయి జైలుకు వెళుతుండేవారు. తాను అరెస్టయినప్పుడల్లా ఆయన ఈ దుకాణం బాధ్యతలను స్థానిక కస్టమర్లకే అప్పగించేవారు. వారు చాలా నమ్మకంగా టీ పెట్టుకుని తాగి, అందుకు తగిన డబ్బును అక్కడే ఉంచి వెళ్లేవారు. వారు తమ తర్వాత వచ్చే కస్టమర్లకు ఆ బాధ్యతను అప్పగించేవారు. ఇప్పటికీ ఈ దుకాణంలో ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. నరేశ్‌చంద్ర తదనంతరం ఆ భవన యజమాని ‘లఖీరాణి దఖీ’ అల్లుడు అశోక్ చక్రవర్తి ఈ దుకాణం బాధ్యతలు తీసుకున్నాడు. క్లరికల్ ఉద్యోగం చేస్తున్న ఆయన ఉదయాన్నే దుకాణం తెరిచి; దుకాణానికి కావాల్సిన పాలు, టీ పొడి, పంచదార వంటివి ఏర్పాటు చేసి ఉద్యోగానికి వెళ్లిపోతారు. ఇక సాయంత్రం విధుల నుంచి రాగానే మళ్లీ దుకాణానికి వచ్చి, మూసేంత వరకు ఉంటారు. మరి మధ్య కాలంలో దుకాణంలో సిబ్బంది ఎవరూ ఉండరు.
ఆ సమయంలో కొందరు స్వచ్ఛందంగా ఈ టీ దుకాణాన్ని నడిపిస్తున్నారు. పదవీ విరమణ పొందిన వారు, ఈ టీ దుకాణంపై అభిమానం కలిగినవారు ఇలా చాలామంది ఈ దుకాణాన్ని నడిపిస్తున్నారు! ఆశిష్ బంధోపాధ్యాయ్ అనే పదవీ విరమణ పొందిన ఒక పెద్దాయన.. అశోక్ చక్రవర్తి లేని సమయంలో దుకాణంలో ఉంటారు. పాలు లేకపోయినా, పంచదార లేకపోయినా క్యాష్ కౌంటర్‌లో డబ్బు తీసి, బజారు నుంచి కొని తెచ్చి పెడతారు. ఆయన కూడా లేనప్పుడు, టీ తాగడానికి వెళ్లిన వారే టీ పెట్టుకుని కప్పుల్లో పోసుకుని, తాగి, వాటిని శుభ్రపరచి, డబ్బులు క్యాష్ కౌంటర్ దగ్గర వేసి వెళ్లిపోవచ్చు. ఇక్కడ కావాల్సినంత సమయం గడపొచ్చు.
టీ తాగినవారంతా డబ్బు ఇస్తున్నారా లేదా అనే విషయం తెలియడానికి నిఘా నేత్రాలేమీ ఉండవు. ఇక్కడ రోజుకు సుమారు రెండు వందలకు పైగా టీలు అమ్ముడుపోతుంటాయి. ఈ దుకాణానికి ఎదురుగా ఛత్ర కాళీబాబు శ్మశానవాటిక ఉండటంతో అక్కడికి వచ్చేవారు సైతం ఇక్కడికి టీ తాగడానికి వస్తారు.ఒకవేళ డబ్బు లేకపోయినా ఇక్కడ టీ తాగి వెళ్లొచ్చు. అలా వెళ్లిన వాళ్లు మరోరోజు తాము ఇవ్వాల్సిన డబ్బుల్ని గుర్తుపెట్టుకుని మరీ తెచ్చి క్యాష్ కౌంటర్‌లో వేస్తారు. పైగా ఈ దుకాణానికి బోర్డ్ కూడా ఉండదు. చాలామంది ఛత్ర ఘాట్ ఎదురుగా ఉన్న టీ షాప్ అని పిలుస్తుంటారు.ఆశిష్ బంధోపాధ్యాయ్‌తో పాటు సుమారు పదిమంది స్నేహితులు ఒక బృందంగా ఉండి, అశోక్ చక్రవర్తి లేని సమయంలో వీలును బట్టి దుకాణం బాధ్యతలను పంచుకుంటూ ఉంటారు.
ఇక్కడ బ్లాక్ టీ, మసాలా టీ కూడా పెట్టుకోవచ్చు. అందుకు నిమ్మకాయలు, మసాలా పొడులు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే చాయ్‌లోకి బిస్కట్స్ కూడా లభిస్తాయి. ఇక సాయంత్రం అశోక్ చక్రవర్తి వచ్చి ఆ రోజు కలెక్షన్‌ను క్యాష్ కౌంటర్‌లో లెక్క చూసుకుని, మరునాటికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటారు. ఇలా సాగుతున్న దుకాణం స్థానికులకు గొప్ప కాలక్షేప కేంద్రం. ఈ చోటు మానసిక సంతోషానికి గొప్ప ప్రదేశం అంటుంటారు ఆశిష్. ఇక్కడికి చాయ్ తాగడానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఎన్నో ఏళ్లుగా వస్తున్నవాళ్లే! ఎవరిని కదిలించినా ఏదో ఒక అనుభూతిని పంచుకుంటారు. ‘నరేశ్‌చంద్రగారు ఉన్నప్పటి నుంచి వస్తుంటాను’ అని కొందరు; ‘మా నాన్నతో కలిసి ఇక్కడికి వచ్చేవాళ్లం’ అని ఇంకొందరు చెబుతుంటారు. కాని, ఈ రోజుల్లో కూడా ఒక వ్యాపార కేంద్రం ఎటువంటి నిఘా నేత్రాలు లేకుండా, ఏ ఒక్క సహాయకుడు లేకుండా కస్టమర్లతో కళకళలాడేలా నడిపించడం అబ్బురమే!