
కర్మ సూత్రం
జీవులు అనుభవించే మంచి చెడు ఫలితాలకు వాళ్ళు గతంలో చేసిన కర్మలే కారణమన్నది భగవద్గీత సారాంశం. అయినా, మనుషులు మాయలో పడి, తమకు జరిగే అనుభవాలకు ఇతరులెవరో కారణం అని భావిస్తారు.
భీష్మునితో ధర్మరాజు... ‘పట్టుదలతో చుట్ట పక్కాలను చంపుకున్నాను. దుర్యోధనుడు రాజ్యం పంచుకోవటానికి ఇష్ట పడలేదు. నేనైనా కోపం మాని, అతడిని రాజ్యం అనుభవించనీయలేదు. మా ఇద్దరి వల్ల ఇంత జన నష్టం జరిగింది’ అని బాధ పడ్డాడు. అప్పుడు భీష్ముడు ‘చంపటానికి మనిషి కర్త కాడు’ అని ఉదాహరణ పూర్వకంగా ఒక కథ చెపుతాడు.
గౌతమి అనే వనిత కుమారుడు పాము కాటుకు చనిపోతాడు. ఆమె దుఃఖిస్తుండగా ఒక వేటగాడు ఆ పామును చంపబోయాడు. ఆమె వారించి, ‘పామును చంపితే నా బిడ్డ బతుకుతాడా? శత్రువునైనా చేత చిక్కితే చంపటం న్యాయం కా’దంది.
పాము తాను మృత్యు దేవత పంపగా వచ్చాను కానీ, స్వయం కర్తను కాదంది. అంతలో మృత్యువు వచ్చి, తాను యముడు పంపగా వచ్చానని, తాను ఆ బాలుడి మరణానికి కారణం కాదంది. యమధర్మరాజు వచ్చి... పాము, మృత్యువు, తాను ఈ బాలుడి మరణానికి కారణం కాము; అతడి కర్మలే కారణం. జీవుడు కర్మఫలాన్ని తప్పించుకోలేడని చెబుతాడు. వేటగానికి జ్ఞానోదయమై వెళ్ళిపోతాడు. కాబట్టి, ‘యుద్ధంలో బంధు మిత్రులు మరణించటానికి వారి కర్మలే కారణం కానీ, నీవు గానీ, దుర్యోధనుడు గానీ కారణం కాదు’ అని భీష్మ పితామహుడు చెప్పాడు. తెలిసి చెడు కర్మలు చేయకుండా ఉండటమే మనుషుల కనీస కర్తవ్యం.
– డా.చెంగల్వ రామలక్ష్మి