
నేడు నేషనల్ గ్రాండ్ పేరెంట్స్ డే
వయసైపోయి, శక్తి ఉడిగిందని గ్రాండ్ పేరెంట్స్‌ని చులకనగా చూడకండి. ఈ యుగపు వేగంతో నత్త వారసులేం పోటీపడగలరు అనుకోకండి. వాట్సాప్‌లు, స్నాప్‌చాట్‌లు, ట్విటర్లు, ఇన్‌స్టా హ్యాండిల్స్‌లో వాళ్లు యమ యాక్టివ్. ఫేస్‌టైమ్.. స్కైపుల్లో భలే షార్ప్. షాట్స్, రీల్స్‌లో సూపర్ ఫాస్ట్. జెన్ జీ జార్గాన్‌నూ జీర్ణించుకుంటున్నారు.
ఆధ్యాత్మికతనూ ఆస్వాదిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ పట్లా అవగాహనతో ఉంటున్నారు. టూర్స్ అండ్ ట్రావెల్స్‌కీ రెడీ అవుతున్నారు. ఇంటి నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ దాకా కావల్సినంత ఇన్ఫో ఇస్తున్నారు. అన్నింటిలోనూ గ్రాండ్‌నెస్‌ను చవిచూపిస్తున్న వాళ్లే గ్రాండ్ పేరెంట్స్. వారితో కనెక్టివిటీని పెంచే ఉద్దేశంతోనే ‘గ్రాండ్‌పేరెంట్స్ డే’ సెలబ్రేషన్ మొదలైంది.
ఆకాశంలోని చుక్కల్ని పరిచయం చేయడం దగ్గర్నుంచి కథలతో ఊహలను ఉసిగొల్పడం వరకు మన జీవితాల్లో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు పోషించిన పాత్రను వర్ణించగలమా? అందుకు వాళ్లు నేర్పిన మాటలతోపాటు మనం నేర్చుకున్న భాషల్లోని వొకాబులరీని అరువు తెచ్చుకున్నా సరిపోదు. రామాయణంలో రాముడి వ్యక్తిత్వాన్ని, భాగవతంలోని కృష్ణుడి లీలలను, భారతంలోని యుద్ధనీతిని.. పురాణ స్త్రీల ఔన్నత్యాన్ని, చరిత్రలోని పరాక్రమాన్ని.. వెండితెర అద్భుతాలను తమదైన బాణి, వాణితో బుజ్జి మెదళ్లలో నింపే గుర్తులు మరుపుకొచ్చేవా! ఆ కాలానికీ ఈ కాలానికీ వారధులైన గ్రాండ్‌పేరెంట్స్ మనల్ని నడిపించే గురువులు. బడులు బోధించలేని ఎన్నో పాఠాలను వాళ్ల అనుభవ జ్ఞానం బోధిస్తుంది.
అందుకే.. ముసలాళ్లని వాళ్లను మూలకు తోసేయొద్దు. మనకన్నా ముందు ప్రపంచాన్ని చూసినవాళ్లని.. ఔపోసనపట్టిన పెద్దవాళ్లని గౌరవిద్దాం. రోజూ కుదరకపోయినా.. వారాంతాల్లోనైనా వాళ్లతో కాస్త సమయాన్ని వెచ్చిద్దాం. కనీసం గ్రాండ్‌పేరెంట్స్ డే అయినా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దాం!
హ్యాపీ గ్రాండ్‌పేరెంట్స్ డే!
మెరియన్ మెక్వేడ్ అనే గృహిణి.. పెద్దలను గౌరవించాలని, వారి అనుభవజ్ఞానానికి విలువివ్వాలని.. దాన్నో సంస్కృతిగా మార్చాలనే తలంపుతో గ్రాండ్‌పేరెంట్స్ డే అనే కాన్సెప్ట్‌ని క్రియేట్ చేసి.. దాన్నో వేడుకగా మలచింది. అప్పటి నుంచి ప్రపంచంలోని పలు దేశాలు వాళ్లకు అనువైన నెలల్లో ఈ గ్రాండ్ పేరెంట్స్ డేను నిర్వహించుకుంటున్నాయి. అలా మనం ప్రతి ఏడు సెప్టెంబర్‌లోని మొదటి ఆదివారం నాడు గ్రాండ్‌పేరెంట్స్ డేని జరుపుకుంటున్నాం!
ఈరోజు నేనీ స్థాయిలో ఉండటానికి కారణం మా తాతయ్యే (పీవీ గోపాలన్). చదువు దగ్గర్నుంచి మహిళా హక్కులు, ప్రజా సేవ వరకు నా మీద ఆయన ప్రభావం చాలా ఉంటుంది. ఆయన చాలా ప్రొగ్రెసివ్. అమ్మాయిల చదువుకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఎన్నో విషయాలను తాతయ్య దగ్గరే నేర్చుకున్నాను.
– కమలా హ్యారిస్
మా నాన్న, చిన్నాన్న యాక్టర్స్ అయినా నాతోపాటు అక్క (కరిష్మా కపూర్), తమ్ముడు (రిషీ కపూర్) అందరం ఇన్‌ఫ్లుయెన్స్ అండ్ ఇన్‌స్పైర్ అయింది మాత్రం మా తాతగారు రాజ్‌కపూర్ వల్లనే! ఫ్యామిలీ యూనిటీ నుంచి సినిమాల దాకా చాలా విషయాల్లో ఆయన చెప్పిన మాటలు, చూపిన దారినే అనుసరిస్తాం! – కరీనా కపూర్
క్రమశిక్షణ, బాధ్యత వంటి విషయాలను మా తాతయ్య (లెఫ్టినెంట్ కల్నల్ రామేశ్వర్‌నాథ్ డియోల్) నుంచే నేర్చుకున్నాను. ఏ పని చేసినా నిబద్ధత ముఖ్యమనే ఆయన మాటలనే జీవన విలువగా పాటిస్తున్నాను.
– అభయ్ డియోల్