భూతాపం వల్ల జరిగే నష్టం ఏమిటి?వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువుల వల్ల భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుతుంది. వాతావరణంలో అనూహ్య మార్పులు ఏర్పడతాయి. పర్యావరణ సమతుల్యత ప్రమాదంలో పడుతుంది... ఒక్క ముక్కలో చెలంటే భూతాపం అనేది సీరియస్ విషయం. సీరియస్ విషయాన్ని చా...లా సీరియస్‌గానే చెప్పాలి అనే రూలేమీ లేదు. ముంబైకి చెందిన థియేటర్ కంపెనీ ‘టఫ్రీవాలే’ గ్లోబల్ వార్మింగ్ సమస్యను సీరియస్‌గా చెప్పాలనుకోలేదు. నవ్విస్తూనే సమస్యను అర్థం చేయించాలనే లక్ష్యంతో రూపొందించిన ‘ఫీవర్ డ్రీమ్’ నాటకం నాటకప్రియులు, విశ్లేషకులు, పర్యావరణవేత్తల ప్రశంసలు అందుకుంటోంది.
భూతాపం అనే సమస్యను మనం ఎలా చూస్తున్నామనేదాన్ని వ్యంగ్యంగా చెప్పే నాటకం... ఫీవర్ డ్రీమ్. ఈ నాటకానికి దర్శకురాలు మేఘనా ఏటీ. సహ రచయిత్రి నయనతార నాయర్. పర్యావరణ సంబంధిత విషయాలపై మొదటి నుంచి ఇద్దరికీ ఆసక్తి ఉంది. ‘ఎందుకు ఇలా జరుగుతుంది?’ అనే విచారం ఉంది. ఆ విచారంలో నుంచే పుట్టిన వినోద నాటకం... ఫీవర్ డ్రీమ్.
మొదట్లో ఈ నాటకానికి రెండు వెర్షన్లు రాసుకున్నారు. ఫైనల్ వెర్షన్‌లో ‘షార్క్ ఇండియా’ తరహా రియాలిటీ షో ఎపిసోడ్‌ను తీసుకువచ్చారు. ఇది నాటకంలో బాగా క్లిక్ అయింది. ‘వాతావరణ సంక్షోభం అనేది ఎవరో ఒకరి సమస్య మాత్రమే కాదు. ఇది అందరి సమస్య. అంతేకాదు, ఇది రేపటి సమస్య మాత్రమే కాదు నేటి సమస్య కూడా’ అంటుంది మేఘన. పర్యావరణం గురించి గతంలో ఒక షో చేసింది మేఘన. అయితే అందులో సముద్ర మట్టాలు పెరగడానికి సంబంధించే ఎక్కువగా ఉంటుంది.
ఆ సమయంలో ఒక పర్యావరణ కార్యకర్త మేఘనను సంప్రదించాడు. భూతాపం గురించి ఒక నాటకం వేస్తే బాగుంటుందని సూచించాడు. వాతావరణ మార్పులు అనేవి మనకు సంబంధం లేని సబ్జెక్ట్ ఏమీ కాదు. ‘ఎండా కాలం ఇంకా రానేలేదు. ఇంత వేడా!’ ‘గత సంవత్సరం కంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి’... ఇలా మనకు తెలియకుండానే రోజువారి సంభాషణలలో భూతాపం గురించి మాట్లాడుకుంటాం.
కాబట్టి భూతాపం గురించి నాటకం చేయడం అంటే భారమైన టాపిక్‌పై చేసినట్లు కాదు. మనకు సంబంధం లేని సబ్జెక్ట్ చేసినట్లు కాదు. సీరియస్ సమస్యను సీరియస్‌గానే చెప్పనక్కరలేదు. దానికి కాసింత కామెడీ దట్టిస్తే సరిపోతుంది అని నిర్ణయించుకుంది మేఘన. దాని ఫలితమే... ఫీవర్ డ్రీమ్ నాటకం.
గొంతు విప్పాలి
వాతావరణ సంక్షోభం గురించి మరింత ఆలోచించేలా చేయడానికి మా నాటకం ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. ‘మార్పులో భాగం కావడానికి నేను నిజంగా ఏంచేస్తున్నాను?’ అని ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నాను.
వాతావరణంలో అనూహ్య మార్పులపై ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు పెట్టడం, ఒకటి రెండు పిటిషన్‌లపై సంతకాలు పెట్టడం మార్పుతెస్తుందని నేను అనుకోను. ప్రభుత్వాలు చెట్లు, మడ అడవులు నరుకుతున్నప్పుడు మనం దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. వ్యర్థాలతో సరస్సులు, నదులను నాశనం చేస్తున్నప్పుడు మనం మాట్లాడాలి.
– మేఘన ఏటీ
(చదవండి: ఇది తప్పుడు కేసు అనుకోవడానికి వీలు లేదు!)


