
2000 హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో పదమూడు నెలల వయసున్న సాకీ అనే రాయల్ బెంగాల్ జాతి ఆడపులిని కొందరు దుండగులు చంపేశారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ సంఘటన 2000 అక్టోబర్ 5న జరిగింది. ఈ సంఘటనపై బహదూర్‌పుర పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు సీఐడీ వరకు వెళ్లింది. తర్వాత సీబీఐ విచారణకు డిమాండ్ వచ్చింది. దీనిపై అనేక రాజకీయ అంశాలు తెరపైకి రావడంతో పోలీసులు సాకీ హంతకుల సమాచారం ఇచ్చిన వారికి లక్ష రూపాయలు రివార్డుగా ప్రకటించారు. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసు కప్పు కాఫీతో యాదృచ్ఛికంగా కొలిక్కి వచ్చింది.
మహారాష్ట్రకు చెందిన మహ్మద్ సలావుద్దీన్ హైదరాబాద్‌కు వలసవచ్చి, రియాసత్‌నగర్‌లో స్థిరపడ్డాడు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ, జల్సాలకు అలవాటుపడ్డాడు. డబ్బు కోసం చిన్న చిన్న చోరీలతో నేరజీవితం ప్రారంభించాడు. వీరప్పన్ స్టోరీలు విన్న ఇతడి కన్ను గంధపు చెక్కలపై పడింది. హైదరాబాద్‌లోని జూ పార్క్‌లో గంధపు చెట్లు ఉన్నట్లు తెలుసుకుని, వాటిని కొల్లగొట్టాలని నిర్ణయించుకున్నాడు.
వెన్నెల లేని చీకటి రాత్రుల్లో జూ పార్క్ ప్రహరీ గోడ దూకి లోపలకు వెళ్లేవాడు. అక్కడున్న గంధపు చెట్లను నరికి తీసుకువెళ్లి అమ్ముకునేవాడు. ఈ కేసుల్లో అరెస్టు కావడంతో అతడికి ‘హైదరాబాదీ వీరప్పన్’ అనే పేరు వచ్చింది. సలావుద్దీన్ ఇళ్లల్లో చోరీలు, చైన్ స్నాచింగ్స్ కూడా చేసేవాడు. చోరీ సొత్తు పంపిణీ వివాదంలో ఒక సహచరుడిని హత్య చేసిన ఆరోపణలపై కేసు కూడా నమోదైంది. గంధపు చెట్ల కోసం ఎప్పటిలాగే 2000 అక్టోబర్‌లో జూ పార్క్‌లోకి వెళ్లాలని భావించిన సలావుద్దీన్‌తో అతడి స్నేహితుడైన ఇస్మాయిల్ ఓ చాలెంజ్ చేశాడు.
‘జూలో ఉన్న పులిని చంపడం ఎవరికీ సాధ్యం కాదు. నువ్వు ఆ పని చేసి చర్మం, గోళ్లు తేగలవా?’ అంటూ రెచ్చగొట్టాడు. దీంతో సలావుద్దీన్ అదే నెల 4 రాత్రి తన అనుచరులైన అహ్మద్, సమద్‌లతో కలసి జూపార్క్ వెనుక ఉన్న మీర్‌ఆలం ట్యాంక్ వైపు నుంచి లోపలకు ప్రవేశించాడు. సఫారీకి సమీపంలోని పులుల ఎన్‌క్లోజర్ వద్దకు వెళ్లాడు. అక్కడ తొమ్మిది బోనుల్లో 14 పులులు ఉండగా, వాటిలో సాకీని ఎంపిక చేసుకున్నాడు.
బోనులో ఉన్న దాని మెడకు ఉరి బిగించి చంపేసిన సలావుద్దీన్– తన వెంట తెచ్చుకున్న కత్తితో దాదాపు నాలుగు గంటలు ప్రయత్నించి దాని చర్మం, గోళ్లు ఒలిచేశాడు. ఈ ఘాతుకాన్ని చూసిన మిగిలిన పులులు తీవ్ర షాక్‌కు గురయ్యాయి. కొన్ని రోజుల పాటు అవి ఆహారం సైతం తీసుకోలేదు. సాకీ హత్యపై బహదూర్‌పుర పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.
జూ పార్క్‌లో జరిగిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. సీఐడీ అధికారులు ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేసినా, చిన్న క్లూ కూడా లభించలేదు. సమాచారం ఇచ్చిన వారికి రూ.లక్ష రివార్డు ప్రకటించినా ఫలితం దక్కలేదు. ఈలోగా సాకీ హత్య రాజకీయ రంగు పులుముకుంది. పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ నేత క్షుద్ర పూజల కోసం ఇక్కడి కొందరు పెద్దలే సాకీని చంపి, దాని చర్మం, గోళ్లు పంపారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
సాకీని చంపిన తర్వాత సలావుద్దీన్ సైతం చోరీ, స్నాచింగ్ తదితర కేసుల్లో మూడుసార్లు పోలీసులకు చిక్కినా నోరు విప్పలేదు. 2005 నాటికి సాకీ కేసు కూడా కొలిక్కి చేరని కేసుల జాబితాలోకి చేరిపోయింది. ఆ రోజుల్లో సలావుద్దీన్ మీద పోలీసుల కళ్లు ఉండేవి. 2005 ఫిబ్రవరిలో సలావుద్దీన్‌ను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అప్పట్లో రాజీవ్ త్రివేది హైదరాబాద్ నేర విభాగానికి అదనపు పోలీసు కమిషనర్‌గా ఉండేవారు. సాధారణంగా సీసీఎస్ పోలీసులు పట్టుకున్న ప్రతి ఘరానా దొంగనూ ఆయన ఎదుట హాజరుపరచే వాళ్లు. అధికారులు సలావుద్దీన్‌ను అలానే హాజరుపరచారు. అతడి నేర చరిత్ర తెలుసుకున్న ఆయన ‘ఇంక మారవా?’ అంటూ కాస్సేపు ముచ్చటించారు. తాను కాఫీ తాగే సమయం కావడంతో సలావుద్దీన్‌ను కూర్చోబెట్టి, అతడికీ కాఫీ ఇచ్చారు.
దీంతో రాజీవ్ త్రివేదీతో సలాదుద్దీన్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాడు. కాఫీ తాగడం పూర్తయ్యాక ఇంకేమేం నేరాలు చేశావంటూ రాజీవ్ త్రివేదీ ప్రశ్నించగా, ఐదేళ్ల కిందట జూపార్క్‌లో సాకీని తానే చంపానని బయటపెట్టాడు. ఆ మాట విన్న వెంటనే షాక్‌కు లోనైన పోలీసులు సలావుద్దీన్ అరెస్టు ప్రక్రియను వాయిదా వేశారు.
అతడు చెప్పే మాటలపై నమ్మకం కుదరకపోవడంతో పదేపదే ప్రశ్నించారు. దీంతో తన మాట మీద నమ్మకం లేకపోతే అనుచరులను పట్టుకుని ప్రశ్నించాలని, మహారాష్ట్రలోని తన బంధువుల ఇంటికి వెళ్లి చూస్తే సాకీ చర్మం, గోళ్లు లభిస్తాయని చెప్పాడు. మహారాష్ట్ర వెళ్లిన బృందం వాటిని రికవరీ చేశాక పోలీసులు సలావుద్దీన్‌ను, అతడి అనుచరులను అరెస్టు చేసి, మీడియా ముందు ప్రవేశపెట్టారు.
పోలీసుల సమక్షంలోనే తాను జైలు నుంచి పారిపోతానని, మళ్లీ నేరాలు చేస్తానని సవాల్ చేశాడు. దీనికి స్పందించిన రాజీవ్ త్రివేది ‘నిన్ను చర్లపల్లి జైలులో పెడుతున్నాం. ఎస్కేప్ కాగలిగితే రూ.లక్ష ఇస్తా’ అని అన్నారు. ఈ మాటనూ సలావుద్దీన్ సీరియస్‌గా తీసుకున్నాడు. 2005 ఫిబ్రవరి నుంచి జైల్లో ఉన్న అతడు పారిపోవడానికి అదను కోసం ఎదురు చూశాడు.
చివరకు 2006 నవంబర్ 24న జైలు నుంచి తప్పించుకున్నాడు. దుప్పట్లను తాడుగా చేసుకుని, వాచ్‌టవర్ పైనుంచి దాని సాయంతో దిగుతూ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడికి నడుము విరగడంతో ఎక్కువ దూరం వెళ్లలేక సమీపంలోని పొదల్లో దాగుండిపోయాడు. మర్నాడు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న జైలు సిబ్బందికే చిక్కాడు.
జైలు అధికారులు సలావుద్దీన్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో తనను కలసిన మీడియాతో ‘రాజీవ్ త్రివేది సాబ్ చేసిన సవాల్‌లో నేనే నెగ్గా. గాయం వల్ల ఆగిపోయినా, జైలు నుంచి అయితే ఎస్కేప్ అయ్యా. ఆయనకు ఈ విషయం చెప్పి రూ.లక్ష ఇప్పించండి. వైద్య ఖర్చులకైనా పనికొస్తాయి’ అని చెప్పి అవాక్కయ్యేలా చేశాడు. ఆ తర్వాత తన పాత పంథా కొనసాగిస్తూ చోరీలు, గంధపు చెట్ల నరికివేత చేసిన సలావుద్దీన్ కొన్నేళ్లుగా స్తబ్ధుగా ఉంటున్నాడు.
శ్రీరంగం కామేష్
(చదవండి: ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..! రీజన్ తెలిస్తే షాకవ్వుతారు..)